Translate

భక్తి మార్గాలు

భక్తి మార్గాలు ఎన్ని? అవి ఏమిటి? వాటి గురించి వివరించగలరా?

మోక్షం పొందడానికి నవవిధ భక్తి మార్గాలు

మన పురణాలలో ఈ భక్తి మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. మొత్తం తొమ్మిది భక్తి మార్గాలు ఉన్నాయి. వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు. అంటే ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని, దాన్ని వదలకుండా సాధన చేస్తే ఆ భగవంతుని సన్నిధిని చేరుకోవడం సులభం అన్నమాట. దీని గురించి సద్గురు షిరిడి సాయిబాబా కూడా వివరించారు. తన శిష్యురాలు, తాను తల్లిగా భావించే బాయిజాకి అవతార సమాప్తి అయ్యే కొన్ని గంటల ముందు 9 నాణాలను ఇచ్చి, ఈ నవవిధ భక్తి గురించి, దాని ద్వారా ముక్తిని సాధించే మార్గాలను తెలిపారని సాయి సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది.

'శ్రవణం కీర్తన విష్ణోః స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం' అనేవి నవవిధ భక్తి మార్గాలు.

శ్రవణం: ఎల్లప్పుడూ భగవంతుని కథలు, లీలా విశేషాలను వినడం, చదవడం వల్ల ఆ స్వామికి దగ్గరగా నివసిస్తూ ఉండే మార్గం ఇది. ఈ మార్గం ద్వారా భగవంతుని చేరినవారిలో అగ్రేసరుడు పరీక్షిత్.

కీర్తన: ఆ భగవంతునిపై కీర్తనలు రచించడమో, లేదా అలా రచించినవారి కీర్తనలను ఎప్పుడూ స్మరించడం ద్వారా కూడా ముక్తి పొందవచ్చు అని ఈ మార్గం చెప్తోంది. నారదుడు మొదలుకొని అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు ఇలా ఎందరో ఉదాహరణగా నిలిచారు.

స్మరణం: ఇది చాలా గొప్ప మార్గం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ దేవదేవుని స్మరిస్తే చాలు ఆయన అక్కున చేర్చుకుంటాడట.

పాద సేవనం: అవతార పురుషులుగా ఈ భూమ్మీద ఆ దేవుడు తిరిగినప్పుడు ఆయనకు సీతాదేవి, లక్ష్మణుడు, కృష్ణ అవతారంలో రుక్మిణి, సత్యభామ ఇత్యాదులు ఎందరో తరించారు. మరి మనబోటి వారి సంగతి ఏమిటీ అంటే మానసిక పూజ. ఎల్లప్పుడు మనకి ఇష్టమైన దేవునివో, దేవతవో పాదాలను సేవిస్తున్నట్టుగా మనస్పూర్తిగా సేవించుకుంటే చాలు.

అర్చనం: మన ఎదురుగా ఆ అమ్మవారో, స్వామో కూర్చున్నట్టుగా భావించి, అర్ఘ్య, పాద్యాదుల దగ్గర నుంచీ, నైవేద్యం దాకా అన్నీ మన చేతులతో మనం చేసుకోవడమే అర్చనం.

వందనం: ఎల్లప్పుడూ ఆ దేవుని ఉనిక్ని గుర్తుపెట్టుకుంటూ, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మనే దర్శిస్తూ వినమ్రంగా ఉండటం, ఆయన మనకి ఇచ్చిన ప్రతిదానికీ కృతజ్ఞతగా వంద్నం సమర్పించడం కూడా ఒక మంచి భక్తి మార్గమేనట.

దాస్యం: ఇది చాలా ఆసక్తికరమైన మార్గం. ఆ భగవంతుణ్ణి మనల్ని పాలించే యజమానిగా గుర్తించి, ఆయ్నకి నమ్మిన బంటుగా బ్రతకడమే దాస్యం. ఈ మార్గం ద్వారా చిరంజీవిత్వం పొందిన ఆ ఆంజనేయస్వామే మనకి మార్గదర్శకుడు.

సఖ్యం: అన్నిటికన్నా ఊహాశక్తి, పూనిక, దేవుడి మీద ఎడతెగని ప్రేమ, ఎన్ని కష్టాలనైనా తట్టుకుని నమ్మకం సడలకుండా ఉండగలగడం ఎంతో ముఖ్యం. ఈ మార్గంలో ఆ దేవుణ్ణి మన స్నేహితునిగా భావించాలి. ఈ మార్గం ద్వారా ముక్తిని పొందిన పాండవులు, కుచేలుడు, సుగ్రీవుడు, విభీషణుడు, గోదాదేవి, వెంగమాంబ తదితరులు.

ఆత్మనివేదనం: అఖరిది, అతి ముఖ్యమైనది ఆత్మనివేదనం. 'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ్' అనడమే ఈ మార్గంలో ప్రధానం.