Skip to main content

Sri Mogileeswara Swamy Temple - ముక్కంటి క్షేత్రం.మొగిలీశ్వరాలయం


మహప్రాణ దీపం శివం' అంటూ కీర్తించినా... 'శివశివ శంకర భక్తవశంకర' అంటూ స్తుతించినా శివ భక్తుల హృదయాలు ఆనంద పారవశ్యంలో మునిగిపోతాయి. ఈశ్వర తత్వంలోని ఔన్నత్యం అలాంటిది. నమ్మి కొలవాలే కానీ దేవతలూ రాక్షసులూ అన్న భేదం లేకుండా అందరికీ వరాలిచ్చేసే శివయ్యకు తన భక్తులంటే మరింత ప్రేమ. దానికి నిదర్శనమే చిత్తూరులోని మొగిలీశ్వరాలయం.

తనను సేవించిన భక్తుడి పేరుమీదుగానే ఈ క్షేత్రంలోని శివయ్య పూజలందుకోవడం శేషం.మహాశివుడు, పరమేశ్వరుడు, నీలకంఠుడు, గంగాధరుడు, పార్వతీవల్లభుడు, త్రినేత్రుడు... ఇలా ఆ సర్వేశ్వరుడికి పేర్లు అనేకం. మహిమలు అనంతం. మంజునాథుడు అనేక ప్రాంతాల్లో, విభిన్న నామాలతో పూజలందుకుంటున్నాడు. వాటిలో చిత్తూరులోని మొగిలీశ్వర ఆలయం ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తారు.

ఇదీ కథ:
పూర్వం ఈ ప్రాంతంలో మొగలి పొదలు ఎక్కువగా ఉండేవట. వీటి సమీపంలో ఉన్న మొగిలివారిపల్లెలో బోయ దంపతులు నివసించేవారు. అతడి భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు రావడంతో అడవిలోనే మగ శిశువును ప్రసవించింది. మొగలిపొదల దగ్గర పుట్టాడు కాబట్టి ఆ బిడ్డను మొగిలప్ప అని పిలవడం ప్రారంభించారు. మొగిలప్ప పెద్దవాడయ్యాక ఓ రైతు దగ్గర పశువులకాపరిగా చేరాడు. పశువులను అడవికి తోలుకెళ్లి మేపుతూ మధ్యలో వంట చెరకు నరికేవాడు. అలా ఒక రోజు చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలను గొడ్డలితో నరుకుతుంటే అకస్మాత్తుగా రాయి తగిలిన శబ్దం వచ్చింది. భయభ్రాంతులకు గురైన మొగిలప్ప గ్రామస్థుల సాయంతో అక్కడ వెతకగా శివలింగం కనిపించింది. అప్పటి నుంచీ ఆ శివలింగానికి రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు మొగిలప్ప. దీంతో అతడి పేరు మీదుగా ఈ క్షేత్రం మొగిలీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.

త్రిశూల తీర్థం:
భక్తులు మొగిలి క్షేత్రంలోని త్రిశూల తీర్థాన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలురతో కలసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. ఓసారి కరవు వచ్చి నదులూ, సరస్సులూ ఎండిపోయాయి. దీంతో శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా... శివుడు కరుణించి తన త్రిశూలాన్ని భూమిమీద గుచ్చి, పాతాళ గంగను పైకి రప్పించాడట. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఆ కారణంగా దీన్ని త్రిశూల తీర్థంగా వ్యవహరిస్తారు.

ప్రత్యేకతలు:
మొగిలీశ్వరాలయానికి పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో విభూతి కొండ ఉంది. ఈ క్షేత్రంలో స్వయంభూ లింగంతోపాటు సహజంగా ఏర్పడిన విభూతి కొండ ఉండటం మరో ప్రత్యేకత. తరతరాలుగా స్వామిని ఈ విభూతితోనే అభిషేకించడం విశేషం. ఈ కొండకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం అగస్త్య మహాముని సూచన మేరకు లోక కల్యాణం కోసం జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడే నిర్వహించాడట. దానికి సంబంధించిన యాగ సమిధల భస్మాన్ని పెద్ద రాశిగా పోయడం వల్ల ఈ కొండ ఏర్పడిందని చెబుతారు.

ఆలయంలోని మరో ప్రత్యేకత పైకప్పుమీద దర్శనమిచ్చే బంగారు బల్లి. ఇలాంటిది కంచి, శ్రీకాళహస్తిలలో మాత్రమే కనిపిస్తుంది. బంగారు బల్లితోపాటు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాహువుని కూడా చూడొచ్చు. వీటిని తాకితే సర్పదోషాలతోపాటు అన్ని దోషాలూ నశిస్తాయని భక్తుల నమ్మకం.

సందర్శించే సమయం 6.00 a.m. to 10.30 p.m. and 5.30 p.m. to 8.00 p.m.

ఇలా చేరుకోవచ్చు:
చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. తిరుపతి నుంచి కుప్పం, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కాణిపాకానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.