Translate

Kalabhairava Ashtakam in Telugu - కాలభైరవ అష్టకం తెలుగులో
కాలభైరవ అష్టకం – తెలుగులో (సాహిత్యం మరియు అర్థం) | Kalabhairava Ashtakam in Telugu (with Lyrics and Meaning)


కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో):

1. దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||

ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

2. భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||

అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

3. శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||

త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శరీరం కలవాడు. నాశనము లేనివాడు. ఎన్నటికీ తరగని వాడు. భయంకరమైన పరాక్రమం కలవాడు. వింత తాండవం చేసేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

4. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||

ఇహలోక సౌఖ్యలను మోక్షాన్ని ఇచ్చేవాడు. గొప్ప అందమైన ఆకారం కలవాడు. భక్తులను బిడ్డలుగా చూసుకునే వాడు. స్థిరంగా నిలిచిన వాడు. లోకాలన్నిటిని నియంత్రించేవాడు. ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణమును ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

5. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||

ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడు. కర్మ బంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు. బంగారు రంగు శరీరము పై పాములనే తాళ్లుగా ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

6. రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||

రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు. ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

7. అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||

బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చి వేసే ప్రళయకారకుడు. తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ చేసేవాడు. అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించే వాడు. పుర్రెల దండ ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

8. భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||

భూతాల సైన్యానికి నాయకుడైన వాడు. లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించే వాడు. కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్ళకు తగిన పుణ్య ఫలాన్ని అందించే వాడు. నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికి అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||

ఎవరైతే అందమైన, జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభి గుణాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతి దినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యం.
Previous
Next Post »
0 Komentar