Skip to main content

Satyam Jnanam Anantam Brahma - సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ

ఉపనిషత్తులు పరబ్రహ్మాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అని వర్ణించాయి. ఆలోచనకు, వాక్కుకు అతీతమైన బ్రహ్మతత్వాన్ని మానవ మేధతో  తెలుసుకోవడం చాలా కష్టం. వేద ద్రష్టలు ఒకవైపు తమ అశక్తతను వ్యక్తపరుస్తూనే బ్రహ్మతత్వ వర్ణనకు ప్రయత్నించారు. వేదాలు సైతం అవర్ణనీయమైన ఆ అనంత సాన్నిధ్యాన్ని విపులీకరిస్తూనే, తత్త్వ వర్ణన కడుదుర్లభమని ఘోషించాయి.

జ్ఞానులు ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటారు. తత్త్వం బోధపడిందనో, తత్త్వాన్ని వర్ణిస్తామనో గొప్పలు చెప్పుకోరు. తాము అనుభూతి చెందుతున్న అద్భుతాన్ని మానవ జాతికి అందించాలన్న తపనే కాని, లేనిపోని సంక్లిష్ట భావజాలాన్ని రుద్దాలని వేద ద్రష్టలు ఎప్పుడూ అనుకోలేదు.

ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ భగవంతుడు ఆవరించి ఉన్నాడు.

“నక్షత్రాల వెనక మెరిసే మహా తేజస్సు”, “హృదయాల్లో స్పందించే దివ్య దీప్తి” –  ఆ తత్వం దూరంగా ఉంది! దగ్గరగానూ ఉంది!

లేనిపోని కల్పనలు చేయక, తర్కాన్ని ఉపయోగించమన్నారు ద్రష్టలు. బుద్ధి, హేతువుకు అందకపోయినా వాటిని వాడాలి. విశ్వంలోని సమస్తాన్ని కళ్లతోనే చూడాలి, బుద్దితో ఆలోచించాలి!

విశ్వంలోని వివిధ అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి మూలం ఎవరు? ఏ కారణం లేకుండా సృష్టి ఎలా వస్తుంది? ఈ విధంగా పరిశోధన జరిపితే మూలకారణం ఒకటి ఉందని తెలుస్తుంది!

మీకు గజేంద్రమోక్షం కథ తెలిసే ఉంటుంది. విచారగ్రస్తుడై, విధి శాపగ్రస్తుడైన గజేంద్రుడు విలపిస్తూ, బయటపడటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. మూల కారణం తెలుసుకోవాలని అనుకున్నాడు. అది తెలుసుకోగల శక్తి ఏనుగుకు లేదు. వచ్చిన బాధకు, విశ్వానికి మూల కారణం తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి?

అందులోని గజేంద్రుడిని జీవాత్మతో పోల్చితే తత్త్వం విశదపడుతుంది. విధివంచిత అయి, భూమిపై సర్వదుఃఖాలు అనుభవిస్తున్న జీవాత్మ బయటపడటానికి మూలకారణం తెలుసుకుని తీరాలి.

విశ్వానికి మూలకారణం బ్రహ్మతత్వమే.

ఆధ్యాత్మిక గ్రంథాల్లోని తత్వసారం తెలుసుకోవడానికి మనం సంకుచిత మనస్తత్వాన్ని, పరిమితత్వాన్ని వీడాలి. అవి ఉన్నంతకాలం ఆధ్యాత్మిక అనుభవాలు రావు. ఋషుల్నే విమర్శిస్తే, వారు చెప్పే ప్రబోధాలు ఎలా అర్థం అవుతాయి? మనిషి తన మనస్సును విస్తరించుకుంటే, ఋషులు చెప్పే మాటలు కొద్దిగానైనా అర్థమై, కొంచెమైనా ఆచరించగలుగుతాడు.అందుకే విశాల దృక్పధం ఎప్పుడూ అవసరం.

మంత్రాక్షరాలు గొప్పవే. కాని అక్షర పరబ్రహ్మ తత్వాన్ని చూపించలేవు. అందుకే అశక్తతను వ్యక్తంచేస్తూనే వేదద్రష్టలు తమ ప్రయత్నం తాము చేశారు.

మనం కూడా జ్ఞానులమై, నిత్య సత్యశోధన చేస్తేనే తత్త్వం అనుభవంలోకి వస్తుంది. వేదసహితమైన పవిత్ర గ్రంథాల్లోని జ్ఞానాన్ని దీపస్తంభాలుగా చేసుకుంటే చీకటిలో సైతం లక్ష్యాన్ని చేరుకోగలం. సంసార సాగరాన్ని దాటగలం. పరబ్రహ్మంలో ఐక్యమై మోక్షాన్ని సాధించగలం.

ఆనందో బ్రహ్మ!

ఈ చరాచర సృష్టి అంతటికీ పరమ కారణం పరమాత్మ. అతనినే మనం 'భగవంతుడు', 'పరబ్రహ్మం', 'సర్వేశ్వరుడు' అని అనేక విధాలుగా పిలుస్తున్నాం. 'ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః/ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా॥'. సమగ్రమైన 'ఐశ్వర్యం (అధికారం), శక్తి, యశస్సు (కీర్తి), సంపద, జ్ఞానం, వైరాగ్యం.. అనే ఆరింటిని 'భగం' అంటారు. 'భగం' కలవాడు కనుక 'భగవంతుడు' అని పేరు. 'ఉత్పత్తించ వినాశంచ భూతానా మాగతిం గతిం/ వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి॥'. భూతాల ఉత్పత్తి, వినాశం, రాకడ, పోకడ, విద్య, అవిద్య.. అన్నీ తెలిసినవాడే 'భగవానుడు'. సృష్టి (పుట్టించడం), స్థితి (పోషించడం, శాసించడం), లయం (నాశం చేయడం), తిరోధానం (తనలోకి తీసుకోవడం), అనుగ్రహం (మరల ఉనికిని కలిగించడం) ఈ పనులను భగవంతుడే తన మాయా శక్తితో చేస్తాడు. అందువల్లే, పరమాత్మ 'పంచకృత్య పరాయణుడు'. పరబ్రహ్మానికి 'ఓం, తత్‌, సత్‌' అని మూడు పేర్లు ఉన్నాయి. 'ఓం తత్స దితి. నిర్దేశో బ్రహ్మణః త్రివిధః' అని 'భగవద్గీత' వాక్యం. 'అవతి భూతాని ఇతి ఓం'. సర్వభూతాలను రక్షించేది కనుక 'ఓం'. ఈ 'ఓంకారం' అత్యంత పవిత్రమైంది. అన్ని మంత్రాలకూ మూలం. అన్ని కర్మలకూ ముందుగా 'ఓం' చెప్తాం. దీనినే 'ప్రణవం' (మిక్కిలి స్తోత్రించదగింది) అనీ అంటాం.

సర్వకారణ కారణత్వాన్ని 'తత్‌' అనే పదం చెబుతుంది. 'యత్తద్య తస్తతో హేతౌ'. 'యత్‌' (ఏది), 'తత్‌' (అది), 'యతః' (ఎక్కడి నుంచి), 'తతః' (అక్కడి నుంచి) ఈ నాలుగు పదాలు కారణాన్ని చెప్తాయి. పరమాత్మ నుంచే 'సర్వం' (అంతా) ఏర్పడిందని 'తత్‌' శబ్దం సూచిస్తున్నది. ఎల్లప్పుడూ ఉండే తత్తాన్ని (శాశ్వతత్తాన్ని) 'సత్‌' శబ్దం చెబుతున్నది. 'అస్తి ఇతి సత్‌'. ఉన్నది (ఉండేది) అనికూడా 'సత్‌' శబ్దానికి అర్థం. 'ఈ సృష్టికి పూర్వం నేనొక్కడినే ఉన్నాను. సత్తుకాని, అసత్తుకాని, వాటికి కారణాలు గాని ఏవీ లేవు. ఇవన్నీ నశించిపోయినా 'మిగిలి ఉండేవాడను నేనే' అని 'భాగవత' ప్రమాణం. పరమాత్మ ఒక్కడే ఎల్లప్పుడూ ఉండేవాడు.

ఇది అతని శాశ్వతత్త్వాన్ని తెలియజేస్తున్నది. 'సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ' అని ఉపనిషత్తు వాక్యం. సత్పురుషులకు వర్తించేది సత్యం. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలలో పరమాత్మ 'తన సత్యసంధత'ను నిరూపించాడు. జ్ఙాయతే ఇతి జ్ఞానమ్‌. తెలిసేది కనుక జ్ఞానం. పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది వేదాల ద్వారానే తెలుస్తుంది. పరమాత్మ మాత్రమే సర్వజ్ఞుడు. 'అన్తం న విద్యతే ఇతి అనన్తం'. దేనికి అంతం (చివర) లేదో, తెలియదో అది అనంతం. పరమాత్మకు మొదలుకాని, చివరకాని లేవు. అందువల్లే పరమాత్మ అనాది, అనంతం. పరమాత్మ స్థితి ఆనందం. 'ఆనందో బ్రహ్మ' అని పెద్దల మాట. ఆనందమంటే 'సంతోషం'. కానీ, వాస్తవానికి 'ఏ వికారాలూ లేని స్థితి' ఆనందం.

ప్రతి వస్తువుకు ఉత్పత్తి (పుట్టడం), సత్త (ఉండటం, బలం కలిగి ఉండటం), వృద్ధి (పెరుగుదల), పరిణామం (మార్పు చెందడం), అపక్షయం (క్షీణించడం), నాశం (నశించిపోవడం) అనే ఆరు గుణాలుంటాయి. అలాగే, సంతోషం, దుఃఖం మొదలైనవి కూడా వికారాలే. ఇవేవీ లేనివాడు కనుక, పరమాత్మ 'ఆనంద స్వరూపుడు'. పరమాత్మే సర్వవ్యాపకుడు, సర్వశాసకుడు. కర్త, కర్మ, క్రియ అంతా పరమాత్మనే. కాలాతీతుడు, గుణాతీతుడు అయిన పరమాత్మ అన్ని వస్తువులలో చైతన్యరూపమై ఉండి, అన్ని పనులూ నిర్వహిస్తాడు. అన్నీ తానే అయి కూడా దేనితో సంబంధం లేని వాని వలె ఉదాసీనంగానూ ఉంటాడు. కర్తృత్వ భావాన్ని పొందడు. ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉండటం పరమాత్మ ప్రత్యేక లక్షణం. ఈ జగత్తంతా పరమాత్మ అధీనంలో ఉన్నది. కనుక, అందరికీ, అన్నిటికీ సర్వాశ్రయుడు, అనన్య శరణ్యుడు పరమాత్మనే.

బ్రహ్మ పరబ్రహ్మ - Brahma Parabrahma

బ్రహ్మమందు మీరు, మీలోన బ్రహ్మంబు, మీరె బ్రహ్మ మ్మీరెయయ్యు |
బ్రహ్మమయులు మీరు, బ్రహ్మమగుదురు, కాని మోహవశత, కానరైరి ||

బ్రహ్మ:
గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.

పరబ్రహ్మ:
బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.

ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.

అచల పరిపూర్ణ పరబ్రహ్మ:
శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు  లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.

పరిపూర్ణము:
పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే  మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.

ఇహరూపము:
ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.

పరరూపము:
ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము.

పరాత్పరము:
పరరూపమునకు కూడా పరము, అతీతము అయినది. సాక్షిగా కూడా లేనిది. సర్వాధారము కానిది. అధిష్ఠానమై యున్నది. నిరాలంబము, నిరాకాశము, నిరాధారము, అచలము, పరిపూర్ణము, మాయాత్పరము. ఉన్నదున్నట్లుండి ఆ ఉండుట అనెడి ఎరుక లేనిది. చిత్పరమైనది. త్రిగుణ రహిత పరబ్రహ్మము. అన్ని కాలాలలో, అన్ని చోట్లా నిండి నిబిడీకృతమై యున్నది. దానియందు ముల్లు గ్రుచ్చసందు లేనిది. అద్వయమైనది. దానినుండి ఏదీ ఆవిర్భవించదు, ఏదీ లయము కాదు. దృశ్యము, దర్శనము అనెడి ఎరుక లేనిది. అట్టి ఎరుక భ్రాంతియే గనుక, పరాత్పరమనగా భ్రాంతి రహితము. దృశ్యము లేని కేవల దృక్‌స్థితి ఏదో అదే పరాత్పరము.  పరాత్పరము అనగా అచల పరిపూర్ణమే.

నిరీహము:
ఇహము కానిది అనగా పరము. ఏదైనా లోకమును అనుభవముతో నుంచుకొనినట్టి అహంకారమున్నప్పుడు దానికాలోకము ఇహలోకము. ఏడు ఊర్ధ్వలోకములలో భూః అనే లోకములో నున్న అహంకు భువర్లోకము పరము. భువర్లోకములోనున్న దానికి సువర్లోకము పరము. ఏడు ఇహ లోకములు అలోకము కాగా పెనుచీకటి కావలనున్నది పరము. ఈ పరమే నిరీహము. ఇహలోకములన్నీ మిథ్య. అహంకారము హారతి కాగా ఇహముండదు. అద్వైతములో పరమే ఉన్నది. అహముంటే ఇహముండును. అహం పోతే ఇహముండదు. పరమే శాశ్వతము.

యోగుల పరరూపము:
అజ్ఞులకు ఏది ఇహ రూపమో, అదే యోగులైన వారికి వారి అంతరంగమందు గంభీరమైన చైతన్య సాగరముగాను, నిర్వికల్పముగాను, అచలముగానున్నదేదో అదే పరరూపము.

అపరరూపము:
పంచ బ్రహ్మలకు మూలమైన శివశక్త్యాత్మకతత్వమును అపర రూపమందురు. సర్వకాల సర్వావస్థలయందున్న సకల జీవులు, దేవతలు, త్రిమూర్తులు, తన్మాత్ర సృష్టి, పంచబ్రహ్మలతో సహా అన్నీ అపరరూపములే. ఇవన్నిటికీ మూలమైన శివశక్త్యాత్మకమునకు పరమైన పరశివరూపమే పరరూపము.

బ్రహ్మకు పర్యాయ నామములు:
బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, అంతర్యామి, సర్వాధిష్ఠాతృ, తత్పద లక్ష్యార్థము, విశుద్ధ చిత్‌, ముఖ్యేశ్వర త్రయాధిష్ఠాతృ, నిరాలంబము, తత్త్వము, అమృతత్త్వము మొదలైనవి. కొన్ని సృష్టితో సాపేక్షము. అన్ని నామములు ఒకే బ్రహ్మను సూచించుచున్నవి.

సాక్షాత్‌ బ్రహ్మ:
అద్వయమై, సాధకునికి అపరోక్షమైయున్న బ్రహ్మ. తనకు తానే ఆద్యంతములు లేని స్వతఃప్రకాశము. అద్వైత సిద్ధిని సూచించే సాక్షాత్కారము.

భూమ:
మానవునిలో ఉండే స్థానము. ఎక్కడైతే సంకల్ప వికల్పములు, ఆలోచనలు, ఊహలు, అనుభవములు, జ్ఞాపకములు ఏమీలేవో, ఆకాశము వలె శూన్యమో, అక్కడ బ్రహ్మ మాత్రము అనన్యముగా స్థిరమై యుండి శిష్యునికి ఆ బ్రహ్మ పట్టుబడునో ఆ స్థానము పేరు భూమ.

శిష్యునిలో బ్రహ్మ సాక్షాత్కారమునకు పర్యాయపదములు:
రాజయోగము, సహజ నిర్వికల్ప సమాధి, అమనస్కము, సర్వలయము, తత్త్వము, అమరత్త్వము, అద్వైత సిద్ధి, తురీయాతీతము, స్వస్వరూప సాక్షాత్కారము, నిర్వాణము, నిర్వికల్పము, సహజము, నిరంజనము, ప్రసన్నత, పరమశాంతి, నిర్వాసనా మౌనముద్ర మొదలగునవి. ఈ పేర్లలో సాపేక్ష, నిరపేక్ష భేదమే గాని అనుభూతి ఒక్కటే. అదే అపరోక్షానుభూతి.

సత్యము: అవ్యక్తము, పరబ్రహ్మ స్వరూపము.
ఋతము: వ్యక్త బ్రహ్మ, పరమాత్మ రూపము.

ఆవరణ బ్రహ్మ-నిరావరణ బ్రహ్మ:
మాయ ద్వారమునకు ఈవలి బ్రహ్మ ప్రకాశము, దానిని ఆశ్రయించిన మాయ కారణముగా కారణ బ్రహ్మమగు చున్నది. అప్పటికీ ఆ బ్రహ్మ నిర్గుణమే. మాయ యొక్క ఆశ్రయము వలన సగుణ బ్రహ్మమని పిలువబడుచున్నది. నిజమునకు సృష్టి స్థితి లయములకు కారణము మాయ, అనగా నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించిన మాయ, బ్రహ్మము కాదు. అయినను బ్రహ్మమును కారణమనుచున్నారు గనుక ఆ బ్రహ్మము మాయాశబలిత బ్రహ్మము.

మాయ ద్వారమునకు ఆవలి బ్రహ్మ ప్రకాశము స్వప్రకాశము. ఈ బ్రహ్మ త్రిగుణ రహితము, కారణ బ్రహ్మము కాదు. మాయ యొక్క ఆశ్రయము లేదు. మాయ, మాయా కల్పితములు లేని, అద్వయబ్రహ్మమును నిరావరణ బ్రహ్మమందురు.

మాయ లేనిది. లేని మాయ కారణముగా తోచినవీ లేనివే. కనుక మాయ ద్వారమునకు ఈవల, ఆవల అనునది అసమంజసము. ఉన్నది నిరావరణ పరబ్రహ్మము మాత్రమే. అన్యము లేదు.
కాని అవిద్యా, మాయా దోషములున్న సాధకునికి ముందుగా అవిద్య నశించగానే మాయావరణమందున్న మాయా శబలిత బ్రహ్మ జ్ఞానము కలుగును. ఇది సత్‌చిత్‌ ఆనందమను తటస్థ లక్షణము. సాధకుడు అహం బ్రహ్మయనుచు అహం, బ్రహ్మానుభవము అని ద్వైతములోనున్నాడు. ద్వైతము నశించినప్పుడు, అహంస్ఫురణ ఆగిపోవును. బ్రహ్మానుభవమును అనుభవించే అహం లేకపోగా సత్‌చిత్‌ఆనందము ఘనమగును. ఇది స్వరూప లక్షణము. ద్వైతము నశించినందున అద్వైతము సిద్ధించును. దీని స్వరూప లక్షణమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మమే మాయావరణ లేని బ్రహ్మము. నిరావరణ బ్రహ్మము. సాధకునికిది అపరోక్షానుభూతి.

నీరంధ్రము:
దట్టముగానుండి ముల్లు గ్రుచ్చ సందులేని అద్వయమైన నిరావరణ బ్రహ్మమును నీరంధ్రము అందురు.

నిబిడము:
అంతా అదే, రెండవది లేదు. అది ఎంత దట్టముగా నున్నదనగా ముల్లు గ్రుచ్చ సందులేక ఉన్నది. నిబిడమనగా దట్టము. ఇట్టిది నిరావరణ బ్రహ్మమే.

పరబ్రహ్మ - కేశవ - విష్ణువు:
పరమ స్వరాట్‌ అయిన పరబ్రహ్మ నుండి, దానికదే అభివ్యక్తమైన కేశమాత్రపు చైతన్యము అనగా వెంట్రుకవాసి చైతన్యమును కేశవ అందురు. ఆ లేశమాత్ర చైతన్యము లెస్సగా వ్యాపించిన చైతన్యమైనప్పుడది విష్ణువనబడును. నిజమునకు పరబ్రహ్మము నుండి చైతన్యము వెలువడలేదు. మాయ కారణముగా మాయావరణలోనే ఈ కేశవ, విష్ణు చైతన్యములు. నిరావరణమందు స్వప్రకాశమే గాని బాహ్య ప్రకాశము లేదు. అందువలన చైతన్యము యొక్క వ్యక్తావ్యక్తములకు సంబంధము లేని స్వరూపమే పరబ్రహ్మ.

బ్రహ్మ లక్షణము: చిదానంద లక్షణము.
చైతన్యము: ఉనికిగా నున్నది.
ప్రకాశము: చైతన్యమును తెలియుటగా నున్నది. అనగా ఉనికి యొక్క అనుభూతిగా నున్నది.
జ్ఞానము: చైతన్య ప్రకాశము వలన స్థిరమై నిలిచియున్న స్మృతి. కేవల స్మృతి రూపమే ఆనందము.
చిత్: చైతన్యము, జ్ఞానము, ప్రకాశము ఒక్కటైయున్నది.
సత్‌: శాశ్వత ఉనికి అనే తత్త్వము.
అసత్‌: శాశ్వత ఉనికి రూపమునందు జేరి యుండుట వలన అనిత్యమైన ఘటమునకు తాత్కాలిక ఉనికి కలుగుట. అప్పుడు ఘటము అసత్‌ అనబడును.
చిత్‌: తెలియబడుతూ ఉండుట అనెడి నిత్య వర్తమానరూప శాశ్వత తత్త్వము.
అచిత్‌: తెలియబడుట అనెడి శాశ్వత తత్త్వము అనిత్య ఘటమునందు జేరి యుండుట వలన ఘటము సృష్టించబడిన పిదప తెలియబడుచు, ఘట నాశనము తరువాత తెలియబడక, తాత్కాలికముగా ఘటము తెలియబడుచున్నది. ఇట్టి ఆది అంతములమధ్య తెలియబడుటను అచిత్‌ అందురు.
సత్‌చిత్‌: శాశ్వత ఉనికి తత్త్వమును శాశ్వతముగా తెలియబడుచుండుట అనెడి తత్త్వము. సత్‌యే చిత్‌. చిత్‌యే సత్‌. ఉనికియే తెలియబడు తత్త్వము. తెలియబడుట తన ఉనికే. ఈ రెండు కలసి ఒక్కటై యుండు తత్త్వము.

అసత్‌ అచిత్‌ పదార్థముల వలన కలిగిన బంధము, దుఃఖము నశించగా కేవల సత్‌చిత్‌ స్వరూపము సాపేక్షముగా ఆనందము. శాశ్వత సత్‌చిత్‌ తత్త్వము ఏనాడూ అసత్‌ అచిత్‌ కానిది గనుక, ఆ సాపేక్ష ఆనందము లేనిదై, నిరాపేక్షికమందు అనంతము. అందువలన సాపేక్ష జ్ఞానము సత్‌చిత్‌ ఆనందము. నిరపేక్ష విజ్ఞానము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.

అసత్‌ అచిత్‌: ఇది అనృత జడము. ఘటపటాదులందు చేరియున్న సత్‌చిత్‌లు సర్వాధారమై యుండగా సర్వమును సృష్టి స్థితి లయ రూప వికారములుగా కనబడునట్లు చేయునది. ఇందులో సుఖము అనిత్యమగుటచే దుఃఖమనబడును. అందువలన ఇది అనృత జడ దుఃఖరూపము.

అహంత: నేను అనెడి స్ఫురణ. చైతన్య ప్రకాశము అంతఃకరణమనెడి ఉపాధిపై పడి ప్రతిఫలించిన ప్రకాశమే చిత్‌+ఆభాస. అందువలన చిదాభాసుడనగా అహం స్ఫురణ.

స్ఫురణ: ఉపాధులయందు ప్రకాశించుచున్న పరమాత్మ చైతన్యము యొక్క లక్షణమే ఈ స్ఫురణ. శుద్ధ అంతఃకరణమందు ఆభాసగానున్న స్ఫురణ సో-హం జ్ఞానము. మలిన అంతఃకరణయందు ప్రతిఫలించిన పరమాత్మ ప్రకాశము అసత్య నేను అనే అజ్ఞానము.

పూర్ణాహంత : అంతయూ నేనే అనెడి స్ఫురణ.
మహత్తత్త్వము : వివేక విజ్ఞానముల చిహ్నము. ఇది ఈశ్వరుని యొక్క విజ్ఞానమయ కోశము.
పూర్ణాహంకృతి : సర్వప్రాణులయందున్న నేను ఒక్కటే అనెడి దృష్టి.

మహదహంకారము:
సర్వ భూతములు వ్యక్తమగుటకు కారణమైనది. ఇట్టి కారణభూతమైన అహంరూప నాశనమే మోక్షము. దీనినే మూలాహంకారమని కూడా అందురు. మూలాహంకారము నశించినంతనే మోక్షము సిద్ధించును.
ఉత్తమ పురుషుడు : అందరిలోనున్న నేను అనే ఒక్కటైన అన్యముతోచని అనుభూతి.

విశ్వరూప సందర్శనము:
నా ఆత్మ స్వరూపమే ఈ బ్రహ్మాండ పిండాండ ములుగా నా దృష్టికి విషయమగుచున్నది. అని గ్రహించి యుండుటయే విశ్వరూప సందర్శన యోగము.

అక్షర పరబ్రహ్మ యోగము:
స్థితులు గతులు మారినా, దేహాదులు వస్తూ పోతూ ఉన్నా, అవస్థలు మారిపోవుచున్ననూ 'నేను' మాత్రము మారని వాడను. శాశ్వతుడను - అని దృఢ నిర్ణయమై అనగా ఆరూఢమగుటయే అక్షర పరబ్రహ్మ యోగము.

పురుషోత్తముడు:
జీవేశ్వరుల ఉపాధిక, నిరుపాధిక అనుభవ భేదములు తొలగిపోగా, సర్వదా సర్వత్రా సర్వసాక్షిగా ఉండే పరమాత్మయే పురుషోత్తముడు. క్షర అక్షర పురుషులకంటె అతీతమైన సర్వోన్నతుడే పురుషోత్తముడు.

పురుషోత్తమ ప్రాప్తి:
ఈశ్వరునియందున్న నిరుపాధికమైన అక్షర పరబ్రహ్మను  జీవుడు తన జీవోపాధిలో యోగించినప్పుడది పురుషోత్తమ ప్రాప్తి అనబడును.

గుణి గుణములు:
1. అవ్యక్తము గుణి - దాని గుణము మహత్తత్త్వము.
2. మహత్తత్త్వము గుణి - దాని గుణము మహదహంకారము
3. మహదహంకారము గుణి-దాని గుణము తన్మాత్రలు
4. తన్మాత్రలు గుణి - వాటి గుణములు ప్రపంచము.

సనాతనము:
అన్ని కాలములలో ఉంటూ ఉండేది. ఆది అంతము లేనిది. నిర్వికారమైనది. ఈ లక్షణములు బ్రహ్మ లక్షణములు. కనుక బ్రహ్మమే సనాతనము.

తత్త్వము:
బ్రహ్మ - ఆత్మల ఏకత్వము. ఘటాకాశ మహాకాశముల ఏకత్వము వంటిది. ఉపాధిగత ఆత్మ - నిరుపాధిక బ్రహ్మ ఒక్కటే. త్వం అనే సాధకుడు - తత్‌ అనే బ్రహ్మము అభేదము (అసి). ఇట్టి అభేదమును తత్త్వమందురు.

జీవుడు - పరమాత్మ:
జీవుడు నిజానికి పవిత్రుడు, సనాతనుడు. కర్మ వశాన అశాశ్వతమైన ఉపాధులను ఆశ్రయించినా, ఉపాధుల నాశనము చేత జీవుడు నశించుటలేదు. ఈ ఉపాధులే తాననెడి అజ్ఞానము నశించగానే కర్మలు అకర్మలై, జీవాత్మయే పరమాత్మ అనెడి జ్ఞానముదయించగా సత్‌చిత్‌ఆనంద రూపుడగుచున్నాడు.
దర్శనము : జ్ఞానైక స్వరూపమును దర్శనము అందురు.

సమ్యక్‌ దర్శనము:
తనలో సకల భూతములను, సకల భూతములలో తనను దర్శించుటను సమ్యక్‌ దర్శనము అందురు. ఇదే సమాత్మ జ్ఞానమనియు, బ్రహ్మ జ్ఞానమనియు అనబడును. సమము, సంప్రాప్తము అని కూడా అందురు. అనగా బ్రహ్మ సాక్షాత్కారమే.

లింగము:
దేనియందు అన్నీ లయమగునో దేని లక్ష్యములో అన్నీ పురోగమించునో అదే లింగము. అదే శివము.
లిం అనగా అవ్యక్తము. గం అనగా అవ్యక్తమును వ్యక్త రూపముగా చూపే చిహ్నము, లేక గుర్తు, లేక సంకేతము. వ్యక్త రూపలింగము  అర్చనాదులకు, సాధనలకు అందుబాటైనది. కాని ధ్యానములో చిహ్నమును విడచి అవ్యక్తమనెడి శివమునే భావించవలెను.

లింగాంగములు:
1. సత్‌ లింగము, చిత్‌ అంగము, ఆత్మ సంయోగమే ఆనందము.
2. తత్‌ పదము లింగము, త్వంపదము అంగము, అసి పదమనెడి అభేదమే తత్త్వమసి వాక్యార్థము.
3. నాదము లింగము, బిందువు అంగము, సంయోగమే కళ.
4. హ అనే పురుషుడు లింగము స అనే ప్రకృతి అంగము, సంయోగపరచి హంసగా చేసేది బిందువు.

పరంజ్యోతికి పర్యాయ నామములు:
అర్యముడు, వరుణుడు, వాయువు, అగ్ని, చంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు.

అనుభూతి:
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనెడి త్రిపుటిని ప్రకాశింపచేసే ప్రకాశరూపముగా నుండుటను అనుభూతి అందురు.
సంవేదనము : ప్రకాశ రూపునికి త్రిపుటి తెలియబడుచుండుటను సంవేదనమందురు.

ప్రపత్తి : ప్రకాశరూపుడు త్రిపుటియందు వ్యాపకుడై యుండుటను ప్రపత్తి అందురు.

ప్రత్యక్షము:
చిన్మాత్రుడు తన అక్షరార్థమును విడువక త్రిపుటియందు వ్యాపించినప్పుడు సాక్షియగును. అదే ప్రత్యక్షము.
జీవుడు : సాక్షి చిన్మాత్రుడు ప్రాణమును ధరించినప్పుడు జీవుడనబడును.

సంవిత్‌:
సాక్షి చిన్మాత్రుడు వృత్తి అనే ఉపాధియందు వ్యాపించినప్పుడు సంవిత్‌ అనబడును. అంతఃకరణ వృత్తిని ఏది ఉపాధిగా చేసుకొని ఉన్నదో అట్టి తెలివి రూపమే సంవిత్‌. ఆ తెలుసుకునే తెలివినే ప్రజ్ఞానమని, స్మృతి రూపమని అందురు.

ప్రమాత, పురుషుడు:
సాక్షి చైతన్యమే అంతఃకరణ వృత్తిలో భాగమైన అహం వృత్తిని ఏది ఉపాధిగా చేసుకొనుచున్నదో అది ప్రమాత అనబడును. ప్రమాతయే పురుషుడు. సాక్షి చిన్మాత్రుడు అహం వృత్తినందు ప్రవేశించినప్పుడు ప్రమాత అని గాని, పురుషుడని గాని అనబడును.

త్రిపుటి:
ఒక్క సాక్షి చిన్మాత్రుడే క్రమముగా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయమనెడి త్రిపుటిగా భేదములను పొందెను.

జగద్రూపము:
సాక్షి చిన్మాత్రుడే సంకల్పము, వికల్పము, సంశయము, అభిమానము మొదలగు భ్రమల చేత అనేక విధములైన అవస్థాంతరములను పొంది, జగద్రూపుడై ప్రకాశించుచున్నాడు.

అన్వర్థ బ్రాహ్మణుడు:
అక్షరమే చిన్మాత్ర స్వరూపమై, సకల చరాచర విశ్వమునకు ఆధారమై, ఆస్పదమై యున్నది. దేశ కాలాదుల సృష్టికి కారణమై యున్నది. అక్షరమందే అవ్యాకృతాకాశము ఓతప్రోతమై యున్నది. అందు అవ్యాకృతము ఇమిడి ఉన్నది. అవ్యాకృతాకాశమునకు కారణమైనట్టి అక్షరమును తెలుసుకున్నవాడే అన్వర్థ బ్రాహ్మణుడు.

అవ్యాకృతాకాశము:
సూక్ష్మాతి సూక్ష్మమైన అవ్యాకృత తత్త్వమును ఆకాశమందురు. సూక్ష్మమనగా త్రిగుణాత్మక ప్రధానము అనెడి తత్త్వము. ఈ తత్త్వమునకు కారణమైనది అవ్యాకృతాకాశము. దీనికి అవ్యాకృతమని, బీజమని, అవ్యక్తమని, సుషుప్తి అని పేరులు. వ్యక్తము కానిది గనుక, ఇది అనుమాన ప్రమాణము, శాస్త్ర ప్రమాణము వలన మాత్రమే తెలియబడును. స్వానుభవమునకు రానిది.

అద్వైతము:
భోక్తృ అనగా జీవుడు, భోగము అనగా విషయము. ప్రేరిత అనగా ఈశ్వరుడు. ఈ మూడూ ఒక్కటే అయినదే పరబ్రహ్మము. ఈ త్రిపుటి యొక్క ఏకీకృతమే అద్వైతము.

అద్వైత భావము:
అద్వైత భావమందు జ్ఞాన అజ్ఞానములు రెండూ ఉండవు. కర్మ సమాప్తి అని గాని, పునఃకర్మ అని గాని ఉండవు. బంధ మోక్షముల ప్రతీతి ఉండదు. ప్రపంచ ప్రతీతి ఉండదు. మనస్సుకు అస్తిత్వము ఉండదు. మృతునివలె ఉండును. సర్వము బ్రహ్మమయము అన్న స్థిరభావముండును. అహంకారముండదు. ద్వైత అద్వైత భావనలుండవు. బ్రహ్మమునందు స్థితుడై అభావమై ఉండును. తాననునదే ఉండదు. సర్వమూ వాటి మూలములో శూన్యమే గనుక, సర్వభావన శూన్యభావన రెండూ ఉండవు. భావనలుంటే ద్వైతమే కదా! అభావమందే ఏదో ఉన్నది. అది అనిర్వచనీయము.

అభావము:
1. ప్రాగా భావము : సృష్టికి పూర్వము ఏమీ లేదు.
2. ప్రధ్వంసాభావము : ప్రలయానంతరము ఏమీ లేదు.
3. అన్యోన్యాభావము : ఆధార ఆధేయములు గాని, కార్యకారణములు గానీ ఏమీ లేవు.
4. అత్యంతా భావము : ఎప్పుడూ, ఎక్కడా, ఏమీ లేదు. మధ్యలో తోచిన జీవ ఈశ్వర జగత్తులు మిథ్య, అందువలన ఏమీ లేదు. దీనినే అత్యంతా భావము అందురు. అందువలన ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. మిథ్యా రూపములకు మూలము లేదు. అవి కలలో తోచిన వేలాగో అలాగే, మేల్కొంటే ఏమీ లేవు. ఉత్త బట్టబయలు ఏమీ లేదు.

తటస్థ, స్వరూప లక్షణములు:
ఏ లక్షణము ఒకానొకప్పుడుండి, తన లక్షణమును అన్య పదార్థములతో కలసియున్నా వాటికంటే భిన్నమైనదిగా ఉన్నదో, అసంగమైనదిగా ఉన్నదో ఆ లక్షణము తటస్థ లక్షణము. సాపేక్ష లక్షణముగా గుర్తించబడినప్పటికీ ముందుగా నున్న నిరపేక్ష లక్షణము కోల్పోనిది. ఆ కోల్పోని లక్షణమే నిరపేక్షము. అన్ని కాలములలో, అన్య పదార్థములతో కలిసియున్నా కలియక ఉన్నా, నిర్వికార శాశ్వత లక్షణముగా సహజమై యున్న లక్షణము స్వరూప లక్షణము.

తటస్థ లక్షణ బ్రహ్మము సత్‌చిత్‌ ఆనందము. అది నామ రూపములందు జేరి యున్నప్పుడు అస్థి భాతి ప్రియములనెడి తత్త్వముగా గోచరించుచు, ఆ నామ రూప వస్తువు ఉన్నది, ఆ నామ రూప వస్తువు తెలియబడుచున్నది. ఆ నామరూప వస్తువే ప్రియమగుచున్నది అని వ్యవహారము కలుగుచున్నది. అవ్యవహారముగా, అసంగముగా ఉన్న అస్థివ్య భాతి ప్రియములే సత్‌ చిత్‌ ఆనంద లక్షణమైన తటస్థ లక్షణము. అస్థిభాతి ప్రియములు నామ రూపములందు అనుస్యూతముగా లేనిచో దృశ్యము, దృశ్య తాదాత్మ్యత ఉండదు. అందువలన అనృత జడ దుఃఖ కారణమైన నామరూపములనుండి సత్‌ చిత్‌ ఆనందములనెడి తత్త్వమును వేరుపరచిన ఆ విలక్షణమైన బ్రహ్మము అనృత జడ దుఃఖములకు వ్యతిరేకార్థమైన సత్‌ చిత్‌ ఆనందములు సాధకుని అనుభవమునకు వచ్చును. అనుభవము ఉన్న దానిలో అహం, బ్రహ్మ అని రెండు (ద్వైతము) ఉండదుట వలన ఇది తటస్థ లక్షణముగా చెప్పబడినది. అహం అనెడి ప్రకృతి కూడా లేకపోగా, అద్వైతము సిద్ధించును. అక్కడ నామరూపములందు వ్యాపకము కాని సత్‌చిత్‌ ఆనందములు తన వ్యాపక లక్షణమును కోల్పోయినయెడల ఆ మూడు లక్షణములు ఘన రూపముగా నున్నవి. జగత్తు మిథ్య గనుక, నిజానికి నిరపేక్షమైన ఘన రూపమే సత్యము, అన్ని కాలములలో శాశ్వతమై యున్నది. అందువలన సత్‌ ఘనము, చిత్‌ ఘనము, ఆనంద ఘనము అని పిలచుటయే సత్యము. అద్వైతము సిద్ధించినది. కనుక ఈ ఘనమనే మాట సాపేక్షమును సూచించుట చేత, ఘనము తిరిగి వ్యాపకమయ్యే ఆస్కారము కనబడుచున్నది. పునరావృతి లేని బ్రహ్మమును స్వరూప లక్షణముతో పిలచినప్పుడు, సత్‌ ఘనమే సత్యము, చిత్‌ ఘనమే జ్ఞానము, ఆనంద ఘనమే అనంతము. అందువలన స్వరూప లక్షణము అనగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది సాధకుని యెడల తనలో తాను రమించుట, సత్య జ్ఞానానందములు తానే యగుట, సత్య స్వరూప, జ్ఞాన స్వరూప, ఆనంద స్వరూప, సత్‌చిదానంద స్వరూప, విజ్ఞాన స్వరూప, స్వస్వరూప అనెడి పేర్లు ఉపయోగించబడును. తటస్థ లక్షణ జ్ఞానమును పరోక్షమనియు, స్వరూప లక్షణయుతుని అపరోక్షానుభూతిగాను చెప్పబడును.

ఆధారము - అధిష్ఠానము:

ఆత్మకు రెండు స్వరూపములు కలవు.
1. సద్రూప సామాన్య రూపము.
2. అసంగత, కూటస్థత, నిత్యముక్తతరూప విశేష రూపము.

సకల మిథ్యా రూపములందు వ్యాపకమైన సత్‌ చిత్‌ ఆనంద సామాన్య రూపమును ఆధారమందురు. మిథ్య గనుక, లేనివిగా నిర్ణయించి నప్పుడు కేవల సత్‌చిత్‌ ఆనంద సామాన్య రూపమే నిరపేక్షమగును. సాధకులు మొదటి సామాన్య రూపమును పరోక్షముగా గ్రహించినప్పుడది అనుభవ రూపము, ద్వైతము. ద్వైత జ్ఞానమందు అసంగత, కూటస్థత, నిత్యముక్తత అయిన బ్రహ్మమే ఉన్నది. అన్యము లేదు, అన్నప్పుడు ఆ విశేష రూపము అద్వయము. అది దేనికిని ఆధారము కాదు. అప్పుడది అధిష్ఠానముగా నున్నది. ఇతర కల్పితములున్నను, లేకున్నను, ఉన్నదున్నట్లున్నది. ఇట్టిది స్వానుభవమైనప్పుడు అనుభూతియే ఉన్నది. రెండవది లేదు. ఇదియే అపరోక్షానుభూతి.

చేతనాంశము - ఆభాసాంశము:
చేతనాంశము ఉన్నదున్నట్లున్నది. దానియందు సత్తాస్ఫూర్తి తప్ప మరేదీ లేదు. ఆభాసాంశము జగత్తుకు సంబంధించి, ఉత్పత్తి, స్థితి, వికారములు, లయములుగా కల్పితములను గోచరింపచేయుచుండును.
జీవులయందున్న ఆభాసాంశము శరీరత్రయముగాను, పుణ్య పాపములు చేయుచు, ఫలితములను అనుభవించుచూ అవస్థాత్రయములో తిరుగుచుండును.

ఈశ్వరునియందున్న ఆభాసాంశము జీవునికి కర్మ ఫలితములను ప్రదానము చేయుచుండును. మాయా కార్యములైన సృష్టి, స్థితి లయములకు ఆభాసాంశ ఈశ్వరుడు కర్త యనుకొనును.

జీవులయందున్న చేతనాంశము కూటస్థాత్మగా, నిష్క్రియగా, నిర్వికల్పముగానుండును. ఈశ్వరునియందున్న చేతనాంశము కూటస్థ బ్రహ్మగా, కర్తృత్వ రహితముగా, నిర్వికల్పముగానుండును. జీవ ఈశ్వర ఆభాసాంశలలో భేదమున్నను, చేతనాంశములలో ఏ భేదములేదు. స్వానుభవమైన సాక్షి చైతన్యముననుసరించి కూటస్థాత్మ, కూటస్థ బ్రహ్మ ఒక్కటే. అనగా జీవేశ్వరులు ఒక్కటే.

బ్రహ్మమునందు కూడా ఆభాసాంశ, చేతనాంశ ఉన్నవి. ఆభాసాంశ రూపబ్రహ్మ ఈ మిథ్యా జగత్తుకు సర్వాధారము. చేతనాంశ రూపబ్రహ్మ సృష్టిలో అధిష్ఠాన బ్రహ్మమే, అచలము, పరిపూర్ణము, నిరాధారము, నిర్వికారము, శాశ్వతము.

చేతనాంశ రూప జీవ, ఈశ్వర, బ్రహ్మలు, మూడూ అభేదమై అచల పరిపూర్ణమై యున్నది.

కం||  బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మకు, నేననెడి మాయ ప్రబలె జగంబై |
బ్రహ్మనుగని, తానేగుటె బ్రహ్మననే మాయకు పని, బ్రహ్మందుజుమీ ||

తా|| చేతనాంశ బ్రహ్మమందు, మాయకారణముగా ఆభాసాంశ బ్రహ్మముతోచి, మాయకు పరమైన చేతన బ్రహ్మ సాక్షాత్కరించగా, ఆభాస బ్రహ్మ మాయమగుటయే మాయపని.

చైతన్య ప్రకాశము:
(1) భ్రూమధ్య స్థానమునందు అహం బిందువు
(2) అహం అనంతముగా వ్యక్తమగుటకు అవకాశమిచ్చే స్థానమైన భూమ
(3) సః అనే పరమాత్మ స్థితికి, లేక దైవీ స్థితికి స్థానమైన సహస్రారము - ఈ మూడు స్థాన బిందువులను త్రిభుజాకారముగా కలుపగా, దానిమధ్య ఉద్భవించిన అంతర్గత చైతన్య ప్రకాశమే ప్రజ్ఞ. సంవిత్‌. ఆ చైతన్యమే మనలోనే మన వెంట వచ్చుచున్నది. ఈ చైతన్య ప్రకాశములోనే అవతారులు అనుగ్రహించిన చైతన్యము కలసిపోయి, భక్తులకు ఆధ్యాత్మిక పురోగమనమునకు వారి అంతరాత్మ స్ఫూర్తిగా పనిచేయుచున్నది. మానవ చైతన్యమును అవతారుని చైతన్యము వద్దకు ఏకోన్ముఖము చేసి కేంద్రీకరించిన సాధకులు అవతారుని అనుగ్రహమునకు పాత్రులగు చున్నారు. సర్వార్పణ అయిన భక్తులు భగవదైక్యము చెందుచున్నారు.

చిత్కళలు:
1. వియన్మండలము (2) తమో మండలము (3) మేఘ మండలము (4) విద్యున్మండలము (5) సూర్య మండలము (6) జ్యోతిర్మండలము (7) తారా మండలము (8) చంద్ర మండలము (9) వహ్ని మండలము (10) హిరణ్మయ మండలము.

బ్రహ్మ అణోరణియాన్‌:
ఒక్క పృథివి అణువులో 11 జలాణువులు కలవు. ఒక్క జల అణువులో 11 తేజో అణువులు కలవు. ఒక్క తేజో అణువులో 11 వాయు అణువులు కలవు. ఒక్క వాయు అణువులో 11 ఆకాశాణువులు కలవు. ఒక్క ఆకాశాణువులో 11 బ్రహ్మాణువులు కలవు. ఒక్క బ్రహ్మాణువు లోపల దశ విధ ప్రాణములు వాటికాధారమైన ముఖ్య ప్రాణమున్నది. ఆ మహా ప్రాణమే పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యమే అణోరణియాన్‌. ఆ పరమాత్మ అన్నింటిలో అణోరణియాన్‌గా వ్యాపించి వాటికి మీరి, అన్నింటినీ తనయందుంచుకొనగా, మహతోమహియాన్‌గా కూడా నున్నాడు.

జ్ఞానము:
ద్వైతము, అద్వైతము, పరము, అపరము మొదలగు భేదముల చేత ప్రకాశించుచున్న బహు విధములు, వాటి ఫలితములు కలిపి జ్ఞానమనబడును. జ్ఞానమే విద్యా రూపము, జ్ఞానమే మాయ.

అపర జ్ఞానము:
ఇంద్రియాతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధిచేత నిశ్చయముగా గ్రహించుటయు, ఇంద్రియ గోచర విషయములతో అంటియున్న మిథ్యాహము నశించుటయు, ఈ హద్దు వరకు అపర జ్ఞానము.

పర జ్ఞానము:
నిర్వికల్ప సమాధియందు, ఏ స్వరూపము గుర్తించబడినదో, తక్కిన సమయములందును, అదే స్వరూపము తెంపు లేకుండా కొనసాగి యుండునో, అపర జ్ఞానమనెడి హద్దు మీరి యున్నదో అట్టి జ్ఞానము పరజ్ఞానమబడును.

అద్వైత జ్ఞానము:
దృశ్యమైనట్టి ఏవియును లేక, కేవలము స్వయముగా ప్రకాశించు పరమ చైతన్యమును అద్వైత జ్ఞానమందురు. దీనివలన ద్విపుటి త్రిపుటులు నశించును. ఇదియే అపరోక్షానుభూతి.

అపరోక్షానుభూతి:
స్వరూప లక్షణముగా చెప్పబడిన జ్ఞేయవస్తువు, జ్ఞాతయందు యోగించిన స్వరూప లక్షణము ఒక్కటేననెడి ఆ స్వరూప లక్షణ సామాన్యాధికరణము చేత, జ్ఞేయవస్తువు పరిత్యాగమగును. జ్ఞాత స్వరూపమగును. వెనువెంటనే జ్ఞాత ఉనికిని కోల్పోవును. స్వరూప లక్షణము జ్ఞాతయందు జేరి సహజము కాగా జ్ఞాత లయమగునని అర్థము. ద్వైతములో జ్ఞాతకున్న సత్‌చిత్‌ ఆనందానుభవము, జ్ఞాత లేకుండా పోయినప్పుడు ఆ జ్ఞానము విజ్ఞానమగును. అద్వైత సిద్ధిలో అది సత్యం జ్ఞానం అనంత బ్రహ్మమనెడి స్వస్వరూప సాక్షాత్కారము, లేక అపరోక్షానుభూతి.

స్థిత ప్రజ్ఞుడు:
ఎప్పుడైతే ఒకడు మనస్సులోనికి ప్రవేశించియున్నవి, ప్రవేశించుచున్నవి అయిన ప్రాపంచిక అర్థములను అన్నింటినీ సర్వ కామనలను మొదలంటా త్యజించి యుండునో, ఎప్పుడైతే లౌకికమైన సంగతులను, సంఘటనలను అధిగమించి యుండునో, అదే సమయములో సర్వేసర్వత్రా ఆత్మను సందర్శించుచూ యుండునో, నిత్య తృప్తిలో విశ్రాంతుడై ఆనందమును అనుక్షణము స్వభావ సిద్ధము చేసుకొని యుండునో, అతడే స్థిత ప్రజ్ఞుడు అనబడును. నిశ్చల బుద్ధియైన మౌని అతడే.

పరేంగితా ప్రజ్ఞ:
ఎవరు బాహ్య విషయములందు ప్రవర్తించుచున్నప్పటికీ ఆయా వస్తురూపములగుచున్నప్పటికీ తనదైన, తానే అయిన ఆత్మ రూపమును కోల్పోవుట లేదో, అట్టివారు ప్రజ్ఞా స్వరూపమునందే, మనో వ్యాపారమును లీలా వినోదముగా జరుపుచున్నారో, వారే పరేంగితా ప్రజ్ఞావంతులు.

పర+ఇంగిత= పరేంగిత అనగా పరము గాను, లౌకికముగాను ఏక కాలములో యోగించి యుండుట. అక్కడ ప్రజ్ఞా విలాసమే గాని, మనో వ్యాపార తాదాత్మ్యత ఉండదు.

శరీర ప్రారబ్ధము కొఱకు, గుర్వాజ్ఞానుసారము, దైవీ ప్రణాళికలో పాలుపంచుకొనుట వంటివి లౌకిక కార్యకలాపాలకు కారణము కావచ్చును. అయినను వారి బ్రహ్మ నిష్ఠకు అంతరాయముండదు. ఇట్టివారు జీవన్ముక్తులు గాని, సద్గురువులు గాని, అవతార పురుషులు గాని కావచ్చును. క్రమ సాధనలో ఇది పరేంగితా ప్రజ్ఞా యోగము. అవతార పురుషులలో ఇది సహజము.

దశాంగుళ న్యాయము:

భూమికంటే జలము 10 రెట్లు సూక్ష్మము. జలము కంటే అగ్ని 10 రెట్లు సూక్ష్మము. అగ్నికంటె వాయువు 10 రెట్లు సూక్ష్మము. వాయువుకంటె ఆకాశము 10 రెట్లు సూక్ష్మము. ఆకాశము కంటె మహదహంకారము 10 రెట్లు సూక్ష్మము. మహదహంకారముకంటే మహత్తు 10 రెట్లు సూక్ష్మము. మహత్తుకంటె మూల ప్రకృతి 10 రెట్లు సూక్ష్మము. మూల ప్రకృతికంటె బ్రహ్మము 10 రెట్లు సూక్ష్మము. చివరకు సూక్ష్మాతిసూక్ష్మమైన బ్రహ్మము కంటె సూక్ష్మమైనదింకేదీ లేదు.

ఈ విధముగా ఒకదానికంటే మరొకటి పదేసి రెట్లు అధిక సూక్ష్మమని తెలుపుచూ అవాంగ్మానస గోచరమైన బ్రహ్మమును, ఊహకు, లక్ష్యమునకు అందించు పద్ధతిని దశాంగుళ న్యాయమందురు.
ఈ దశాంగుళ న్యాయములో విరాజిల్లే సమస్త లోకములు, విశ్వ రూపుడైన విరాట్పురుషునికి ఒక్క పాదమే. తక్కిన మూడు పాదములు తనకు తానుగా సిద్ధమైన పురుషోత్తముడు. ఈయనకు దశాంగుళ న్యాయము వర్తించదు.

ప్రత్యభిజ్ఞానము:

సాధకుడి చిత్త శుద్ధియైనట్టి చిదాత్మతో లయమై నిర్వికల్ప సమాధిని పొందిన తరువాత, సమాధినుండి లేచినవాడు, తాను సమాధి యందు ఏ చిదాత్మ రూపముగా నున్నాడో, తరువాత కూడా, ఆ శుద్ధ చిదాత్మ రూపముగానే కొనసాగియున్నాడని గుర్తించుటను ప్రత్యభిజ్ఞానము అందురు.

తాను నిజానికి బ్రహ్మమే అయియుండి, భ్రాంతి కాలములో మరచినాడు గాని, తాను భ్రాంతి కాలములో కూడా బ్రహ్మమే. ఇప్పుడు సమాధియందు సహజమై యుండగా కలిగిన జ్ఞానము క్రొత్తది కాదు. కేవలము మరపు తొలగినది. అయినవాడే తిరిగి అగుచున్నాడు అని అర్థములో ప్రత్యభిజ్ఞ అనుచున్నారు. తాను తానే అయియున్నది త్రికాలాబాధ్యము. సూర్యచంద్రుల ప్రకాశము రాహుగ్రస్తమునకు ముందును, గ్రహణ కాలములోను, గ్రహణ విడుపు తరువాతను ఎట్లు నిరంతరాయముగా నున్నదో, గ్రహణ కాలములోనూ సూర్యచంద్రులు ప్రకాశించుచుండగా, అజ్ఞాన దృష్టికి లేనట్లు జ్ఞాన దృష్టికి మరల వచ్చినట్లు అనిపించుట వలె సాధకుడు తనకు తెలిసినా తెలియకపోయినా, తాను ఆద్యంతములు లేని బ్రహ్మము. తాను బ్రహ్మము కాదను అజ్ఞానము వీడగా అదే మళ్ళీ తాను బ్రహ్మమే అయినట్లయినది. గాని, తాను కాకుండా పోయినది లేదు. ఇది అపరోక్షానుభూతి నిర్ణయము.

సరూప మనోనాశనము:
మనస్సు ప్రాతిభాసికమైన శుద్ధ సత్వ గుణముగా నుండును. శరీర ప్రారబ్ధముండును. పునర్జన్మ ఉండదు. వైరాగ్యాభ్యాసముల చేత సర్వము నిరోధించబడగా, ఆత్మ మాత్రమే శేషించి యుండును. దీనిని సరూప మనోనాశనమందురు. దీని ఫలము జీవన్ముక్త స్థితి. కేవలాత్మ నిర్గుణమై యుండును. మైత్రి ముదిత కరుణ ఉపేక్ష వంటి సత్వగుణ స్వభావము కూడా పోవును.

అరూప మనోనాశనము:
మనస్సు ప్రాతిభాసిక మాత్రముగా కూడా ఉండదు. శుద్ధ సత్వము విశుద్ధ సత్వమగును. శరీర ప్రారబ్ధమును పట్టించు కొనడు. మైత్రాది గుణములు పోగా, వాటి ఆశ్రయమైన మనస్సు కూడా పూర్తిగా నశించును. నిష్కళరూపమగును. చిత్తము నశించగా, పునరావృతి ఉండదు. ఇది విదేహముక్తి అనబడును.

జ్ఞాన ఫలము:
హృదయ గ్రంధి వీడిపోవును. సంశయ రాహిత్యమగును. వాసనాక్షయమగును. సంచితములు దగ్ధమగును. సరూప మనోనాశ్‌ యగును. బ్రహ్మనిష్ఠ తైలధారవలె ఉండి, సంతృప్తి, నిరతిశయానందము కొనసాగుట జ్ఞాన ఫలము.

విదేహముక్తి:
దృశ్యము కానట్టి, మనః పీడన లేనట్టి శివశబ్ద వాచ్యమగు చిన్మాత్రముగా నుండుటయే విదేహముక్తి అనబడును.

జీవన్ముక్తి:
నిర్వికార ఆత్మ స్వరూపుడై, జగత్తులో సుషుప్తునివలె ఉండువాడు, కాని అవిద్యా రూపమగు సుషుప్తి లేనివాడు. సర్వావస్థలయందు మేల్కొనియే యుండువాడు. జాగ్రత్‌ వాసనాక్షయమైనవాడు. అందువలన కలలు కననివాడు, శరీర ప్రారబ్ధము అనుభవములో నున్నను పాము కుబుసము విడచునప్పుడున్న బాధవలె సహించుచు, ఆనందపడువాడు. కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా అతనివలన కొన్ని పనులు జరుగుచుండును గనుక ఆగామి లేనివాడు. జ్ఞాని గనుక, సంచితమున్ను లేనివాడు.ఇతడే జీవన్ముక్తుడు.

బ్రహ్మవిదుడు:

ఆత్మకు సహజ లక్షణమైన ఆనందానుభవము కొనసాగుచుండును. తనలో తాను రమించుచుండును. జ్ఞానవికాసము జరుగుచుండగా, బ్రహ్మ విద్వరుడుగా, బ్రహ్మ విద్వరీయుడుగా, బ్రహ్మ విద్వరిష్ఠుడుగా పరివర్తన చెందును. కాని ముక్త స్థితిలో ఏ మార్పు ఉండదు. ఈ భేదములు శరీర ప్రారబ్ధముననుసరించి, లోక కళ్యాణ కార్యక్రమముల కొఱకు మాత్రమే. అయినను కర్తృత్వ భోకృత్వములు లేనివాడు గనుక అతడు ముక్తుడే.
దేహళీదత్త దీప న్యాయము : దేహళీ అనగా గడప. దేహళీ దత్త దీపమనగా గడపమీద ఉంచిన దీపమని అర్థము. ఆ దీపము లోపలా, బయటా తన ప్రకాశమును వ్యాపింపజేయును. లోపల అనగా మాయావరణ లేని చోటు. బయట అనగా మాయావరణ కల్పించిన చోటు. దీపమనగా అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశము. గడప అనగా మాయద్వారము. నిరావరణమందు స్వప్రకాశ సాక్షాత్కారము లోపలిది. మాయావరణయందు సర్వత్రా వ్యాపకమైన సర్వమును ప్రకాశింపజేయుట బయటిది. పరబ్రహ్మ స్వరూపము లోపలిది. పరమాత్మానుభవము బయటిది. మాయ ద్వారము వద్ద నిలిచి, లోపలా, బయటా రెండు చూడగలిగినటుల, జీవన్ముక్తుడు బ్రహ్మనిష్ఠగా ఉంటూనే, బాహ్య ప్రపంచమునందు అసంగునిగా, సాక్షీభూతునిగా వ్యవహరించును. దీనినే దేహళీదత్త దీప న్యాయమందురు.

పురాణేతిహాసములందు బాహ్యార్థమును ఒక చరిత్రగాను, అంతరార్థమును ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగాను చూపించుటలో ఈ దేహళీదత్త దీపన్యాయమున్నది. ఉదా : రామాయణము - ఆధ్యాత్మిక రామాయణము.
పశ్చిమ దృష్టి : తూర్పు దృష్టి సూర్యోదయమును చూచుట. పశ్చిమ దృష్టి సూర్యాస్తమయమును చూచుట. సాధకునికి తూర్పు దృష్టి వలన జ్ఞానోదయ మగును. దీనివలన అతడు బ్రహ్మానందానుభవమును పొందును. ఇది మాయ ద్వారమునకు ఈవలి మాయావరణమునందు కలిగిన పరోక్ష జ్ఞానము. పశ్చిమ దృష్టి వలన మాయావరణయందు కలిగిన జ్ఞానము అస్తమించి, నిరావరణ బ్రహ్మమగును. జ్ఞానము విజ్ఞానమగును. ప్రకాశము స్వస్వరూపమగును. ఆభాస అస్తమించి స్వయం భాస సాక్షాత్కరించును. అందువలన పశ్చిమ దృష్టిని సిద్ధింపజేసుకొనును.

జ్ఞాన భూమికలు:

1. శుభేచ్ఛ:
వివేక వైరాగ్యములు కలిగి, సంసార సాగరమును దాటవలెనని ఇచ్ఛ కలిగి మంచి పనులు చేయుట. ప్రేమాభిమానములు చూపుట, పరోపకార బుద్ధి, త్రికరణ శుద్ధి కలిగి సత్కర్మాచరణ, సదాచార ప్రవర్తన, సజ్జన సాంగత్యము, సేవ మొదలగు వాటిచే బుద్ధిని వృద్ధి పొందించుకొనుట.

2. విచారణ:
జ్ఞాన సాధనలను సంపాదించుట, శాస్త్ర పఠన, శ్రవణాదులు చేయుట, ఆత్మ విచారణ, శ్రౌత స్మార్త కర్మాచరణ, నిత్యానిత్య వస్తు వివేకము కలిగి, అభిమానము, మదము, దంభము, మోహము మొదలగు దుర్గుణములను పూర్తిగా త్యజించుట. పండితులను, గురువులను ఆశ్రయించుట, గురు శుశ్రూషలు జరుపుట ద్వారా సూక్ష్మ బుద్ధిని ప్రాప్తింప జేసుకొనుట. ఈ సూక్ష్మ బుద్ధిచేత గాని, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను గ్రహించలేరు.

3. అసంసర్గము:
అద్వైతాత్మను నిర్ణయించు మహా వాక్యార్థములందు నిశ్చయ బుద్ధి కలిగి, విరాగియై, తత్త్వమును మననము చేయుచూ చిత్తోప శాంతి కలుగగా లభించిన అసంగ సౌఖ్యమును పొందియుండుట. ఇందులో సామాన్య అసంసర్గము, విశేష అసంసర్గము అని రెండు విధములు.

1. సామాన్య అసంసర్గము:
నేను కర్తను కాదు, భోక్తను కాదు, బాధ్యుడిని కాదు, బాధకుడిని కాదు అని తలచి పదార్థములందు అసంగుడై యుండుట.
2. విశేష అసంసర్గము:
ఆత్మ వస్తువు కరతలామలకము వలె స్పష్టము కాగా, సంసార సాగరమునకు ఆవలి తీరముననున్న పరబ్రహ్మమునందు జేరి, మౌనియై, శాంతుడై యుండుట. ఆద్యంత రహితము పరమశాంతము అయిన తత్త్వమును ఆశ్రయించి యుండుట.
3. వాసనలయము:
ద్వైత భావము నశించుట, అద్వైత భావము స్థిర రూపమును దాల్చుట. ద్వైతవాసనలు క్షయమగుట. సంసారము స్వప్న తుల్యమగుట.
4. సత్తామాత్రము:
సర్వ వాసనా రాహిత్యము. చిన్మయమై, సత్తా మాత్రముగా నుండుట అనగా ఆ సత్తా క్రియోన్ముఖము కాకుండుట, చిత్తము విలయమై, జగద్రూప వికల్పములు ఉడిగిపోగా, సుషుప్తునివలె యుండి ఘనీభూతానందాకారమగుట.
5. తుర్యము:
క్రమముగా తుర్యుడై ఉదాసీనావస్థలో నుండును. అహం రహితుడై సంశయ రహితుడై, జీవన్ముక్తుడై,చిత్రములో ప్రకాశించే దీపమువలె ఉండును. సముద్రములో మునిగియున్న పూర్ణకుంభమువలె ఉండును. జాగ్రత్‌ స్వప్నములుండవు. అజ్ఞానము లేదు గనుక, సుషుప్తి ఉండదు. సంకల్ప వికల్పములు లేని నిర్వికల్ప బ్రహ్మమై యుండును.
6. తుర్యాతీతము:
ఇది అనిర్వచనీయము, నిత్య సిద్ధము, నిరుపాధికము, సమరూపము, అంతటా పరిపూర్ణము, సౌమ్యము, స్వచ్ఛము, ప్రసన్నత, పరమ శాంతము, కైవల్య రూపము, తుర్యాతీతము, విదేహ ముక్తి.

లక్షణ వృత్తి త్రయము:

1. జహల్లక్షణ:
పదము యొక్క శక్యార్థమును పరిత్యజించి, అశక్యార్థము యొక్క సంబంధము గల అన్య పదార్థమునందు, ఆ పదము యొక్క ఏ లక్షణ వృత్తి ఉన్నదో, అది జహల్లక్షణ అనబడును. ఆత్మకు బదులుగా, ఆత్మకు సమీపమందున్న అసత్య నేను, తన అజ్ఞానము చేత వ్యవహరించుచూ, బంధ దుఃఖములను పొందుచున్నది. ఆత్మ-అనాత్మ అని రెండు ఉన్నట్లు చెప్పే బోధ జహల్లక్షణ. ఆత్మకంటె అన్యము లేదు గనుక, బ్రహ్మ నిర్ణయమునకు జహల్లక్షణ సరిపోదు.

2. అజహల్లక్షణ:
పదము యొక్క శక్యార్థమును పరిత్యజించకయే, ఆ శక్యార్థము కల మరొక పదము యొక్క సంబంధము గల అన్య పదార్థము నందు ఏ లక్షణ వృత్తి ఉన్నదో, అది అజహల్లక్షణ. ఆత్మ వ్యవహరించుటకు బదులుగా ఆత్మ చైతన్యము వలన చైతన్యవంతమైన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు వ్యవహరించుచున్నవి అని చెప్పే బోధ అజహల్లక్షణ అనబడును. అనాత్మ వ్యవహారము భ్రాంతి గనుక ఆత్మకు కారణత్వము గాని, ఆత్మ ఆధారమని గాని చెప్పలేము. ఆ భ్రాంతికి అనాది మాయయే కారణము గాని, ఆత్మ కాదు. ఆత్మ అద్వయముగనుక మాయ నిజానికి లేని మాయ. అందువలన బ్రహ్మ నిర్ణయమునకు అజహల్లక్షణ సరిపోదు.

3. జహదజహల్లక్షణ:
పదము యొక్క శక్యార్థము యొక్క ఏకదేశ పరిత్యాగము చేసిన, అదే పదము యొక్క ఏ లక్షణ వృత్తి మిగిలియున్నదో, అది జహదజహల్లక్షణ అనబడును. మహావాక్య విచారణయందు ఒకే వస్తువు యొక్క వాచ్యార్థమును విడచినప్పుడు ఏది మిగులునో, అది లక్ష్యార్థమైన బ్రహ్మము. వాచ్యార్థమైన మాయాకల్పితమైన బ్రహ్మమును, వాచ్యార్థమైన మాయాకల్పిత దేశ కాలవస్తువులను విడచి, లక్ష్యార్థమైన అంతర్యామిని అద్వయ బ్రహ్మ స్వరూపముగా నిర్ణయించుకొనుటను జహదజహల్లక్షణ అందురు. ఈ లక్షణ వృత్తి వేదాంత సిద్ధాంత బోధకు సరిగ్గా సరిపోవును. తత్త్వమసి వాక్యర్థమును భాగత్యాగ లక్షణ అయిన జహదజహల్లక్షణచేత చక్కగా నిర్ణయించి పరబ్రహ్మగా ఆరూఢమగుటకు ప్రయోజనమగును.

ఆనందాష్టకము:
విషయానందము, వాసనానందము, ముఖ్యానందము, నిజానందము, విద్యానందము, ఆత్మానందము, అద్వైతానందము, బ్రహ్మానందము.

సాధకుని ఆనందములు:
1. అవిద్యానందము : స్థూల దేహ సంబంధము వలన, దేహేంద్రియ సంపర్కము వలన కలిగే ఆనందము.
2. విద్యానందము : బాహ్య విద్యల వలన కలిగే ఆనందము.
3. యోగానందము : యోగ ధ్యానాదుల చేత, ప్రణవానుసంధానము చేత కలిగే ఆనందము.
4. జ్ఞానానందము : విజ్ఞానమయ కోశము బాగుగా వికసించుట వలన తన్మయత్వము పొందినప్పుడు గాని, ఆర్తి, ఉద్వేగము వంటివి కలిగినప్పుడు గాని, కొన్ని తత్త్వములు, పద్యములు, పాటలు పాడుట, నృత్యము చేయుట, కవిత్వము చెప్పుట వంటి వాటివలన గాని కలిగే ఆనందము.

ఇవన్నీ భ్రాంతులే. ఇవి బుద్ధి పరిథిలో కలిగే ఆనందములు. సత్‌చిత్‌ ఆనందము అహం పరిథిలోనిది. ఆనంద ఘనము, లేదా ఆనంద స్వరూపము మాత్రమే అద్వయమై యున్నది. అనుభవములోగాని, ఎరుకలో గాని, ఉన్న ఆనందము భ్రాంతి. ఎరుక పోతే ఆనంద ఘనమును చెప్పేవారే లేరు గనుక ఆనందమే లేదని అనవచ్చును. అది అనంతము, పరమపదము.

బ్రహ్మానందము:
బ్రహ్మానందమునకు కొలతలు చెప్పిన యెడల అది ఉన్నదున్నట్లున్న సత్యము కాదు. అయినను పరిశీలించెదము.

1. మనుష్యానందము : ఉత్తమ ఆశయములు, దృఢమైన సంకల్ప శక్తి కలవాడు, బలిష్ఠుడు, వేదాధ్యయన సంపన్నుడు, సద్గుణశాలి, నడి యవ్వనములోనున్న ఏక ఛత్రాధిపతి, ఐశ్వర్యవంతుడు అయినట్టి మానవుని ఆనందము. మానవులలోకెల్లా అధికాధిక ఆనందమును అనుభవించు మానవుని ఆనందము. ఇది కారణముతో కూడిన ఆనందము. కారణము నశించిన ఉండనిది.
2. మనుష్య గంధర్వ ఆనందము : పై చెప్పిన మనుష్యానందమునకు నూరు రెట్లు అధికము.
3. దేవగంధర్వానందము : ఇది మనుష్య గంధర్వానందమునకు నూరు రెట్లు అధికము.
4. చిరలోక వాసులగు పితరుల ఆనందము : దేవ గంధర్వ ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
5. అజానజుల ఆనందము : పితరుల ఆనందము కంటే నూరు రెట్లు అధికము.
6. వైదిక కర్మల చేత దైవత్వము పొందిన కర్మ దేవతల ఆనందము :
అజానజుల ఆనందముకంటె నూరు రెట్లు అధికము.
7. దేవతల ఆనందము : కర్మ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
8. ఇంద్రుని ఆనందము : దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
9. బృహస్పతి ఆనందము : ఇంద్రుని ఆనందము కంటే నూరురెట్లు అధికము.
10. ప్రజాపతి ఆనందము : బృహస్పతి ఆనందముకంటె నూరు రెట్లు అధికము.
11. హిరణ్యగర్భుని ఆనందము : ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
12. బ్రహ్మానందము : హిరణ్యగర్భుని ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
13. కామరహితుడైన బ్రహ్మవేత్త ఆనందము : బ్రహ్మానందముతో సమానమైన ఆనందము.
14. విజ్ఞాన స్వరూపుడు : ఆనందమే తానైనవాడు. ఆనంద కారణములు లేనివాడు.
15. అచల పరిపూర్ణుడు : ఆనంద రహితుడు, భ్రాంతి రహితుడు, బట్టబయలు.

శింశుమారక చక్రము:
విశ్వములోని గ్రహముల కావల సప్తర్షి మండలము, దానిపైన శింశుమారక చక్రమున్నది. అక్కడ ధృవ, ఇంద్ర, వరుణ, యమ, కశ్యపాదులు ఆకల్పాంతము ఉందురు. ఈ ధృవ మండలము చుట్టూ సర్వగ్రహములు, తారకలు, గోళములు పరిభ్రమించుచుండును.

అంతరార్థములో శింశుమారక చక్రము ఒక స్థానము కాదు. ధృవమనగా ఘనరూప అఖండ ఎరుక అయితే, శింశుమారక చక్రము బట్టబయలు. బట్ట బయలునుండి ఏదీ వ్యక్తము కాదు. బట్టబయలులో ఏదీ లయము కాదు. ధృవమనే అఖండ ఎరుక ఘనము అనే స్థితినుండి, ద్రవీభూతము, వ్యాపకత్వము మొదలైన కదలికలతో వికారమై, తిరిగి సాధనలచేత, యోగాభ్యాసములచేత ధృవమగు ఘనస్థితికి చేరుటను ఎరుక లేక హంస యొక్క అవరోహణగాను, ఆరోహణగాను చెప్పబడినది. ఈ హంసయే ముందుగా లేకనే ఉన్నట్లు తోచి, తుదకు లేనిది లేకుండా పోవుటగా చెప్పబడినది. అయినను, శింశుమారక చక్రము గురించి పెద్దల నిర్ణయమే శిరోధార్యము.

శ్రు||  ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవ స్వరూపమ్‌
- ఆత్మబోధోపనిషత్‌

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.