Skip to main content

About Puranalu - మన పురాణాలు - సూక్ష్మ వివరణ - పురాణాలు ఎన్ని? అవి ఏవి?


మన పురాణాలు - సూక్ష్మ వివరణ

మన పురాణాలు 18. మత్స్యపురాణం, కూర్మపురాణం, వామన పురాణం, వరాహ పురాణం, గరుడ పురాణం, వాయు పురాణం, నారద పురాణం, స్కాంద పురాణం, విష్ణుపురాణం, భాగవత పురాణం, అగ్నిపురాణం, బ్రహ్మపురాణం, పద్మపురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగపురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యపురాణం

ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోపాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

నారద పురాణం: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

స్కందపురాణం: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

విష్ణుపురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

భాగవత పురాణం: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

అగ్నిపురాణం: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

బ్రహ్మపురాణం: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

పద్మపురాణం: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

మార్కండేయ పురాణం: శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మాండ పురాణం: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

లింగపురాణం: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

భవిష్యపురాణం: సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మాపవైపర్తపురాణము : ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి.

పురాణాలు ఎన్ని? అవి ఏవి?

అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే! ఆయన రచించిన పురాణాలను తేలికగా గుర్తించడానికి పద్మ పురాణంలో గల ఈ క్రింది సూత్రం తోడ్పడుతుంది.

‘మ‘ద్వయం ‘భ‘ద్వయం చైవ ‘బ్ర‘త్రయం ‘వ‘ చతుష్టయం |
‘అ‘ ‘నా‘ ‘ప‘ ‘లిం‘ ‘గ‘ ‘కూ‘ ‘స్కా‘ని పురాణాని పృథక్ పృథక్ ||
‘మ’ మరియూ ‘భ’ అక్ష్రరంతో మొదలయ్యెవి రెండు, ‘బ్ర’ అనే అక్ష్రరంతో మూడు, ‘వ’తో నాలుగు మరియూ ‘అ’, ‘నా’, ‘ప’, ‘లిం’, ‘గ’, ‘కూ’, ‘స్కా’ అను శబ్దాలతో ఒకొక్కటి; మొత్తం 18.
శబ్ధము సంఖ్య పురాణాలు
‘మ’ 2 మత్స్య మరియూ మార్కండేయ పురాణాలు
‘భ’ 2 భాగవత, భవిష్య పురాణాలు
‘బ్ర’ 3 బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ పురాణాలు
‘వ’ 4 వరాహ, వామన, వాయు మరియూ విష్ణు పురాణాలు
‘అ’ 1 అగ్ని పురాణం
‘నా’ 1 నారద లేదా నారదీయ పురాణం
‘ప’ 1 పద్మ పురాణం
‘లిం’ 1 లింగ పురాణం
‘గ’ 1 గరుడ పురాణం
‘కూ’ 1 కూర్మ పురాణం
‘స్కా’ 1 స్కంద లేదా స్కాంద పురాణం

పురాణలలో నారద పురాణానికి ఓక ప్రత్యేకత ఉన్నది. అష్టాదశ పురాణాలలో చెప్పబడిన విషయానుక్రమణిక పూర్వ భాగంలో 92 నుంచి 109 అధ్యాయాలలో ఇవ్వబడింది. దీని ఆధారంగా, ప్రస్తుతం లభ్యం అవుతున్న పురాణాల మూల రూపము, ప్రక్షిప్త అంశాలను తేలికగా తెలుసుకోనవచ్చును. నారద పురాణమును బట్టి పైన ప్రస్తావించిన 18 పురాణములు, వాటి గుర్తింపు సరితూగుతున్నాయి. ఈ దృష్టాంతాన్ని ఇక్కడ ప్రస్తావించడానికి ఒక బలమైన కారణమున్నది. ఇతర ప్రాచీన ఐతిహాసిక విషయాలకులాగానే, పురాణాల పట్టిక మీద (మహా పురాణాలు ఏవి?) కొన్ని విభేదాలున్నాయి. ఉదాహరణకు భాగవతం అంటే కొందరు పండితులు “దేవీ భాగవతం” అని మరి కొందరు “విష్ణు భాగవతం” అని భావిస్తారు. అలాగే, వాయు పురాణం స్థానంలో కొందరు శివ పురాణాన్ని చేరుస్తారు. ఏది ఏమైనా, అన్నీ ధర్మాన్నే భోదిస్తాయి కాబట్టి, ఏదనుకున్నా తప్పు లేదని నా అభిప్రాయం.

మరో ముఖ్య గమనిక. పైన ప్రస్తావించిన సూత్రంలో “అనాపలింగకూస్కా” (‘అ‘, ‘నా‘, ‘ప‘…)ని విడగొట్టినప్పుడు, నా వద్దనున్న వివిధ గ్రంథాలు ఎకోన్ముఖంగా ‘అ‘, ‘నా‘, ‘ప‘, ‘లింగ‘, ‘కూ‘ మరియూ ‘స్కా‘ లుగా పేర్కొంటున్నాయి. ఆ విధంగా ‘లింగ‘ అని పరిగణించినట్లైతే, మొత్తం సంఖ్య 17కు చేరుతున్నది. పద్దెనిమిదవది “శ్రీమద్భాగవతం” అని పేర్కొన బడుతున్నది. కానీ, నాకు తోచినంత మటుకు అది ‘లింగ‘ గా కాక ‘లిం‘ మరియూ ‘గ‘లుగా భావించినట్లైతే నారద పురాణముతో సరిగ్గా సమన్వయమవుతున్నది. కనుక పైవిధముగా దాని విశ్లేషణను ప్రతిపాదించాను. ‘లింగ‘ అని పరిగణించినపుడు, గరుడ పురాణము ను ప్రస్తావించడం కుదరదు. ఇది మరో కారణం.

పురాణ లక్షణాలు

ప్రతిదానికి ఒక లక్షణం అనేది ఉంటుంది. అది ఎలా ఉండాలి, దానిలో కనీసం ఏవేవి ఉండాలి? ఇదే క్రమంలో పురాణమంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. తేలికగా, ’పురాణం పంచ లక్షణం’ అని మత్స్య పురాణంలో సమాధానము దొరుకుతుంది; అనగా పురాణానికి ఐదు లక్షణాలుండాలని.

సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ |
వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణమ్ ||

అనగా (1) సర్గము, (2) ప్రతి సర్గము, (3) వంశము, (4) మన్వంతరము మరియూ (5) వంశానువర్ణనములు ఉండవలెను అని.

1. సర్గము: ఈ చరాచర ప్రపంచము దానిలోని నానా పదార్థాల ఉత్పత్తి లేదా సృష్టినే సర్గ అంటారు.
2. ప్రతిసర్గము: సర్గమునకు వ్యతిరేకమైనది ప్రతిసర్గము; అనగా లయము లేదా ప్రళయము.
3. వంశం: బ్రహ్మద్వారా ఎందరు రాజులు సృష్టించబడ్డారో (ప్రజాపతులు) వారియొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో గల సంతాన పరంపరను వంశము అనవచ్చును.
4. మన్వంతరము: విభిన్న కాలాలలో జరిగిన సంఘటనలకు గుర్తుగా ఉండే కాల గణనం. ఉదాహరణకు మనము నిత్య పుజలో చేయు దేశ కాల సంకీర్తనములో “వైవస్వత మన్వంతరే” అంటాము. అనగా ఈ కల్పమునకు వివస్వంతుడు (వైవస్వతుడు) మనువు.
5. వంశానుచరితము: పైన తెలుపబడినట్లుగా చక్రవర్తులు, ఋషుల వంశాలలో ఉత్పన్నం చెంది, ఆయా వంశాలకు మూల పురుషులైన రాజుల విశిష్ట వర్ణనమే వంశాను చరితం.
పురాణముల గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. మున్ముందు, మరికొన్ని విశేషాలను, ఈ టపాలో నామమాత్రంగా ప్రస్తావించిన “స్మృతుల” గురించి, పద్దెనిమిది పురాణాలలో ప్రతిదాని గురించి క్లుప్తంగా టపాలు వ్రాసే ప్రయత్నం చేయగలను.

అష్టాదశ పురాణాలు

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.