Skip to main content

Dharma Sandehalu - ధర్మ సందేహాలు - Telugu Devotion

నిత్య సత్యాలు - ధర్మ సందేహాలు | Eternal Truths - Dharma Sandehalu - Telugu Devotion

గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీస్తారు

ఒక సమయంలో బ్రహ్మ దేవుడు గణపతికి గుంజీళ్లు తీసి నమస్కరించాక  గణపతి స్వయంగా చెప్పిన మాటలు "ఎవరైతే నాభక్తులై నాఅనుగ్రహన్ని కోరుకుంటారో వారు ఈ బ్రహ్మ దేవుడు వలె రెండు చెవులూ చేతులతో లాగి గుంజీళ్ళు తీసి వారి శిరోభాగాన్ని వేళ్ళు మడిచి చప్పుడు వచ్చేటట్లు చేయవలెను. ఈవిధంగా చేసిన వారి యెడల నేను పరమ ప్రీతుడినై వారు కోరిన వన్నీ ఇస్తాను. ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే నమస్కారం అనడంలో సందేహం లేదు." అందుకని వినాయక ప్రీతి కోసం ఇలా గుంజీళ్ళు తీస్తారు.

పూజలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి.
దేవునకు ఎడమవైపు నీటిపాత్ర (కలశం), గంట, ధూప పాత్ర ఉంచవలెను. ఎడమవైపు నూనె దీపాలు వెలిగించాలి. కుడివైపు నేతి దీపం, సువర్ణ జలంతో నింపిన శంఖం ఉంచాలి. దేవుడికి ఎదురుగా హారతి కర్పూరం, పసుపు కుంకుమ ఉంచవలెను.

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమి ఫలితం
అనేక దానాలు చేసిన పుణ్యం, అనేక తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరు దానం చేయడం వలన వస్తుంది.

బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు ఏమిటి
నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదం (దంపతులను విడదీయడం), శిశుమాతృవిభేధనం (తల్లీబిడ్డలను విడదీయడం)

పూజలో ముద్దగా ఉన్న గంధం, నెయ్యి దేవూడికి సమర్పించవచ్చా?
"ద్రవీభూతం ఘృతం చైవ ద్రవీభూతం చ చందనం;
నాఅర్పయేన్మమ తుష్ట్యర్దం ఘనీభూతం తదర్పయేత్"
నేతిని కరిగించినదిగాక ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను. అదేవిధంగా గంధంగూడా పలుచగా నీటి వలె ఉన్నది గాక ముద్దగా ఉన్నదే  దేవునికి సమర్పించవలెను

పూజకు ఉపయోగించే పువ్వులు ఎలా ఉండాలి?
పూజకు ఉపయోగించే పువ్వులు ఎడమ చేతితో తెచ్చినా, తాను ధరించిన వస్త్రములలో తెచ్చిన్ననూ, జిల్లేడు, ఆముదపు ఆకులలో తెచ్చినను ఆ పువ్వులు ఉపయోగించరాదు.

అపవిత్రమైన స్థానాలలో ఉండే వృక్షాలు యొక్క పువ్వులు పండ్లు దైవ కార్యక్రమాలకి వాడవచ్చా
అపవిత్రమైన స్థానాలలో ఉండే వృక్షాల యొక్క పువ్వులు, పండ్లు, మొదలైనవి పవిత్రములే దైవ కార్యక్రమాలకీ  వాడవచ్చు (బోదాయన ధర్మ సూత్రాలు)

దేవతలకు నివేదించే పదార్థాలు శ్రద్ధ లేకుండా నివేదిస్తే ఫలితం ఉంటుందా
దేవతలు స్వభావతః పవిత్రమైన వానినే కోరుకుందురు అందువలన అపవిత్రమైన వస్తువులను అసహ్యించుకుంటారు. ఐనప్పటికీ శ్రద్ధగా సమర్పించినచో వాటిని స్వీకరింతురు. పవిత్రమైనా శ్రద్ధ లేకుండా నివేదించిన పదార్థము శ్రద్ధ ఉన్నను అపవిత్రమైన పదార్థము ఈ రెండింటిలో ఏది గొప్ప అను విషయముపై దేవతలందరూ బాగా చర్చించి రెండూ సమానమే అనిరి. కానీ ప్రజాపతి వారితో ఇవి రెండూ సమానం కావు. శ్రద్ధ లేకుండా సమర్పించిన పదార్థము వ్యర్థం. కానీ శ్రద్ధతో సమర్పించుట వలన  పవిత్రమైన పదార్థము  చాలా గొప్పది అని తెలిపెను

కొన్ని పదార్థాలు చద్దివైనా తినవచ్చు అంటారు. అవి ఏమిటి
శాస్త్ర ప్రకారం వండి నాలుగు గంటలు దాటిన పదార్థాలను చద్ది పదార్థాలు అంటారు వాటిని తినకూడదు. అయితే కొన్ని పదార్థాలకు మినహాయింపు ఉంది. అవి ఆకుకూరలు, యూషము, మాంసము, నేయి, పిండి పాలు కలిపి ఉడికించిన పాయసం, పురోడాశము, బెల్లం, పెరుగు, తేనె, సత్తుపిండి తప్ప మిగిలిన పదార్థాలు చద్దివైనచో వాటిని తినకూడదు.

ఉపనయనం ఏవిధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి
ఉపనయనం ఎప్పుడు చేయాలి.
ఉపనయనము తగిన కాలము తల్లి కడుపులో పడినప్పటి నుండి లెక్కించి బ్రాహ్మణునకు ఎనిమిదవ సంవత్సరంలో, క్షత్రియులకు పదకొండవ సవంత్సరములో వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి. అలా కుదరకపోతే బ్రాహ్మణులకు 16 సంవత్సరములు క్షత్రియులకు 22 సంవత్సరములు వైశ్యులకు 24 సంవత్సరములు వరకు ఉపనయనం చేసినా కాల అతిక్రమణలు జరుగదు
(భోదాయన ధర్మ సూత్రాలు)

ఉపనయనం ఏ మంత్రం తో చేయాలి
బ్రాహ్మణునకు గాయత్రీ మంత్రంతో
క్షత్రియులకు త్రిష్ఠుబ్ మంత్రంతో
వైశ్యులకు జగతీ మంత్రము చేత ఉపనయనం చేయాలి

నమస్కారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు
శాస్త్ర ప్రకారం ఎటువంటి సందర్భాలలో . నమస్కారం చేయకూడదు
శాస్త్ర ప్రకారం అన్నము మొదలగు పదార్థాలు చేతిలో ఉన్నప్పుడు, పితృ, దేవతా, అగ్ని కార్యములలో ఉన్నప్పుడు నమస్కారం చేయనవసరం లేదు. (భోదాయన ధర్మ సూత్రాలు)

వివాహలు ఎన్ని విధాలు

వివాహాలు ఎనిమిది విధాలు
1.వరుడి యొక్క చదువు నడవడిక తెలుసుకుని వివాహం చేసుకోవలెనని కన్య కొరకు ప్రయత్నించుచున్న బ్రహ్మచారియైన వరునికి  కన్య నిచ్చి వివాహం చేయవలెను అది బ్రహ్మవివాహం
2.కన్యను వస్త్రాభరణములచే అలంకరించి ఈమెతో ధర్మ కార్యాలను ఆచరింపుము అనుచూ చేయు వివాహం ప్రాధాన్యం
3.వివాహమునకు ముందే వరుడు లాజాహుతులు చేసుకుని కన్య తండ్రికి గోమిథునం సమర్పించుకుని చేసుకును వివాహం  ఆర్షము
4.యాగము పూర్తి అయిన తరువాత దక్షిణల నిచ్చి నప్పుడు యోగ్యుడైన ఋత్విక్కునకు యజ్ఞ వేదిక దగ్గర చేయు వివాహం దైవము
5. పరస్పరం కోరికతో రహస్యంగా చేసుకున్న వివాహం గాందర్వము
6. కన్య యొక్క తండ్రికి సమృద్దిగా ధనమిచ్చి చేసుకును వివాహం అసురము
7. బలవంతముగా కన్యను ఎత్తుక పోయి చేసుకున్న వివాహం రాక్షస వివాహం
8. నిద్ర పోవుచున్న దానిని మద్యం మత్తులో ఉన్న దానిని లేక భయాదుల వలన నివ్వెరపోయిన కన్యను బలవంతముగా అనుభవించి చేసుకున్న వివాహం పైచాచిక వివాహం

అష్ట వసువులు ఎవరు వారి పేర్లు ఏమిటి

ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారూ జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువులూ ఆవిర్భవించారు ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు

స్త్రీ జాతి నాలుగు రకాలు
1. పద్మినీ జాతి 2.హస్తినీ జాతి  3.శంఖినీ జాతి 4.చిత్తినీ జాతి

పంచ కాలాలూ అంటారు కదా అవి ఏమిటి
1. ప్రాతః కాలం 2.సంగమ కాలం  3.మాధ్యాహ్నిక కాలం 4. అపర్ణాహ కాలం 5. సాయం కాలం

సప్త కిరణాలు ఏమిటి
1 సుషుమ్నము 2.హరికేశము 3.విశ్వకర్మ 4.విష్ణువు 5. కంజజము 6.తారేయము 7.ఉగ్రము

సప్త చిరంజీవులు ఎవరు
1. అశ్వత్థామ. 2.బలి చక్రవర్తి 3.వ్యాసమహర్షి 4.హనుమంతుడు 5.విభీషణుడు 6. కృపాచార్యుడు  7.పరశురాముడు.

దేవాలయాలలో ఆత్మ ప్రదక్షిణ చేయవచ్చా
దేవాలయాలలో పాటించాల్సిన నియమాలలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం ఒకటి. అంతేగానీ దేవుని గుడిలో ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు

సంక్రాంతి దినాలలో (సూర్య సంక్రమణాలు) ఏమి దానం చేయాలి.
మేష సంక్రాంతి నాడు -- మేక
వృషభ సంక్రాంతి నాడు --  ఆవు
మిథున సంక్రాంతి నాడు -- వస్త్రములు, అన్నపానాదులు
కర్కాటకం సంక్రాంతి నాడు -- నెయ్యి, ధేనువు
సింహ సంక్రాంతి నాడు -- గొడుగు, బంగారం
కన్య సంక్రాంతి నాడు -- గృహం, వస్త్రం
తుల సంక్రాంతి నాడు -- నువ్వులు, ఆవుపాలు, నెయ్యి
వృశ్చిక సంక్రాంతి నాడు -- దీపదానం
ధనుస్సు సంక్రాంతి నాడు -- వస్త్రం, వాహానం
మకర సంక్రాంతి నాడు -- కర్రలు, అగ్ని
కుంభ సంక్రాంతి నాడు -- గోవు, నీరు, గడ్డి
మీన సంక్రాంతి నాడు -- భూమి, పూలమాలలు దానం చేయాలి.

నైవేద్య సమయంలో ఘంటానాదం చేయవచ్చా.
నైవేద్య సమయంలో ఘంటానాదం కాని ఇతర నృత్య, గీత, వాయిద్య ధ్వనులు కాని చేయరాదు. అలా చేస్తే రౌరవాది నరకాలు పొందుతారు.

నువ్వులతో చేసిన పదార్థాలను తినకూడని సమయాలు ఏమిటి
అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులలోనూ ఆదివారంనాడు, శ్రాద్ద దినములలోనూ, నువ్వుల నూనె వంటకు, భోజనాలకు ఉపయోగించరాదు. సూర్యాస్తమయం తర్వాత నువ్వులకు సంబంధించిన ఏ వస్తువులు తినరాదు.

అన్న కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా
అన్న కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు.
తమ్ముని కంటే ముందు పెళ్లి చేసుకోని అన్నను పరివిత్తుదంటారు. అన్న కంటే ముందు పెళ్లి చేసుకున్న తమ్ముడిని పరివేత్త అంటారు. పరివిత్తుడు, పరివేత్త అతన్ని వివాహమాడిన కన్య, ఆమె తండ్రి, పెళ్లి చేయించినవాడు నరకమునకు పోవుదురు. కాబట్టి అన్న పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు.

అల్ఫాహరం తిని పూజ చేయవచ్చా?

భోజనం చేసిన తరువాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు. మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది. ఆదోషం స్నానం చేస్తే కాని పోదు. ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు

శాస్త్ర ఆధారం (గౌతమ స్మృతి)

మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా

ఏవస్తువును ఎందుకు ఉపయోగించాలో అందుకే ఉపయోగించాలి. కుర్చీ ఉంటే కూర్చోడానికి ఉపయోగించాలి. మంచం పడుకోవడానికి ఉపయోగించాలి. పడుకునేటప్పుడు తప్ప ఇంక మిగిలిన సందర్భాలలో మంచాన్ని తాకకూడదు శాస్త్రం అయితే మంచం మీద కూర్చుని ఔషదం కూడా తీసుకోకూడదు అని చెప్పింది. ఇంక భోజనం విషయానికి వస్తే ఎన్నో నియమాలు ఉన్నాయి అందులో కొన్ని నిల్చుని కాని, ఒళ్ళో పెట్టుకొని కాని, మంచంపై కూర్చునిగాని  భోజనం చేసిన వారికి దారిద్ర్యం నిశ్చయం కాబట్టి మంచంపై భోజనం దరిద్రం

శాస్త్ర ఆధారం (స్మృతులు, పురాణాలు)

నైవేద్యానికి మహా నైవేద్యానికి తేడా ఏమిటి

నైవేద్యం రెండు రకాలు అవసర నైవేద్యం, మహా నైవేద్యం
అవసర నైవేద్యం అంటే తాత్కాలిక నైవేద్యం
ఉదాహరణకు ఒక మహదేవతను పూజించే నప్పుడు ముందుగా గణపతిని పూజిస్తాం అపుడు గణపతికి బెల్లం ముక్క లేదా అరటి పండ్లో సమర్పిస్తారు అది అవసర నైవేద్యం
మహా దేవతకు భక్ష్య,భోజ్య, శోష్య, లేహ్యాలతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. అది మహా నైవేద్యం

శాస్త్ర ఆధారం (తంత్ర శాస్త్రం)

సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి

సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు సూతకం ఉన్న పదకొండు రోజులు వైదిక పరమైన, నైమిత్తిక పరమైన, దైవ పరమైన కార్యాలు చేయకూడదు. సంధ్యావందనం చేయకూడదు.రామాయణ, భాగవతాది గ్రంథాలు పారాయణ చేయకూడదు, అగ్నిహోత్రం చేయకూడదు. ఇంకా చెప్పాలంటే వారు వంట చేసుకోకూడదు. (బంధువులు లేకపోతే వంట చేసేవారు లేకపోతే మినహాయింపు) ఇల్లు అంతా కలయతిరగరాదు అశౌచాన్ని ఇల్లు అంతా వ్యాప్తి చేయకుండా ఒక గదిలో ఉండి మాత్రమే వారు అన్ని పనులు చక్కబెట్టుకోవాలి.

శాస్త్ర ఆధారం (ధర్మ సూత్రాలు)

భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు

మనం చేసే సమ‌స్త పాప కర్మలు తల కేశములు ను ఆవహించి ఉంటాయి మేము ఇక నుంచి ఎటువంటి దుష్కర్మలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు నా సమస్త పాపములను  గుర్తుగా ప్రతీకగా ఉన్న కేశములను నీకే సమర్పిస్తున్నాను నన్ను ఉద్దరించు అని తలనీలాలు సమర్పిస్తారు.

(శిష్ఠాచారం)

భార్యాభర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా

భార్యా భర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం కలిసి భోజనం చేయడం ధర్మ విరుద్ధం. దీనికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మరియు ఇది ఆయుఃక్షీణం కూడా మన కంటే పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు. భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు. మరియు ఈ పద్దతి పతివ్రతా నియమాలకు కూడా విరుద్ధం. పూర్వ కాలంలో భార్యలు భర్తలను "స్వామి, నాథా" అని పిలిచేవారు. ఇప్పుడైతే అలా పిలవకపోయినా  "ఏవండీ" అని పిలిస్తే చాలు ఇంక భర్తలు భార్యలను పేరు పెట్టి పిలువ వచ్చు లేదా పూర్వం "వశి , ఏమేవ్" అని పిలిచేవారు. పేరు పెట్టి పిలవడం వల్ల అంత అనుబంధం ఉండదు కాబట్టి. "వశి" అంటే శివా అని కూడా అర్థం

శాస్త్ర ఆధారం (సమస్త వైదిక గ్రంథాలలోని సదాచార నిరూపణం)

తులసికి సంబంధించిన అన్ని విషయాలు

తులసీ పత్రాలను ఏ సమయంలో తాకకూడడు, కోయకూడడు.?

జ) తులసీ పత్రాలను అమావాస్య, పూర్ణిమ, రోజులలోను ద్వాదశీ నాడు, సూర్య సంక్రమణా దినములు లోను , మధ్యాహ్న కాలంలో, రాత్రి వేళల్లో, ద్విసంధ్యల లోనూ కోయకూడడు.
ఓం అశౌచ సమయములలోనూ, శరీరమునకు నూనె రాసుకుని ఉన్న సమయాల్లోనూ, స్నానం చేయకుండా ఉన్నప్పుడు, మరియు రాత్రి ధరించిన వస్త్రాలతోనూ తులసీ పత్రములు కోయడం, వాటిని తాకడం చేయకూడదు. పై నియమాలు ఉల్లంఘించి తులసీ పత్రాలను కోసిన, తాకినా నా శిరసును ఖండించినట్లే అని స్వయంగా శ్రీహరి చెప్పాడు.

మరణాసన్న కాలంలో చనిపోయేవారి చేత తులసీ జలం ఎందుకు త్రాగిస్తారు.

జ) మృత్యు సమయంలో ఎవరి ముఖమందు (నోటిలో) తులసీ దళాలతో కలిసిన జలం ఒక చుక్కైనా ఉంటుందో వారు నిశ్చయముగా రత్న విమానం అధిరోహించి విష్ణులోకం చేరెను. ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.

తులసి యొక్క మహత్యం, గొప్పదనం చెప్పగలరు ?

జ) తులసికి శ్రీహరి ఇచ్చిన వరాలు
1.తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు, పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి.
2.తులసీ పత్రము యొక్క స్పర్శ కలిగిన జలములో స్నానం చేసిన వారు సర్వ తీర్థములందు స్నానం చేసినవారు సమస్త యజ్ఞములకు దీక్ష వహించిన వారగుదురు.
3.శ్రీహరికి ఎన్నో వేల వేల అమృత బాండాలు సమర్పించిన కలగని తృప్తి ఒక తులసీ దళం సమర్పించిన శ్రీహరి కి ఎంతో తృప్తి కలుగుతుంది.
4.పదివేల గోవులను దానం చేసిన మానవులకు ఎంత ఫలము కలుగుతుందో అంత ఫలితం ఓక తులసీ దళం దానం చేస్తే కలుగుతుంది.
5.ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.
6.ఏ మనుష్యుడు నిత్యం భక్తి పూర్వకంగా తులసీ తీర్థం స్వీకరించునో వానికి గంగాస్నాన ఫలమ లభించును. అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలడు.
7.ఎవరు ప్రతి నిత్యం శ్రీహరికి తులసీదళం సమర్పించి భక్తితో పూజించునో వానికి లక్ష అశ్వమేధములు చేసిన పుణ్యము నిశ్చయముగా లభించును.
8.ఎవరు తులసీదళములను హస్తమందుంచుకుని తులసీ పత్రాలను తన శరీరంపై వేసుకుని పుణ్యతీర్థములలో ప్రాణత్యాగం చేస్తారొ వారు నిస్సందేహంగా విష్ణు లోకం వెళ్ళగలరు.
9.తులసీ కాష్ఠముచే నిర్మింపబడిన మాలను కంఠం నందు ధరించిన వారు అడుగడుగునా అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు.
10.ఎవరు తులసీ దళములను హస్తమందుంచుకుని ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చడో వారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు కాలసూత్రమను నరకమున పడి నానా యాతనలు అనుభవించును.
11.ఎవరు తులసీ దళాలను చేతియందు ఉంచుకుని అసత్య ప్రతిజ్ఞ చేస్తారొ వారు పద్నాలుగు ఇంద్రుల ఆయుః పర్యంతం కుంభీపాక నరకం అనుభవిస్తారు.

తులసీ దళాలు ఎన్నిరోజులు వరకు వాడవచ్చు?

జ) శ్రాద్ధ, వ్రత, దాన, ప్రతిష్టాది కార్యములందు, దేవతార్చనలయందు తులసీ దళాలు వాడిపోయినను, శుష్కించినను మూడు రాత్రుల కాలం వరకు  పవిత్రంగా వాటిని ఉపయోగించవచ్చును.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.