Skip to main content

తిరుమల తిరుపతి దేవస్థానం - Tirumala Tirupati Devasthanam


తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

స్థల పురాణం

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధనం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్ధనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

తిరుమల కాలక్రమము

ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలం లో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణి గా తిరుమల చ్రిత్ర లో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి ‘పేరుందేవి’అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు,ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి,మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.

1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్టించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.

అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని,రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.

ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.

చరిత్ర

1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో వ్రాశారు. గాలిగోపురం వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు.

ఉపోద్ఘాతము

భగవంతుడు పంచాత్మ స్వరూపుడని తైత్తరీయ ఉపనిషత్తు పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలలో చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన ఆళ్వార్లు తమ నాలాయీర దివ్యప్రబంధాలలో ప్రస్తుతించారు.

ఈ నూటెనిమిది దివ్యదేశాలూ శ్రీవైష్ణవమత సంప్రదీకులకు పరమ పవిత్రస్థలాలు. ఇవి భారతదేశమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో 106 క్షేత్రాలు భూలోకంలో ఉండగా, రెండు పరలోకంలో(వైకుంఠం, క్షీరాబ్ది) ఉన్నాయని భావన. ఈ 106 దివ్యక్షేత్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి రెండే రెండు. అవి… తిరుమల (తిరుపతి), అహోబిలం.

ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం.

క్షేత్ర వైభవం:

శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి.

ఏడుకొండలు

తిరుమల లో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడ అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి.

ఆ ఏడు శిఖరాలూ:

శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర .

1. శేషాద్రి:
సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి.విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామి వారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా, వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదో శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

2. నీలాద్రి:
స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి "నీలాద్రి" గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

3. గరుడాద్రి:
దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

4. అంజనాద్రి:
వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ళతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

5. వృషభాద్రి:
కృతయుగంలో... తిరుమలలోని తుంబురుతీర్ధం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢ భక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్దం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలం పాటు జరిగిన ఆ యుద్దంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాధ.

6. నారాయణాద్రి:
విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

7. వేంకటాద్రి:
కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. "వేం" అంటే పాపాలు అని, "కట" అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని "వేంకటాద్రి" అంటారని ప్రతీతి.

అలిపిరి చరిత్ర

పూర్వం అలిపిరిని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదం పుళ అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి వేంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.


బహ్మోత్సవ సంబరం చూతము రారండీ...:

తిరుమలలో ప్రతి రోజూ పర్వదినమై అనేక ఉత్సవములు జరుగుతున్నా విశేష పరవడి ఉత్సవములుగా చైత్రమాసంలోను, భాద్రపదమాసంలోను స్వామివారికి విశేషంగా జరిగే బ్రహ్మొత్సవాలు ముఖ్యం. వైభవోపేతంగా జరుగుతాయి.

"కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ" పై వెలసిన వేంకటేశ్వరుడు సకల సింగారాలతో తిరువీధుల మెరసిపోయేందుకు సిద్దమవుతున్న బ్రహ్మ ఉత్సవాల శుభఘడియలివి ఆనంద నిలయంలో కొలువై ఉండి భక్తులను తన వద్దకు రప్పించుకునే దేవదేవుడు ఏడాదికొక్కసారి బహు వైభవంగా జరిగే ఊరేగింపు ఉత్సవాలలో పాల్గొని, భక్తులకు మరింత చేరువయ్యేందుకు ముస్తాబవుతున్న శుభవేళ ఇది... బ్రహ్మాండంలోని భక్తకోటి అంతా తరలి వచ్చి స్వామివారి శోభాయాత్రను కనులారా తిలకించి, మనసారా పులకించే తరుణమిది... సకల లోకాలలోని సర్వ దేవతా గణాల్ని సాదరంగా భువికి ఆహ్వానించి బ్రహ్మ ఉత్సవాల్ని జరుపుకోవటానికి తిరుమల యావత్తూ సంసిద్దమవుతున్న సమయంలో... ఇంతటి ప్రాశస్త్యం గల ఈ బ్రహ్మ ఉత్సవాలు ఎలా జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పటినుంచి ఆరంభమయ్యాయన్న విశేషాలను గుర్తు తెచ్చుకోవటం సందర్భోచితం.

తిరుమలేశుని ఆలయంలో నిత్యకల్యాణం - పచ్చతోరణమే అయినా, బ్రహ్మ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మ ఉత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి "బ్రహ్మ ఉత్సవాలు" అయ్యాయని అంటారు.

మరో వ్యాఖ్యానం ప్రకారమైతే - నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిదిరోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి "బ్రహ్మ ఉత్సవాలు". అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని "బ్రహ్మ ఉత్సవాలు" అంటారనీ ఇంకొందరి భావన.

ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని "బ్రహ్మ ఉత్సవాలు" అంటున్నారని మరికొందరి భావన. బ్రహ్మ ఉత్సవాలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిని ఆయా సందర్బాలను బట్టి నిత్య బ్రహ్మ ఉత్సవం, శాంతి బ్రహ్మ ఉత్సవం, శ్రద్దా బ్రహ్మ ఉత్సవాలుగా పేర్కొంటారు. ప్రతి సంవత్సరం నిర్థారిత మాసంలో, నిర్థారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మఉత్సవాలు. ఇవి మూడురోజులుగానీ, అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి. ఇవి ప్రతి సంవత్సరం కన్యా మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విథంగా తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఇక కరువుకాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి "శాంతి బ్రహ్మ ఉత్సవాలు". ఇలాంటి శాంతి బ్రహ్మ ఉత్సవాలను గత చరిత్రకాలంలో చాలా మంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. ఇక మూడోది శ్రద్దా బ్రహ్మఉత్సవం. ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దేవస్థానంలో కాని, దైవసన్నిధిలో కాని సమర్పించి, భక్తిశ్రద్దలతో జరిపించుకొనేది "శ్రద్దా బ్రహ్మ ఉత్సవం". శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్దా బ్రహ్మ ఉత్సవాలను "అర్జిత బ్రహ్మ ఉత్సవాలు" గా పేర్కొంటున్నారు. శ్రీవారి బ్రహ్మ ఉత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండుగగా జరుగుతాయి. "నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి" అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మ ఉత్సవాలను కన్నులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

స్వామిని దర్శించేందుకు పలు మార్గాలు:

శ్రీవారి దర్శనానికి 90గంటలు కొండమీద ఉండటానికి చోటు చాలక భక్తుల అగచాట్లు క్యూకాంప్లెక్స్‌లో తొక్కిసలాట వీఐపీ బ్రేక్ దర్శనాలపై భక్తుల ఆగ్రహం మహాలఘ దర్శనంపై అసంతృప్తి ఇవీ నిత్యం టీవీ ఛానెళ్ళలో, దినపత్రికల్లో చూసే తిరుమల విశేషాలు.

ఎందుకిలా జరుగుతోంది? సరే! వీఐపీలకు తితిదే రాచమర్యాదల సంగతి పక్కన పెడితే మిగతా ఇబ్బందులను భక్తులు ముందస్తు ప్రణాళిక వేసుకోవడం ద్వారా తప్పించుకోవచ్చు.

  • సెలవులు కలిసొచ్చాయి కదా అని ఎవరికి వారు పండుగ దినాల్లో, వారాంతపు రోజుల్లో తిరుమల ప్రయాణం పెట్టుకుంటారు.
  • అలాంటి సమయాల్లోనే పైన చెప్పిన చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తుంది.
  • ఈ ఇబ్బందులేవీ లేకుండా తిరుమల యాత్ర ప్రశాంతంగా జరగాలంటే భక్తులు అనుసరించాల్సిన పద్దతులివీ కోరిన వరాలిచ్చే కోనేటి రాయని మొక్కు తీర్చుకునేందుకు రోజూ తిరుమలకు వేల సంఖ్యలో భక్తులు వెళ్ళివస్తుంటారు. ఉత్సవ సమయాల్లో ఆ సంఖ్య లక్షకు పైగా చేరుతుంది.
  • జాతీయ సెలవు దినాలు, శని, ఆది, మంగళవారాల్లో తిరుమలలో మామూలుగానే రద్దీ విపరీతంగా ఉంటుంది.
  • ధనుర్మాసంలో, ఆణివార ఆస్థానం, ఉగాది లాంటి సమయాల్లో అన్ని సేవలూ రద్దు చేసి వాటిని ఏకాంతంలో జరుపుతారు.
  • ఆయా సమయాల్లో శ్రీవారి సేవల్లో పాలుపంచుకునే అవకాశం భక్తులకు లభించదు. దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకూ ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళేటట్లుగా ప్రణాళిక వేసుకోవాలి.
  • అందులో ప్రధానమైనవి శ్రీవారి దర్శనానికి, తిరుమలలో ఉండడానికి ఏర్పాట్లు.
  • ఆర్జిత సేవలు చేయించదలిస్తే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం.
  • ఎన్ని రోజులు ఉండేదీ అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా రానూ పోనూ ప్రయాణ టిక్కెట్లు రిజర్వు చేయించుకోవడం. ఈ ప్రణాళిక అమలులో భాగంగా మొట్టమొదట చేయాల్సిన పని మీ ఊళ్ళో / ఊరికి సమీపంలో తితిదే ఆన్‌లైన్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం.

ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా...

సాధారణంగా తితిదే కల్యాణమంటపాల్లో లేదా జిల్లా కేంద్రాల్లో ఈ ఆన్‌లైన్ కేంద్రాలు ఉంటాయి. అక్కడ అర్చనానంతరం దర్శనం (ఏఏడీ-రూ.200), దర్శనం (రూ.50), కాటేజీ (రూ.100) లకు రిజర్వేషన్ కోసమైతే ఒక్కరు వెళితే సరిపోతుంది. ఏఏడీ, దర్శనం టోకెన్లను బయోమెట్రిక్ పద్దతిలో (వేలిముద్రల ఆధారంగా) ఇస్తారు. కాబట్టి తిరుమలకు ఎంత మంది వెళ్ళాలనుకుంటే అందరూ ఆన్‌లైన్ కేంద్రానికి వెళ్ళి వేలిముద్రలు ఇవ్వాల్సిందే.

ఇంటర్‌నెట్...

విదేశాల్లో ఉన్న వారైతే ఇంటర్‌నెట్ ద్వారానే అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. ఆర్జిత సేవల టిక్కెట్లను www.ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. కాటేజీ వసతి (రూ.100, రూ.750) కూడా ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు. సిటీబ్యాంక్‌తో అనుసంధానమైన ఏ క్రెడిట్ కార్డు ద్వారానైనా చెల్లింపులు జరిపితే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో లావాదేవీలు పూర్తికాగానే... క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరిగినట్లు ఒక నివేదిక వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తిరుమల చేరుకున్నాక ఒకరోజు ముందుగా అక్కడి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఆ రసీదును చూపిస్తే అసలు టిక్కెట్టు జారీ చేస్తారు. గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్ / పాస్‌పోర్ట్ / ఓటరు గుర్తింపు కార్డు / పాన్‌కార్డు వీటిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. పద్మావతి గెస్ట్‌హౌస్ విచారణ కౌంటర్ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఒకరోజు ముందు వెళ్ళడం కుదరని పక్షంలో ఆర్జిత సేవ జరిగే సమయానికి ముందు వెళ్ళినా టిక్కెట్లు జారీ చేస్తారు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా... www.tirumala.org వెబ్‌సైట్‌లో తిరుమల విశిష్టత, శ్రీవారి సేవలకు సంబంధించి చాలా వివరాలు లభ్యమవుతాయి. ఈ బుకింగ్ సదుపాయాన్ని ఇక్కడి భక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ బుకింగ్ కోటా చాలా తక్కువగా ఉంటుంది. అందునా ఇంటర్‌నెట్ విప్లవం వచ్చాక ఇప్పుడందరూ నెట్ ద్వారానే టిక్కెట్లు బుకింగ్ చేస్తున్నారు. దాంతో మూడు నెలలు ముందుగానే దాదాపు అన్ని సేవలకూ, వసతికీ రిజర్వేషన్లు అయిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రయత్నించే వారికి చాలావరకూ నిరాశ తప్పదు. కానీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు.

అడ్వాన్స్ బుకింగ్:

ఆన్‌లైన్ కేంద్రాలు, ఇంటర్‌నెట్ ద్వారా ఆర్జిత సేవలు, వసతి, దర్శన టిక్కెట్లు పొందలేని వారు అడ్వాన్స్ బుకింగ్ పద్దతిలో టిక్కెట్లు పొందవచ్చు. తిరుమలలోని ఆర్జితం ఆఫీసుకు ఫోన్ చేస్తే (0877-2263277, 2263679) ఏయే తేదీల్లో సేవా టిక్కెట్ల లభ్యత ఉందో తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగా తితిదే ఈవో పేరిట డీడీ తీసి పంపితే సరిపోతుంది. ఉదాహరణకు... కల్యాణోత్సవ సేవలో పాల్గొందామనుకునే భక్తులు తమకు ఫలానా రోజున అవకాశం కల్పించాలని కోరుతూ "కార్యనిర్వాహణాధికారి, తితిదే, తిరుపతి" పేరిట రూ.1000 డిమాండ్ డ్రాప్ట్ తీసి మూడు నెలలు ముందుగా "పేష్కార్, తిరుమల దేవస్థానం, తితిదే, తిరుమల-517504" చిరునామాకు పంపించాలి. కవరుపై భక్తులు తమ చిరునామాతో పాటు, టెలిఫోన్ నెంబరు కూడా రాయాలి. అత్యవసర సమయాల్లో దేవస్థానం వారు ఫోన్ ద్వారా కూడా సంప్రదిస్తారు. భక్తులు అడిగిన రోజున సేవా టిక్కెట్ల లభ్యత ఉండకపోతే తితిదే చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మరో నాలుగు తేదీలను కూడా సూచించాలి. అలా చేసినట్లైతే భక్తులు సూచించిన నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజుకి సేవా టిక్కెట్ల లభ్యత ఉంటుంది. ఆ తేదీని ఖరారు చేస్తూ కార్యనిర్వహణాధికారి కార్యాలయం నుంచి 15 రోజుల లోపలే సేవా టిక్కెట్టు వస్తుంది. భక్తులు సూచించిన నాలుగు తేదీల్లోనూ సేవా టిక్కెట్ల లభ్యత లేకపోతే డీడీని తిరిగి పంపించేస్తారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అర్చన, తోమాలసేవ ఏకాంతంలో జరుగుతాయి. ఈ రెండు సేవలకూ డీడీలు పంపేటప్పుడు భక్తులు తాము సూచించే తేదీలు ఆయా రోజుల్లో రాకుండా జాగ్రత్త పడాలి.

అప్పటికప్పుడే ఆర్జిత సేవా టిక్కెట్లు

ఇంటర్‌నెట్, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లు పొందలేకపోయినవారు అప్పటికప్పుడు ఆ టిక్కెట్లను పొందే మార్గమే కరెంట్ బుకింగ్. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విజయా బ్యాంక్ కౌంటర్‌లో తర్వాత రోజు జరిగే ఆర్జిత సేవలకు గాను టిక్కెట్లు విక్రయిస్తారు. వీలైనంత ముందే కరెంట్ బుకింగ్ వరుసలో ఉండడం మంచిది. దర్శనం, ఆర్జితం, వసతి టిక్కెట్లను ఏ పద్దతిలో తీసుకున్నా వాటిని రద్దు చేసుకునే వీలుండదు. అవకాశాన్ని బట్టి ఆ తేదీలను ముందు వెనుకలకు జరుపుకోవడం తప్ప, ఇక కరెంట్ బుకింగ్‌లో తీసుకున్న టిక్కెట్లనైతే వాయిదా వేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు.

వీఐపీ కోటాలో...
  • మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు ఇచ్చిన సిఫారసు లేఖల ద్వారా అన్ని రకాల ఆర్జిత సేవా టిక్కెట్లను పొందవచ్చు.
  • అర్చన, తోమాలసేవ, కళ్యాణోత్సవం, అభిషేకం వంటి సేవల టిక్కెట్ల కోసం సిఫారసు ఉత్తరాలతో ఒక రోజు ముందుగా తిరుమలలోని ప్రత్యేక అధికారిని సంప్రదించాలి. అర్చనానంతర దర్శనం, నిజపాద దర్శనం వంటి సేవలకు గాను విజయాబ్యాంక్ రెండో అంతస్తులో ఉన్న ఆలయ డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలి.
  • ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఈవోల అనుమతి లభించాక ఆ రసీదులు తీసుకుని విజయా బ్యాంక్‌కు సమర్పించి నగదు చెల్లిస్తే సేవా టిక్కెట్లను మంజూరు చేస్తారు.

ప్రయాణం... దర్శనం... శీఘ్రం
  • దర్శనానికీ, వసతికీ, సేవాటిక్కెట్లకీ రిజర్వేషన్ అయ్యాక చెయ్యాల్సింది ప్రయాణం టిక్కెట్ల రిజర్వేషన్.
  • భక్తులు ఉండే ప్రదేశం, వారి ఆర్థిక స్థోమతను బట్టి ప్రయాణ సాధనాలను ఎంచుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన సౌకర్యం ఉంది. తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు విమానాలు వచ్చే వేళకు అక్కడ తితిదే బస్సులు సిద్దంగా ఉంటాయి.
  • తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలు,నగరాల నుంచి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

రైల్లో వెళితే...
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతుంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండ మీదకు వెళ్ళిపోవచ్చు.

బస్సులో వెళితే...
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్ స్టేషన్. రైలు వచ్చే సమయానికి అక్కణ్ణుంచి తిరుమలకు వెళ్ళే బస్సులు బయలుదేరేందుకు సిద్దంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టాండ్‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టాండ్ (పెద్ద బస్‌స్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ పద్మావతి బస్‌స్టాండ్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

నడక దారిలో...
కొండమీదకు నడిచి వెళ్ళే వారికి సామాను మోయాలనే చింతే అక్కర్లేదిప్పుడు. అలిపిరి టోల్‌గేటు వద్ద ఉన్న కౌంటర్లో సామాను ఉంచి, టోకెన్ తీసుకుంటే వారు కొండ ఎక్కేసరికి వారికన్నా ముందే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస (సీ ఆర్ వో) కు సామాన్లు చేరిపోతాయి. తిరుపతిలో తితిదే నిర్వహిస్తున్న సత్రాల్లో ఎక్కడైనా సామాన్లు ఉంచి, టోకెన్ తీసుకుంటే చాలు వాటిని తిరుమలకు చేరవేస్తారు. ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. నడిచి వెళ్ళే భక్తుల కోసం తితిదే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరి వరకు ప్రతి అరగంటకు రెండు ఉచిత బస్సులు నడుపుతుంది. వారి సౌకర్యార్థం తాగు నీరు, మరుగు దొడ్లు, విశ్రాంతి కోసం షెల్టర్లు, వైద్య సౌకర్యాలు... ఇలా ఎన్నో ఏర్పాట్లు చేసింది. బీపీ, హార్ట్ ఎటాక్ పేషెంట్లు, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు నడిచి వెళ్ళే కన్నా బస్సులోనే వెళ్ళడం మంచిది.


బండి మీద వెళ్ళితే...

కొంత మంది తమ సొంత వాహనాల్లోనే తిరుమలకు బయలుదేరతారు. దురదృష్టవశాత్తూ ఆ బళ్ళు ఘాట్ రోడ్ మార్గంలో ఆగిపోతే? భయపడక్కర్లేదు. అలాంటి వాహనాలను బాగుచేసేందుకు తితిదే ఆటోమొబైల్ క్లినిక్ నడుపుతోంది. వాహనం బ్రేక్‌డౌన్ అయిన సంగతి, ఏ ప్రాంతంలో ఉన్నదీ అలిపిరి టోల్‌గేట్ వద్ద ఉన్న సిబ్బందికి సమాచారమిస్తే తితిదే నియమించిన మెకానిక్‌లు మొబైల్ వ్యాను, స్పేర్‌పార్ట్స్ తో సహా అక్కడికి చేరుకుని ఆగిపోయిన వాహనాన్ని బాగు చేస్తారు. సర్వీసును బట్టి రుసుము, కొత్త పరికరాలు అమర్చితే వాటి విలువ చెల్లించాల్సి ఉంటుంది.

వసతికి కీలకం సీ.ఆర్.వో C.R.O

తిరుమలలో బస్సు దిగాక మొట్టమొదట చేయాల్సిన పని సీ ఆర్ వో కు వెళ్ళడం. సీ ఆర్ వో అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ వెబ్‌సైట్ల ద్వారాను వసతి రిజర్వేషన్ చేయించుకున్న వారు ఆ కార్యాలయానికి వెళ్ళి... తాము సొమ్ము చెల్లించిన రసీదును చూపిస్తే లభ్యతను బట్టి గదులు కేటాయిస్తారు.
  • ఉచిత వసతి సౌకర్యం కావాలన్నా సీ ఆర్ వో లోనే సంప్రదించాలి.
  • తిరుమలలో ఉచితంగా వసతి కల్పించే సత్రాలు మూడు ఉన్నాయి. సీ ఆర్ వో పక్కనే మూడు ఉచిత వసతి భవన సముదాయాలు (పిలిగ్రిం ఎమినిటీస్ కాంప్లెక్స్-పీ ఏ సీ) ఉన్నాయి.
  • ఈ కాంప్లెక్స్‌లో బస చేసిన యాత్రికులు విలువైన వస్తువులు ఉంచుకునేందుకు ఉచిత లాకర్ల సౌకర్యం కూడా ఉంది.
  • ఈ భవన సముదాయాల్లో బస చేయాలంటే ముందుగా రూ.200 డిపాజిట్ చేయాలి.
  • ఖాళీ చేసేటప్పుడు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు.
  • తలనీలాలు ఇచ్చేందుకు పీ ఏ సీ ల్లో మినీ కళ్యాణ కట్ట ఉంది.
  • అదీ ఉచితమే. సీ ఆర్ వో లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది.
  • తిరుపతి నుంచి బయలు దేరే ఏ రైలుకైనా 24 గంటల ముందు వరకూ కూడ అక్కడ రిజర్వేషన్ చేయించుకోవచ్చు.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే దర్శనం సులభంగా అవుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వెళ్ళి నానా అగచాట్లు పడే బదులు చక్కటి ప్లానింగ్‌తో వెళ్ళి స్వామి వారిని ప్రశాంత చిత్తంతో దర్శించండి.

తిరుమలలోనే ఒక వైపున పాపనాశనం జలపాతం, మరోవైపున గోగర్భం నీటి యూట మొదలయినవి మరియు ఆంజనేయస్వామి తల్లియైన అంజనా దేవి పుత్రార్ధియై తపమాచరించిన చోటు - తిరుమలలో శ్రీ వేంకటేశుని దర్శించబోయే ముందు ముఖ్యంగా చూడవలసిన వరాహ నరసింహ స్వామి దేవాలయము, పవిత్ర పుష్కరిణీ స్నానం చేసి స్వామి దర్శనానికి భక్తులు తేలికగా వరుసగా వెళ్ళటానికి ఏర్పరచిన క్యూలలో ప్రవేశించి దర్శనోత్సాహులై ఎన్ని గంటలయినా నిరీక్షించి క్యూలల్లో కదిలి వెళ్ళి స్వామిని దర్శించి పునీతులవుతారు.

తిరుమలపై నూతనంగా అభివృద్ధి పరచబడిన ఎన్నో ఉద్యానవనాలున్నాయి. తిరుమలకొండపై ఎక్కడ వున్నా భగవన్నామ స్మరణ నిత్యం జరుగుతూ మన చెవులకు శ్రావ్యంగా వినపడటానికి స్పీకర్లు అన్ని చోట్లా అమర్చారు. అక్కడ వున్నంత సేపు తనువూ, మనసూ మైమరచి భక్తిభావంతో పులకించిపోతారు భక్తులు ఆ దివ్యానుభూతిని కలకాలం మనసులో దాచుకుని మరచిపోలేరు కూడా.

ఆధ్యాత్మిక తత్వానికి తోడుగా ప్రకృతి రమణీయమై, నేత్రపర్వంగా మనోహర దృశ్యాలు దృగ్గోచర మవుతాయి.

తిరుమల నుండి క్రిందికి దిగితే తిరుపతి పట్టణం చూడముచ్చటగా సాక్షాత్కారమవుతుంది. ఒక వంక విజ్ఞానభాండారమైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ భవనాలు, పద్మావతీ కళాశాల - అనేక శాఖోపశాఖలుగా విలసిల్లిన కళాశాల భవనాలు ఒక వంక, మరో ప్రక్క కపిల తీర్థమనే ఎత్తునుండి నీరు ధారగా పడే జలపాతం కమనీయంగా కనబడతాయి. తిరుపతి నుండి పట్టణాన్ని ఆనుకునే తిరుచానూరు, అలివేలు మంగాపురం. పద్మావతి అమ్మవారి దేవాలయం, కళ్యాణ మండపం, శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం, గోవిందరాజుల స్వామి వారి ఆలయం మొదలైన దేవాలయాలు ఎంతో చూడదగినవి.

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన మన వడ్డి కాసుల వాడి ఆలయానికి నిత్యం అవేలాది భక్తులు వస్తుంటారు. పర్వ దినాలలో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది. ఈ స్వామి వారి వార్షికాదాయం ఏడు వందల యాబై కోట్ల రూపాయల పైమాటే. ఈ స్వామి వారికి మూడు వేల కిలోల బంగారు డిపాజిట్లున్నాయి. ఇంకా వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి. ఈ ఆలయానికి ఏటా సరాసరిన మూడు వందల కోట్ల రూపాయలు, మూడు వందల కిలోల బంగారు ఆబరణాలు, ఐదు వందల కిలోల వెండి ఆబరణాలు కానుకలుగా వస్తుంటాయి. ఈ స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన సేవ టికెటు ధర పది లక్షల రూపాయలు. అయినా ఆ టికెట్లు రాబోయె ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయి పోయాయి. మొత్తంమీద ఈ ఆలయం సంపద విలువ ముప్పైమూడు వేల కోట్ల రూపాయలు. ఈ ఆలయం వలన లక్షకు పైగా ప్రజలు ఉపాది పొందుతున్నారు.

తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే:....

ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వంద కోట్లు ఆదాయం వస్తున్నది. బ్యాంకుల్లో వుండే ఫిక్సుడు డిపాజిట్ల పై వడ్డీ 140 కోట్లు వుంటుంది. ఈ స్వామి వారి చెంత నున్న బంగారం సుమారు ఐదు టన్నులు. విదేశాలలో వున్న స్థిరాస్తుల విలువ సుమారు 33 వేల కోట్లు.

ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు, మిరాసీ దారుల చేతుల్లో వుండేది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి చేతుల్లోకి వచ్చింది. తి.తి.దే ఏర్పడ్డాక కూడ మిరాసి విధానమె కొనసాగింది. అనగా పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి వుండే వారు. అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి 51 లడ్డులకు 11 లడ్డులను మిరాసి కింద అర్చకులకిచ్చేవారు. వాటిని అర్చకులు అమ్ముకునెవారు. 1987 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు /మిరాసి విధానాన్ని రద్దు చేశారు. కాని అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్దతిని పూర్తిగా రద్దు చేసింది. అర్చకులకు వేతనం ఇచ్చే పద్దతిని ప్రారంబించారు.

తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు:

వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.

అవి:
ప్రత్యూష,
ప్రభాత,
మధ్యాహ్న,
అపరాహ్ణ,
సాయంకాల,
రాత్రి పూజలు.
తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.

సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.

అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.

కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు:
రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.

అవి:
సోమవారం విశేషపూజ,
మంగళవారం అష్టదళ పాద పద్మారాధన,
గురువారం సడలింపు,
పూలంగిసేవ,
తిరుప్పావడ,

శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.

సడలింపు: గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.

పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.

తిరుప్పావడ: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.

అభిషేకం: శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.

తల కోన.:

తిరుమల ఏడు కొండల వరుసలో తల భాగాన వున్నందున ఈ కొండకు తల కోన అని పేరు వచ్చింది. ప్రకృతి రమణీయతకు ఇది ఆలవాలము. చూడ చక్కని జలపాతాలకు ఇది నెలవు. అడవిలో సాహస యాత్ర చేయ దలచిన వారికిదిఎంతో ఉత్సాహానిస్తుంది. ఇన్ని హంగులున్నందునే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరిగింది. ఈ అటవీ ప్రాంతంలో అనేక ఔషద మొక్కలకు కూడ ప్రసిద్దే, అందుకే ఇక్కడున్న చెట్లకు వాటి పేర్లు/ వాTi శాస్త్రీయ నామాలను కూడ రాసిన బోర్డులు వేలాడ దీశారు. గిల్లి తీగ వంటి అనేక ఔషద మొక్కలకు ఇది కేంద్రము. అందుకే ఈ ప్రదేశము బొటానికల్ టూర్ చేసే వారికి సరైన ప్రదేశము. మద్ది, జాలాది, చందనం, ఎర్రచందనం మొదలైన చెట్లకు కూడ ఇది నిలయము. అరుదైన అడవి జంతువులకు కూడ ఇది కేంద్రమే. అడవి కోళ్లు, నెమళ్లు, దేవాంగ పిల్లి, ముచ్చు కోతి, ఎలుగ బంట్లు, వంటి వన జీవ జాతికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఇక్కడున్న అనేక జలపాతాలు. రెండు కొండల మధ్యనుండి సుమారు మూడు వందల ఎత్తునుంచి పడే జలపాతాన్ని చూస్తుంటే మనసు ఉరకలేస్తుంది. దీన్ని శిరోద్రోణ తీర్థం అంటారు. ఈ నీటిలో అనేక ఔషద గుణాలుంటాయి. దీనికి దిగువన నెల కోన అనే ప్రాంతం వుంది. అక్కడే సిద్దేశ్వర ఆలయమున్నది. శివ రాత్రి పర్వదినాన భక్తులు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వస్తారు.

ఎలా వెళ్లాలి:

తిరుపతి నుండి సుమారు యాబై కిలోమీటర్ల దూరంలో వున్నది తలకోన. తిరుపతి నుండి చాల బస్సులుంటాయి. ఇక్కడ అటవీ శాఖవారి, పర్యాటక శాఖ వారి, దేవాదాయ శాఖవారి అతిది గృహాలున్నాయి. వసతి భోజన సదుపాయాలున్నాయి. అడవి అందాలను తిలకించడానికి వాచ్ టవర్లను, చెట్లపై కర్ర వంతెనలు ఏర్పాటు చేశారు.

గోవింద రాజ స్వామి వారి ఆలయం, తిరుపతి:

గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోవే ఉంది.

ఆలయానికి రెండు గోపురాలున్నాయి. రెండు ఆవరణలు వున్నాయి. ఈ ఆలయం గాలి గోపురం బాగా పెద్దది. మొదటి ఆవరణములో అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, మొదలగు ఆలయాలతో పాదు రెండు నాలుగు స్థంబాల మండపాలున్నాయి. మధ్యలో ఒక రావి చెట్టు దానిక్రింద నాగ శిల్పాలున్నాయి. లోపలి వైపు గోపురం అనగా రెండొ గోపుర ద్వారం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాధల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. , . ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఇక్కడే వున్న ఆలయ వివరాలను తెలిపే ఒక బోర్డు వున్నది. దానిలోని వివరాల ప్రకారము ఈ ఆలయంలోని మూల విరాట్టు ............ ఇక్కడి మూల విగ్రహం మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవడం ఒక విశేషం.ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది. రెండో ఆవరణములో ఎడం వైపున కళ్యాణ మండపం వున్నది. ఈ చిన్న కళ్యాణ మండపం నల్ల రాతితో అత్యంత సూక్ష్మ శిల్ప కళా వైభవము కలిగి వున్నది. వైశాఖ మాసంలో గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు నాలుగు ప్రక్కలా విశాలమైన మెట్లు కట్టారు. కోనేటి చుట్టూ నాలుగు ప్రక్కలా నిర్మించిన మెట్లు అనేక ఉద్యమాలకు ప్రచారస్థలాలుగా ఉపయోగపడ్డాయి. వైష్ణవోద్యమం ప్రచారానికి ఈ కోనేటిగట్టు కేంద్రంగా ఉండేది. రామానుజాచార్యుల భక్తి కూటములు ఇక్కడినుండే దక్షిణ భారతంలో వైష్ణవ ప్రచారం సాగించాయి. కోనేరు బొమ్మ చూడండి.

ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైన సమచారాన్ని అందిస్తున్నాయి. అన్నింటికంటె పాత శాసనం ప్రకారం 1235లో మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. 1239 లో వీర నరసింగ యాదవరాయలు భార్య ఆలయం రధం నిమిత్తం, మరి కొన్ని మరమ్మతుల నిమిత్తం కానుకలు సమర్పించింది. 1506 లో విజయ నగర రాజుల సాళువ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది. ఆయా రాజులు సతీ సమేతంగా తమ చిత్రాలను ప్రధాన గోపురం లోపల చెక్కించి వున్నారు.

ఒక కథనం ప్రకారం: చిదంబరంలో వున్న గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 24-2-1130 లో ప్రతిష్టించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనె శ్రీ ఆండాల్ విగ్రహాన్ని కూడ ప్రతిష్టించారు. గోవింద రాజ స్వామి వారి విగ్రహం రాక ముందు నుండి అక్క పార్థ సారధి విగ్రహం వుండేది. దీని ఉత్తర దిశలో గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో వుత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటిటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.

కళ్యాణ వేంకటేశ్వరాలయం. శ్రీనివాస మంగాపురం:

శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీని వాస మంగాపురంలోని శ్రీ వెంకటేస్వరాలయం గతంలో పూజా పునస్కారాలు లేక పురావస్థు శాఖవారి ఆధీనం లో వుండేది. చాల కాల తర్వాత ఈ ఆలయంలో నిత్య పూజాదికాలు జారుగు తున్నాయి. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణం లో చూడ వచ్చు. ఇక్కడి స్వామి వారి మూల విరాఠ్ తిరుమలలోని మూల విరాఠ్ కన్నా పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.

పాకాల -- తిరుపతి రైలు మార్గంలో మంగా పురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు మంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించు కొని ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లె వారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. కాని ప్రస్తుతం మంగాపురంలో రైల్వే స్టేషన్ లేదు. ఈ మెట్ల దారిని ఉపయోగించే భక్తులు చాల తక్కువ. సుధూర ప్రాంతాల వారికి ఇక్కడ తిరుమలకు ఒక మెట్ల దారి వున్నదన్న సంగతి కూడ తెలియదు.

పద్మావతి అమ్మవారి ఆలయము. అలమేలుమంగా పురం, తిరుపతి:

పద్మావతి అమ్మ వారి ఆలయము తిరుపతి సమీపంలో ని తిరుచానూరు లో వున్నది. దీనిని అలమేలు మంగా పురమని కూడ అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు. అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.

ఈ ఆలయంలో - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి వారికి కూడ ఆలయాలున్నాయి. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. తిరుచానూరులో వున్న పద్మావతి అమ్మవారి కోనేరు చాల విశాలమైనది. అందులోని నీరు చాల స్వచ్చంగా వుంటాయి. అమ్మ వారికి తెప్పోత్సవం ఈ కోనేరులోనె వైభవంగా జరుగు తుంది. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.

Sources: TutorSagar, TeluguBharath

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం...

Telugu Devotional Books Free Download గ్రంధాలయం తెలుగు పుస్తకాలు - E Books Guide

Telugu Devotional Books Free Download తితిదే మహాభారతం తెలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహాభారతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో అందరికీ అందుబాటులో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించారు. Maha Bharatham Vol 01 - Adi Parvam P-1 Maha Bharatham Vol 02 - Adi Parvam P-2 Maha Bharatham Vol 03 - Sabha Parvam Maha Bharatham Vol 04 - Aranya Parvam P-1 Maha Bharatham Vol 05 - Aranya Parvam P-2 Maha Bharatham Vol 06 - Virata Parvam Maha Bharatham Vol 07 - Udyoga Parvam Maha Bharatham Vol 08 - Bheshma Parvam Maha Bharatham Vol 09 - Drona Parva Maha Bharatham Vol 10 - Karna Parvam Maha Bharatham Vol 11 - Shalya Sowptika Striparvam Maha Bharatham Vol 12 - Santi Parvam P-1 Maha Bharatham Vol 13 - Santi Parvam P-2 Maha Bharatham Vol 14 - Anushasanika Parvam Maha Bharatham Vol 15 - Aswamedha Asramavasa Mousala Mahaprasthanika Parvam Bharathamlo Neethikathalu - Ushasri Mahabharatam Mokshadharmaparvam Modati Bhagam - ...

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను. ...