Skip to main content

త్రయీ ఆధ్యాత్మిక ప్రయాణం (Threaiee The Etemal Journey)


ప్రపంచంలోని వ్యక్తులు భగవంతుని నమ్మడంలో రెండు విధానాలను పాటిస్తారు. మొదటి వారు భగవంతుడు వున్నాడని నమ్మే ఆస్తికులు. రెండవవారు భగవంతుడు లేడని నమ్మే నాస్తికులు. ఆస్తికులు భగవంతుని మీద నమ్మకంతో ఆయన నామాన్ని ఉచ్ఛరిస్తే, నాస్తికులు భగవంతుని పై అపనమ్మకంతో ఉచ్ఛరిస్తారు. అది నమ్మకమైనా కావచ్చు, అపనమ్మకమైనా కావచ్చు. కాని ప్రతీ వ్యక్తి తన జీవితకాలంలో కనీసం ఒక్క సందర్భంలోనైనా ఆయన నామాన్ని మాత్రం ఉచ్ఛరించాల్సిందే ‍! అలాంటి అలౌకికమైన భగవంతుని వెతుకుతూ సాగే ఒక అమ్మాయి ఒంటరి ప్రయాణమే త్రయీ” --- ఆధ్యాత్మిక ప్రయాణం...

Episode: 01

అజోz పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోz పి సన్ |
ప్రకృతిం స్వామాధిష్టాయ సంభవామ్యాత్మమాయయా ||

జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకూ ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే మాయాశక్తి వలన జన్మిస్తున్నాను. -భగవత్గీత

భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఆధ్యాత్మికత అనగానే ప్రపంచమంతా తిరిగి చూసేది భరతభూమినే.

అనాదికాలం నుండి ఆధ్యాత్మికతను ఎంతో మంది జ్ఞాన పిపాసులకు పంచుతూనే వుంది.

ఈ మహా భూమిలో ఎంతోమంది యోగులు, జ్ఞానులు, సంతులు జనించారు. కొందరు తాము పొందిన జ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో జనులకు అందిస్తే మరి కొందరు గుప్తంగా అందించారు. జగద్గురువులుగా ఖ్యాతిగాంచిన ఆదిశంకరాచార్య నుండి మొదలుకొని యుగపురుషునిగా ఖ్యాతిగాంచిన స్వామివివేకానంద వరకు ఎందరో జ్ఞానులు ఈ నేలపై జన్మించారు.

జనన మరణాలు లేని నేను సర్వత్రా వ్యాపించివున్నాను అన్నాడు భగవానుడు గీతలో. భగవంతుని దర్శనం పొందాలంటే గురువు తప్పనిసరి. ఆ గురువే చాకలిగా మారి నీ ఆత్మను, మనస్సును శుద్ధి చేసి భగవంతుని పొందడంలో సహాయం చేస్తాడు అన్నాడు కబీర్‌దాస్‌.

“అన్ని యోగమార్గాలలో భగవద్దర్శనం పొందానని ఎలుగెత్తి చెప్పారు రామకృష్ణ పరమహంస.”

“6నెలలు నిశ్చలసమాధిలో ఉండి, శరీరం చీమలు పట్టి ఓపక్క అంతా పుండ్లమయం అయినా చలించకుండా, సమాధి నుండి బయటకు వచ్చాక భగవంతుని దర్శించానని, అమిత ఆనందం పొందానని ప్రకటించారు రమణమహర్షి.”

“60 సం,,లు పాడుబడిన మసీదులో జీవించిన శిరిడిసాయిబాబా సాధనలో భాగంగా 12సం,,లు వేపాకులు మాత్రమే తిని జీవించానని చెప్పారు. “అల్లామాలిక్” అంటూ తన యజమాని భగవంతుడే అని చాటారు.”

“గురువు సహాయంతో నా అంతర్నేత్రం తెరుచుకున్నది, నా ప్రభు దర్శనం పొందాను అన్నది మీరాబాయి. ఆ ప్రభు దర్శనం కోసం ఎన్నో లోకనిందలు మోసింది, కుటుంబసభ్యులు ఇచ్చిన విషాన్ని త్రాగింది. అయినా తాను అన్ని వేళల పరమానందాన్ని అనుభవిస్తుంటానని తన భజనల ద్వారా తెలిపింది.”

“రామా రామా అంటూ ఒకప్పుడు నేను తిరిగేవాణ్ణి కానీ ఇప్పుడు రాముడే కబీర్ కబీర్ అంటూ నా వెంట పడుతున్నాడు అన్నారు కబీర్ తన దోహాలలో.” వీళ్ళందరి గురించి చదివిన నా సంస్కారం, నేను పుట్టిన మతం , నన్ను కన్న నా వాళ్ళు అందరూ భగవంతుని ఉనికి నిజమే అని చెబుతున్నాయి. కాని నేను జీవిస్తున్న నేటి సమాజం మాత్రం నాలో కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నది.

నిజంగా భగవంతుడు వున్నాడా? ప్రయత్నిస్తే భగవద్దర్శనం పొందగలమా? యోగులు, జ్ఞానులు నిజంగా భగవంతుని చూసారా? వారు సామాన్యులు భగవంతుని చూడటంలో సహాయం చేయగలరా? ఎందుకంటే నేటి సమాజంలో భగవంతుని పేరు చెప్పి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. గురువులము, బాబాలము, స్వాములము అని చెప్పుకునే వారు ఎన్నో రకాలుగా సామాన్య జనాన్ని మోసం చేస్తూ ఎప్పడూ ఏదో ఒక వార్తలలో వుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నాలాంటి సామాన్యురాలికి భగవంతుడు వున్నాడా లేడా అని అనుమానం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదేమో! కాని ఆ అనుమానాన్ని నా అస్తిత్వం తునాతునకలు చేయడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఈరోజు వరకు ప్రతిక్షణం నేను ఆయన ఉనికిని అనుభవిస్తున్నాను. నా హృదయంలో ఆయనకోసం అమితమైన ప్రేమ వుంది. అందుకే ఆ హృదయం భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆలోచించే  మెదడుని చిన్నాభిన్నం చేస్తుంది.

Episode: 02

నా హృదయం చెబుతుంది భగవంతుడు వున్నాడని కాని నా ముందు మరికొన్ని ప్రశ్నలు ఉదయించాయి.

మరి నేను ఎలా ఆయనను చూడను? నిజంగా నేను కోరుకొని ప్రయత్నిస్తే ఆయనను చూడగలనా? ఈ మహాత్ములందరూ చెప్పినట్టు ఒక గురువో, ఒక మహాత్ముడో నాకు నా భగవంతుని కలుసుకునే విషయంలో ఏమైనా సహాయం చేయగలరేమో! కాని అలాంటి గురువు నాకు ఎక్కడ దొరుకుతాడు? ఎలా నేను ఆయనను కనిపెట్టాలి? నిజంగా అలాంటి మహాత్ములు వున్నారా అనే అనుమానం నాకు బలపడసాగింది.

అందుకే అది తేల్చుకుందామనే గురువులని, మహాత్ములని కలుసుకోవాలి అనుకున్నాను. ఇందులో పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతుల వైపు నా దృష్టి వెళ్ళలేదు. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో వున్న వారికంటే ఎలాంటి ప్రచారం లేకుండా గుప్తంగా జీవిస్తున్న వాళ్ళని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.

అలాంటి గుప్త మహాత్ములని వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలి. ఏ స్థలంలో వారు నాకు కలిసే అవకాశం వుందా అని ఆలోచించినపుడు, పురాణకాలం నుండి ఆధ్యాత్మికతకు చిహ్నంగా విరాజిల్లిన కాశీనగరి గుర్తుకువచ్చినది.

కాశీనగరి శంకరభగవానుని నివాస స్థలి. ప్రతి హిందువు తన మరణం కాశీలో జరగాలనుకుంటాడు. ఎందుకంటే కాశీలో మరణించినవారికి శంకరుడు మోక్షమంత్రం ఉపదేశిస్తాడని, వారికి పునర్జన్మ వుండదని ప్రసిద్ధి.

అందుకే సామాన్య జనులే కాక ఎందరో మహానుభావులు సైతం కాశీ ప్రశస్థిని గుర్తించి కాశీ దర్శనం తప్పక చేసుకుంటారు. కొంతమంది కాశీనే తమ నివాస స్థానంగా చేసుకోవడం కూడా జరిగింది.

కాశీ విశ్వనాధుడు 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. కాశీ విశాలాక్షి అష్టాదశ మహాపీఠాలలో ఒక పీఠం. గంగోత్రి నుండి జనించిన గంగామాత అక్కడి నుండి అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను దాటుతూ కలకత్తా వద్ద సాగరంలో కలుస్తుంది. కాని గంగకి కాశీలో వున్నంత విశిష్టత మరెక్కడా లేదని చెప్పవచ్చు.        

పురాతన ఈ నగరిని యాత్రికులు ‘కాశీ’ అని, ఆ నగరంలో నివసించే వాళ్ళు ‘బెనారస్’ అని, పాశ్చాత్యులు ‘వారణాసి’ అని, సాధువులు, సన్యాసులు ‘ఆనందవన్’ అని అంటారు.

వరుణ మరియు అస్సీ అనే నదులు ఈ స్ధలంలో గంగా నదిలో కలవడం వలన ఈ స్థలం వారణాసిగా ప్రఖ్యాతిగాంచింది. అస్సీనది గంగలో కలిసే చోటు నుండి వరుణనది గంగలో కలిసే మధ్యలో కాశీనగర ముఖ్యమైన 84 స్నానఘట్టాలు వున్నాయి. వీటిని ఘాట్‌లు అంటారు.

ఎంతో మంది సాధకులు, సాధువులు కాశీలో వుంటారని వినడం వలన నేను నా ఆధ్యాత్మికత వైపు ప్రయాణంలో మొదటి మజిలీగా కాశీని ఎన్నుకోవడం జరిగింది.

ఈ ప్రయాణం కోసం ఇంట్లో వాళ్ళను ఒప్పించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. ఎందుకంటే నేను నా ప్రయాణం ఒంటరిగా చేయాలనుకున్నాను. మన దేశం సాంకేతికంగా ఎంతగా అభివృధ్ధి చెందినా కొన్ని విషయాలలో మన కట్టుబాట్లు మనల్ని వెనక్కులాగడానికి ప్రయత్నిస్తూనే వుంటాయి.  

హిందూ ధర్మంలో ఒక మధ్యతరగతి కుటుంబపు ఆడపిల్లనైన నాకు ఆ మాత్రం వ్యతిరేకత నేను ఊహించనిదేమి కాదు. కాని ఆధ్యాత్మికత అనే మామిడిపండు నన్ను అమితంగా ఆకర్షించడం వలన ఎలాగైనా సరే దాన్ని అందుకోవాలనే తపన నాది. కొంచెం కష్టపడి మొత్తానికి ఇంట్లోవాళ్ళని ఒప్పించగలిగాను. శివరాత్రికి 15 రోజులు ముందు నేను కాశీలో వుండేలా ఏర్పాటు చేసుకున్నాను. శివరాత్రికి సాధువులు వచ్చే అవకాశం వుందని నా ఉద్దేశ్యం అందుకే ఆ సమయంలో వెళ్ళాలనుకున్నాను.

చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను నేను కాశీ ప్రయాణం అయ్యే రోజు కోసం. నిజం చెప్పాలంటే కొంచెం కంగారుగా కూడా వుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటి ప్రయాణాలు చేయలేదు అది కూడా ఒంటరిగా. మొత్తానికి నేను ఎదురుచూసే ఆరోజు వచ్చేసింది.

కాశీ ట్రైయిన్లో అడుగుపెట్టిన నాకు అంతా గందరగోళంగా అనిపించింది. ట్రైయిన్ మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళతో నిండి వుంది. ఎవరిని చూసినా గుట్కా, పొగాకు నములుతూ భయపెట్టేలా వున్నారు. ఇక ఇలాంటి వాళ్ళని చూడటం నాకు సహజమే అని నాకు నేను సర్దిచెప్పుకుని నాకు వచ్చిన సైడ్ బెర్త్ యెక్క కిటికి వద్ద కూర్చున్నా.

Episode: 03

ట్రైయిన్ బయలుదేరిన అరగంటకి నా ఎదురుగా కూర్చున్న 20 ఏళ్ళ వయస్సు వున్న అబ్బాయి స్వచ్ఛమైన హిందీలో నన్ను పలకరించాడు. ఆ అబ్బాయి పేరు విక్రమ్. మాటలలో తెలిసింది విక్రమ్‌ది కాశీ అని. ఆ మాట వినగానే నాకు ఒక్కసారిగా ఆనందం వేసింది.

ఎందుకంటే నాకు కాశీలో ఎవరూ తెలియదు. ఇంతకు ముందు ఒకసారి వెళ్ళినా అది ఎప్పుడో. అది కూడా చాలా మందితో వెళ్ళడం వలన గుంపులో వెళ్ళి గుంపులో వచ్చేశా. ఒకసారి వెళ్ళాననే కాని కాశీలో నాకు ఏమీ తెలియదు. తెలిసిన వారు కూడ ఎవరులేరు అని అనుకుంటున్న సమయంలో విక్రమ్ కనిపించడం కటిక చీకటిలో వెళ్తున్నవాడికి దీపం కనిపించి నట్టనిపించింది.

విక్రమ్‌ది కాశీ అని తెలియగానే నాకు చాలా ఉత్సాహం వచ్చింది. నేను ఎందుకు కాశీ వస్తున్నాను అనే విషయం చూచాయగా చెప్పాను. నాకు కాశీ గురించి ఏమైనా వివరాలు చెప్పమని అడిగినప్పుడు విక్రమ్ కాశీలోని కొన్ని ఘాట్ల గురించి, అక్కడి ప్రజల అలవాట్ల గురించి చెప్పాడు. అక్కడ ఎక్కువగా భోజ్‌పురి భాష మాట్లాడతారని ఇలా ఎన్నో కాశీ విశేషాలు చెప్పాడు.
కాకపోతే తనుకూడా నా ఒంటరి ప్రయాణానికి కొంచెం ఆశ్చర్యపోయాడు. కాశీలో కొంచెం జాగ్రత్తగా వుండమని హెచ్చరించాడు. నేను ముందే ఇది విని వున్నాను. కాశీలో యాత్రికుల వద్ద దొంగతనాలకు, దుశ్చర్యలకు పాల్పడతారని, చంపడాలు ఎక్కువని విన్నానని చెప్పాను.

అందుకే నేను నాతో నా బంగారు వస్తువులు ఏమి తీసుకురావడం లేదని ,ఈమధ్యే కొనుక్కున్న నా విలువైన సెల్‌ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి ఈ ప్రయాణం కోసమే ఒక మాములు సెల్ కొన్నానని, ఆఖరికి నాచేతి గడియారం కూడా తీసేసి ఒక మాములు 100రూ,,ల గడియారం తెస్తున్నానని ఎంతో గొప్పగా నా ముందుజాగ్రత్త గురించి చెప్పాను.
ఇది విని విక్రమ్ ఆశ్చర్యపోయాడు. మరీ అంత జాగ్రత్తపడవలసిన అవసరం ఏమి లేదని మీరు విన్నట్టు వుండదని చెప్పాడు. అయినా ఎందుకో నాకు నేను తీసుకున్న జాగ్రత్తలు సరయినవే అనిపించింది.
కాశీ ఇంకొక 3గంటలలో చేరుకుంటామనగా ఒక వంతెన మీదుగా ట్రైన్ వెళ్తుంది. క్రింద ఒక నది కనిపించింది. వెంటనే విక్రమ్ చెప్పాడు ఇదే త్రివేణి సంగమం అని.

ఓ! ప్రయాగా!! గంగ, యమునలు కలిసేచోటు. సరస్వతి అంతర్వాహినిగా వుండే చోటు. ఈ మూడు నదుల కలయిక వలన ఈ స్థలం త్రివేణి సంగమంగా పేరు గాంచింది. దీన్నే “ప్రయాగ” అని కూడ అంటారు. ఎంతో భక్తిగా ఆ నది సంగమానికి నమస్కారం చేసి నా యాత్ర సఫలం అయ్యేలా చేయమని కోరుకుని ఒక నాణెం నదిలోకి విసిరాను.
ట్రైయిన్ ఎక్కినప్పుడు పూర్తిగా క్రొత్త ప్రదేశం వెళ్తున్నానని వున్న కంగారు ట్రైయిన్ దిగే సమాయానికి లేదనే చెప్పాలి. విక్రమ్ ద్వారా ఎంతోకొంత ఆ ప్రదేశం గురించి తెలుసుకున్నాను. అంతేకాదు నాకు ఇప్పుడు కాశీలో ఒక స్నేహితుడు కూడా వున్నాడు. విక్రమ్ నాకు ముందే చెప్పాడు కాశీలో ఏ సమస్య వచ్చినా, అవసరం వచ్చినా తనను సంప్రదించమని అందుకే కొంచెం కంగారు తగ్గి శాంతపడ్డాను.

చేరుకోవలసిన సమయం కన్న 3గం,,లు ఆలస్యంగా వారణాసి జంక్షన్ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టాను. స్టేషన్ చాలా రద్దీగా ఉంది. మొదటి ఫ్లాట్‌ఫాం మీద నిలబడిన నాకు ఎటు నుండి స్టేషన్ బయటికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. అది గమనించిన విక్రమ్ నా దగ్గరికి వచ్చి తనతో నడవమని చెప్పాడు.

జనాలను తోసుకుంటూ నాబ్యాగ్ లాక్కుంటూ ఎలాగోలా బయటకు వచ్చాను.
విక్రమ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. కేదార్‌ఘాట్ అని చెప్పాను. అక్కడే ఒక ఆశ్రమంలో నా వసతి. విక్రమ్ తన ఇల్లు మణికర్ణికాఘాట్ వద్ద అని, నేను ఎలా కేదార్‌ఘాట్ వెళ్ళాలో చెప్పాడు. షేర్ ఆటో ఎక్కి గౌదోలియాలో దిగమని అక్కడి నుండి రిక్షా ఎక్కి కేదార్‌ఘాట్ వెళ్ళాలని చెప్పాడు. తనకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళవలసిన గౌదోలియాకి ఆటో ఎక్కాను.

కానీ రోడ్లు చూసి నేను ఆశ్చర్యపోయాను అవి చాలా ఇరుకైనవి. బస్సులు తిరిగేంత స్థలం లేకపోవడం వలన కాశీలో లోకల్ బస్సులు వుండవు. అందుకే అక్కడ అంతా రిక్షాలు, ఆటోరిక్షాలే. రోడ్లమీద ఎక్కడ చూసిన పాశ్చాత్యులే కనిపిస్తున్నారు.
గౌదోలియాలో దిగి కేదార్‌ఘాట్‌కి రిక్షా ఎక్కాను. నేను బసచేయబోయే ఆశ్రమం కేదార్‌ఘాట్‌కి దగ్గరలోనే వుందని విన్నాను. ఆశ్రమం వివరాలు విన్న రిక్షావాడు నాకు తెలుసు అన్నాడు. అది విని ధీమాగా ఎక్కి కూర్చున్నాను.

విక్రమ్ చెప్పాడు అక్కడి నుండి వెళ్ళవలసిన చోటుకి 5ని,,లు సమయం మాత్రమే పడుతుందని. కాని మేము దాదాపుగా 15ని,,లు ప్రయాణించాం. అనుమానం వచ్చి రిక్షా అతన్ని అడిగితే నాకు ఆచోటు తెలియదు వెతుకుతున్నాను అని చెప్పాడు.

Episode: 04

నేను నా వద్ద వున్న ఫోన్‌నంబర్‌కి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి వసతి వున్న చోటు తెలుసుకున్నాను. దాన్ని అనుసరించి మేము ఒక వీధిలోకి వెళ్ళి ఒక కిరాణా దుకాణం దగ్గర ఆగాము. ఆ కిరాణా యజమానికి అడ్రస్ చెప్పి ఎక్కడ అని అడిగాడు రిక్షావాడు.

ఆ షాపు అతను చాలా ఉత్సాహంగా ఒకతన్ని పిలిచాడు. అతను 50సం, లు వుండొచ్చుపొట్టిగా, నల్లగా వున్నాడు. అతనికి నన్ను చూపిస్తూ అడ్రస్ చెప్పి మేడమ్‌ని అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పాడు. నాకు అతన్ని కూలీవాడని పరిచయం చేసాడు. ఆ కూలి అతను మనం లోపల సందుల్లోకి వెళ్ళాలని ఆ ఆశ్రమం ఇక్కడి నుండి దగ్గరే రిక్షా వెళ్ళదు, మీరు నాతో నడవండి అంటూ బ్యాగ్ తీసుకుని నడవడం మొదలుపెట్టాడు.

నేను అతన్ని అనుసరించి నడవడం మొదలుపెట్టాను. 10ని,,లు పైగా నడిచాం. చాలా లోపల సందుల్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఇంతలో మాకు ఒక నడివయస్సు వ్యక్తి ఎదురయ్యాడు. అతను నన్ను చూస్తూ కూలీ అతనితో మంచి బేరం దొరికినట్టు వుంది అన్నాడు. కూలీవాడు అవును అన్నట్టు తల ఊపాడు. 

నాకు ఎందుకో అతని ఆ మాట కూలీ అతని వెటకారపు నవ్వు నచ్చలేదు. కొంచెం చిరాకుగా అనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మరొక అతను ఎదురయ్యాడు. అతను కూలీవాణ్ణి చూసి అతని వెనుక ఉన్న నన్ను క్రిందకి మీదకి చూసి కూలీవాని వైపు ఒక నవ్వు విసిరి మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయాడు. అంతే ఇక నాలో ఎక్కడో అనుమానం మొదలయ్యింది. ఆ ఇద్దరు వ్యక్తుల చూపులు నన్ను వెంటాడుతున్నట్టే అనిపించింది. నడిచే ముందు కూలీ అతను మేము వెళ్ళవలసిన చోటు చాలా దగ్గర అని చెప్పాడు. కాని మేము చాలా దూరం నడిచాము.

నేను వెంటనే కూలీ అతన్ని అదే విషయం అడిగాను, దగ్గర అన్నావు ఏమిటి ఇంత నడుస్తున్నాం అని. దగ్గరే అమ్మా అన్నాడు. నేను దబాయిస్తున్నట్టుగా లేదు మా అంకుల్ చాలా దగ్గర అని చెప్పారు అన్నాను. నడుస్తున్న వాడల్లా ఆగిపోయి మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. అతను అడిగిన విధానం నాకు అతని పట్ల కలిగిన అనుమానాన్ని బలోపేతం చేసింది.

కొంచెం కంగారుగా అనిపించి చుట్టూ చూసాను వీధులు నిర్మానుష్యంగా వున్నాయి. ఒకవైపు చీకటి కూడా పడుతుంది అయినా నా కంగారును బయట పడనీయకుండా, మా అంకుల్ తన కుటుంబంతో వారణాసిలో స్థిరపడ్డారని ఆ ఆశ్రమంలో సేవ చేస్తున్నారని చెప్పాను. ఇదిగో మా అంకుల్ కి ఫోన్ చేస్తాను అంటూ ఆశ్రమం ఇన్‌చార్జ్ కి ఫోన్ చేసి కూలీవాడికి అర్ధం కాకుండా నా సమస్యను నా భాషలో ఆ ఇన్‌చార్జ్ కి చెప్పాను. అతను వెంటనే స్పందించి కూలీ అతనికి ఫోన్ ఇమ్మన్నాడు. నేను ఫోన్ ఇవ్వబోతే కూలీ అతను ఫోన్ అందుకోవడానికి ఇష్టపడలేదు. నేను బలవంతం చేయడంతో తీసుకొని మాట్లాడాడు. ఫోన్ పెట్టేసాక అతని మొహం వాడిపోయింది. మేము వచ్చిన దారిలో కొంత వెనక్కి తీసుకువెళ్ళి ఒక మలుపు తిరిగాడు. అసలు వీధుల్లో జనసంచారం లేదు, పూర్తిగా చీకటి పడింది . బయటపడటం లేదు కాని నాకు చాలా కంగారుగా వుంది. ఇతన్ని అనవసరంగా నమ్మానేమో అనిపించింది. మళ్ళీ ఎందుకు వెనక్కు వచ్చామో అర్ధం కాలేదు. ఆ మలుపు చివరే నేను దిగవలసిన ఆశ్రమం ఉంది.

అతను గబగబా లోపలికి వెళ్ళి ఆశ్రమం ఆఫీస్ ముందు నా బ్యాగ్ పెట్టి నిల్చున్నాడు. నేను కొంచెం కంగారుగానే లోపలికి వెళ్ళాను. నన్ను చూస్తూనే ఆశ్రమం ఇన్‌చార్జ్ బయటికి వచ్చాడు. ఆయన్ని చూడగానే కూలీవాడు నేను చెప్పిన అంకుల్ అనుకొని, ఆయనతో మీ అమ్మాయి చాలా భయపడింది నన్ను నమ్మలేదు అంటూ నామీదే చెప్పడం మొదలుపెట్టాడు.

నేను ఏం మాట్లాడటం లేదు. నాలో ఇంకా ఆ కంగారు తగ్గలేదు. నా పరిస్థితి అర్ధం చేసుకున్న ఇన్‌చార్జ్ కోపంగా అమ్మాయి ఇక్కడి నుండి దగ్గరలోనే దిగింది. నువ్వు ఎందుకు తనను వీధులన్నీ తిప్పావు అంటూ చీవాట్లు పెట్టారు. నేను అతనికి డబ్బులు ఇచ్చి వెళ్ళి పొమ్మన్నాను. అతను చాలా వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
నాకు ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి కొంత సమయం పట్టింది.

కాశీలో దిగగానే ఇలాంటి అనుభవం ఎదురవడం ఆదిలోనే హంసపాదులా అనిపించింది, బాధను కూడా కలిగించింది. వెంటనే ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలనిపించింది. కాని చెబితే వాళ్ళు భయపడతారని ఊరుకుండిపోయాను.
నాకు కేటాయించిన గదిలోకి వెళ్ళబోతుంటే ఇన్‌చార్జ్ గారు అడిగారు తర్వాత కార్యక్రమం ఏమిటని. విశ్వనాధుని దర్శనానికి వెళ్తానని చెప్పాను. ఆయన వెంటనే లేదు ఇప్పుడు రాత్రి 7.30 అవుతుంది. నువ్వు ఈ చీకట్లో అంత దూరం వెళ్ళి రాలేవు. రేపు ఉదయం విశ్వనాధుని దర్శనం చేసుకో. ఇప్పుడు ప్రక్కనే వున్న గౌరీకేధారనాధుని దర్శనం చేసుకో ఆయన స్వయంభువు అని చెప్పారు.
 ఈ రోజు పౌర్ణమి. పౌర్ణమి రోజు విశ్వనాధుని శేజ్ ఆరతి చాలా బాగుంటుందని, విశిష్టమయినదని ఆ అవకాశం వదులుకోవద్దని చెప్పిన విక్రమ్ మాటలు గుర్తుకు వచ్చాయి. రాత్రి 10.30 ని,,లకు జరిగే ఆ ఆరతిలో ఎలాగైనా వెళ్ళాలనుకున్న నాకు ఆశ్రమం గేట్లు 9.30 గం,,లకే మూసివేస్తారని విని చాలా నిరుత్సాహం కలిగింది. చేసేదేమిలేక గౌరీకేధార్‌నాధ్ గుడికి బయలుదేరాను. 

నిజంగానే నా వసతి నుండి ఆ గుడి చాలా దగ్గరగా వుంది. చాలా పురాతనమైన గుడిలా వుంది. లోపల చాలా చల్లగా, ప్రశాంతంగా వుంది. ఈ ఆలయం చాలా విశిష్టమైనది. గౌరీశంకరులు ఇద్దరు ఒకే లింగంలో స్వయంభువుగా వెలిసారు. అందుకే ఆ ఆలయంలో శివలింగాన్ని స్పృశించినపుడు మన ఎడమచేయి లింగం కుడివైపు, మన కుడిచేయి లింగం ఎడమవైపు తాకించి నమస్కరించాలి. అంటే లింగంని స్పృశిస్తున్నపుడు మన చేతులు ‘’x’’ ఆకారంలో వుండాలి. ఈ విధంగా మనం ఎడమ చేతితో గౌరిదేవిని, కుడిచేతితో శివుడిని స్పృశించినట్టు. 

దర్శనం చేసుకొని మండపంలోకి వచ్చి కూర్చున్నాను. నాకు దగ్గరలో కొంతమంది దక్షిణదేశం వాళ్ళు కూర్చొని వున్నారు. వాళ్ళకి ఒక పంతులుగారు కాశీలో కుంభమేళ జరిగినపుడు ఆయన చూసిన వింతలు, విశేషాలు, చిత్రవిచిత్రమైన యోగుల గురించి వర్ణించి చెబుతున్నాడు. కొంతమంది బాబాలు పూలల్లో నుండి వస్తువులు తెప్పించడం లాంటి విద్యలు ప్రదర్శించారని చెబుతుంటే అందరూ చాలా ఆశ్చర్యంగా వింటున్నారు.

వాళ్ళ మాటలు వింటూ కూర్చున్న నాకు గుడి మరో ద్వారం నా ఎదురుగానే కనిపించింది. గౌరీకేధారుని దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ ద్వారం గుండా బయటకు వెళ్ళడం చూసి అక్కడ ఏముందో చూద్దామని నేను ఆ ద్వారం దగ్గరకి వెళ్ళాను. అద్భుతం కొన్ని మెట్ల క్రింద నా ఎదురుగా గంగానది వెన్నెల్లో మెరిసి పోతుంది.

Episode: 05

ఈ సమయంలో గంగానది దర్శనం ఎదురుచూడని నేను అనుకోని ఈ దర్శనానికి ఎంతో ఆనందపడిపోయాను. గబగబా మెట్లు దిగి నది దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లోకి దిగాను. గంగాజలం తలమీద జల్లుకొని నమస్కరించాను. నేను వచ్చిన కార్యం సఫలం అయ్యేలా చూడమని ప్రార్ధించి పైకి వచ్చి మెట్ల మీద కూర్చుని ఆ ప్రాంతం చూడటం మొదలు పెట్టాను.

ప్రశాంతంగా వున్న గంగానదిని, ఆకాశంలోని పూర్ణచంద్రుని వెన్నెల కిరణాలు పలకరిస్తున్నట్టే వుంది. అక్కడక్కడ ఆగి వున్న పడవలు, కనిపించినంత మేర స్నాన ఘట్టాలు, వాటిని అక్కడి వారు ఘాట్‌లంటారు. ఇక నుండి మనము అలాగే అందాము. కాబట్టి నేను కూర్చున్న స్థలం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది అది కేధార్‌ఘాట్ . కొంతసేపు ఆ ప్రశాంతతను, ఆ రమ్యమైన ప్రకృతిని ఆస్వాదించి నా గదికి వచ్చేసాను.

ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సాయంత్రం జరిగిన కూలీవాని గొడవ, విశ్వనాథుని దర్శనం, పౌర్ణమి ఆరతి దర్శనం కలగలేదనే బాధ కొంత తగ్గాయనే చెప్పాలి. తెల్లవారాక చేయవలసిన పనుల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను.  
ఉదయమే లేచి కాశీ విశ్వనాధుని దర్శనం కోసం వెళ్ళాను. పెద్దగా రద్దీ లేదు. అందువలన దర్శనం త్వరగానే అయిపోయింది. విశ్శనాధుని మందిరానికి 4 వైపుల నుండి దారులున్నాయి. విశ్వనాధ దర్శనం చేసుకొని వెనుకవైపు నుండి బయటకు వచ్చిన నాకు ఒక పెద్ద నందీశ్వరుడు గుడిలోని విశ్వనాధుని చూడకుండా మరో వైపు చూస్తుండటం కనిపించింది. కాని నందీశ్వరుడు అలా మరో వైపు చూడటానికి ఒక కారణం వుంది.

నందీశ్వరుడు చూస్తున్న చోట ఒక మసీదు దాని ఎదురుగా శిథిలమైన ఆలయం కనిపిస్తుంది. అసలు కాశీ విశ్వనాధుడు అక్కడే వుండేవాడు. కాని భారతదేశంపై జరిగిన ఇతర మతాల దాడులలో ఆ శివాలయం శిథిలమైంది. ఇతర మతస్థులు దాడి చేయడానికి ముందే కొందరు భక్తులు విశ్వనాధున్ని ఆలయం నుండి తొలగించి ప్రక్కనే వున్న బావిలో పడవేసారు. అలా ఆ శివలింగం ఇప్పటికీ బావిలోనే వుంది. ఆ బావినే “జ్ఞానవ్యాపి” అంటారు. భక్తులకు ఆ బావిలోని నీటినే ప్రసాదంగా ఇస్తారు.

ఇప్పుడు ఉన్న విశ్వనాధ మందిరం 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యబాయి కట్టించినది. ఇప్పుడున్న శివలింగ ప్రతిష్ఠాపన కూడా అప్పుడే జరిగింది. ఆ నందీశ్వరుని ప్రక్కన నిలబడి లేని కోవెలకి, బావిలో వున్న భగవంతునికి నమస్కారం పెట్టుకుని, ఆ బావినీరు త్రాగి బయటకు వచ్చేశాను. 

మహాత్ములు ఎక్కడ దొరుకుతారు వారిని ఎలా వెతకాలి అని ఆలోచిస్తున్న నేను ఆలయ దర్శనం ఎక్కువ సమయం చేసుకోలేదు 10ని.,లలో బయటకు వచ్చేసాను. ఆలయం లోపలికి నేను వెళ్ళేటప్పుడు చూసిన సెక్యూరిటీ గార్డ్స్ నేను అంత తొందరగా బయటకు రావడం చూసి ఎక్కడెక్కడి నుండో భగవంతుని దర్శనం కోసం వస్తారు కాని భగవంతుని కోసం ఎక్కువ సమయం పెట్టలేరు. ఆలయం ఎంతో ఖాళీగా వుంది అయినా ఈ అమ్మాయి భగవంతుని కోసం సమయం కేటాయించలేకపోతుంది. ఎంత తొందర అందరికీ అంటూ హిందీలో మాట్లాడుకోసాగారు. నేను ఆ మాటలు వినీ విననట్టు ఆ ప్రదేశం నుండి బయటకు రాసాగాను.

ఎటువైపు చూసినా ఆలయం 4 దిక్కులు పూర్తిగా పోలీస్ సెక్యూరిటీ వుండటం చూస్తే కొంచెం ఆశ్చర్యంగాను, కొంచెం హాస్యంగాను అనిపించింది. మన కంటికి కనిపించే ఈ భూలోకమే కాకుండా ఇంకా ఎన్నో స్థూల, సూక్ష్మ లోకాలకు అధిపతి. ఆయనే మనల్ని కాపాడుతుంటాడు అని మనం చెప్పుకునే భగవంతునికి పోలీస్ సెక్యూరిటీ. 24 గం,,లు తుపాకుల పహారా. ఇదేనేమో కలికాలం అంటే.

మనకు కష్టం రాగానే భగవంతుడు గుర్తుకు వస్తాడు. మనకు వచ్చిన ఎలాంటి పెద్ద సమస్య అయినా చిటికెలో ఆయన పరిష్కారం ఇవ్వగలడు అని నమ్ముతాం. చనిపోయే ముందు ఆయన నామం చేస్తూ చనిపోతే పునర్జన్మ వుండదని నమ్ముతాం.
మనకు ఏదైనా ఇవ్వగలిగిన భగవంతునికి మళ్ళీ మన నుండే ప్రమాదం అందుకే మన వల్ల ఆయనకు ఏమీ కాకుండా తుపాకులు. మనం ఎలాంటి పరిస్థితులలో వున్నామో ఇది చూస్తేనే తెలుస్తుంది. అయినా తప్పదు చెప్పాకదా కలికాలం.

అక్కడి నుండి బయలుదేరి నేను మణికర్ణికాఘాట్‌కు నడవటం మొదలు పెట్టాను. కనిపించిన వారినల్లా దారి అడుగుతూ వెళ్తున్నాను. వీధులన్నీ చాలా ఇరుకుగా అస్తవ్యస్తంగా వున్నాయి. మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఎదురవుతుంటే నాకు కొంచెం వింతగానే అనిపించింది. ప్రతీసారి వాటిని దాటి ముందుకు వెళ్ళడం ఒక పరిక్షగానే వుంది.

ఏమిటో దారులన్నీ తికమకగా అనిపిస్తున్నాయి. నాకు ఈ వీధులన్నీ చూస్తుంటే నేను కాశీలో వుండబోయే ఈ నెల రోజులలో ఎన్నిసార్లు దారి తప్పిపోతానో అనిపించింది. కాని తప్పదు అలవాటవుతుంది అని నాకు నేను చెప్పుకొని ముందుకు వెళుతున్న నాకు ఒక దగ్గర కట్టెలు అమ్ముతున్న దుకాణాలు చాలా కనిపించాయి. చాలా పెద్ద కట్టెల దుకాణాలు అవి. 

ఎందుకు ఇక్కడ ఇంతగా కట్టెలు అమ్ముతున్నారు అని కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామని ఆ కట్టెల దుకాణాల మధ్యగా వెళ్ళిన నాకు ఒక రకమైన వాసనలతో పొగలు వస్తుండటం కనిపించింది. ఏమి జరుగుతుంది అక్కడ అని ఇంకాస్త ముందుకు
వెళ్తుంటే అకస్మాత్తుగా నా ప్రక్క నుండి ఒక గుంపు “రామ్ నామ్ సత్యహై” అంటూ కేకలు వేస్తూ ఒక శవాన్ని తీసుకు వెళ్తూ కనిపించారు. నాకు అర్ధమైంది, అదే మణికర్ణికాఘాట్ అని. చనిపోయిన వారి చెవిలో ఇక్కడ శివుడు మహామంత్రాన్ని ఉచ్ఛరించి ముక్తిని ప్రసాదిస్తాడని వారికి మళ్ళీ జన్మ వుండదని ప్రసిధ్ధి. అందుకే చాలా మంది చనిపోయాక వారి దేహానికి అంత్యక్రియలు ఇక్కడ జరగాలని కోరుకుంటారు. మరికొందరు అంత్య దశలో వచ్చి కాశీలో జీవించి ఇక్కడే మరణిస్తారు. దాన్నే కాశీ వాసం అంటారు. ఇప్పుడంటే రవాణా వ్యవస్థ పెరిగింది కాని ఒకప్పుడు కాశీకి వెళ్ళడమంటే మళ్ళీ తిరిగి రాకపోవడమే. చాలా మంది తమ అంత్యదశలో కాశీకి వెళ్ళి స్థిరపడిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు ఎవరైనా ఎప్పుడైనా కాశీ దర్శనం చేసుకోవచ్చు.

ఇంతకీ ఈ ఘాట్‌కి మణికర్ణికాఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ మణికర్ణికాఘాట్ పైన ఒక కుండ్ వుంది. కుండ్ అంటే కొలను, దీన్నీ మణికర్ణికా కుండ్ అంటారు. 10,000 సం,,ల క్రితం విష్ణువు, శంకర భగవానుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సు చేసాడు. తన చక్రంతో కుండం తవ్వాడు ప్రసన్నుడైన శంకరుడు ఆ కుండంలో స్నానం చేస్తూ ఆనందంగా తల విదిలించే సమయంలో శంకరుని చెవికి వున్న ఒక చెవిపోగు ఆ కుండంలో పడిపోయింది. అప్పటి నుండి ఆ కుండం మణికర్ణికాకుండ్ అయింది. ఆ ఘాట్ మణికర్ణికాఘాట్ అయింది.

Episode: 06

ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ కుండంలోకి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. హిమాలయాల నుండి గుప్త మార్గంలో వస్తాయని భక్తుల నమ్మకం. నిజంగా ఆ కుండం పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంది. అక్కడ స్నానం చేసి ఆ తడి బట్టలు అక్కడే వదిలి వేస్తే రోగాలు, పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. దాన్ని నిజం చేస్తూ అక్కడ చాలా మంది స్నానం చేస్తూ వుండటం, కొలను మెట్ల వద్ద రకరకాల బట్టలు కుప్పలుగా పడివుండటం కనిపించింది.

ఆ కుండంకి ఎదురుగా ఒక శివాలయం గంగా నదిలో కొంత మునిగి పోయి వుంది. అలా ఎందుకు వుందో అర్ధం కాలేదు. అక్కడ నిలబడి ఆ గుడిని చూస్తున్న నాకు మేడమ్ బోట్ ఎక్కుతారా అంటూ ఒకరు పలకరించడం కనిపించింది. నాకు అతనితో మాటలు కలిపి కొన్ని విషయాలు అడుగుదామనిపించింది.

ఇప్పుడే నేను బోట్ ఎక్కను, నేను ఇక్కడ ఇంకా కొన్ని రోజులు వుండబోతున్నానని చెప్పాను. నేను ఆ నీటిలో వున్న గుడిని గురించి అతనిని అడిగాను. ఒక కొడుకు తన తల్లి జ్ఞాపకార్ధం ఆ గుడి కట్టించాడని, కానీ ఆ తల్లి శాపం వల్లే అది అలా నీళ్ళల్లో వుందని చెప్పాడు. 

అంతేకాదు గుడి చూశారా ఒక వైపుకి ఎలా ఒరిగి వుందో అన్నాడు. నిజమే ఒక వైపు ఒరిగిపోయి వుంది. ఎవరా తల్లికొడుకులు ఏమిటా కథ అని అడిగాను. ఆ వివరాలు తనకు పూర్తిగా తెలియవని పెద్దవాళ్ళ ద్వారా వినడం వలన ఈ కొంత మాత్రమే తెలుసని చెప్పాడు. ఆ గుడి పని నైపుణ్యం, అందం చూస్తే ముచ్చటేసింది.

ఆ పడవ అతనికి నన్ను నేను పరిచయం చేసుకొని సాధువులు, మహాత్ముల కోసం వెతుకుతున్నానని తనకు ఎవరి గురించైనా తెలిస్తే చెప్పమని అడిగాను. నేను పడవ ఎక్కుతాను అనుకొని నా దగ్గరకి వచ్చిన అతను నా మాటలు వినగానే కొంత నిరుత్సాహ పడ్డాడు. ఒకసారి చుట్టూ చూసాడు పెద్దగా యాత్రికులు లేరు, బేరాలు లేవు. ఏమనుకున్నాడో కాని సరే అంటూ మెట్లమీద కూర్చున్నాడు. నేను అతని ఎదురుగా కూర్చున్నాను. చూస్తే అబ్బాయి వయస్సు పెద్దగా వుంటుందని పించలేదు. 22 లేక 23 సం,, లు వుండి ఛామనఛాయ రంగులో కాస్త బొద్దుగా వున్నాడు. ఏమి వివరాలు కావాలి మీకు అని అడిగాడు.

నేను : ముందుగా నీ వివరాలు చెప్పు.    
                        
సంజయ్ : నా పేరు సంజయ్, 10వ తరగతి వరకు చదువుకున్నాను. మణికర్ణికాఘాట్ పైనే మా ఇల్లు.

నేను : ఎందుకు పెద్దగా చదువుకోలేదు? 

సంజయ్ : నాకు చదువు అంటే ఇష్టం లేదు, నాకు గంగమ్మ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆమె దగ్గరే వుండాలనిపించేది. అందుకే బడికి వెళ్ళేవాడిని కాదు తర్వాత పూర్తిగా మానేసాను. ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ఇంట్లో వుండను. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాని ఎక్కువ సమయం ఇంట్లో ఉండాలనిపించదు. ఇంట్లో వుంటే అశాంతిగా అనిపిస్తుంది అందుకే తినడానికి మాత్రమే ఇంటికి వెళతాను. మిగిలిన సమయం అంతా ఇక్కడే వుంటాను. నిద్రపోవడం కూడా పడవలోనే.

నేను : నువ్వు పూర్తి సమయం ఇక్కడే ఉంటాను అంటున్నావు కదా. ఇక్కడెవరైనా మహాత్ములు తెలుసా? నువ్వు అలాంటి వారిని ఎవరినైనా చూసావా?

సంజయ్ : కుంభమేళా లాంటి సమయాల్లో చాలా మంది యోగులు, మహాత్ములు వస్తారు. మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా ఎవరో ఒకరు వస్తుంటారు. కాని వారిలో ఎవరు మహాత్ములో ఎవరు కాదో గుర్తించడం కష్టం.

నువ్వు అలాంటి వారిని ఎవరినైనా చూసావా అని అడిగాను. అప్పుడు సంజయ్ ఒక వింతయైన విషయం చెప్పాడు. 3సం,, ల క్రితం ఒక మధ్య వయస్కుడు అతని భార్యతో కలిసి వచ్చాడు. ఈ ఘాట్ దగ్గరే నాకు పరిచయం అయ్యాడు. అతను నాతో చెప్పాడు నేను కొన్ని పూజలు చేసి ఒక చనిపోయిన మనిషితో మాట్లాడించగలను.

కాని ఆ పూజ కోసం నాకు ఒక మనిషి పుర్రె కావాలి అని అడిగాడు. ఇదేదో చాలా అద్భుతం జరిగేలా ఉంది చూద్దాం అనుకున్నాను. అతనికి కావలసిన పుర్రె తెచ్చిస్తానని, కాని ఆ పుర్రె మాట్లాడటం నేను చూడాలని చెప్పాను. అలాగే కాని అది మాట్లాడినప్పుడు సారాయి , మాంసము వంటివి అడుగుతుంది. అవి కూడా సిధ్ధం చేసుకో అని చెప్పాడు.

గంగానది అవతలివైపు కొట్టుకుపోయిన శవాల పుర్రెలు దొరుకుతాయి ఒకటి తెచ్చి ఆయనకు ఇచ్చాను. రెండు, మూడు రోజులు అది పెట్టుకుని చాలా పూజలు చేశాడు. చివరి రోజు నాతో, రేపు నీతో పుర్రెను మాట్లాడిస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు నేను చాలా ఉత్సాహంగా పుర్రె కోసం అతను చెప్పిన సారాయి, మాంసం తీసుకొని వెళ్ళాను. కాని అతను అక్కడ లేడు బెనారస్ వదలి వెళ్ళిపోయాడని తెలిసింది, చాలా నిరుత్సాహం కలిగింది. అతను ఏదైనా మంత్రవేత్తో మరి ఏమిటో నాకు అర్ధం కాలేదు. అందుకే అప్పటి నుండి ఎవరైనా అద్భుతాలు చేస్తానంటే నమ్మాలనిపించదు.


 నిజంగా వాళ్ళు అవి చేయలేరు. ఏదో చేస్తాం అంటూ బిరాలు పలుకుతారు, ఎవరైనా ధైర్యంగా చూడటానికి ముందుకు వస్తే తోక ముడుస్తారు. అయినా నాకు ఎందుకో ఈ రోజుల్లో అద్భుత వ్యక్తులు వుంటారు అంటే నమ్మాలనిపించదు. ఒకప్పుడు వుండేవారేమో కాని ఇప్పుడు డబ్బుల మహాత్ములే అందరూ.

Episode - 7

సంజయ్ అనుభవం నన్ను ఆలోచింప చేసింది. ఆయనెవరో కాని ఆయన చేసుకునే పూజలకు అవసరమైన పుర్రెలు తెప్పించుకోవడానికి సంజయ్‌కి అద్భుతం చూపిస్తానని అబధ్ధం చెప్పి ఆయనకు కావలసిన పుర్రెలు తెప్పించుకున్నాడనిపించింది. ఉత్సాహం వున్న కుర్రవాడు కావడం వలన సంజయ్ ఆయన మాటలు నమ్మేశాడు. పుర్రెలతో ఆయన ఎలాంటి పూజలు చేసుంటాడో నాకు అర్ధం కాలేదు. అవి ఆధ్యాత్మికతకు సంబంధించినవా లేక క్షుద్రకు సంబందించినవా? ఏమైనా ఇపుడు నాకు అది తెలుసుకోలేని ఒక మిస్టరీయే.

ఇప్పుడు బెనారస్‌లో వున్న మహాత్ములు ఎవరైనా తెలుసా అని అడిగాను. అపుడు సంజయ్ మేము కూర్చున్న దానికి కాస్త ప్రక్కనే వున్న ఒక చిన్న మందిరం చూపించాడు. అది దత్త పాదుక మందిరం. అది ఇంతకు ముందు ఒక సాధువు సంరక్షణలో వుండేది. అప్పుడు అది పెద్దగా బాగుండేది కాదు కాని 3సం,, ల క్రితం ఇక్కడికి ఒక నాగా సాధువు వచ్చాడు. ఆయనే ఇప్పుడు ఆ మందిరం బాగోగులు చూస్తున్నాడు. ఆయన అదిగో అక్కడ వుంటారు అంటూ ఆ మందిరంకి కొంచెం దూరంలో వున్న కుటీరం చూపించాడు.

ఆయన పేరు సత్యానంద్. ఆయన ఎవరితోను ఎక్కువగా కలవరు, ఎక్కువగా మాట్లాడరు, డబ్బుల కోసం ఎవరినీ పీడించడము చూడలేదు. అడపాదడపా వచ్చే దక్షిణలతోనే ఈ గుడికి రంగు వేయించాడు, గుడి బాగుచేయించాడు. మీకు ఆసక్తి వుంటే ఆయనను కలవండి అన్నాడు. వెంటనే సంజయ్ కి ధన్యవాదాలు తెలిపి నేను ఆ కుటీరం దగ్గరికి వెళ్ళాను.

కుటీరం ప్రహరీ తడికలతో వుంది. గేట్‌లా వాడబడుతున్న తడికను ప్రక్కకు జరిపి మెల్లిగా లోపలికి వెళ్ళాను. నాకు కుడివైపు ప్రదేశం ఖాళీగా వుంది. మూడు వైపులు మూసి వుండి ఒక వైపు తెరచివున్న కుటీరం అది. అక్కడ ధుని వుంది. ధుని ఎదురుగా 50 సం,, ల వ్యక్తి కాషాయ పంచె ధరించి వున్నాడు.

ఆయన జుట్టు జడలు కట్టి వుంది, దేహం ఆకర్షణీయమైన రంగులో దేదీప్యమానంగా అనిపించింది. కళ్ళు ప్రశాంతంగా సూటిగా వున్నాయి. నన్ను చూడగానే లోపలికి రమ్మని సైగ చేసారు. మెల్లిగా వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ధునికి ప్రక్కగా కూర్చున్నాను.

అక్కడ ఇంకో వ్యక్తి కూడా వున్నాడు. 40 సం,, ల వయస్సు వుండొచ్చు. చిన్న గడ్డంతో సాధారణంగా అనిపించాడు. అతను కూడా కాషాయ వస్త్రాలే ధరించి వున్నాడు. నేను వెళ్ళి కూర్చోగానే అతను లేచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను బాబాజీయే మిగిలాము. నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు బాబాజీ. 

నేను నా వివరాలు చెప్పి, శివరాత్రి కోసం వచ్చానని చాలా సమయం ఉంది కాబట్టి మహాత్ములను దర్శిస్తున్నానని చెప్పాను. కాశీ సాధువులతో నిండి వుంది, నీకు ఇక్కడ ఎంతో మంది సాధువులు కనిపిస్తారు, అందరినీ కలువు, మాట్లాడు. అపుడు కూడా నీకు ఎలాంటి సంతృప్తి కలగకపోతే చివరిగా నన్ను కలువు అన్నారు.

ఆయన నా కోసం టీ తెప్పించాలనుకున్నారు. కాని తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతుంటే నేను పరవాలేదన్నాను. మరొకసారి ఆయనకు నమస్కరించి బయటకు వచ్చాను. నాకు ఆయన సన్నిధి చాలా ప్రశాంతంగా అనిపించింది. 

ఆయన నాతో మాట్లాడుతున్నపుడు నా వైపు చూడకుండా క్రిందికి చూడటం గమనించాను. నాకు అర్ధమైంది నేను అమ్మాయిని కదా అందుకే నన్ను చూడటం లేదని. నాగా సాధువులు , సన్యాసులు నాగా దీక్ష తీసుకొనే సమయంలో వారి గురువులు కొన్ని క్రతువులు ఆచరించి వీరి లింగంని విరగగొడతారు. అప్పటి నుండి వీరు ఆ సాంప్రదాయాన్ని అనుసరించి సాధనలు చేస్తారు. శరీరం అంతా విభూతి ధరిస్తారు. వీరు నగ్న సాధువులు కాని కొన్ని సార్లు జనంలోకి వచ్చినపుడు వీలైనంత వరకు మాములుగా వుండటానికి ప్రయత్నిస్తారు. వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు నేను కలిసిన సత్యానంద్ బాబాజీ కూడా ఆ సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తియే.

అక్కడి నుండి బయటకు వచ్చి మణికర్ణికాఘాట్ వద్ద శవ దహనాలు జరిగే చోటికి వచ్చాను. అక్కడ ఒక శివ మందిరం కనిపించింది. అది కొంచెం భూమిలోకి వుంది. లోపలికి ఒకసారి తొంగి చూశాను. అక్కడ ఎవరూ లేరు మెట్లు దిగుతూ క్రిందికి వచ్చాను. అంతకు ముందే అక్కడ కొన్ని శవాలు కాలుతున్నాయి. కొన్నింటిని అప్పుడే తీసుకొచ్చారు. కాటి కాపరులు ఆ శవాలను తీసుకెళ్ళి గంగానదిలో ముంచి తీస్తున్నారు తరువాత దహనం చేస్తున్నారు. నాకు అక్కడ ఎక్కువ సమయం నిలబడాలనిపించలేదు. ఎందుకంటే పొగలు ఎక్కువగా వున్నాయి. అందుకే కాస్త దూరంగా నిలబడి చూస్తున్నాను.

నాకు కాస్త దూరంలో ఒక పాశ్చాత్య జంట నిలబడి వుంది. ఇంతలో ఒక ముసలతను ఆ పాశ్చాత్యుల జంట దగ్గరికి వెళ్ళి వచ్చీరాని ఇంగ్లీష్‌లో వాళ్ళకి అక్కడి తతంగం గురించి చెప్పడానికి ప్రయత్నించాడు. వారు వినకుండా దూరంగా వెళ్ళమన్నారు. అతను నా వైపు వచ్చి నిలబడ్డాడు. నాకు కూడా హిందీ రాదు అనుకొని నాకు ఇంగ్లీష్‌లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ జరిగేది ఏమిటో తెలుసా you die u burn here. నువ్వు చనిపోతే ఇక్కడే కాల్చుతారు అని. అది వినగానే నేను ఎంతో నవ్వుకున్నాను. ఒక వైపు అతని వచ్చీరాని ఇంగ్లీష్ మరోవైపు నాకు అర్ధం అయ్యేలా చెప్పడం కోసం ఉదాహరణగా నన్నే చంపేయడం. నవ్వుకొని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాను. 

మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను కాశీ రావడానికి ముందు కాశీ విషయాలు తెలుసుకుంటున్నపుడు నాకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. కాశీలో గంగ ఒడ్డున ఉన్న 84 ఘాట్లలో 3 ఘాట్ లు ముఖ్యమైనవి. మొదటిది దశాశ్వమేధఘాట్. ఈ ఘాట్ విశ్వనాధ మందిరంకి దగ్గరగా వుంటుంది. ఇక్కడే రోజు సాయంత్రం విశిష్ట గంగా ఆరతి జరుగుతుంది.

ఇక మిగిలినవి మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లు. ఈ రెండు ఘాట్‌లలోను దేశవిదేశాల నుండి వచ్చిన శవాలకు దహన క్రియలు జరుగుతాయి. కాని కొన్ని విధాలుగా చనిపోయిన వారికి అక్కడ అంత్య క్రియలు జరగవు. వారు
  1. సాధువులు
    2. 10సం,,ల లోపు వయస్సు వారు
  3. పాము కరవడం వలన మరణించిన వారు
  4. కుష్ఠురోగులు
  5. గర్భవతులైన స్త్రీలు.

Episode - 8

పై విధంగా చనిపోయిన వారిని వీరు దహనం చేయరు. వారి శవాన్ని ఒక రాయికి కట్టి పడవలో నది మధ్యకు తీసుకువెళ్ళి అక్కడ పడవేస్తారు. నీటిలో పడేసాక కొన్నిసార్లు రాయి నుండి శవం విడిపోయి కొట్టుకు పోవడం జరుగుతుంది. అలా ఎప్పుడైనా అవి అవతలి ఒడ్డుకు కొట్టుకుపోతే అవి కుక్కలకి ఆహారంగా మారుతాయి. అందుకే గంగానదికి ఆ వైపు ఎముకలు కనిపిస్తాయి.

చిన్న పిల్లలను జ్ఞానశూన్యులుగా భావిస్తారు. పాము శంకరభగవానుని ఆభరణం. కుష్ఠుని భగవంతుని చిహ్నంగా భావిస్తారు. గర్భిణి  స్త్రీల గర్భంలో మరొక జీవం వుంటుంది, సాధువులను భగవంతుని ప్రతి రూపంగా చూస్తారు. ఇలా రకరకాల కారణాల వలన పైన చెప్పబడిన 5 విధాల మరణించినవారిని నదిలో వదిలివేస్తారు.

మధ్యాహ్నభోజనం చేసి అలా తిరుగుతూ ఘాట్‌లు చూడటం మొదలు పెట్టాను. ఇక్కడ వాతావరణం చిత్రంగా వుంది రాత్రి సమయంలో గడ్డ కట్టుకు పోయే చలి పగలు కాల్చివేస్తున్న వేడి తీవ్రత. ఆ రోజు సాయంత్రం దశాశ్వమేధఘాట్‌లో జరిగే ఆరతి చూడాలనుకున్నాను. కాని నా వసతి విషయంలో వచ్చిన చిన్న ఇబ్బంది వలన వెళ్ళలేకపోయాను.

రాత్రి 7 గం,, ల ప్రాంతంలో రాణామహల్ ఘాట్ వద్ద కూర్చుని నది అందాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను.

ముందు రోజే పౌర్ణమి అవ్వడం వలన చంద్రుడు నిండుగా వున్నాడు. నాకు దగ్గరలో ముగ్గురు పాశ్చాత్యులు కూర్చుని వున్నారు. ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు. ఆ వ్యక్తి వయోలిన్ వాయించడం మొదలుపెట్టాడు. నిజంగా చాలా బాగా వాయిస్తున్నాడు. ప్రశాంతమైన సమయంలో చల్లని వెన్నెలరాత్రి ఆ సంగీతం మనసుకి మరింత ప్రశాంతతను కలిగించింది.

అంతలో నదిలో ఒక్కసారిగా హడావిడి మొదలయ్యింది. జనాలతో నిండి వున్న పడవలు రాసాగాయి. విశిష్టమైన గంగాహారతిని కొందరు ఘాట్‌ల మీద కూర్చుని చూస్తే, మరికొందరు పడవలలో వుండి చూసి ఆనందిస్తారు.

ఆ పడవలే హారతి అయిపోగానే వారిని తమ తమ స్థానాలలో దించడానికి కదులుతున్నాయి. ఆ రోజు చాలా పడవలే వున్నాయి. ఆ కోలాహలం అయిపోగానే మళ్ళీ ఘాట్లన్నీ నిశ్శబ్ధం అయిపోయాయి. అక్కడక్కడ పాశ్చాత్యులు, పడవల వాళ్ళు తప్ప మిగిలిన యాత్రికులు వెళ్ళిపోయారు. మొదటి రోజు కదా ఘాట్‌ల మీద పరిస్థితులు తెలియకుండా రాత్రి ఎక్కువ సమయం నేను అక్కడ గడపదల్చుకోలేదు. అతి కష్టంగా ఆ ప్రశాంత వాతావరణాన్ని వదిలివేసి నా వసతికి వచ్చేశాను. ఈ విధంగా నా మొదటి రోజు అంత ఉత్సాహంగా కాకపోయినా నిరుత్సాహంగా కూడా లేదనే చెప్పాలి.

ఉదయం 6 గం,, ల ప్రాంతంలో ఘాట్‌ల మీదకి వచ్చాను. చలి చాలా ఎక్కువగా వుంది. పొగ మంచులో గంగానది అద్భుతంగా వుంది. ఇపుడు నా ముందు వున్న సమస్య మహాత్ములని ఎక్కడ వెతకాలి అని. ఏమీ అర్థం కావడం లేదు ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఆలోచిస్తూ కేధార్‌ఘాట్ దగ్గర నిలబడిన నాకు కుడివైపు కొంచెం దూరంలో పొగలు వస్తుండటం కనిపించింది. అది మరేంటో కాదు హరిశ్చంద్ర ఘాట్. నేను చెప్పాను కదా మీకు ముందే శవదహనక్రియలు జరిగే రెండవ ఘాట్ ఇది. ఈ ఘాట్‌కి ఆ పేరు రావడం వెనుక ఒక కథ వుంది. సత్యవాది అయిన హరిశ్చంద్రుని కథ మనం విననిది ఏమీకాదు.

సత్యయుగంలో అయోధ్యను పాలించిన రాజులలో పేరుగాంచిన వాడు రాజా హరిశ్చంద్రుడు. సత్యవాదిగా ఆయనకు పేరు ఉండేది. ఎంత కష్టమైనా ఇచ్చిన మాటను నిలబెట్టు కునేవాడు. ఎలాంటి పరిస్థితులలోను అబద్దం చెప్పేవాడు కాదు. 

ఒకసారి దేవతలు హరిశ్చంద్రుని సత్యనిష్ఠను పరీక్షించాలనుకున్నారు. అందుకు విశ్వామిత్ర మహర్షి సహాయం కోరారు. ఒకసారి హరిశ్చంద్రుడు వేటకోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి స్త్రీ ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినిపించిన వైపు వెతుకుతూ వెళ్ళిన హరిశ్చంద్రుడు ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఆశ్రమం విశ్వామిత్రునిది.

హరిశ్చంద్రుని రాక వలన విశ్వామిత్రునికి ధ్యానభంగం కలిగింది. అందుకు కారణమైన హరిశ్చంద్రుని మీద కోపం వచ్చింది. విశ్వామిత్రుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం హరిశ్చంద్రుడు తన మొత్తం రాజ్యాన్ని దక్షిణగా ఇస్తానన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాజ్యమే కాక దక్షిణగా ఇంకా కొంత ధనం కావాలన్నాడు.

రాజ్యం ఇచ్చివేశాక హరిశ్చంద్రుని దగ్గర ధనం వుండదు. కాబట్టి దక్షిణ ఇవ్వడం కోసం ఒక నెల గడువు అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.

హరిశ్చంద్రుడు అయోధ్యను వదిలి భార్య, కొడుకుతో కలిసి కాశీ నగరం చేరాడు. డబ్బు సంపాదించలేదు కాని గడువు పూర్తి కావస్తుంది. దానితో భార్యను ఒక బ్రాహ్మణుడికి బానిసగా అమ్మివేస్తాడు. అయినా వచ్చిన డబ్బు విశ్వామిత్రునికి దక్షిణగా సరిపోదు. అలాంటి సమయంలో వేలం పాటలో రాజా హరిశ్చంద్రుడిని ఒక కల్లూధామ్ కొనుక్కున్నాడు. కల్లూధామ్ అంటే కాటి కాపరి అని అర్ధం.

ఆయనకు చెందిన ఘాట్ స్మశానంలో కాటి కాపరిగా పనిచేసేవాడు. అలా హరిశ్చంద్రుడు ఆ ఘాట్ వద్ద కాటికాపరిగా వుండటం వలన తరువాతి కాలంలో అది హరశ్చంద్ర ఘాట్‌గా ప్రసిధ్ధి చెందింది.

Episode - 9

నేను హరిశ్చంద్రఘాట్ వద్దకు వెళ్ళి నిలబడ్డాను. ఉదయాన్నే కావడం వలన అప్పుడే శవ దహనాలకి ఏర్పాట్లు మొదలవుతున్నాయి. రెండు మూడు శవాలు, వారి బంధు జనం ఉన్నారు. మరేమిలేదు ఈ ఘాట్ వద్దకు రావడంలో నాకు ఒక ఉద్దేశ్యం వుంది.

అఘోరా ఈ పేరు మీలో కొందరైనా వినే ఉంటారనుకుంటున్నాను. ఇది ఒక సంప్రదాయం. స్మశానంలో పూజలు చేస్తారని, సగం కాల్చి గంగలో పారేసిన శవాలను ఆహారంగా తీసుకుంటారని వీరి గురించి వినికిడి. అందుకే సామాన్యజనం ఆ పేరు వింటేనే భయపడతారు. నేను కాశీ ప్రయాణం అనుకున్నప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు ఇచ్చిన సలహాలలో ముఖ్యమైనది ఇదే. రాత్రి సమయంలో అఘోరాలు మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌ల వద్దకి వచ్చి పూజలు చేస్తారని ఆ సమయంలో అక్కడికి వెళ్ళొద్దని. అందుకే అలాంటి సమాచారం ఏమైనా దొరుకుతుందేమోననే ఈ ఘాట్ వద్దకి వచ్చాను.

ఎవరిని పలకరిద్దామా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఉదయమే కావడం వలన తక్కువ మంది కాటి కాపరులు వున్నారు. వాళ్ళు పనిలో వున్నారు. నిలబడి ఆ కార్యక్రమాలు చూస్తున్న నా దగ్గరికి ఒక 60 సం,, లు పైబడిన వ్యక్తి వచ్చాడు. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అని పలకరించాడు. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నేరుగా అఘోరాల గురించి అడిగితే అతను చెప్పక పోవచ్చుఅనిపించింది. ముందు అతనితో పరిచయం చేసుకుందామనిపించింది. అతని వివరాలు అడిగాను. హరిశ్చంద్రఘాట్ కాటి కాపరుల పెద్దనని , తనపేరు రాజాచౌదరి అని చెప్పాడు. ఇది వినగానే నాకు సరైన వ్యక్తే దొరికాడు అనుకున్నాను.

నేను : మీ గురించి చెప్పండి.
చౌదరి : మాది కుల్లుడోమ్ వంశం. నేను చిన్నప్పటి నుండి ఈ పనే చేస్తున్నాను
నేను : ఇక్కడ ఏం చేస్తారు మీరు?
చౌదరి : ఒక శవం వచ్చినపుడు దాన్ని గంగకు తాకించడం, నోట్లో అగ్ని పెట్టుకుని 5 సార్లు శవం చుట్టూ తిరిగి ఆ కర్మను చేయవలసిన వారికి ఆ నిప్పును అందిస్తాము. తరువాత ఆ బూడిదను పోగుచేసి అక్కడి నుండి తీసివేస్తాం. ఒక్కొక్క శవ దహనానికి 4000రూ,,ల నుండి 5000రూ,, ల వరకు అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు కట్టించిన ఎలక్ట్రిక్ విధానం వలన 700/- రూ,,లు ఖర్చు అవుతుంది. చాలా దూర ప్రాంతాల నుండి కూడా శవాలు తీసుకువస్తారు, కొందరు వాళ్ళు రాకుండా కొన్ని పద్ధతుల్లో శవాలను, డబ్బులను పంపుతారు. అలాంటి వాటి కర్మను మేమే పూర్తి చేస్తాము.

అంతలో నా దృష్టి, కాలుతున్న ఒక శవం దగ్గర మంట సరిగా రాకపోతే దానికి దగ్గరగా వంగి నోటితో ఊదుతూ అది సరిగా మండేలా ప్రయత్నిస్తున్న ఒక 10 సం,, ల పిల్లవాడి మీద పడింది. ఆ సన్నివేశం కొంచెం ఆశ్చర్యపరచింది. అంత చిన్నపిల్లవాడు అది ఒక సామాన్యమైన పనిలా చేయడం నేను జీర్ణించుకోలేక పోయాను. అదే విషయం రాజాచౌదరితో అన్నాను.

నేను : అంత చిన్నపిల్లలు ఈ పనులు చేస్తున్నారేంటి ? వారు బడికి వెళ్ళరా ? చదువుకోరా? (అది వినగానే ఆయన ముఖంలో కొంచెం మార్పు కనిపించింది.)
చౌదరి : మీరు ఏమనుకుంటున్నారు ఆ పని చేయడం అవమానం అనేనా? మీకు తెలుసా అది మాకు ఎంతో గౌరవప్రదమైన పని. నేను చిన్నప్పటి నుండి ఆ పనే చేస్తున్నాను. నా తోబుట్టువులు 8 మంది, మా సంతానం అంతా ఇదే పని చేస్తారు. మా వృత్తిని వదిలి మేము ఇంకొకరి దగ్గర ఎందుకు పని చేయాలి? చదువులు మాకు ఇంత గౌరవాన్ని ఇస్తాయా? ఎంత గొప్పవారైనా, ఎంత డబ్బు సంపాదించిన వారైనా, ఎంత చదువుకున్న వారైనా చివరికి ఇక్కడికే వస్తారు. మా చేతులమీదుగా బూడిద అవుతున్నారు. రోజూ ఈ నిజం చూస్తున్న మాకు మిగిలిన వాటి మీద ఆశ లేదు. మీరు చూసిన ఆ పిల్లవాడు నా మనవడే. ఆ పిల్లవాడిని అడగండి ఈ పని వదిలివేసి వేరే ఏమైనా చేస్తాడేమో? చేయడు ఎందుకంటే ఇది మా రక్తంలోనే వుంది. మేము
గంగమ్మని నమ్ముకొని బ్రతుకుతున్నాము. ఆమె తప్ప మాకు ఇంకేది సత్యం కాదు. భవిష్యత్తులో మీరు ఎక్కడ చనిపోయిన మీ కోరిక ఇదే కావచ్చు కాశీలో మీ శవసంస్కారం జరగాలని లేదా అస్థికలు ఇక్కడ కలవాలని కోరుకుంటారు మరి మేము ఇక్కడే పుట్టిపెరిగి ఎక్కడో బ్రతకాలని ఇంకేదో పనిచేయాలని ఎందుకు కోరుకుంటాము.

అతని మాటలు విన్నాక వారికి వారి వృత్తి పట్ల వున్న గౌరవం చూసి ముచ్చట వేసినా ఎందుకో చిన్నపిల్లలు ఆ పనిచేయడం నన్ను కదిలించిందనే చెప్పాలి. ఇక్కడ చెప్పుకోదగ్గ ఒక విశేషం గమనించారా? నాతో మాట్లాడేవారందరూ నాకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నన్నే చంపేయడం. వాళ్ళ ఉదాహరణకి ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. రాబోయే నా కాశీ రోజుల్లో నన్ను ఇంకెంత మంది చంపేస్తారో చూడాలి. సందర్భాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉందనిపించింది.

నేను : చౌదరి గారు ఈ ఘాట్ వద్ద రాత్రి సమయాల్లో మరియు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో అఘోరాలు వస్తారని విన్నాను. అది నిజమేనా? మీకు వాళ్ళు ఎవరైనా తెలుసా?

చౌదరి :  మీరు ఎవరు? అఘోరాలతో మీకేం పని?

నేను : నాకు వారితో ఏ పని లేదు నేను కేవలం వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే కలుద్దామని అనుకుంటున్నాను. 

చౌదరి :  (ఆశ్చర్యంగా) ఏమిటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒంటరిగా ఇంత దూరం వచ్చావా? ఒకప్పుడు నువ్వు విన్నట్టు అఘోరాలు కొంత వరకు కనిపించేవారు. కాని ఇప్పుడు పరిస్థితి అది కాదు. మారుతున్న పరిస్థితులను బట్టి వారు మారారు. ఇపుడు ఎక్కువ సంఖ్యలో అఘోరాలు కనిపించరు. ఉన్న కొంత మంది పీఠాలు, ఆశ్రమాలు ఏర్పరచుకొని ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కాబట్టి నీకు ఎవరూ దొరకకపోవచ్చు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.

Episode - 10

ఒక్కసారిగా నాకు నీరసం ఆవహించింది. పోనీ ఇంకెవరైనా సాధువులు మహాత్ములు తెలుసా అని అడిగాను. నిజమైన సాధువులు ఇప్పుడు ఎక్కడ వున్నారు? అంతా డబ్బుల కోసం సాధువుల బట్టలు ధరించి తిరిగేవారే. భిక్షాటన వారి వృత్తి అన్నాడు. ఇదేమిటి ఇలా అంటున్నాడు అని నేను అనుకుంటుండగానే మళ్ళీ ఒక్కసారీ వారి వృత్తి గొప్పతనం, వంశ చరిత్ర చెప్పుకుపోవడం మొదలుపెట్టాడు. సత్య హరిశ్చంద్రుడు కూడా తాము ఇప్పుడు చేసే పని చేసాడని ఆయనే తమ 
ఆదర్శం అని చెప్పుకుపోతున్నాడు.

చెబుతూ మధ్యలో అడిగాడు మీరు ఈ పుస్తకం ఎప్పటికి పూర్తి చేస్తారు? మీకు ఇంకా మా వివరాలు ఏమైనా కావాలన్నా, Photos కావాలన్నా ఇస్తాం అని అది వినగానే అర్థం అయింది అతను నాతో మాట్లాడటానికి ఎందుకు ఉత్సాహపడ్డాడో. అవసరం అయితే అడుగుతానని, త్వరలో పుస్తకం వస్తుందని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలాను.

అక్కడి నుండి అస్సీఘాట్ వైపు నడవడం మొదలుపెట్టాను. దారిలో ఒక ఘాట్ వద్ద డేరాతో వేసిన ఒక కుటీరం కనిపించింది. దాన్ని చూస్తూ ముందుకు వెళ్ళిపోయాను.

అస్సీఘాట్‌కి దగ్గరలో ఒక పడవతను పలకరించాడు. అతని పేరు అశోక్ అతను చలి నుండి రక్షణ కోసం ముఖానికి ముసుగు ధరించి వున్నాడు. నేను అతణ్ణి ఎవరైనా మహాత్ములు, సాధువుల గురించి నీకు తెలుసా? ఇక్కడెవరైనా అలాంటి వారున్నారా అని అడిగాను. అతను అలా ఎవరూలేరని వస్తే శివరాత్రికి వస్తారు అని చెప్పాడు. ఇంతకు ముందు నేను దారిలో చూసిన కుటీరం వైపు చూపించి అక్కడ ఒక బాబా వున్నాడని హిమాలయాల నుండి నిన్ననే వచ్చాడని చెప్పాడు. కాకపోతే జాగ్రత్తగా వుండమని ఎవరు ఎలాంటి వారో తెలియదు కదా అని చెప్పాడు. నేను మళ్ళీ వెనక్కి నడుస్తూ ఆ కుటీరం వద్దకు వచ్చాను. బయట ఒకతను కుటీరం ముందు స్థలాన్ని శుభ్రం చేస్తూ కనిపించాడు. నేను అతనితో బాబాజీ ఉన్నారా? అని అడిగాను. లేరు బయటకు వెళ్ళారని చెప్పాడు.

ఉత్తర భారతదేశంలో సాధువులను, మహాత్ములను బాబాలని పిలుస్తారు. మర్యాదపూర్వకంగా బాబాజీ అంటారు. ఆ సాధువు లేరని విన్నాక మళ్ళీ కాస్త సమయం తరువాత వద్దామని నేను కేధార్‌ఘాట్ వైపు నడవసాగాను. హరిశ్చంద్రఘాట్ వద్దకు రాగానే ఆ ఘాట్ వద్ద నున్న హరిశ్చంద్ర ఆలయం పూజారి నన్ను రమ్మని పిలిచాడు. నేను ఆలయం ముందుకి వెళ్ళి నిలబడ్డాను. ఆ పూజారి పెద్ద వయస్సువాడు కాదు. 30 సం,,ల వాడు.

నువ్వు ఎవరు, ఎందుకు కాశీ వచ్చావు, ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. నేను నా పేరు, వచ్చినచోటు చెప్పి మహాత్ములని వెతుకుతున్నానని చెప్పాను. అతను చాలా ఆవేశంగా ఏమిటి ఈ కాలంలో ఇంకా మహాత్ములు వున్నారా? సాధువుల వేషాలు వేసుకొని తిరిగే వీళ్ళంతా మోసగాళ్ళు అంటూ వారిని గూర్చి నానా దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. నాకు ఏమి చేయాలో పాలుబోలేదు. చచ్చినట్టు అతని ఉపన్యాసం వింటున్న నాకు, కాస్త దూరంలో కూర్చుని వున్న కొందరు వ్యక్తులు నన్ను చూస్తూ, వెళ్ళిపో అతని మాటలు వినకు అని సైగల ద్వారా తెలియచేయడం కనిపించింది. అప్పటివరకు అతను మట్లాడుతుంటే వెళ్ళిపోవడం అమర్యాదని మౌనంగా వింటున్న నాకు ఆ వ్యక్తులు అలా చెప్పగానే కొంచెం ముఖ్యమైన పని ఉందంటూ అతను పిలుస్తున్నా వినకుండా వచ్చేశాను.

ఇంకొంచెం ముందుకు నడవగానే ఒక దగ్గర గుంపుగా వున్న పడవల వాళ్ళు నా గురించి మాట్లాడుకోవడం వినిపించింది.  కాకపోతే వాళ్ళు భోజ్‌పురిలో మాట్లాడుతుండటం వలన ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు. వారిని పట్టించుకోకుండా నేను ముందుకు నడుస్తుంటే వారిలో ఒక వ్యక్తి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. 6 అడుగుల పొడవు, జులపాల లాంటి పొడవాటి అస్తవ్యస్తమైన జుట్టు, తలకి ముసుగు, కండలు తిరిగిన శరీరంతో వున్నాడు . వయస్సు 30 కి అటు ఇటుగా వుండొచ్చు. నా దారిలో అడ్డంగా నిలబడి మేడమ్ ఏం కావాలి ? ఎవరి కోసం వెతుకుతున్నారు అంటూ చాలా దురుసుగా అడిగాడు.

గుంపులోని మిగతా వారు చోద్యం చూస్తూన్నట్టుగా చూస్తున్నారు. అతను అడిగిన విధానానికి కొంచెం కలవరపడినా, అది బయటకు కనిపించనీయకుండా మహాత్ములకోసం, సాధువుల కోసం వెతుకుతున్నానని చెప్పాను. అతను వెంటనే నేను ఇంతకు ముందు ఏ కుటీరం దగ్గరికైతే వెళ్ళానో ఆ కుటీరం గురించి చెబుతూ ఆ బాబా మాహాత్ముడు ఆయనను కలవండి నేను చూపిస్తాను అన్నాడు. నేను అక్కడి నుండే వస్తున్నానని ఆయన బయటకు వెళ్ళారు కుటీరంలో లేరని చెప్పాను. ఆ వ్యక్తి నా మాట పట్టించుకోకుండా, లేదు మేడమ్ మీరు రండి నేను కలిపిస్తాను అంటూ కొంచెం బలవంతపెట్టడానికి ప్రయత్నించాడు.

అతని మొండితనం చూస్తే నా అనుమానం ఇంకా పెరిగిపోయింది ఎందుకంటే అశోక్ అనే వ్యక్తి ఆ బాబా గురించి చెబుతూ వెళ్ళండి కాని జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ఇతనేమో ఆ బాబా కుటీరంలోనే లేడని నేను చెబుతున్నా వినకుండా రమ్మని బలవంతపెడుతున్నాడు. నా అనుమానాన్ని,కంగారుని కనిపించనీయకుండా నాచేతి గడియారం వంక చూసుకుంటూ నాకిప్పుడు ముఖ్యమైన పని వుంది మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పాను. అతను పట్టుదలగా మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్నాడు. సాయంత్రం వస్తాను అని చెప్పాను. అలాగే తప్పకుండా రండి అని అన్నాడు. హమ్మయ్య అని వూపిరి పీల్చుకుని గబగబ ముందుకు వచ్చేశాను.

ఏమిటో నా ఈ రోజు అంత బాగా మొదలయినట్టు అనిపించలేదు. ఏమిటి ఇదంతా అనిపించింది. అక్కడి నుండి క్షమేశ్వర్ ఘాట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఈ ఘాట్ కేధార్ ఘాట్ మరియు మానస సరోవర్ ఘాట్‌ల మధ్య వుంటుంది. ఇక్కడ క్షమేశ్వరుణి రూపంలో శంకరభగవానుడు కొలువయ్యాడు. ఎవరైతే గంగలో స్నానం 
చేసి ఈ క్షమేశ్వరుని గుడిలో వారు చేసిన తప్పులకు, పాపాలకు క్షమాపణ అడుగుతారో వారికి క్షమ లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్షమేశ్వర మందిరం వలన ఈ ఘాట్ పేరు క్షమేశ్వర్‌ఘాట్ అయ్యింది. 

మందిరంను ఆనుకొని టీ దుకాణం వుంది అక్కడ నలుగురైదుగురు వ్యక్తులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు నావైపు చూస్తున్నారు. వాళ్ళని చూస్తే యాత్రికులలా లేరు, కాశీ వాసులే అనిపించింది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడనా వద్దా అని ఆలోచిస్తున్నాను. అంతలో ఒక వ్యక్తి ఆ గుంపులో నుండి లేచి నేను కూర్చున్న చోటికి వచ్చాడు.

Episode - 11

30సం,,ల వయస్సు వుండొచ్చు. ఛామనచాయ రంగులో పొడుగు కాకుండా బక్కపలచగా వున్నాడు. నాదగ్గరికి వచ్చి ఏమైంది మేడమ్ అలా వున్నారు అన్నాడు. అప్పుడు నా బుర్రలో తట్టింది, ఉదయం అస్సీఘాట్ దగ్గరలో కలిసిన అశోక్ ఇతనే అని. ఉదయం ముసుగులో చూశాను కదా గుర్తు పట్టలేకపోయాను. ఏమి లేదు అశోక్ నాకు ఇప్పటి వరకు ఒక్క సరైన బాబా కూడా కనిపించలేదు. అంతేకాకుండా ఇప్పడు హరిశ్చంద్రఘాట్‌కి దగ్గరలో ఒక కుటీరం చూశాను. ఆయనను కలుద్దాం అని వెళ్ళాను కాని ఆయన లేరు. ఈ బాబాలు ఎవరు ఎక్కడున్నారో, ఎక్కడ దొరుకుతారో అర్ధం కావడంలేదు అన్నాను. వెంటనే అశోక్ క్షమేశ్వర మందిరం వెనుక వున్న ఒక రాతి గుడి వైపు చూపించాడు.

దాని ముందుభాగం ఇనుప ఊచలతో తలుపులా వుంది. అది ఒక మందిరం అందులో ఒక బాబా వుంటాడు. అందరూ అతన్ని మౌనీబాబా అంటారు. ఆయన్ని కలవండి. అందరూ ఆయన్ని మహాత్మునిగా చూస్తారు అన్నాడు. అంతే అది వినగానే మళ్ళీ నాకు చాలా ఉత్సాహం కలిగింది.

వెంటనే లేచి ఆ మందిరం దగ్గరికి వెళ్ళాను నాతో పాటు అశోక్ కూడా వచ్చాడు. లోపల గది మధ్యగా శివలింగం వుంది. ఆ లింగం కుడి వైపు ధుని వుంది. ధుని ఎదురుగా 60 సం,, ల వృద్ధుడు కూర్చుని వున్నాడు. నన్ను చూసి లోపలికి రమ్మని సైగ చేశాడు. నేను,అశోక్ లోపలికి వెళ్ళి శివలింగానికి నమస్కరించి ఎడమవైపు కూర్చున్నాము. బయట నిలబడ్డప్పుడు కనిపించలేదు కాని లోపల ధునికి ఆ వైపు ఇంకో ఇద్దరు వ్యక్తులు వున్నారు. ఏదో ఆకుకూరని శుభ్రం చేస్తున్నారు వంటకోసం. అందులో ఒకతను 60సం,, ల వయస్సు వుండవచ్చు చాలా శుభ్రంగా, మర్యాదస్తునిగా వున్నాడు. మరొకతను పని అతను అనుకుంటా. నేను అలా గదిలా వున్న గుడిని పరిశీలిస్తుండగా మౌనీబాబా అశోక్‌కి నన్ను చూపించి ఎవరు అని అడిగారు.

అశోక్ ఆయనకు నా వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు. వారి సంభాషణ వింటున్న నాకు ఆశ్చర్యం కలిగింది. అశోక్‌కి మాత్రమే వినిపించేలా ఏమిటి అతను మౌనీబాబా అన్నావు, మరి అతను ఏమిటి గలగలా మాట్లాడుతున్నాడు మౌనంగా లేడేమిటి అని అడిగాను. అశోక్ మరింత మెల్లగా ఆయన ఒకప్పుడు మౌనంగా వుండేవారు ఇప్పుడు కాదు ఐనా అందరూ ఆయన్నీ మౌనీబాబాయే అంటారు అన్నాడు.

మాలో మేము మాట్లాడుకోవడం చూసిన మౌనీబాబా ఏమిటి విషయం అని అడిగాడు. అశోక్ వెంటనే ఈమె మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటుంది. కాని అడగడానికి సందేహిస్తుంది అన్నాడు. వెంటనే మౌనీబాబా ఎందుకు సంశయం ఏమి అడగాలనుకున్నావో అడుగు అన్నారు. ఆ సంభాషణ మీ ముందు పెడుతున్నాను.
నేను : బాబా మీ పేరు తెలుసుకోవచ్చా?
బాబా : నన్ను అందరూ మౌనీబాబా అంటారు.
నేను : ఈ పేరు కాదు ఇంతకు ముందు మీ పేరు?మీరు ఎలా బాబా అయ్యారు?ఎక్కడి నుండి వచ్చారు?ఎప్పుడు వచ్చారు?
బాబా : నేను బాబాని. ఇప్పుడు నాగతం గురించి అనవసరం (కోపాన్ని ఆపుకోవడం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది).
నేను :క్షమించండి బాబా.
బాబా: ఇంకా ఏమైనా అడుగు. 
నేను : చాలా గ్రంధాలలో చదివాను సమాధి గురించి దాని అర్ధం ఏమిటి బాబా?
బాబా : అసలు సమాధి అంటే ఏమిటి?(కొంత సేపు మౌనంగా ఏదో ఆలోచించాడు)
బాబా : అది ఒక అత్యున్నతమైన విషయం. సమాధి కలగాలంటే చాలా సాధన అవసరం,ఆ సాధనా మార్గాన్ని గురువు మాత్రమే నీకు ఉపదేశించగలడు. ఆయన మాత్రమే నీకు సరైన దారి చూపించగలడు.
నేను : నేను నా గురువుని ఎలా గుర్తించగలను?(అంతే ! ఈ ప్రశ్న వినగానే ఆయనలో ఆవేశం వచ్చింది.)
బాబా : నీ గురువు నీ ఎదురుగా వున్నాడు,నువ్వే గుర్తు పట్టకుండా ఇక్కడ అక్కడ తిరుగుతున్నావు. సరిగా చూడు నీ ఎదురుగా వున్నాడు,ఆయన గొప్పతనాన్ని గుర్తించు.

అంతలో ఆకుకూర శుభ్రం చేస్తున్న వ్యక్తి కలగజేసుకుని గురువు గొప్పతనం ఏమని చెప్పగలం,గురువు మాత్రమే భగవంతుని దర్శనానికి సహాయం చేయగలడు. అందుకే కదా కబీర్ ఒక దోహాలో మాకు భగవంతుని కన్నా గురువే ముఖ్యం అన్నారు. అంతే ఈ మాటలు వినగానే మౌనీబాబా ఆవేశం మరీ పెరిగిపోయింది.
మౌనీబాబా : నీ ఎదురుగా వున్న నన్ను ఉపేక్షిస్తున్నావు,జ్ఞానం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఇప్పుడైనా నీ గురువుకి నీ మన,ధనములు సమర్పించు. నీకు ఆయనే మార్గాన్ని ఉపదేశిస్తాడు.
నేను : నాకు ఎలా తెలుస్తుంది ఆయనే నా గురువని?
మౌనీబాబా : ఏంటీ ఇంతసేపటి నుండి నీ ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న నీ గురువుని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా? మేలుకో ఇప్పడైనా ఆయనకి నీ తను,మన,ధనములు సమర్పించు.

నేను : తను,మన,ధనములు సమర్పించడమంటే?
మౌనీబాబా : ఆయన నీ గురువని నమ్ము. ఆయనకి సేవలు చెయ్యి,నీ దగ్గర వున్న ఎంతో కొంత డబ్బు ఆయనకు సమర్పించు. ఆయన సంతోషించి నీకు మార్గం బోధిస్తాడు,దాని కోసం నువ్వు నీ కుటుంబాన్ని వదలవలసిన అవసరం లేదు. గురువు బోధించిన నాలుగు మంచి విషయాలు గుర్తుపెట్టుకో చాలు నీ సంసారంలో నువ్వుండు నీకన్నీ లభిస్తాయి. 

నేను : మీరన్నీ పొందారా?
బాబా : అన్నీ అంటే..?
నేను : మీకు సమాధి కలిగిందా?

బాబా : ఎన్నోసార్లు.
నేను : సమాధి అంటే ఏమిటి?
బాబా : సమాధి పెద్ద విషయం కాదు? అది ఎవరికైనా కలుగుతుంది. ఎంతో కొంత దక్షిణ నీ గురువుకి సమర్

పించు ఆయనే నీకు సమాధి కలిగిస్తాడు.
నాకు అర్ధమైంది ఆయనకు ఏమీ తెలియదని. ఆయన వేషధారయిన బాబా అని. ఆయన దృష్టి ఎంతసేపు డబ్బుమీదే వుంది. ముందు మనసు,ధనము సమర్పించమన్నాడు. తరువాత తను,మన, ధనమన్నాడు. నాకు గురువు ఆయనే అని నేను గుర్తించాలని పాపం చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆ తాపత్రయం అంతా దక్షిణకోసమే అని అర్ధం కాగానే నాకు నవ్వు వచ్చింది. ఆయన ఒక సాధువు! అది కూడా మౌనీబాబా!!

ఇక అక్కడ కూర్చోవడం అనవసరమనిపించింది. నేను లేచి నిలబడ్డాను, వెళతానని నమస్కారం చేశాను.

Episode - 12

అలాగే అంటూ, దీవిస్తూ మౌనీబాబా నన్ను,నా చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ని మార్చి మార్చి చూడటం కనిపించింది. ఆయన డబ్బులిస్తానని అనుకుంటున్నారని నాకు అర్థమైంది ఎంతో కొంత ఇద్దామనుకున్నా. అప్పుడు అనిపించింది ఇప్పుడు నేను ఇస్తే అతను ఏమి అనుకుంటాడు. ఆయన మాటలు నేను నమ్మానని అనుకుంటాడు. ఆ నమ్మకంతో రేపటి నుండి ఎవ్వరినైన వెధవలను చేయగలను అనుకుంటే ఆ ప్రభావం యాత్రికుల మీద పడుతుంది. దీనికి కారణం నేను కాదల్చుకోలేదు. నేను అతనిని నమ్మలేదని అతనికి తెలియాలి. ఇలా అనుకోగానే నేను శివుడికి నమస్కారం చేసి బయటకు వచ్చేశాను.

వస్తూ వస్తూ ఒకసారి ఓరకంట అతన్ని చూశాను నా వైపు చాలా కోపంగా చూస్తున్నారు. నేను పట్టించుకోకుండా బయటకు వచ్చి ఘాట్ మీద కూర్చున్నాను అశోక్ నా ఎదురుగా నిలబడి వున్నాడు.
అశోక్ : ఏమిటి మేడమ్ మీకు బాబా ఎలా అనిపించారు?
నేను : అసలతను బాబాయేనా?
అశోక్ : అదేంటి అలా అన్నారు?
నేను : అతను బాబా అని నువ్వు ఎలా చెబుతున్నావు?
అశోక్ : నాకు తెలియదు కాని అందరూ అతన్ని బాబా అనే అంటారు.
నేను : సమాధి అంటే ఏమిటి?

అంతలో ఆ టీ షాపతను కూడా నా దగ్గరికి వచ్చాడు. ఏమిటి మేడమ్, మౌనీబాబా ఎలా అనిపించారు అని అడిగాడు? నేను నవ్వుతూ ఆయన అంత గలగలా మాట్లాడుతుంటే మౌనీబాబా అంటారేమిటి? అసలు ఆ పేరు ఎలా వచ్చింది అతనికి అని అడిగాను. 
టీ షాపు యజమాని : ఆయన ఇంతకు ముందు క్షమేశ్వరాలయంలో వుండేవారు. అప్పుడు ఆయన మౌనంగానే వుండేవారు. కాని కోపం చాలా ఎక్కువ. ఈ గుడి దగ్గరలో చనిపోయిన వారికి పిండప్రదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమం పూర్తిచేసిన వారు ఇక్కడికి వచ్చి క్షమేశ్వరుని దర్శనం చేసుకొనే వారు.

అక్కడ వుండి ఈ మౌనీ బాబా వారిని విసుక్కోవడం, వారి వస్తువులు విసిరివేయడం లాంటివి చేసేవారు. ఆయన వున్నారు కాబట్టి అక్కడికి ఎవర్ని రానిచ్చేవారు కాదు. భక్తులు,స్థానికులు కొంత కాలం ఇదంతా భరించారు కాని ఆయన ప్రవర్తన శృతి మించింది. దానితో ఒక్కసారిగా అందరూ ఆయన మీద తిరగబడ్డారు. అప్పటి నుండి ఇప్పుడు వున్న చోట వుంటున్నారు. మౌనంలో కూడా ఆయన ఎక్కువకాలం లేరు. కాని పేరు అలా వచ్చిందంతే. కాని నాకు ఒక అనుమానం మేడమ్? అందుకే ఇక్కడికి వచ్చాను మీరు ఆయనతో మాట్లాడారు కదా మీకు ఏమనిపిస్తుంది? ఆయన నిజంగా బాబాయేనా? అవును అతను బాబాయే కాని వేషధారి బాబా.

ఆయనకు ఎలాంటి జ్ఞానము లేదు. ఇంట్లో బాధ్యతలకు భయపడి బాబాగా మారాడనిపిస్తుంది. అంతకు మించి ఏమిలేదని చెప్పాను. ఇంకెవరయినా బాబాలు? ఆశ్రమాలు తెలుసా అని అశోక్ ని అడిగాను. పంచగంగాఘాట్ వద్ద ఒక దక్షిణాది స్వామి ఆశ్రమం వుంది ఆయన గొప్ప సిద్ధుడు ఇప్పుడు ఆయన లేరు. ఆయన సమాధి వుంది. అక్కడ చూస్తారా అని అడిగాడు. ఆయన పేరేమిటి అని అడిగాను. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు గుర్తురావడం లేదన్నాడు. సరే పద వెళదాం అన్నాను. 

అలా ఘాట్‌ల మీదుగా నడుస్తూ దారిలో అశోక్‌ని అడిగాను, ఇంకా సాధువులు ఎక్కడ వుంటారు బెనారస్‌లో అని. అపుడు చెప్పాడు బెనారస్‌లో మూడు సాధువుల సంఘాలు వున్నాయి. అందులో ఒకటి మీరు వున్న కేథార్‌ఘాట్‌కి దగ్గరలో వున్నది. అది మూడు సంఘాలలో పాతది. అక్కడ కొందరు సాధువులు వుంటారు. కుంభమేళా లాంటి సమయాల్లో హిమాలయాల నుండి వచ్చే ముఖ్యమైన సాధువులకు వసతి ఇక్కడే కల్పిస్తారు. ఇంకా మీకు లాహిరిబాబా తెలుసా! ఆయన ఆశ్రమం దిగ్పతిరాయ్ ఘాట్ పైన వుంది. వీలయినప్పుడు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు.

అలా మాట్లాడుతూ దశాశ్వమేధ ఘాట్ దాటి మణికర్ణికాఘాట్‌కి వచ్చాము. బెనారస్ వచ్చాక ఇప్పటి వరకు నేను మణికర్ణికాఘాట్ స్మశాన స్థలం నుండి అటు దాటలేదు. మొదటిరోజు వెళ్ళినా పైన వీధుల గుండా వెళ్ళాను. ఇప్పుడు దహనక్రియలు జరుగుతున్న కాస్త దూరం నుండి నడుస్తుంటే నాకు శరీరం జలదరిస్తుంది. ఆ వాసనలకు నేను చాలా గాబరా పడిపోయాను. ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత గట్టిగా చేతి రుమాలుతో ముక్కు మూసుకున్నాను. అశోక్ ని చూస్తే చాలా మాములుగా నడుస్తున్నాడు ఆ పొగలో. పైగా నేను అలా ముక్కు మూసుకోవడం చూసి నవ్వుతున్నాడు.

మాములుగా మనం మన ఊళ్ళలో స్మశానం వైపు వెళ్ళము. ఈ మధ్య కాలంలో స్మశానాలు నగరాల మధ్యలో వుండటం వల్ల అవి దాటుతున్నప్పుడు వాటి వైపు కూడా చూడము. పైగా మనకు స్మశానం లోపలివైపు కనిపించకుండా గోడలు వుంటాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య వుండిన మనకు స్మశానం మధ్యలో నుండి అలా మాములుగా నడిచివెళ్ళడం కొంచెం కష్టమనే చెప్పాలి.

మొత్తానికి పంచగంగాఘాట్‌కి వచ్చాము. పైకి మెట్లు ఎక్కుతున్నపుడు మాకు కుడి ప్రక్కగా ఒక మఠం కనిపించింది. గులాబి రంగులో వున్నఆ బంగళాపైన “శ్రీమఠం”అన్న పేరు కనిపిస్తుంది. మఠం తలుపులు తెరిచి ఉన్నాయి. పైకి మెట్లు ఎక్కుతున్న అశోక్‌ని ఆగమని చెప్పి ఈ మఠం చూపించాను. ఒకసారి లోపలకి వెళదాం అని చెప్పాను.

లోపల విశాలమైన ఒక హాల్ వుంది. అందులో ఒక చివర కొన్ని విగ్రహాలు వున్నాయి. స్వామి రామానంద ఇంకా వారి పరంపరలోని వారివి. హాలంతా ప్రశాంతంగా వుంది. ఒక పండు ముదుసలి వ్యక్తి మూలగా కూర్చుని వున్నాడు, కాషాయం ధరించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాను. ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. నా వివరాలు చెప్పాను.

మఠంలో గురువుగారు లేరు ఊరు వెళ్ళారు, పై అంతస్తులో వున్నవారిని కలిస్తే వివరాలు తెలుస్తాయి అని చెప్పారు.పై అంతస్తుకు వెళ్ళాను. అక్కడ ముందు హాల్ లోపల మూడు గదులు వున్నాయి. మధ్య గదిలో సీతారాముల మందిరం వుంది. దాని ఎదురుగా ఇద్దరు పిల్లలు కూర్చుని వేదం చదువుకుంటున్నారు. మందిరం కుడివైపు గది నుండి ఒక 60 సం,,ల వ్యక్తి బయటకు వచ్చాడు. మమ్మల్ని చూసి ఎవరని అడిగాడు. నేను పరిచయం చేసుకొని గురువు గారి దర్శనం ఎప్పుడు దొరుకుతుంది అని అడిగాను. 

10వ తేదిన గురువుగారు కాశీలో వుంటారని కాకపోతే ఇక్కడ వుండరు కబీర్ చౌరహ దగ్గర వున్న మరొక మఠంలో వుంటారు మీరు ఆ రోజు ఉదయం ఇక్కడికి వస్తే ఎవరినైన తోడునిచ్చి అక్కడికి పంపిస్తాను అన్నారు. తప్పకుండా ఆరోజు వస్తానని చెప్పి అయనకు ధన్యవాదాలు తెలుపుకొని సీతారాముల దర్శనం చేసుకుని బయటకు వచ్చేశాను.

Episode - 13

పంచాగంగా ఘాట్ మెట్ల నుండి పైకి వెళ్ళాక ఎడమవైపు సందులో ఎదురుగా “శ్రీ త్రైలింగస్వామి” ఆశ్రమం అన్న బోర్డు కనిపించింది. అది చూసి నేను చాలా ఆనందపడ్డాను. అశోక్ నాకు చెప్పిన ఆశ్రమం ఇదే. త్రైలింగస్వామి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని హోలియా అను గ్రామంలో 1607 వ సం,, లో నరసింగారావు విద్యావతిదేవి అను దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. ఆయన 50 వ యేట తల్లి కూడా మరణించడంతో ఆయనలో వైరాగ్యం జనించింది. తల్లి దహనక్రియలు జరిగిన స్మశానంలోనే గుడిసె వేసుకుని జీవించసాగారు. ఆయన తమ్ముడు వచ్చి ఎంత బ్రతిమిలాడిన ఇంటికి వెళ్ళలేదు. తరువాత కాలంలో ఆ ఊరు వచ్చిన ఒక సాధువు దగ్గర దీక్ష తీసుకున్నాక ఆయన పేరు గణపతి స్వామిగా మారింది. అలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ 1737 వ సం,, లో కాశీ వచ్చారు. అప్పటి నుండి పరమపదించే వరకు అంటే 1887 వ సం,, వరకు అంటే 150 సం,,లు కాశీలో జీవించారు. మొత్తం ఆయన వయస్సు దాదాపు 280 సం,,లు. 

కాశీ వచ్చిన క్రొత్తలో ఈయన ఎక్కువగా హనుమాన్ ఘాట్ మరియు మణికర్ణిక ఘాట్‌ల వద్ద వుండేవారు. ఆరడుగుల పొడుగు, ధృడమైన శరీరం, పెద్ద పొట్టతో నగ్నంగా వుండే త్రైలింగస్వామిని ప్రజలు వింతగా చూసేవారు. గంగ నీటిలో గంటలగంటలు తేలియాడటం. ఒక దగ్గర నీటిలో మునిగితే కొన్ని గంటల తర్వాత వేరొక దగ్గర నీటి నుండి బయటకు రావడం వంటి స్వామి ఎన్నో మహిమలు చూసిన భక్తుల వల్ల రోజురోజుకి ఇబ్బంది పెరుగుతుండటంతో, జన సమూహానికి కాస్త దూరంగా వున్న పంచగంగా ఘాట్‌‌ని ఆయన స్థానంగా చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే స్వామివారి ఆశ్రమం ఉందో అది మంగళభట్, కృష్ణకాంత్ అనే ఇద్దరు అన్నదమ్ములది. వాళ్ళు బ్రహ్మచారులు. వారి కోరిక మేరకు స్వామి వారి ఇంట్లో నివసించారు.

ఇప్పుడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఎదురుగా కృష్ణుని మందిరం వుంటుంది. ప్రక్కన హాల్‌లో 6 అడుగుల పొడవు వెడల్పు వున్న ఒక పెద్ద శివలింగం వుంది. స్వామి ఒకసారి గంగా నదిలో స్నానం చేసి వస్తూ ఆ లింగాన్ని చంకలో పెట్టుకొని వచ్చారని తరువాత దాన్ని అక్కడ ప్రతిష్ఠించారని విని చాలా ఆశ్చర్యపోయాను. 6అడుగుల పొడవు, వెడల్పు వున్న అంత పెద్ద శివలింగాన్ని ఒక వ్యక్తి చంకలో పెట్టుకుని వచ్చాడంటే ఆ వ్యక్తి ఎలా వుండేవాడో నా ఊహకి కూడా అందలేదు. ఊహించడానికి మీరు ప్రయత్నిస్తే ప్రయత్నించండి. శివలింగం ఎదురుగా కొన్ని దేవీదేవతల విగ్రహాలు, శ్రీచక్రం వున్నాయి. వాటిని త్రైలింగస్వామి వారే స్వయంగా ప్రతిష్ఠించారట.

శివలింగం అటుపక్క కాషాయం దుస్తులు ధరించి తల మీదుగా ఉత్తరీయాన్ని ముసుగులా ధరించి అటు వైపు తిరిగి ఒక వ్యక్తి ధ్యానం చేసుకోవడం నాకు కనిపించింది. నేను ఆ వ్యక్తి వెనుక వైపున వున్నాను. అతను కూర్చొని వున్న చోటుకి కొంచెం ముందు కొన్ని మెట్లు దిగువకి వున్నాయి. అక్కడే స్వామి వారి సమాధి వుందని ఆశ్రమంలోని వ్యక్తి చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళి నిల్చున్నాను. నేను ఆయనను దాటి వెళ్తున్నపుడు నా అడుగుల శబ్దానికి ఆయనకు ధ్యానభంగం కలగవచ్చేమో అనే అనుమానం కలిగింది, కొంతసేపు అలాగే నిలబడిపోయాను.

ఆయన అప్పుడే లేవకపోవచ్చేమో అనిపించడంతో మెల్లగా రెండు అడుగులు ముందుకు వేసి ఒకసారి ఆయన ముఖం వైపు చూశాను. నేను అనుకున్నట్టు అక్కడ కూర్చుంది వ్యక్తి కాదు. అది స్వామి వారి విగ్రహం. నిజంగా మనిషిలా వున్న విగ్రహం చూసి నేను ఎంతో విస్మయం చెందాను. కాని ఆ మూర్తి దర్శనం నాకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగించింది. త్రైలింగస్వామి వారు నిజంగా నా ఎదురుగా వున్నట్లు అనిపించింది. మెట్లు దిగి క్రిందికి వెళ్ళగా అక్కడ స్వామి వారి సమాధి వుంది. నమస్కారం పెట్టుకొని పైకి వచ్చాను. స్వామి వారి జననం, మరణం రెండు శుక్ల ఏకాదశి రోజే. అందుకే ప్రతి సంవత్సరం శుక్లఏకాదశి రోజు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ.

ఆశ్రమం మొత్తం చూసి వచ్చి కృష్ణుని మందిరం ముందు కూర్చున్నాను. అక్కడ ఒక ఆశ్రమ నిర్వాహకుడు వున్నాడు. ఆయనే నాకు స్వామి వారి కొన్ని లీలలు, ఆ లింగ ప్రతిష్ఠ మొదలగునవి చెప్పారు. అంతేకాదు అక్కడ కొలువై వున్న కృష్ణుని ప్రత్యేకతని కూడా చెప్పారు. త్రైలింగస్వామి వారు ఆ ఇంటికి రాకముందే ఆ ఇంట్లో కృష్ణుడి విగ్రహం వుంది. ఈ కృష్ణున్ని మహారాష్ట్రలోని మహాత్ములలో ఒకరిగా పేరు గాంచిన సంత్ ఏకనాధ్ మహారాజ్ ప్రతిష్ఠించాడు. ఏకనాధ్ మహారాజ్ విఠల్ భక్తుడు, ఆయన కాశీలో వున్న కాలంలో రోజూ గంగ ఒడ్డున వున్న ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఆరాదించేవాడు. కొన్ని రోజులకు గంగాదేవి ప్రత్యక్షమై ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఇచ్చిందని దాన్నే ఆయన ఈ ఇంట్లో ప్రతిష్ఠించారని చెప్పారు. ఈ కృష్ణుని విగ్రహం ప్రత్యేకత తలపై శివలింగం కలిగి వుంటుంది.

కలకత్తాలో నివసించి కాళీ అపర భక్తునిగా భక్త లోకంచే కీర్తించబడ్డ రామకృష్ణ పరమహంస, ఆయన జీవిత కాలంలో రెండు సార్లు త్రైలింగస్వామి దర్శనం చేసుకున్నారు. మొదటిసారి గంగాఘాట్ వద్ద రెండవసారి ఈ ఇంట్లో. అలా ఇద్దరు మహాత్ముల కలయికకు సాక్ష్యంగా నిలచిన ఇక్కడి కృష్ణభగవానుడు ఆ రోజు నుండి సాక్షిగోపాల్‌గా ఖ్యాతి పొందాడు. అంతేకాదు రామకృష్ణ పరమహంస, త్రైలింగస్వామిని కాశీలో నడయాడే దైవంగా పేర్కొన్నారు.

ఎంతో అద్భుతంగా అనిపించింది త్రైలింగస్వామి గురించి విన్నాక. ఒక వ్యక్తి 280 సం,,లు జీవించడం, ఆయన చేసిన లీలలు నిజంగా అద్భుతమే. ఆయనను ప్రత్యక్షంగా దర్శించలేకపోవచ్చు. కాని ఆయన ఆశ్రమ దర్శన ఆనందం తక్కువేమీ కాదనే చెప్పాలి. ఒక మహాత్ముని ప్రత్యక్ష దర్శనం కావచ్చు లేదా ఆయన గురించిన ఏ చిన్న విషయం మనకు తెలియాలి అన్న అందుకు మనకు వాళ్ళు అనుమతి ఇవ్వాలి అంటారు. మరి నేను త్రైలింగస్వామి ఆశ్రమ దర్శనంతో ఇంత ఆనందం పొందాను అంటే ఆయన ఆశీస్సులు నాకు లభించాయనే నా నమ్మకం.

మీరు ఎప్పుడైనా కాశీకి వెళితే స్వామి ఆశీస్సులు తప్పకుండా పొందడానికి ప్రయత్నించండి. చెప్పాకదా పంచగంగా ఘాట్ పైన వుంది త్రైలింగస్వామి వారి ఆశ్రమం.

Episode - 14

ఆశ్రమం నుండి బయటకు వస్తున్నపుడు అశోక్ అడిగాడు మేడమ్ తరువాత ఎక్కడికి అని. నాకు తెలియదు ఇంకా ఇక్కడ ఏమైనా చూడవలసినవి వుంటే చెప్పమన్నాను. కాలభైరవుని దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. లేదు నేను వచ్చి 3 రోజులయ్యింది కాని ఆయన దర్శనం చేసుకోలేకపోయాను అన్నాను. అదేంటి మేడమ్ ఇంత ఆలస్యం చేశారు కాలభైరవుడు కాశీనగర క్షేత్రపాలకుడు. ఎవరైనా ఈ క్షేత్రంలో వుండాలంటే ఆయన అనుమతి చాలా అవసరం. ఇంత ఆలస్యం చేయకూడదు దర్శనానికి పదండి. ఇక్కడి నుండి దగ్గరే కాలభైరవుడి మందిరం వెళదాం అంటూ చెప్పడంతో అక్కడికి బయలుదేరాము.

కాలభైరవ మందిరం ఒక పురాతన మందిరం అని చూడగానే తెలిసిపోతుంది. ద్వారం బయట పూలమాలలే గాక నువ్వుల నూనె కూడా అమ్ముతున్నారు. అది తీసుకోమన్నాడు. లోపలికి ప్రవేశించగానే మధ్యలో మందిరం చుట్టూ వసారాలా వుంది. వసారా అంతా పండాలు కూర్చుని వున్నారు. ఉత్తర భారతంలో పూజారులను పండాలు అంటారు. ఒక్కొక్కరి దగ్గర నల్లరంగులో, ఎరుపురంగులో తాళ్ళు చేతికి కట్టుకునేవి వున్నాయి. నేరుగా మందిరంలోకి వెళ్ళాను. పూలదండ స్వామికి సమర్పించాను. అప్పుడు అశోక్ చెప్పాడు ఆ నువ్వుల నూనె స్వామికి అభిషేకించమని. నువ్వులనూనె అభిషేకం వలన శనిదోష నివారణ జరుగుతుంది, దిష్టిపోతుంది.

అశోక్ నన్ను అక్కడ కూర్చున్న పండాలలో ఒకరి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన నెమలిపింఛంతో కొడుతూ ఆశీర్వదించి నల్లనిదారం నాచేతికి కట్టాడు. నేను ఆలయ వివరాలు అడిగాను. 1751 సం,, రాణి అహల్యబాయి ఈ గుడి పునర్నిర్మాణం చేసింది. ఈ మందిరంకి సంబంధించి ఒక అద్భుతమైన కథ వుంది .  బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు తమలో ఎవ్వరు శ్రేష్ఠులు అనే విషయం మీద గొడవ జరిగింది గొడవ తారాస్థాయికి చేరింది. అప్పుడు బ్రహ్మ, మద్యం తాగి స్మశానంలో తిరిగేవాడు శ్రేష్ఠుడు ఎలా అవుతాడని శంకరుడిని నిందించాడు. ఇది విని కోపోద్రిక్తుడైన శంకరుడు తన జటాజూటం నుండి భైరవుడిని సృష్టించాడు. ఆ భైరవుడు తన చిటికెనవేలి గోరుతో బ్రహ్మ ఒక తల నరికివేసెను. బ్రహ్మ తల పడిన ఆ చోటు బ్రహ్మపుష్కర్. ఇది రాజస్థాన్ లో వున్నది. కాని కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది. ఆ బ్రహ్మహత్యా పాతకం నుండి ముక్తి కోసం భైరవుడు ఇక్కడికి వచ్చి విశ్వనాధున్ని ఆరాధించాడు. విశ్వనాధుని ఆరాధన వల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి విడుదలే కాక కాశీ నగర క్షేత్ర పాలకుడిగా కూడా స్థిరపడి పోయాడు.

ఈ దర్శనాలన్నీ అయ్యేసరికి మధ్యాహ్న భోజన సమయం అయింది. నేను, అశోక్ నా వసతి వైపుగా నడుస్తున్నాం. మాటలలో చెప్పాను అశోక్ తో ఉదయం నేను హరిశ్చంద్రఘాట్ అవతల కుటీరంలో వుండే బాబాని కలవడానికి వెళ్ళడం, ఆయన కుటీరంలో లేకపోవడం అక్కడి నుండి వస్తున్న నన్ను ఒక పడవ నడిపే అతను అడ్డగించడం. అది విని అశోక్ చెప్పాడు, లేదు ఆ బాబా మంచి వారు భయపడవలసినది ఏమిలేదు. ఆయన పేరు మనోజ్‌గిరి. ప్రతి శివరాత్రికి 10 లేక 15రోజుల ముందు ఆయన కాశీకి వస్తారు. ఒకటి లేక రెండు నెలలు వుండి వెళతారు. మీరు రేపు ఉదయం 7 గం,,లకి మానస సరోవర్ ఘాట్‌కి రండి నేను మిమ్మల్ని తీసుకువెళతాను అన్నాడు.

ఇంతలో వసతి వుండే చోటు వచ్చింది. నన్ను అక్కడ వదలి వెళ్ళబోతూ అశోక్ ఆగాడు. మేడమ్ మీరు ఉదయం నుండి నన్ను అశోక్ అని పిలుస్తున్నారు కదా. నా పేరు అశోక్ కాదు గౌరవ్ అని చెప్పాడు. ఇది విని నాకు షాక్ కొట్టినంతపనయ్యింది. అదేమిటి అస్సీఘాట్ వద్ద నేను చూసిన ముసుగు వ్యక్తి నువ్వు కాదా అని అడిగాను? కాదు నేను మిమ్మల్ని హరిశ్చంద్రఘాట్ వద్ద ఆ గుడి పూజారితో మాట్లాడుతున్నపుడు చూశాను. తరువాత మీరు క్షమేశ్వర ఘాట్ వద్ద అలా ఒంటరిగా వుండటం చూసి పలకరించాను. మీరు నేను ఇంకెవరో అనుకుని మాట్లాడారు అన్నాడు. నేను మరింత ఆశ్చర్యపోతూ మరి ఉదయం నుండి అశోక్ అని పిలుస్తుంటే ఎందుకు పలికావు, ఎందుకు నీ పేరు చెప్పలేదు అని అడిగాను.

మీరు నన్ను ఎవరో మీకు తెలిసిన వ్యక్తి అనుకుంటున్నారు, నేను కాదు అని చెబితే మీరు నా సహాయం తీసుకోపోవచ్చు. ఇక్కడికి వచ్చే యాత్రికులు తొందరగా స్థానికులను నమ్మరు అందుకే నేను చెప్పలేదు. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే సాయంత్రం 4గం,,లకి నేను క్షమేశ్వర్‌ఘాట్ వద్ద వుంటాను రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారి నేను ఉదయం నుండి జరిగినదంతా గుర్తు చేసుకున్నాను. నిజంగా అశోక్ కాదు గౌరవ్ నాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించాడు. ఎన్నో కాశీ వివరాలు చెప్పాడు. తన సమయం వృధా చేసుకుని నాతో వచ్చాడు. ఇదంతా కేవలం నేను ఒంటరిగా వున్నాను ఏమైనా ఇబ్బంది పడతానేమో అని చేశాడని అర్ధమైంది.

కాశీ రావడానికి ముందు నేను విన్న జాగ్రత్తలలో ముఖ్యమైంది స్థానికులను నమ్మొద్దని. అందులోను ముఖ్యంగా పడవ నడపేవారిని అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎందుకో ఈ మాటలు వదంతి మాత్రమే అని నిరూపణవుతుందేమో అనిపించింది.

భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని సాయంత్రం 4 గం,,ల ప్రాంతంలో క్షమేశ్వరఘాట్ వద్దకి వచ్చాను. నా కళ్ళు గౌరవ్‌ని వెదుకుతున్నాయి.

క్షమేశ్వర్‌ఘాట్‌కి కాస్త దూరంలో వున్న గౌరవ్నన్ను చూడగానే దగ్గరికి వచ్చాడు. మేడమ్ నిజం చెప్పనందుకు మీరు ఏమి అనుకోలేదు కదా అన్నాడు. ఆ ప్రశ్న వినగానే నేను నవ్వుతూ, లేదు అశోక్ నేను ఏమనుకోలేదు అన్నాను. మేడమ్ ఇప్పుడైనా గౌరవ్ అని పిలవండి అంటూ బిక్కమొహం వేశాడు అశోక్ ఉరఫ్ గౌరవ్. అలా నాకు కాశీలో విక్రమ్ తర్వాత రెండవ స్నేహితుడు దొరికాడు. ఆ సాయంత్రం చాలా సమయం క్షమేశ్వర మందిరం మెట్ల మీద కూర్చొని ఘాట్లమీద తిరుగుతున్న రకరకాల యాత్రికులను చూస్తూ కాలం గడిపాను.

6గం,,లు అవుతుండగా ముందు రోజు నేను వెళ్ళలేకపోయిన గంగా హారతి చూడటానికి దశాశ్వమేధ ఘాట్‌కి వెళ్ళాను. ఈ ఘాట్ మీద శీతలాదేవి మందిరం వుండటం వలన స్థానికులు ఈ ఘాట్‌ని శీతలాఘాట్ అంటారు. 

గంగా హారతి ఈ శీతలాఘాట్ మరియు దాని ప్రక్కనే వున్న రాజేంద్రప్రసాద్ ఘాట్ లోను జరుగుతుంది. ఆరతి సమయం కావడం వలన ఈ రెండు ఘాట్‌లు జన సమూహంతో నిండిపోయి వున్నాయి. నేను, ముఖ్యమైన ఘాట్ శీతలఘాట్ దగ్గరే కూర్చున్నాను. హారతికి కూర్చున్న జనసమూహం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అందులో మన దేశీయులకంటే విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. వివిధ దేశాల వాళ్ళు కనిపిస్తున్నారు.

అందులో ఎక్కువగా జపనీయులు, చైనీయులే వున్నారు. మీరాబాయి కీర్తనతో మొదలయిన హారతి కార్యక్రమం పూర్తవ్వడానికి గంట సమయం పట్టింది. ఐదుగురు యువకులు రకరకాల ధూపదీపాలతో గంగామాతకి హారతినివ్వడం చూడటం నిజంగా అద్భుత దృశ్యమే. హారతి ముగిశాక కాసేపు గంగానది అందాలను ఆస్వాదించి నా వసతికి వచ్చేశాను.

Episode - 15

మరుసటి రోజు ఉదయాన్నే క్షమేశ్వరఘాట్‌కి వచ్చాను. ఈ రోజు గౌరవ్ హరిశ్చంద్రఘాట్ దగ్గర కుటీరంలో వున్న బాబాని కలవడానికి వెళ్దాం అన్నాడు కదా అందుకే నేను ఘాట్ కి వచ్చేటప్పటికే గౌరవ్ అక్కడ వున్నాడు. ఇద్దరం కలిసి ఆ కుటీరం దగ్గరికి బయలుదేరాము ముందురోజు హరిశ్చంద్రఘాట్ దగ్గరలో నన్ను అడ్డగించిన వ్యక్తి కనిపిస్తాడేమో గౌరవ్‌కి చూపిద్దామనుకున్నా. కాని అతను కనిపించలేదు. కుటీరం దగ్గరికి వెళ్ళాము.

దాన్ని కుటీరం అని కూడా అనరేమో! ఘాట్ ఎత్తైన మెట్లు ఒక వైపు అడ్డుగా వుంటే మిగిలిన మూడు వైపుల తెరిచే వుంది. పైన ఒక పరదాకట్టి వుంది. అంతే మేము వెళ్ళేసరికి ఒళ్ళంతా బూడిద ధరించిన ఒక వ్యక్తి ధుని ముందు కూర్చుని వున్నాడు. ఆయన వస్త్రములు ఏమి ధరించలేదు. భుజాల మీదుగా ఒక శాలువా వుంది. మొల భాగం ఒక చిన్న తుండు గుడ్డచే కప్పబడింది. ఆయన మెడలో రుద్రాక్షమాలలు, ముత్యాలదండ, ఎరుపురంగు రాళ్ళ దండ వున్నాయి. సుమారుగా 50 సం,, లు వుండొచ్చు. మనిషి బక్కపలచగా వున్నాడు.

నేను ఆయనకు నమస్కరించి ధునికి ఒకవైపు కూర్చున్నా. గౌరవ్ నా ప్రక్కన కూర్చున్నాడు. ఆయన లేచి బయటకు వెళ్ళి దుస్తులు సరి చేసుకుని వచ్చి కూర్చున్నాడు. నావివరాలు అడిగారు, చెప్పాను. అంతదూరం నుండి శివరాత్రి కోసం ఒక్కదానివి వచ్చావా అంటూ ఆశ్చర్యపోయారు. నాతో ఏం మాట్లాడాలి అని అడిగారు. ఏమి లేదు బాబా శివరాత్రికి ఇంకా సమయం వుంది కదా అని ఈ సమయంలో బాబాలను, మహాత్ములను కలుస్తున్నాను. అలాగే మీ దర్శనం కోసం వచ్చాను అని చెప్పాను.
నేను : మీ పేరు ఏమిటి బాబా ?
బాబా : నా పేరు మనోజ్‌గిరి, ప్రభుత్వరికార్డ్ లో మనోహర్‌గిరి. కాని అందరూ నన్ను మంకీబాబా అని పిలుస్తారు.
నేను : ప్రభుత్వ రికార్డ్ లో అంటే?
బాబా : ప్రభుత్వం మాకు సాధువుగా ఇచ్చే గుర్తింపు పత్రంలో.
నేను: ఏమిటి మీకు గుర్తింపు పత్రం వుంటుందా సాధువని?
 (నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓటర్ఐడి కార్డ్, ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్ ఇలాంటివే విన్న నాకు సాధువుగా ఐడికార్డ్ వుంటుందని తెలియదు.)
బాబా : అవును మాకు గుర్తింపు కార్డ్ వుంటుంది. కాశీలోనే జూనా అఖాడా లో నాకు సభ్యత్వం వుంది. (ఈ జూనా అఖాడా మరేదో కాదు నాకు గౌరవ్ ముందురోజు చెప్పాడు కదా సాధువుల సంఘాల గురించి వాటిలో ఒకటి.)
నేను : బాబాలకి, సాధువులకి గుర్తింపు అవసరమా?
బాబా : ఇంతకు ముందు వుండేవి కాదు. కాని ఇపుడు అవసరమే.
నేను : ఎందుకని?
బాబా : కొన్నిసార్లు దొంగలు, తీవ్రవాదులు వంటి వారు సాధువుల వేషంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. అప్పటి నుండే ప్రభుత్వం గుర్తింపుకార్డులు ఇవ్వడం మొదలు పెట్టింది. దీని వలన ఎవరికైనా ఏ సాధువు మీదైనా అనుమానం వస్తే వారి గుర్తింపు కార్డ్ ఆధారంగా వారి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. వారు ఏ అఖాడాకి సంబంధించిన వారో ఆ అఖాడాలో వారి పూర్తి వివరాలు వుంటాయి.
నేను : అలాగా! అయితే ఈ ఆలోచన మంచిదే.

బాబా మీ వివరాలు చెప్పగలరా? మీ జన్మస్థలం ఏది? ఎక్కడి నుండి వచ్చారు. సాధువుగా ఎలా మారారు?
బాబా : నేను పుట్టింది నైనిటాల్ లో ఇది ఇప్పుడు ఉత్తరాంచల్ లో వుంది. మాతండ్రి గారి పేరు దాన్‌వీర్ సింగ్. ఆయనకి దానగుణం ఎక్కువ ఎవరు ఏమి అడిగినా లేదు అనకుండా ఇచ్చేవారు. ఒకరోజు ఒక సీతారాం వచ్చి, నువ్వు బాగా దానాలు చేస్తావని విన్నాను. అదే నిజం అయితే నీ కొడుకుని నాకు దానం ఇవ్వు అని అడిగారట.
నేను : సీతారాం అంటే?
బాబా : ఇది ఒక సంప్రదాయం పేరు, వారు రామభక్తులు. ఆ సాధువు అలా అడగగానే మా నాన్న నన్ను ఆయనకు ఇచ్చివేసారు. అప్పుడు నా వయస్సు 6 సం,, లు. నా మీద బెంగతో 6 నెలలకి ఆయన చనిపోయారు. ఆ సీతారాం బైపాస్ రోడ్‌లో సియారాందాస్ దగ్గర వుండేవారు. ఆయనకి ఆస్తులు బాగానే వుండేవి. ఆయనే నన్ను సాధువుని చేసారు. అలా చిన్న వయసులోనే సాధువుగా మారాను. అయోధ్య లో అల్లర్లు జరిగినపుడు నేను అక్కడ నుండి వారణాసి వచ్చేసాను. అప్పుడు నాకు ఇక్కడెవరు తెలియదు, కర్‌వట్ దగ్గర కూర్చొని బాగా ఏడ్చాను. తర్వాత మెల్లిగా పరిచయాలు పెరిగి స్థిరపడ్డాను.

(కర్‌వట్ అంటే తేడా గుడి అని అర్ధం. మీకు జ్ఞాపకం వుందా? మణికర్ణికాఘాట్ వద్ద ఒక గుడి ఒకవైపు ఒరిగిపోయి వుంటుంది అని చెప్పాను కదా ఆ గుడినే కాశీ కర్‌వట్ అంటారు.)
బాబా: నాకు దేని పైన కోరిక లేదు ఎవ్వరు ఏమి ఇస్తే అదే లేకపోతే నీళ్ళు త్రాగి బ్రతికేస్తాను. మొదట నేను ఒక సీతారాంని, అప్పుడు నేను ఒక నాగ సాధువుని కలిసాను ఆయనే నన్ను భైరాగిగా వున్నావు సన్యాసివి అవ్వు అన్నారు, అలా సన్యాసి అయ్యాను. 2004 సం,,లో ఉజ్జయిని లో సన్యాస సంస్కారం తీసుకొన్నాను. నాగాలను అర్ధనారీశ్వర రూపంగా చెబుతారు. నాగాలు 5 రకాలు.

1. లంగోటి గురువు(కౌపీనం ధరిస్తారు)
2. భగువ గురువు (శాలువా ధరిస్తారు)
3. జనే గురువు (రుద్రాక్షలు ధరిస్తారు)
4. ఛోటి గురువు (జుట్టు తీయించుకోవడం)
5. భస్మే గురువు (విభూతి ధరిస్తారు).

Episode - 16

12 సం,,లు భైరాగిగా తిరిగిన వాడు మాత్రమే నాగా కాగలడు. నాగాలలో మహాపురుష్ 5 సంస్కారాలు, సన్యాసి 7 సంస్కారాలు కలిగి వుంటాడు. సన్యాసి దిగంబరంగా వుంటాడు. నాగా సాంప్రదాయం స్వీకరించే వారి లింగం ఈ దిగంబర సన్యాసియే విరుస్తాడు. సాధన విధానం కూడా ఈయనే చెబుతాడు.

నేను గంగోత్రిలో వుంటున్నాను. అప్పుడప్పుడు హరిద్వార్ లో కూడా వుంటాను. ఇపుడు గంగాసాగర్ (కలకత్తా) వెళ్ళి వస్తున్నాను. నాకు గురువు స్వేచ్ఛ మార్గం చూపాడు. నేను రోజు విభూతి ధరిస్తాను.ఇది ధరించడం వలన రోగాలు రావు. నన్ను స్వచ్ఛంగా వుంచుతుంది. ఇది ధరించని రోజు నా వివేకం పనిచేయదు. నాకు కోరిక లేదు కాని ఎవరైనా ఆశ్రమం కట్టమంటే కడతాను. కట్టి వదిలివేస్తాను. జన ఉద్ధరణ కోసం మాత్రమే కడతాను.

మేము ఇలా మాట్లాడుతుండగానే ఒక వ్యక్తి వచ్చి గౌరవ్ ప్రక్కన కూర్చున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు ముందురోజు నన్ను అడ్డగించిన వ్యక్తియే. అతణ్ణి గురించి గౌరవ్‌కి చెబుదామనుకునేలోగానే ఆ వ్యక్తి గౌరవ్ ను చనువుగా పలకరించాడు గౌరవ్ మాట్లాడటం జరిగింది. ఇంకా నేను అతణ్ణి గురించి అపుడే గౌరవ్‌కి ఏమి చెప్పాలి అనుకోలేదు. గుండాలా అనిపించిన ఆ వ్యక్తి గౌరవ్ స్నేహితుడా? ఆ వ్యక్తి బాబాతో కూడా చనువుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మంచివాళ్ళేనా వీళ్ళంతా అనిపించింది.

అంతలో మనోహర్‌గిరి బాబా తన శిష్యుడితో పాలు తెచ్చి కాఫీ కలపమన్నారు. అతను పాలు తెచ్చి గిన్నెలో పోసి ఆ గిన్నె ధుని మీద పెట్టబోయాడు. వెంటనే ఆ క్రొత్తవ్యక్తి ధునిలోని ఒక ఇనుపరాడ్‌ని చూపిస్తూ అది ఏమిటి అని అడిగాడు. హరిశ్చంద్ర ఘాట్‌లో ఒక శవం కాల్చినపుడు బూడిదలో అది దొరికిందని, ఆ వ్యక్తి బ్రతికి వున్నపుడు ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల పెట్టి వుండొచ్చు బూడిదలో దొరికితే తెచ్చి ధునిలో పెట్టాను అన్నారు.

అది వినగానే అ వ్యక్తి అరిచేసినంత పని చేసాడు. ధుని నుండి దాన్ని తీసివేయమని విసుక్కున్నాడు . అప్పటి వరకు నేను గమనించలేదు. కాని అది ఒక మూర పొడుగు వుండి చివర బంతిలా వున్న స్టీల్‌రాడ్. బాబా ఆ రాడ్ తీసి ప్రక్కన పెట్టారు. అపుడు శిష్యుడు ఆ ధునిలో పాలు కాచి కాఫీ కలిపాడు. ఆ కాఫీ గ్లాసులని మనోహర్ బాబాయే మా అందరికి అందించారు. వాళ్ళ మాటల్లో తెలిసింది గౌరవ్ స్నేహితుడైన ఆ వ్యక్తి పేరు మనోజ్‌యాదవ్ అని.

మనోజ్ కాసేపటికి చిలుం గొట్టంతో హుక్కా తయారుచేసాడు. ముందు తను పీల్చి బాబాకు ఇచ్చాడు. బాబా పీల్చి శిష్యునికి ఇచ్చారు, శిష్యుడు పీల్చి అక్కడ వున్న ఇంకో వ్యక్తికి ఇచ్చాడు. అలావారంతా ఒకటే హుక్కా తాగడం నాకు వింతగా అనిపించింది. వారి మాటలను బట్టి అర్థమైంది అది గంజాయి అని. దానితో నేను మనోహర్‌గిరి బాబాని అడిగాను ఇలా మీరు గంజాయి త్రాగవచ్చా అని.

ఆయన వెంటనే ఇది భోలేబాబా ప్రసాదం. ఏమి మనోజ్ అంటూ మనోజ్ ని అడిగారు. అపుడు మనోజ్ ఈ దక్షిణాది వాళ్ళకి ఈ విషయం ఎలా తెలుస్తుంది బాబా? వాళ్ళకి ఇది ఒక వ్యసనం. కాని మనకు ప్రసాదం అన్నాడు. ఇక నేను వారితో ఈవిషయం గురించి వాదించ దలుచుకోలేదు.
నేను : బాబా మీకు ఆత్మ దర్శనం అయిందా?
బాబా : అయింది. కావాలంటే నువ్వే చూడు, నువ్వు ఎక్కడ ఉన్నా నా ఫోటో నీ దగ్గర వుంటే నేను నీకు ప్రత్యక్ష దర్శనం ఇస్తాను.
ఇంతలో మనోజ్ కల్పించుకొని నా భార్య గర్భవతిగా వున్నపుడు బాబా చెప్పారు నాకు కొడుకు పుడతాడని అలాగే కొడుకు పుట్టాడు.
నేను : బాబా మీరు ఎలాంటి సాధనలు చేస్తారు.
బాబా : ఎప్పుడూ నేను ఒక్కడినే తిరుగుతుంటాను. ఎక్కడికి వెళ్ళిన అక్కడ నా శిష్యులు ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. నేను హఠయోగం చేస్తాను, ధౌతి చేస్తాను, క్రియలు అన్ని చేస్తాను. యోగాసనాలు వేస్తాను. ఎవరు లేనపుడు 10 లేక 15 నిమిషాలు ధ్యానం చేస్తాను.
నేను : తప్పుగా అనుకోకపోతే ఒక ప్రశ్న. కొంత మంది సాధువులు, బాబాలు మహిమలు చేస్తుంటారు అని వింటుంటాం. అలాంటివి మీరు చేస్తారా?

బాబా వెంటనే రెండు అరచేతులు దగ్గరికి తెచ్చి ఒక చేయి తెరిచి ఇంకోటి మూసి వుంచి రెండింటిని కలుపుతూ ఒక విచిత్రమైన శబ్దం వచ్చేలా చేశారు. ఆ శబ్దం చిరుతలు వాయిస్తున్నట్టుగా వుంది. ఇలా మీలో ఎవరైనా చేయగలరేమో ప్రయత్నించండి అన్నారు అక్కడ వున్న మా అందరిని చూస్తూ. నేను, గౌరవ్, మనోజ్, బాబా గారి శిష్యుడు, మరో వ్యక్తి అందరమూ ప్రయత్నించాము. కాని ఎవరము చేయలేకపోయాము.
బాబా : ఇలా అందరూ చేయలేరు ఒక్క హనుమంతుడు తప్ప. ఆయన అనుగ్రహం వలన నేను చేయగలుగు తున్నాను.
నేను : జీవితం మొత్తం ఇందులోనే గడిపారు కదా ఏం లభించింది.
బాబా : సత్యం దొరికింది.
నేను : ఏమిటా సత్యం?
బాబా : గంగ పారుతుంది అది ఆమె కర్మ. సూర్యుడు వెలుగునిస్తాడు అది సూర్యుని కర్మ. ఇలా ఎవరి కర్మలు వారు సక్రమంగా చేయాలి.
నేను : ఇంతేనా! ఇదేనా సత్యం? తెలుసుకోవడానికి ఇంకేం లేదా?
బాబా : లేదు.
నేను : ఇది తెలుసుకోవడానికేనా సాధకులు అంతగా ప్రయత్నించేది.
బాబా : అవును. భగవంతుడు ఎంతో గొప్ప శక్తివంతుడు ఆయనను ఎవరు ఆపలేరు.

కేధార్‌నాధ్ లో రుద్రుడు తాండవం చేసినపుడు ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎంతో విలయం సంభవించింది. 2003లో మానససరోవర్ దగ్గర బాంబ్ పేలినపుడు ఎంతోమంది సాధువులు చనిపోయారు.

Episode - 17

నేను : మీరు మానససరోవర్ వెళ్ళారా?
బాబా : లేదు వెళ్ళాలనుకుంటున్నా. పాస్‌పోర్ట్ చేయించుకుంటున్నాను. భారత్‌లోని అన్ని తీర్ధక్షేత్రాలు దర్శించాను.
నేను : మీ కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తెలుసా?
బాబా : వాళ్ళలో చాలా మంది చనిపోయారని విన్నాను.
నేను : మీకెలా తెలుసు?
బాబా : అక్కడి వాళ్ళు కలుస్తుంటారు.
నేను : మీ పేరు మనోహర్‌గిరి కదా. గిరి అంటే ఏమిటి?
బాబా : గిరి అంటే పర్వతం అని అర్ధం.
నేను : గిరి అనేది ఒక సన్యాస సంప్రదాయం అని నేను విని వున్నాను.
బాబా : కాదు మేము హిమాలయ పర్వతాలలో ఉంటాం అందుకే మా పేర్లలో గిరి ఉంటుంది.
నేను : మీరు ఏం చదువుకున్నారు? 
బాబా : నేను ఏం చదువుకోలేదు.

మా ఈ సంభాషణ అయిపోయాక మనోహర్‌గిరి బాబా అడిగారు నువ్వు కెమెరా తీసుకురాలేదా అని, లేదు అని చెప్పా. తీసుకు వచ్చి వుంటే బాగుండేది నేను నీకు కొన్ని యోగాసనాలు వేసి చూపించేవాడిని అన్నారు. అంతేకాదు అయన దగ్గర ఉన్న ఆయన ఫోటోలు తీసి చూపించడం మొదలు పెట్టారు. వందకు పైగా వున్నాయి అవి. వాటిలో ఆయన రకరకాల ఆసనాలు వేసినవి, వేరువేరు సాధువులతో వున్న ఫోటోలు వున్నాయి.

నేను వచ్చేసే ముందు నా ఫోన్ నంబరు తీసుకున్నారు. ఆయన ఫోన్ నం. నాకు ఇచ్చారు. నేను అక్కడి నుండి బయటకు రాబోతుండగా ఒక 40 సం,,ల వ్యక్తి వచ్చి బాబా ప్రక్కన కూర్చున్నాడు. చింపిరి జుట్టు, మాసిపోయిన బట్టలతో ఉన్నాడు. కూర్చుంటూనే బాబాతో గంజాయి త్రాగుదాం అంటూ చిలుం తయారు చేయడం మొదలు పెట్టాడు.

అపుడు మనోహర్‌గిరి బాబా నన్ను చూపిస్తూ ఈ అమ్మాయి “సాధువులు ఇలా గంజాయి లాంటి మత్తు పదార్ధాలు తీసుకోవచ్చా అని అడుగుతుంది నన్ను” అన్నారు. అది వినగానే ఆ వ్యక్తి నన్ను చూస్తూ మేము సాధువులము, మహాత్ములము మేము ఏమైనా చేయవచ్చు. నా దగ్గర డ్రగ్స్, ట్యాబ్లెట్స్, ఇంజక్షన్స్ కూడా వుంటాయి తెలుసా అన్నారు. మీ పేరు ఏమిటని అడిగా, పద్మగిరి అన్నాడు.

నేను అప్పటి వరకు మనోహర్‌గిరి బాబా జీవిత విశేషాలు తెలుసుకున్నానని పుస్తకం రాయబోతున్నానని వినగానే పద్మగిరి బాబా వెంటనే “అయితే నా వివరాలు రాసుకో ”అని అడిగాడు. కాని నాకు ఎందుకో అతని వేషము, ప్రవర్తన నచ్చలేదు. అందుకే మరొకసారి మీతో మాట్లాడుతాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను.

ఒక్క విషయం మాత్రం అర్ధమైంది. మనోహర్‌గిరి బాబా ఒక సాధువు మాత్రమే కాని జ్ఞాని కాదు. ఆయన దృష్టిలో భగవద్దర్శనం కోసం చేసే సాధన, యోగాసనాలు వేయడం మాత్రమే. నిజానికి ఆయనకి సమాధి, ఆత్మదర్శనం ఏవి తెలియదు. చివరికి ఆయన పేరులో గిరి ఎందుకు వుందో కూడా ఆయనకి తెలియదు. గిరి అనేది ఒక సన్యాస సంప్రదాయం అన్న చిన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాకపోతే ఆయన ఎవరికి హాని చేయరు. ఎవరి నుండి ఏమి ఆశించరు. ఆయనకు తెలిసిన సాధన ఏదో ఆయన చేసుకుంటున్నారు.

అంతా బాగుంది కాని జీవితం మొత్తం ఆయన ఏ భగవంతుడి కోసం పెట్టారో ఆ భగవంతుడు గురించి గాని, ఆయనను చేరుకునే మార్గం గురించి గాని ఆయనకు తెలియకపోవడం నాకు ఆయన పట్ల జాలిని కలిగించింది.

మనోహర్‌గిరి బాబా వద్ద సెలవు తీసుకొని బయటకు వచ్చాను. గౌరవ్, మనోజ్ కూడా నాతో వున్నారు. బయటకు రావడంతోనే గౌరవ్ నాతో మేడమ్ మనోహర్‌గిరి బాబా అయినా మీరు వెతుకుతున్న మహాత్ముల్లా అనిపించారా అని అడిగాడు. మనోహర్‌గిరి బాబా ఒక సాధువు మాత్రమే మహాత్ముడు కాదు అనే విషయాన్ని గౌరవ్‌కి వివరించాను.

మా సంభాషణ వింటున్న మనోజ్, మరి మహాత్ములు ఎలా వుంటారు మేడమ్ అని అడిగాడు. చెప్పడం కాదు నిజంగా మహాత్ములు బెనారస్‌లో కనిపిస్తే వారిని మీకు నేను చూపిస్తాను అని చెప్పాను. ఇంకెవరైనా సాధువులు తెలుసా అని అడిగాను వారిని. అపుడు మనోజ్ గౌరవ్‌తో మేడమ్‌కి లోలార్ కుండ్, కీనారం బాబా మఠ్ చూపించావా అని అడిగాడు. నేను అవి చూడలేదని వినగానే మేడమ్ అవి రెండు చూడవలసిన ప్రదేశాలు మీరు చూస్తానంటే వెళ్దాం అన్నాడు. వాటి ప్రత్యేకత ఏమిటి అని అడిగాను. లోలార్ కుండ్ ఒక నీటి కుండము ప్రసిద్ధి చెందినది. కీనారాం ఆశ్రమం అఘోరపీఠం అన్నాడు.

అఘోరాలు గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దొరకలేదని బాధపడుతున్న నాకు, ఏకంగా అఘోరాల పీఠం గురించి వినగానే ఆనందం వేసింది. అక్కడ ఉంటారా అని అడిగాను. ఉంటారా ఏమిటి మేడమ్ ఇపుడు వున్న పీఠాధిపతి బెనారస్‌లో వున్న అందరు అఘోర బాబాలలో ముఖ్యులు. 

కాని ఆయన దర్శనం సులభంగా దొరకదు. ఆయన గొప్ప మహాత్ముడని భక్తుల విశ్వాసం అన్నాడు. పదండి వెళ్దాం అన్నాను. ఆరోజు పెద్దగా బేరాలు లేకపోవడం వలన మనోజ్, గౌరవ్ ఇద్దరు నాతో కీనారాం మఠంకి వస్తామన్నారు.

Episode - 18

హరిశ్చంద్రరోడ్ దాటాక రోడ్ ని అనుకొని పెద్ద ప్రహారీ గోడ ఉంది, దాన్ని చూపిస్తూ అదే కీనారాం ఆశ్రమం అని చెప్పాడు మనోజ్. ఆ వైపుగా నడిచి ప్రధాన ద్వారం వద్దకు వచ్చాము. చాలా పెద్ద గేట్, గేట్‌కి ఆ చివర ఈ చివర పెద్ద పెద్ద సిమెంట్ ‌పుర్రెలు, ఒక వైపు పుస్తకాలు అమ్మే దుకాణం మరోవైపు వాచ్‌మెన్ వున్నాడు. బయటే చెప్పులు వదిలి కుళాయి వద్ద కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాము. మనోజ్‌తో కలిసి లోపలికి వెళ్తున్న నన్ను అక్కడ కూర్చున్న కొందరు వింతగా చూస్తున్నారు. వారికి నేను వింతగా ఉన్నా, నాకు మాత్రం చాలా ఉత్సాహంగా వుంది.

మనం ఎన్నో విశేషాలతో వినే అఘోరాలు కాశీలో చాలా మంది ఉంటారని విని, వారిని కలవవచ్చు అనుకున్న నాకు ఇప్పటి వరకు ఒక్కరు కూడా కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు నేను అఘోరాల ఆశ్రమంలో అడుగుపెట్టాను అందులోను ఈ పీఠాధిపతి ప్రస్తుత అఘోరాలలో ముఖ్యులు. నేను అప్పుడే ఆయన రూపాన్ని ఊహించుకోవడం మొదలు పెట్టాను. నల్ల బట్టలలో, రంగురంగుల పూసల దండలతో శవాలను పీక్కుతింటూ, నా ఊహ నన్ను మరింత ఉత్సాహపరిచింది.

చాలా పెద్ద ఆశ్రమం అది. మనోజ్ నన్ను రెండుగదులు ఉండి ముందు హాల్ వున్న ఒక ఇంటి దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ హాల్‌లో ఒక పెద్ద ఆసనం మీద ఒక ఫోటో వుంది. అందులో ఒక 70 ఏళ్ళ వ్యక్తి గడ్డంతో ఉన్నాడు. ఆయన కళ్ళు నిజంగా చూస్తున్నట్టే వున్నాయి. అక్కడ కొన్ని కుర్చీలు, వస్తువులు వున్నాయి. ఆ హాల్‌ ఇనుప గ్రిల్స్ తో ఉండి తలుపు తాళం వేయబడి వుంది. మనోజ్ చెప్పాడు ఆ ఫోటోలోని వ్యక్తి కీనారాంబాబా అని, ఆ వస్తువులన్నీ ఆయన వాడినవి అని.

ఇప్పుడు నేను చూస్తున్న ఆ ఫోటోలోని వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి కాదు చాలా పెద్ద అఘోరాబాబాగా ఖ్యాతి పొందారు.200 సం,,ల క్రితం ఆయన కాశీలో జీవించి వున్నారు. త్రైలింగస్వామి సమకాలికులు ఈ కీనారాంబాబా. అప్పటి వరకు అఘోరాలు అంటే అడవుల్లో, స్మశానాల్లో జీవించేవారు దొరికింది తిని పొట్టనింపుకునేవారు.

కాని మొదటి సారిగా అఘోరాల పీఠాన్ని స్థాపించి అఘోర సాంప్రదాయంలోనే కీనారాంబాబా ఒక క్రొత్త ఒరవడిని తీసుకువచ్చారు. ఇపుడు నేను ఉన్న ఆశ్రమం స్థలం ఆయనే కొని స్వయంగా ఆయనే ఇక్కడ పీఠాన్ని స్థాపించారు.

నేను నిల్చున్న హాల్‌కి కుడి వైపున 5 శివలింగాలు వాటి చుట్టూ మరికొన్ని చిన్న చిన్న శివలింగాలు వున్నాయి. కాస్త దూరంలో ధుని వుంది. శివలింగాల వెనుకగా మెట్లు ఎక్కి పైకి వెళితే కీనారాంబాబా సమాధి వుంది. ఆ సమాధిని స్పృశించి నమస్కరించుకున్నాను. కీనారాంబాబా లీలలు అక్కడి స్థానికులు కథలుకథలుగా చెప్పుకుంటారు. నేను విన్న వాటిలో విశేషంగా అనిపించిన ఒక మహిమను మీ ముందు పెడుతున్నాను.

కీనారాం బాబా జీవించి వున్న కాలంలోనే కాలూరాం, కుమారస్వామి అనే మరో ఇద్దరు మహాత్ములు కూడా కాశీలో నివసించేవారు. ఒకసారి ఈ ముగ్గురు హరిశ్చంద్రఘాట్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారట. వారికి చిలుం త్రాగాలనిపించిందట.

కాని ఆ వస్తువులు తీసుకురావడానికి అక్కడ ఏ వ్యక్తి లేరు. అంతలో గంగానదిలో ఒక శవం కొట్టుకురావడం చూశారు కీనారాంబాబా. వెంటనే ఆ శవాన్ని పిలిచారట. బాబా పిలుపు వినగానే ఆ శవం నీళ్ళలో నుండి లేచి వచ్చి వారి ముందు నిలబడిందట. అపుడు కీనారాంబాబా, పైన వున్న దుకాణం వద్దకు వెళ్ళి చిలుం త్రాగడానికి కావలసిన వస్తువులు తీసుకురమ్మని చెప్పారట. 

అలాగే ఆవ్యక్తి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చాడట. చనిపోయిన వ్యక్తిని ఒక పిలుపుతో బ్రతికించారట కీనారాంబాబా. మనకు వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కాని అది ఆయన భక్తుల నమ్మకం. ఇది ఒక కాల్పనిక కథ కాదు. ఇప్పటి వారు తమ పెద్దల ద్వారా విన్నదే నాకు చెప్పారు. ఇది నిజంగా జరిగి వుంటే మాత్రం ఆయన అసామాన్యమైన శక్తివంతుడు అనడంలో సందేహం ఏమి లేదు.

సమాధి దర్శనం తర్వాత కాస్త దూరంలో వున్న కుండ్ దగ్గరికి వెళ్ళాము. ఆ కుండంలో నీరు చాలా స్వఛ్ఛంగా వున్నాయి. ఆ కుండానికి మెట్లు ఒక వైపు మాత్రమే వున్నాయి. నీటిని చూసి ఆశ్చర్యపోయాను. మెట్లకి దగ్గరగా చాలా చేపలు వున్నాయి.

అవన్నీ ఒక జాతి రకం చేపలు. 5 నుండి 10 కిలోల చేపలు కూడా ఉండటం విశేషం.50 నుండి 100వరకు చేపలు అలా మెట్ల దగ్గరగా ఉండటం చూస్తే ఆశ్చర్యంగా వుంది. మనోజ్ చెప్పాడు కొన్ని సార్లు అంతకన్నా పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయట ఆ కుండంలో. ఆ కుండంలోని చేపలనే వండి ప్రతి ఆదివారం కీనారాంబాబాకి నివేదిస్తారు.ఆ కుండంలోని నీరు పాతాళగంగ నుండి వస్తుందని భక్తుల నమ్మకం. 

ఆరోగ్య సమస్యలు వున్నవారు ఈ కుండంలో స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలి వేస్తే వారి సమస్యలు తీరుతాయని వారి నమ్మకం. నేను కూడా నీటిలోకి దిగి కొంచెం నీరు తీసుకొని మీద జల్లుకున్నాను. నా దగ్గర కొన్ని బిస్కెట్స్ వున్నాయి. మనోజ్‌తో ఆ విషయం చెప్పి చేపలకు వేయనా అని అడిగాను.అంతలో నల్లబట్టలతో వున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. మనోజ్ అతనితో చేపలకు బిస్కెట్స్ వేయొచ్చా అని అడిగాడు. ఇంతకు ముందు భక్తులు చేపలకు ఆహారం పెట్టడానికి అనుమతి వుండేది.

కాని ఇపుడు లేదు ఎందుకంటే కొన్ని సార్లు వాళ్ళు పెట్టే ఆహార పదార్ధాల వల్ల చేపలు జబ్బు పడటం, చనిపోవడం జరిగాయి అని చెప్పాడు. ఇది వినగానే చేపలకు ఆహారం పెట్టాలనే నా ఆలోచన విరమించుకొని పైకి వచ్చాను.ప్రస్తుత మఠాధిపతి ఎవరు, ఆయనను కలవచ్చా అని అడిగాను ఆ వ్యక్తిని. గౌతంబాబా ప్రస్తుతం ఇక్కడ లేరు. 10వ తేదీ రండి అప్పుడు ఉంటారు, దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఆశ్రమం బయటకు వచ్చాము. 

పుస్తకములు అమ్మే షాపులో నేను కొన్ని అఘోరా పుస్తకాలు కొన్నాను. చెప్పులు వేసుకోవడానికి వెళ్తుండగా మనోజ్ గొణుక్కుంటూ వెళ్ళడం కనిపించింది. కాళ్ళు కడుక్కోవడం కోసం వున్న కుళాయిని ఎవరో సరిగా ఆపలేదు చిన్న ధారలా నీరు పోతుంది. 

అక్కడ వున్న ఆశ్రమ సిబ్బంది కాని, భక్తులు కాని ఇది పట్టించుకోలేదు కాని మనోజ్ వెళ్ళి దాన్ని పూర్తిగా ఆపి వచ్చాడు. ఎంతనీరు వృధా అవుతుంది. ఆపేవాళ్ళు కుళాయిని సరిగా ఆపాలి కదా అంటూ విసుక్కుంటున్నాడు.అందరూ చాలా చిన్న విషయంగా తీసి వేస్తున్న విషయంలో మనోజ్ ఆలోచన విధానం, సున్నితత్వం కనిపించింది. 

ఇలాంటి వ్యక్తినా నేను ముందు రోజు ఒక రౌడీలా ఊహించి భయపడింది అనుకున్నాను. తనను చూసి నవ్వుతున్న నన్ను గౌరవ్ ఏమైందని అడిగాడు. ముందు రోజు మనోజ్ నన్ను అడ్డగించడం, నేను భయపడటం గురించి చెప్పాను. గౌరవ్ గట్టిగా నవ్వేస్తూ ఏమిటి మనోజ్‌ని చూసి భయపడ్డారా? తను చూడటానికి అలా మొరటుగా వుంటాడు కాని చాలా మంచివాడు అన్నాడు. నిజమే రూపం చూసి మనిషి స్వభావం అంచనా వేయకూడదేమో.

Episode - 19

కీనారాంబాబా మఠ్ నుండి లోలార్ కుండ్ వెళ్ళాలనుకున్నాం. గౌరవ్‌కి కొంచెం పని వుండటం వలన గౌరవ్, ఘాట్‌కి వెళ్ళిపోయాడు. నేను మనోజ్ లోలార్‌కుండ్‌కి బయలుదేరాము. లోలార్ కుండ్ కూడా ఘాట్‌లకి దగ్గరగానే వుంది. గేట్ లోపలికి వెళ్ళగానే ఎడమవైపు శివుడి గుడి, కుడివైపున మహిషాసుర మర్ధిని, చక్రకాళిల మందిరం మధ్యలో ఒక పురాతన బావి, దాని ప్రక్కనే కుండం వున్నాయి. ఇక్కడి ఆలయంలోని శివుడిని లోలార్‌బాబా అంటారు ఆ విధంగా ఆ కుండ్ లోలార్ కుండ్ అయింది.

ఆలయం దర్శనం చేసుకుని కుండం దగ్గరికి వచ్చాము. అది చాలా దిగువగా వుంది. చాలా మెట్లు క్రిందికి దిగాలి. ఆ కుండానికి మూడు వైపులా మెట్లు వున్నాయి. మెట్ల మధ్య దూరం ఎక్కువగా వుంది అదే విషయం మనోజ్‌తో అన్నాను. మేడమ్ ఈ కుండం ఎప్పటిదో, దీని చరిత్ర ఏమిటో ఎవరికి తెలియదు కాని మా పూర్వీకుల ద్వారా మేము విన్నది ఏమిటంటే ఈ కుండంలోని నీటికి గంగమ్మతో సంబంధం వుంది. గంగానది ప్రవాహం పెరిగితే ఇక్కడ నీరు పెరుగుతుంది. గంగానది ప్రవాహం తగ్గితే ఇక్కడ తగ్గుతుంది.

ఒకసారి అలా కుండంలోని నీటి ప్రవాహం పైపైకి పెరుగుతూ వుందట. ఆ‌ నీటి ప్రవాహం ఎలా ఆపాలో ఎవరికి తెలియలేదట. అప్పుడు ఒక మహాత్ముడు వచ్చి కుండం చుట్టూ మెట్లు కట్టమనీ, వాటి మధ్య బంగారు పలకలు పెట్టమని చెప్పారట. అలా చేయగానే ప్రవాహం క్రిందికి దిగిందట. ఇప్పటికీ ఈ మెట్ల మధ్య బంగారు పలకలు వుంటాయని మా నమ్మకం అన్నాడు. అది విని నేను ఆ మెట్లను చూశాను, అవి చాలా పురాతన కాలం మెట్లు. రాళ్ళు కలపడానికి మధ్యలో వాళ్ళు వాడినది ఒక విచిత్రమైన పదార్ధమే కాని అది ఏమిటో అర్ధం కాలేదు.

మేము కుండం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక స్త్రీ ఆ కుండంలో స్నానం చేసి పైకి రావడం కనిపించింది. ఏమిటి ఇక్కడ కూడా స్నానానికి ఏదైనా విశేషమా అని అడిగాను మనోజ్‌ని. అవును మేడమ్ ఈ కుండంలో స్నానం చేసి తడిబట్టలు వదిలివేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి. కుష్ఠు వంటి రోగాలు పోతాయి అన్నాడు. ఏ నీటిలో ఏ మహత్యం వుందో ఎవరికి తెలుసు? ఎందుకైనా మంచిదని క్రిందికి దిగి నీళ్ళు తీసి తలపై జల్లుకున్నాను.

ఇపుడు కుండ్ ఖాళీగానే వుంది కానీ కుంభమేళా సమయంలో అయితే కుండ్‌లో స్నానానికి 2 నుండి 3 రోజుల సమయం పడుతుందట. సమయం 10:30 కావస్తుంది. వేడి తీవ్రత అధికంగా వుంది ఘాట్ల మీదికి వచ్చాము. కేధార్‌ఘాట్‌కి వెళ్ళడం కోసం హరిశ్చంద్ర ఘాట్ దాటుతుండగా శవదహనాల వాసనలు గుప్పుమన్నాయి. వెంటనే చేతిరుమాలుతో ముక్కు మూసుకున్నాను. అది చూసి మనోజ్ అందరమూ ఇక్కడికి రావలసిన వారిమే అంటూ బలవంతంగా రుమాలు తీయించాడు.

చేసేదేమిలేక ఊపిరి బిగబట్టి నడుస్తుండగా అక్కడికి దగ్గరలో వున్న టీ షాపుని చూపిస్తూ టీ తాగుదామా అని అడిగాడు. ఏమిటి ఇక్కడ కూర్చొని టీ త్రాగాలా అన్నాను. అవును పర్లేదు టీ త్రాగుతూ ఇక్కడ జరిగేది చూడండి అన్నాడు. ఇక్కడ జరిగే విధానం అంతా నేను ఇంతకు ముందే తెలుసుకున్నాను. ఇక్కడ నేను టీ త్రాగలేను ముందుకు వెళ్దాం అని మనోజ్‌ని బలవంతంగా కేధార్‌ఘాట్ వద్దకు తీసుకువచ్చాను. అక్కడ టీ త్రాగాక మనోజ్‌కి మళ్ళీ కలుస్తానని చెప్పి ఘాట్లమీద నడవసాగాను. 
మీకు చెప్పాకదా క్షమేశ్వర్‌ఘాట్ వద్ద చనిపోయిన వారికి పిండప్రధాన కార్యక్రమాలు జరుగుతాయని. అలాగే అపుడు కూడా జరుగుతున్నాయి.

అక్కడ కొందరు అరుచుకోవడం వినిపించి దగ్గరికి వెళ్ళాను. ఇద్దరు వ్యక్తులు పంతులు గారితో వాదిస్తున్నారు.
వారి మాటలను బట్టి అర్ధమైన విషయం ఏమిటంటే వారిద్దరూ అన్నదమ్ములు. తల్లీదండ్రుల పిండకార్యక్రమం విడివిడిగా చేస్తామని వాదులాడుకుంటున్నారు. పంతులు గారేమో తిడుతున్నారు. ఏలాగో ఆస్తులు వాటాలు వేసుకుని ఉంటారు కదా పిండాలు కూడా వేయాలా ఇదైనా కలిపి చేయండి అని. పిండాల వాటా కోసం గొడవ పడుతున్న అన్నదమ్ముల కోసం సమయం కేటాయించదలుచుకోలేదు. అందుకే మెల్లిగా దశాశ్వమేధఘాట్ వైపుగా నడవసాగాను. అంతలో నా దృష్టి ఒక గేదె మీద, దానిని వివిధ రకాలుగా ఫోటోలు తీస్తున్న ఇద్దరు పాశ్చాత్యుల మీద పడింది. వారిద్దరు ఆ గేదె చుట్టూ గుండ్రంగా తిరుగుతూ అలా ఎందుకు ఫోటోలు తీస్తున్నారో అర్ధం కాలేదు. ఏమి ప్రత్యేకత వుందా అని నేను అక్కడే నిలబడి గేదెను చూడసాగాను. కాసేపటికి గేదె ఫోటో తీసే వారి సంఖ్య ముగ్గురికి పెరిగింది. నాకు ఏమి అర్ధం కావడం లేదు. ఎంత పరిశీలించినా, నాకు మాములుగా కనిపిస్తున్న ఆ గేదెలో వారికి ఏం కనిపించిందో తెలియడంలేదు. 

ఇంతలో ఒక పడవతను వచ్చి నన్ను పలకరించాడు. నేను అతనితో వాళ్ళు ఎందుకు ఆ గేదెని అన్ని ఫోటోలు తీస్తున్నారు. అది ఏమైనా ప్రత్యేకమైనదా అని అడిగాను. అతను నవ్వి లేదు మేడమ్ ఈ పాశ్చాత్యులకి మన దేశంలో అన్నీ వింతలే. ఏది కనిపించినా ఫోటోలు తీస్తారు. మనుషుల నుండి పశువుల వరకు ఎవరిని వదిలిపెట్టరు. అటు చూడండి అంటూ ఇంకో వైపు చూపించాడు అక్కడ ఒక పాశ్చాత్యురాలు ఒక కుక్క ఫోటోలు తీసుకుంటుంది అది పెద్ద విశేషమయినది కాదు ఒక మాములు ఊరు కుక్క. ఆమె దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది కెమెరాతో. వీళ్ళ దేశాల్లో కుక్కలు, గేదెలు, ఆవులు ఉండవా అనిపించింది. ఎవరి పిచ్చి వారికి ఆనందం. వారి ఆనందాన్ని వారికే వదిలి ముందుకు కదిలాను.

సాయంత్రం 5 గం,, లవుతుండగా రాజాఘాట్ పైనే వున్న లాహిరి మహాశయుల ఆశ్రమానికి బయలుదేరాను.

Episode - 20

ఒక చిన్న సందులో ఒక ఇంటి ముందు లాహిరిబాబా ఆశ్రమం అన్న బోర్డు కనపడింది. తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. ఎవరు కనిపించకపోవడంతో కాస్త లోపలికి వెళ్ళాను. వసారాను ఆనుకొని వున్న రెండు గదులు తాళం వేసి వున్నాయి, లోపలగా వున్న వసారాలో ఇద్దరు వ్యక్తులు కూర్చుని వున్నారు. నన్ను లోపలికి రమ్మని ఆహ్వానించారు. మొదటిసారి ఇక్కడికి వచ్చారా అని అడిగారు. అవును అన్నాను. అయితే దర్శనం చేసుకోండి ముందు అన్నారు. వారు కూర్చున్న వసారాకు ఆనుకొని వున్న చిన్న గదిలాంటి మందిరంలో మహాఅవతార్‌బాబాజీ విగ్రహం వుంది. ఆయనే లాహిరి మహాశయుల గురువుగారు. ఆ వసారాకి ఎదురుగా కాస్త దూరంలో లాహిరి బాబా సమాధి మందిరం, శంకరభగవానుని మందిరం వున్నాయి. వరుసగా నమస్కారాలు చేసుకొని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. నేను దక్షిణ భారతదేశం నుండి వచ్చానని పరిచయం చేసుకున్నాను.

లాహిరిబాబా గురించి నేను కొంత ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో చదివానని నాకు ఆయన గురించి ఇంకేమైనా క్రొత్త విషయాలు చెప్పమని అడిగాను. అపుడు వారిలో విజయ్‌బాజ్‌పాయ్ అనే వ్యక్తి లాహిరిబాబా గురించి, తరువాత వారి పరంపరలోని వారి గురించి, ప్రస్తుత గురువు గురించి ఎన్నో వివరాలు చెప్పారు. ఆ విషయాలు చెప్పేముందు నేను మీకు లాహిరిబాబా గారి గురించి నాకు తెలిసింది చెప్పాలను కుంటున్నాను.

లాహిరిబాబా(శ్యామాచరణ్ లాహిరి) 30 సెప్టెంబర్ 1828 సం,,లో కలకత్తాలో జన్మించారు. మిల్ట్రీలో Accountant గా ఉద్యోగం చేసేవారు. ఆయనకు చిన్న వయస్సులోనే కాశీమణితో వివాహం జరిగింది. ఉద్యోగంలో భాగంగా హిమాలయాలకు దగ్గరగా వుండే రాణిఖేద్‌లో పనిచేస్తున్నపుడు జరిగిన ఒక సంఘటన, మొత్తం ఆయన జీవితాన్నే మలుపు త్రిప్పింది.

ఒక సాయంత్రం హిమాలయ సానువుల్లో తిరుగుతున్న ఆయనకు ఒక ఎత్తైన కొండపై నుండి ఒక వ్యక్తి తన పేరు పెట్టి పిలవడం వినిపించింది. ఆయన అక్కడికి బదిలీ అయి వచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు. తనని తెలిసిన వాళ్ళు కూడా లేని ప్రదేశంలో ఒక అపరిచిత వ్యక్తి తన పేరు పెట్టి పిలుస్తుండడంతో ఆశ్చర్యపోయాడు. బాగా గమనించగా ఆ వ్యక్తి ఆయనను పైకి రమ్మంటున్నారని అర్ధమైంది. ఎవరో చూద్దామనే ఉత్సాహంతో లాహిరిబాబా కొండపైకి వెళ్ళారు. ఆ వ్యక్తి లాహిరిబాబాని ఒక గుహలోకి తీసుకువెళ్ళారు. ఆ గుహలో ఒక కమండలం, ధ్యానం చేసుకునే ఆసనం వున్నాయి. ఆ వ్యక్తి లాహిరి మహాశయునితో, లాహిరీ! గుర్తుపట్టలేదా? ఇక్కడే నువ్వు ధ్యానం చేసుకునేవాడివి అంటూ ఆయనను స్పృశించారు. ఆ మహాత్ముని స్పర్శా శక్తి ఎలాంటిదో కాని లాహిరి మహాశయుల అజ్ఞాన పొరలు తొలిగిపోయాయి.

ఆయనకు ఆయన గత జన్మలు గుర్తుకు వచ్చాయి. తన ఎదురుగా వుంది ఎవరో కాదు. తన జన్మజన్మల గురువు మహావతార్ బాబాజీ. మహావతార్ బాబాజీ వయస్సు 2000సం,,లు. ఆయన పూర్వాపరాలు ఎవరికీ తెలియవు. ఇప్పటికీ మహావతార్ బాబాజీ జీవించేవున్నారని, ఆయన అనుగ్రహం కలిగిన వారు ఆయనను దర్శిస్తుంటారని ప్రసిద్ధి. గురువును చూసిన ఆనందంలో లాహిరి బాబా వారు ఎంతో చలించిపోయారు. తాను ఇన్ని సం,,లుగా తన గురువుకు దూరంగా మోహ జీవితంలో బ్రతికినందుకు నిందించుకున్నారు. కాని బాబాజీ, లాహిరి మహాశయులని ఊరడించారు.

ఇదంతా దైవసంకల్పం అని భవిష్యత్తులో కూడా లాహిరి మహాశయులు సంసారంలోనే ఉండి అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్న వారికి జ్ఞాన వెలుగును చూపాలని ఆదేశించారు. బాబాజీని వదిలి వెళ్ళడానికి మొదట ఒప్పుకోకపోయినా తరువాత ఆయన మాట ప్రకారమే చేయడానికి ఒప్పుకున్నారు. అప్పుడే బాబాజీ లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షని ప్రసాదించారు. అక్కడి నుండి వచ్చాక లాహిరి మహాశయులు కాశీనే తన స్థిర నివాసంగా మార్చుకున్నారు. భార్య, పిల్లలు,సంసార బాధ్యతల మధ్య ఉంటూనే ఎంతోమంది జ్ఞానపిపాసులకు జ్ఞానాన్ని అందించారు. క్రియాయోగ దీక్షని ప్రసాదించారు. లాహిరిబాబా శిష్యులలో ప్రముఖుడు యుక్తేశ్వర్‌గిరిబాబా.

ఆయన శిష్యుడే “ఒక యోగి ఆత్మకధ” అనే పుస్తకంతో ఆధ్యాత్మిక చరిత్రలో సంచలనం సృష్టించిన వారే పరమహంస యోగానంద.ఈ పుస్తకం ద్వారా ఆయన ఎంతో మందికి పరిచయం. దేశవిదేశాలలోని శిష్యులకు క్రియాయోగ దీక్షను అనుగ్రహించారు. ఈయన 1893లో జనవరి 5న జార్ఖండ్‌లోని ఘోరక్‌పూర్‌లో జన్మించారు. 1952మార్చ్7న పరమపదించారు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న అద్భుతయోగి యోగానంద.

ఈ అద్భుత యోగి యొక్క పరమగురువైన లాహిరిబాబా ఆశ్రమంలోనే ఇప్పుడు నేను కూర్చొని వున్నది. లాహిరిబాబా గురించి ఏమైనా చెప్పమని అడిగినప్పుడు విజయ్ భాజ్‌పాయ్ ఇలా అన్నారు.
విజయ్: ఏ జ్ఞానం కోసం అయితే అందరూ సంసారం, బాధ్యతలు అన్నీ వదిలి శ్రమిస్తారో దానిని సంసారంలో వుండే సాధించారు లాహిరిబాబా. మీకు తెలుసా కాశీలో లాహిరిబాబా సమకాలీకులుగా నివసించిన త్రైలింగస్వామి వారు ఒకసారి లాహిరిబాబాని దర్శించారు. అప్పుడు ఆయన అక్కడ వున్న వారితో గృహస్థాశ్రమంలో ఉండి ఈయన అన్నీ సాధించారు. మాకు మాత్రం అన్నీ వదలవలసివచ్చింది అన్నారు.

మరొకసారి ప్రముఖ వ్యక్తి ఒకరు విగ్రహారాధన వుండకూడదు అనే ఉద్దేశ్యంతో విశ్వనాధ మందిరంలోని శివలింగం విరగ్గొట్టాలని చాలా మందితో వాదించారు. విషయం తెలిసిన లాహిరిబాబా, ఆలయానికి వెళ్ళారు. విగ్రహంలోనే భగవంతుని అస్థిత్వం దాగి వుంది. ఇది నమ్మే ప్రజలు తమ బాధలు ఆయనకు విన్నవించుకొని ఉపశమనం పొందుతున్నారు.

పూజలు చేసి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. మీరు మార్పు తేవాలనుకుంటే ప్రజల మనసులలో తీసుకురండి. అంతేకాని ఆలయంలోని విగ్రహాలు విరగ్గొట్టడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు అన్నారు. ఈ మాటలతో ఆ ప్రముఖుని అహం విరిగిపోయింది. విశ్వనాధ మందిరంలోని 74 స్తంభాలలో ఆయనకు లాహిరిబాబా కనిపించారు.

Episode - 21

నేను: లాహిరిబాబా పుస్తకములు ఏమైనా రాశారా?
విజయ్: బాబా పుస్తకముల రూపంలో ఏమి రాయలేదు కాని 26 డైరీలు రాశారు. మొదటి దానిలోనే ఆ డైరీలు ప్రచురించవద్దని రాశారు. ఆయనకు భగవంతుని పట్ల ఉన్న అభిప్రాయాలు, పద్ధతులు మరొక ధర్మంగా రాకూడదు అనేవారు. అందుకే ఆ డైరీలు ప్రచురించవద్దని కోరారు. ఎలాంటి ట్రస్టులు ఏర్పాటు చేయవద్దన్నారు. ఎవరి దగ్గరి నుండి డొనేషన్స్ తీసుకోవద్దు అన్నారు. ఇప్పటికీ ఇవి అన్ని మేము ఆచరిస్తాము. కాని కొన్నిసార్లు పొరపాట్లు జరగుతుంటాయి. నేను ఇప్పుడు చెప్పానే మీకు 26 డైరీల గురించి ఈ డైరీలు, మరియు లాహిరిబాబా వాడిన కొన్ని వస్తువులను ఇంతకు ముందు సందర్శకులు చూడటం కోసం వుంచేవారము. కాని బాబాజీ బంధువులలోనే ఒకరు కొన్ని సం,,ల క్రితం 4 డైరీలు దొంగిలించి ఒక ప్రముఖ సంస్థకు కోటి రూపాయలకు అమ్ముకున్నారు. అప్పటి నుండి సందర్శనకు పెట్టడం లేదు.
నేను : ప్రస్తుత గురువు ఎవరు? 
విజయ్ : లాహిరిబాబా తరువాత వారి సంతానం నుండి ఈ పరంపర కొనసాగింది. ఇప్పుడు 4 వ తరం వ్యక్తి గురువుగా వున్నారు.

లాహిరిబాబా కుమారుడు తీన్‌కౌర్ లాహిరి. ఆయన కుమారుడు సత్యచరణ్ లాహిరి ఆయన కుమారుడే శివేందులాహిరి. అంటే లాహిరిబాబా ముని మనవడు శివేందు లాహిరి ప్రస్తుత గురువు. ఈయన వయస్సు 77సం,, లు ఈయన బొంబాయిలో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసేవారు. తండ్రి గారి కోరిక ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాయోగ దీక్షని ఇవ్వడం మొదలు పెట్టారు. గురువు గారు ఎవరి నుండి ఎలాంటి దక్షిణ తీసుకోరు, ఎవరైనా ప్రోగ్రామ్ ఏర్పాటుచేస్తే అక్కడికి వెళ్తారు దీక్ష ఇచ్చి వస్తారు. చివరికి ఆయన ప్రయాణ ఖర్చులు కూడా ఆయనే పెట్టుకుంటారు.
నేను : మరి ఇప్పుడు ఆయన ఎక్కడ వున్నారు?
విజయ్ : ఫ్రాన్స్‌లో.
నేను : భారతదేశంలో ఎప్పుడు ఉంటారు?
విజయ్ : జనవరి, జూలై, అక్టోబర్ నెలలలో మొదటివారం వుంటారు. అంటే సం,,లో మొత్తం 21 రోజులు ఇండియాలో వుంటారు. 
నేను : మరి ఈ ఇంటిని ఎవరు చూసుకుంటారు?
విజయ్ : నేను, ఈయనే చూసుకుంటాం. ఇపుడు మీరు చూస్తున్నది 200 సం,,ల క్రితం కట్టిన ఇల్లు. లాహిరి బాబా నివసించిన ఇల్లు 300 సం,,ల క్రితంది. ఆ ఇల్లు చిన్నగా వుండటం వలన సరిపోక అది మూసివేసి ఈ ఇల్లు కట్టించారు. ఇప్పుడు ఈ పాత ఇల్లు ఎవరూ వాడటం లేదు.
నేను : నేను ఆ ఇల్లు చూడవచ్చా?
విజయ్ : లేదు.
నేను : శివేందులాహిరి గారి తర్వాత గురువు గారు ఎవరు?
విజయ్ : ఆయన కుమారుడు ఉజ్వల్ లాహిరి.
నేను : ఆయన ఎక్కడ వుంటారు?
విజయ్ : ఇంగ్లండ్‌లో ఉంటున్నారు. తండ్రి గారి తర్వాత ఆయనే క్రియాయోగ దీక్షనిచ్చే బాధ్యత తీసుకుంటారు.
నేను : అసలు క్రియాయోగ దీక్ష అంటే ఏమిటి?
విజయ : క్రియాయోగ దీక్ష తీసుకోవాలంటే 18సం,,ల పైనే వయస్సు కలిగి వుండాలి. బుద్ధిహీనులకు ఈ దీక్షని ఇవ్వరు. ఈ దీక్షకు 40 ని,,ల సమయం పడుతుంది.

దీన్ని గురించి భగవద్గీతలో వుంది. కృష్ణుడు, అర్జునుడికి క్రియాయోగదీక్షని గురించి భోదించాడు. ఈ దీక్ష తీసుకోవాలంటే శిష్యుడిగా మారాలి. ఇష్టం వున్నవారే గురువుగా స్వీకరించి దీక్ష తీసుకోవాలి. క్రియాయోగం వలన ఆధ్యాత్మిక జీవితంలోనే గాక మామూలు జీవితంలోను ఎన్నో మార్పులు వస్తాయి. క్రియాయోగం చేయడం వలన ఆస్తమా తగ్గుతుంది. మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది. మొత్తం క్రియాయోగం 5 భాగాలుగా వుంటుంది. ప్రతి క్రియ ఎన్నో లాభాలు కలిగిస్తుంది.

1.     తాళంభ క్రియ – గొంతులోని గ్రంధులు బాగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ బాగుంటుంది.
2.    ప్రాణాయామం – ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి. రక్తపోటు కంట్రోల్‌లో వుంటుంది.
3.    నాభిముద్ర – భయం పోతుంది.
4.    యోనిముద్ర – శృంగారపరమైన సమస్యలు నివారణవుతాయి.
5.    మహాముద్ర – సమాధి.ఈ విధంగా క్రియాయోగం వలన మన శరీరం, ఆత్మ ఎంతో వృద్ధి పొందుతాయి.

నేను : ఓ! నిజంగా ఇది చాలా బాగుంది.
విజయ్ : అవును. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలా?
నేను : గురువుగారితో కలవడం కష్టమే కదా అయితే. ఆయన తక్కువగా వుంటారు కదా భారత్‌లో.
విజయ్ : అయినా పరవాలేదు మేడమ్. ఈ పుస్తకంలో ఆశ్రమమును దర్శించిన అందరి పేర్లు, ఫోన్ నెం.లు తీసుకుంటాము. గురువుగారు వచ్చినపుడు ఈ పుస్తకం చూస్తారు. కొందరితో ఫోన్‌లో మాట్లాడుతారు. వీలయితే నేరుగా కూడా కలుస్తారు. మీరు మీ వివరాలు ఇవ్వండి. నా వివరాలు అందులో రాసుకున్నారు. 

నిజమే ఆ పుస్తకంలో చివరిసారి ఆయన వచ్చినపుడు ఆ పుస్తకంని చూసినదానికి గుర్తుగా చివరలో ఆయన సంతకం వుంది. నేను నా వివరాలు ఇచ్చి వచ్చేసాను.అప్పటికే చాలా చీకటిపడింది. కాసేపు ఘాట్‌ల వద్ద కూర్చొని నా గదికి వచ్చేశాను. నా వసతికి వచ్చేసరికి నాకు ఇక్కడ నేను ఊహించని సమస్య ఎదురయ్యింది.

Episode - 22
       
మీకు గుర్తుందా, నేను కాశీ వచ్చిన రోజు నేను బస చేసిన ఆశ్రమం ఇన్‌ఛార్జ్ గురించి చెప్పాను. ఆయనను కాశీలోనే నేను మొదటిసారి కలవడం. ఆయన మంచి హోదాలో ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. వయస్సు పరంగా మా నాన్నగారి కన్నా పెద్దవారు. అంతేగాక నేను వచ్చిన రోజు కూలీవాడి వల్ల జరగబోయిన ప్రమాదం నుండి సహాయం కూడా చేశారు. దాని వల్ల ఎప్పుడైనా ఆయన కనిపిస్తే పలకరించేదాన్ని. ఆయన కూడా నేను వచ్చిన పని ఎలా జరుగుతుందని అడుగుతుండేవారు. కాని త్వరలోనే ఆయన ప్రవర్తనలో మార్పు కనపడింది.

నేను ఒంటరిగా తిరుగుతుండడం, కాశీలో నాకు తెలిసినవారు ఎవరూలేరుఅనేవి ఆయన నా బలహీనతలుగా తీసుకున్నాడేమో, మెల్లి మెల్లిగా నాతో మాట్లాడుతున్నపుడు ఆయన మాటలలో ద్వంద్వార్ధాలు వచ్చేవి. ఇలా ఒకమ్మాయి ఒంటరిగా తిరుగుతుంది అంటే ఆ అమ్మాయి ఆయన దృష్టిలో వ్యక్తిత్వంలేని దానిలా అనిపించిందని అర్ధమైంది. 

అందుకే నిన్న శృతిమించుతున్న ఆయన మాటలకు అడ్డుకట్ట వేస్తూ చాలా గట్టిగా సమాధానం చెప్పాను. అందుకే ఈ రోజు నేను వసతికి వచ్చేసరికి ఆశ్రమం గేట్ వద్దే నన్ను అడ్డగించాడు. రెండు రోజుల్లో నేను గది ఖాళీ చేయాలని చెప్పాడు. ఇది ఊహించని నేను మొదట షాకయ్యాను. కారణం అడిగితే ఎక్కువ రోజులు ఒంటరి అమ్మాయికి గది ఇవ్వరని చెప్పాడు. అంతేకాదు బయట కూడా ఒంటరి స్త్రీకి గది ఇవ్వరని, శివరాత్రి రోజులు కాబట్టి కాశీలో మరీ కట్టుదిట్టం ఉంటుందని హెచ్చరిక కూడా చేశాడు. ఇవి అన్నీ వినగానే నేను చాలా నీరస పడిపోయాను. ఇలా నా పని మధ్యలో ఆపి వెనక్కి వెళ్ళాల్సి వస్తుందేమో అన్న ఆలోచనే నన్ను బలహీనపడేలా చేసింది.

నేను నీరసంగా నా గదికి వస్తుండగా అతను మళ్ళీ నన్ను పిలిచాడు. నువ్వు కావాలంటే నేను నీకు సహాయం చేయగలను ఆలోచించుకో అంటూ నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు. గదికి వచ్చిన నేను భోజనానికి కూడా వెళ్ళలేదు. నా వద్ద వున్న కాశీలోని ఆశ్రమ జాబితా తీసి అందరికీ ఫోన్ చేయడం మొదలుపెట్టాను. ఎవ్వరూ కూడా ఒంటరి దాన్నని గది ఇవ్వమని చెబుతున్నారు. రాత్రంతా అలా ఆలోచిస్తూనే గడిపాను. మనోజ్, గౌరవ్‌లు ఎవరైనా సహాయం చేస్తారేమో అడగాలనుకున్నా.

పూర్తిగా తెల్లవారకుండానే మనోజ్‌కి ఫోన్‌చేసి నాకు వెంటనే గది కావాలి అని చెప్పాను. నేను ప్రయత్నిస్తే దొరకడం లేదని చెప్పాను. మనోజ్ వెంటనే స్పందించాడు. పరవాలేదు మేడమ్ మీరు 7 గం,,లకి ఘాట్ దగ్గరికి రండి నేను గది చూపిస్తాను అన్నాడు. తను చెప్పినట్టుగానే నా కోసం మనోజ్ ఒక గది చూశాడు.

హరిశ్చంద్ర ఘాట్ పైన వున్న రోడ్‌లో ఒక బెంగాలీ ముసలి దంపతులు నడుపుతున్న హోటల్ లాంటి ఇల్లు అది. ఇల్లు 3 అంతస్థులతో చాలా బాగుంది.100 సం,,ల క్రితం కట్టిన ఇల్లు అది. వెంటనే డబ్బు కట్టేసాను. నా లగేజ్ కోసం పాత వసతికి వచ్చాను. నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతూ గది తాళంచెవి ఇవ్వడానికి ఆఫీస్ రూమ్‌కి వెళ్ళాను. ఆ ఇన్‌ఛార్జ్ నేను అలా ఉదయాన్నే వెళ్ళి పోతానని అనుకోలేదేమో ఆశ్చర్యపోయాడు. నీకు ఇంకా రెండు రోజులు ఇక్కడ వసతి వుంది అన్నాడు. నీ సహాయం నాకు అవసరం లేదు, ఇక్కడికి సేవ చేయడానికి వచ్చావు కదా అది సరిగా చేసుకో. 

ఒంటరి వాళ్ళు నిస్సహాయులు అనుకోకు అంటూ వచ్చేయబోయాను. వెనక నుండి అతని మాటలు వినిపించాయి. పడవ వాళ్ళ సహాయం తీసుకొని వుంటావు ఆ అబ్బాయిలు మంచివారు కాదు, చూడు నిన్ను మోసం చేస్తారు అని. నేను పట్టించుకోకుండా వచ్చేసి నా కొత్త వసతిలో చేరాను.

ఈ ప్రయాణంలో ఆ ఇన్‌ఛార్జ్ అనుభవం నాకు విసుగును కలిగించింది. ఎలాంటి వారు వున్నారు ఈ సమాజంలో అనిపించింది. వసతి మారే పనిలో ఇప్పటికే ఆలస్యం అయింది. ఈ రోజు శ్రీమఠం గురువు గారిని కలవాల్సిన రోజు. నా వస్తువులు అలా గదిలో పడేసి బయటకు వచ్చేసాను.

శ్రీ మఠం చేరుకునేసరికి ఉదయం 9.30 ని,,లు అయింది. నేరుగా మఠ నిర్వాహకుని వద్దకు వెళ్ళాను. గురువు గారు వచ్చారు. కబీర్ చౌరహా వద్దనున్న ఆశ్రమంలో ఉన్నారు. మీతో పాటు ఇద్దరు పిల్లలు వస్తారు. వారు మిమ్మల్ని గురువు గారి వద్దకు తీసుకువెళతారు అని చెప్పారు. ఇద్దరు పిల్లలని నాతో పంపారు. ధన్యవాదాలు చెప్పి వచ్చేస్తుండగా పిల్లలతో చెప్పారు ఆమెకు దండపాణి, బిందుమాధవ్ ఆలయాలు కూడా దర్శనం చేయించమని.

ఆయన చెప్పినట్టుగానే ఆలయాల దర్శనం చేసుకొని కబీర్‌చౌరహాకి రిక్షా ఎక్కాము. నాతో వచ్చిన పిల్లలు విశ్వజిత్ 13సం,,లు, శ్రీభం 12సం,,ల వయస్సు వారు.

బీహార్ నుండి వచ్చి మఠంలో ఉంటూ వేదం చదువుకుంటున్నారు. వాళ్లు అక్కడికి వచ్చి 4సంవత్సరాలైందని చెప్పాడు శ్రీభం. అంతేకాదు ఉదయం 4 గం,,లకే లేవాలని, చల్లని నీటితో స్నానం చేయాలని, సెలవులలో ఇంటికి వెళ్ళినా వేదం చదవాలనీ, అలా మాట్లాడుతూ మధ్యలో నన్ను అడిగాడు నువ్వు ఎప్పటి నుండి చేరుతావు అని. ఆ ప్రశ్నకి నేను నవ్వుకున్నాను.

మఠంలో చేరడానికి వచ్చాననుకుంటున్నారు వాళ్ళు నన్ను. ఆ విషయం మీదే నేను గురువు గారిని కలుస్తున్నాననుకుంటున్నారు. నేను మఠంలో చేరడంలేదని తెలిసాక వాళ్ళ ముఖంలో కొంచెం నిరుత్సాహం కనపడింది. పిల్లలకు ఇంటి మీద బెంగ బాగానే ఉందనిపించింది. కబీర్‌చౌరహాలోని ఆశ్రమంలోకి ప్రవేశించాం.

Episode - 23

మూడు అంతస్తుల ఆ భవనంలోని2 వ అంతస్తులో ఒక గది దగ్గరికి వాళ్ళు నన్ను తీసుకువెళ్ళారు. గదిలోకి ప్రవేశించిన నాకు ఎదురుగా సోఫాలో 77 ఏళ్ళ స్వామి రామానంద రామ నరేష్ గారు కూర్చుని వున్నారు. పూర్తి కాషాయ వస్త్రధారి. ఆయనకు ఎడమవైపు ఇద్దరు ముగ్గురు స్త్రీలు, కుడివైపు కొందరు మగవారు వున్నారు. నన్ను చూడగానే ఆడవారు పక్కకు జరిగి కొంత చోటు ఇచ్చారు. వాళ్ళందరికి గురువుగారు తమ యాత్రా విశేషాలు చెబుతున్నారు. మధ్యమధ్యలో నన్ను చూస్తున్నారు.

కొంతసేపటికి నన్ను పలకరించారు. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావని అడిగారు. నేను నా వివరాలు చెప్పాను. ఏమిటీ! అంతదూరం నుండి ఒంటరిగా వచ్చావా అని ఆశ్చర్యపోయారు. వారణాసి ఎలా వుంది. నీకు సౌకర్యంగానే వుందా. ఎక్కడ దిగావు? వసతి అది బాగుందా అని అడిగారు. ఆయన అలా అడగగానే నాకు ఉదయం నేను వసతి మారడం, దానికి కారణం గుర్తుకు వచ్చింది. అంతా బాగుంది అని చెప్పాను ఆయనకు. కాసేపటికి అందరికీ ఆయనే ప్రసాదం ఇచ్చారు, నాకు ఇస్తూ భగవంతుని కార్యం చేయడం మంచిదే. కాని అందుకు చాలా సమస్యలు ఎదుర్కోవాలి. నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి అని చెప్పారు. ఆయనకి నమస్కరించుకొని ఘాట్‌ల మీద అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను.


       నా ప్రధాన ఉద్దేశ్యం మఠాధిపతులను, పీఠాధిపతులను కలవడం కాదు. గుప్తంగా ఉన్న మహాత్ములను కలవడం. అందుకే ఇప్పటి వరకు నా కాశీయాత్ర నాకు ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. కాశీలో చాలామంది మహాత్ములు, అఘోరాలు ఉంటారని విన్న నాకు ఇక్కడి పరిస్థితులు నిరాశను కలిగిస్తున్నాయి. 


కాని తప్పదు వెన్న కావాలంటే మజ్జిగను బాగా చిలకాల్సిందే. అందుకే నా నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చుకున్నాను. పడవల వాళ్ళతో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చేమో అనే ఉద్దేశ్యంతో రాణామహల్ ఘాట్ వద్ద ఉన్నవారిని పలకరించాను. వారు వినోద్‌యాదవ్, చోటేలాల్‌సహాని. వాళ్ళు, నేను మహాత్ములని వెతుకుతున్నానని విని,ఇప్పుడు అలాంటి వారు ఎక్కడ వున్నారు. వస్తే శివరాత్రికి రావచ్చు ఇంకెవరైనా ఉంటే కనుక్కుంటాం అని చెప్పారు. వారికి నా ఫోన్‌నెం. ఇచ్చి క్షమేశ్వర్ ఘాట్‌కి వచ్చాను.


  అక్కడ గౌరవ్, ఇంకా కొంతమంది టీ షాపు దగ్గర కూర్చొని వున్నారు. నేను టీ తీసుకొని వారికి కాస్త దూరంలో కూర్చుని వున్నాను. కాసేపటికి 6 అడుగుల పొడవు, తెల్లని ఒంటిఛాయ, కళ్ళజోడు, నల్లపంచె, నల్లచొక్క, తలకి నల్లబట్ట చుట్టుకొని వున్న ఒక పాశ్చాత్యుడు కట్టెల మోపు మోసుకుంటూ వచ్చి ఆ టీ దుకాణం వద్ద ఆగాడు. అప్పుడు చూశాను అతను పెట్టుకున్న బొట్టు కూడా నల్లని మసి లాంటిదే. అతను అఘోరా అని అతని వేషధారణతో అర్ధం అవుతుంది. అందులోను ఒక పాశ్చాత్యుడు. అతను ఎవరో, ఆ కట్టెలు ఎక్కడి నుండి తెస్తున్నాడో ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాను.


  అతను కట్టెల మోపు ప్రక్కన పెట్టి టీ అడిగాడు. అక్కడ కూర్చున్న వారు అతనిని ఏదో అడుగుతున్నారు. అతను సమాధానం చెప్పడం లేదు. గంభీరంగా వున్నాడు. టీ త్రాగడం అయిపోగానే మళ్ళీ ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకొని క్షమేశ్వర్ ఘాట్ నుండి పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. నేను ఆలస్యం చేయకుండా వెళ్ళి గౌరవ్‌ని అడిగాను అతను ఎవరని. అతను ఒక అఘోరబాబా శిష్యుడని చెప్పాడు. అడ్రస్ తెలుసా అని అడిగాను, తెలియదన్నాడు. సరే అయితే నేను అతనిని అనుసరిస్తానని చెప్పి పైకి వెళ్ళాను.


       ఆ యువకుడు కేథార్‌నాధ్ ఆలయం వీధి గుండా నడుస్తున్నాడు. కాస్త దూరంగా వుండి నేను అతనిని అనుసరిస్తున్నాను. వీధిలో బాగానే జనం వుండి రద్దీగా వుంది. కాని అందరూ అతణ్ణి చూడగానే తప్పుకొని దారి ఇస్తున్నారు. అందరూ అతన్ని వింతగా చూస్తున్నారు. ఆ వీధి చివరకు వచ్చేసరికి ఒక మందుల దుకాణం ముందు అతడి కట్టెల మోపు క్రింద పడిపోయింది. అది చూసి దుకాణ యజమాని కోపంగా ముఖం పెట్టాడు. ఇంతకు ముందే గౌరవ్ నాతో చెప్పాడు ఆ కట్టెలను అతను మణికర్ణికాఘాట్ స్మశానం నుండి తీసుకువెళ్తున్నాడని. శవ దహనం జరిగాక మిగిలిన సగం కాలిన కట్టెలు అవి. అఘోరాలు ధునిలోకి వాడుతారు వాటిని.


  స్మశాన కట్టెలు తన దుకాణం ముందు క్రింద పడటంతో దుకాణ యజమానికి కోపం వచ్చింది. ఆ యువకుడు కట్టెలు సరిగా కట్టుకొని తల మీద పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. నేను అనుసరిస్తున్నాను. హరిశ్చంద్రరోడ్‌లో ఉన్న ఒక రిక్షా దగ్గరికి వెళ్ళి ఏదో అడిగాడు. నేను కొంచెం దూరంగా వుండటం వలన నాకు ఏమి వినిపించడం లేదు. ఆ రిక్షా ఎక్కి వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళి ప్రక్కనే వున్న ఇంకో రిక్షా అతణ్ణి అడిగాను, ఆ యువకుడు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడని. అతను పుష్కర్ తలాబ్ వెళ్ళాలన్నాడని చెప్పాడు. అది ఎక్కడ వుంది అని అడిగాను.


 ఇంతలో మా సంభాషణ వింటున్న ప్రక్కన ఉన్న టీ షాపతను మీరు ఎవరు మేడమ్ అని అడిగాడు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి విలేకరిని అన్నాను. ఆ యువకుడు పుష్కర్ తలాబ్ వెళ్తున్నాడు. అది అస్సీఘాట్ అవతల వుంది. అక్కడ కొన్ని ఆలయాల సముదాయం వుంది. అక్కడే ఇతని గురువు మౌనిబాబా వుంటారు. అక్కడికే అతను వె

ళ్తున్నాడని చెప్పాడు. సరే ఇపుడు నేను కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చా అని అడిగాను. వెళ్ళొచ్చు మేడమ్ కాని వాళ్ళను అంత నమ్మేలా వుండదు. మీరు మొదటిసారి వెళ్తున్నారు. రేపు ఉదయం వెళ్ళండి ఇప్పుడు చీకటి పడుతుంది కదా అన్నాడు. నాకు అది సబబుగానే అనిపించింది. నీకు ఇంకా ఎవరైనా బాబాలు, అఘోరాల గురించి తెలుసా అని అడిగాను. 


అతను వెంటనే మణికర్ణికాఘాట్ వద్ద ఉన్న శివాలయంలో చూశారా మేడమ్ అక్కడ ఒక అఘోరా ఉంటాడు అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అదేమిటి నేను అక్కడే తిరుగుతున్న ఎంతోమందిని అడిగా, ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదే అని. అతనికి ధన్యవాదాలు చెప్పి వెంటనే మణికర్ణికాఘాట్ వద్దకు బయలుదేరాను.

Episode - 24 (Telugu)

చలికాలం కావడం వలన త్వరగానే చీకటిపడింది. సాయంత్రం సమయం కావడం వలన ఘాట్ వద్ద చాలా శవాలు కాలుతున్నాయి. మెల్లిగా వాటిని దాటుతూ ఆ గుడి దగ్గరికి వచ్చాను. ఆ గుడి నేను కాశీ వచ్చిన మొదటి రోజే చూశాను. అది కొంచెం నేల లోపలికి వుంటుంది. ఆ రోజే నేను బయటి నుండి చూశాను లోపలికి వెళ్ళలేదు. ఇపుడు లోపలికి వెళ్దాం అని ఆలయం ద్వారం దగ్గరికి వెళ్ళాను. ఇంతలో ఆలయం శుభ్రం చేస్తున్న ఒకతను నా దగ్గరికి వచ్చి మీరు ఏదైనా శవంతో వచ్చారా? మాములుగా వచ్చారా? అని అడిగాడు. లేదు నేను ఏ శవంతో రాలేదు అని చెప్పాను. అయితే లోపలికి రండి అన్నాడు.


అప్పుడు చూశాను తలుపుకు వేళాడుతున్న బోర్డ్ శవంతో వచ్చిన వారు గుడిలోకి రావద్దని వుంది. ద్వారానికి ఎదురుగా ధుని మండుతూ వుంది. అందులో కొన్ని త్రిశూలాలు గ్రుచ్ఛబడి వున్నాయి. దాని ప్రక్కనే నల్లబట్టలు ధరించి, మెళ్ళో రంగురంగులపూసల దండలు వేసుకున్న ఒక 60ఏళ్ళ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదురుగా ఒక యువకుడు చాలా భక్తిగా మస్కరిస్తూ నిలబడి ఉన్నాడు.

అప్పుడు ఆలయంలో వారిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ అబ్బాయి ఏదో చెబుతూ ఉంటే ఆ పెద్దాయన వింటూ వున్నారు. నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళాను. కుడి వైపుగా కొంచెం దిగువన మహాస్మశాన్‌నాధ్ పేరుతో శంకరభగవానుడు కొలువై వున్నాడు. నేను ఆయనకు నమస్కరించుకొని వచ్చి ధునికి కాస్తదూరంలో కూర్చున్నాను. ఇపుడు నాకు వారిద్దరి మాటలు వినబడుతున్నాయి.

ఆ అబ్బాయి ఈ రోజు ధ్యానంలో తాను చూసిన శివ దర్శనం గురించి ఆయనకు చెబుతున్నాడు. అనుభవం చెప్పడం అయిపోయాక ఆ పెద్దాయన ఆ అబ్బాయిని కాసేపు కూర్చోమన్నారు. అతను వచ్చి నాకు కాస్త దూరంలో కూర్చున్నాడు. అప్పుడు ఆ పెద్దాయన నాతో నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. నేను నా వివరాలు చెప్పాను. అంతలో ఎవరో ఒకతను వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. ఆయన ధునిలో నుండి విభూతి తీసి వచ్చినతనికి నామాలు పెట్టాడు. నన్ను దగ్గరికి పిలిచి చేయి చాపమన్నాడు. కుడి చేయి చాపాను. కొంత విభూతి నా చేతిలో వేశారు. నేను దాన్ని నా నొసటన పెట్టుకున్నాను.
నేను: మీరు ఏ సంప్రదాయం వారు బాబా?
బాబా: అఘోర సంప్రదాయం.
నేను: ఈ ఆలయం గురించి ఏమైనా చెబుతారా?
బాబా : ఇది మహా స్మశాన్ నాధ్ ఆలయం. ఆయన చాలా శక్తివంతుడు. ఇక్కడ ఏమికోరుకున్నా ఫలిస్తాయి. ఇక్కడ సాధన చేసే వారికి ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అదిగో ఆ కుర్రవాడికి ఈ రోజు చాలా చక్కని అనుభవం కలిగింది.

ఇలా అంటూ ఇంతకు ముందు కుర్రవాణ్ణి చూపించారు. నేను అతని దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏమిటని అడిగాను. సమీర్ అని చెప్పాడు. 32సం,,ల వయస్సు. ఏమి చూశావు ఈరోజు ధ్యానంలో అని అడిగాను. అతను ఎంతో భక్తి పారవశ్యంతో చెప్పడం మొదలుపెట్టాడు. నేను ధ్యానంలో ఉండగా ఎదురుగా ఉన్న స్మశానంలో నాకు శంకరుడు కనిపించాడు. నేను ఆయనకు ప్రణామం చేశాను. ఆయన నాతో పద అన్నారు. నేను వెళ్ళాను. చాలా ఎత్తుకు తీసుకువెళ్ళారు. అంతరిక్షంలోకి వెళ్ళాము. ఈ అనుభవం నాకు చాలా గొప్ప అనుభూతిని కలిగించింది అన్నాడు.
నేను : ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నావు?
సమీర్ : చిన్నప్పటి నుండి.
నేను : ఎవరు నేర్పారు?
సమీర్ : మా నాన్న గారు
నేను : ఏ మార్గం?
సమీర్ : మా నాన్న చెప్పింది కుండలిని యోగం.
నేను : నీ గురువు ఎవరు?
సమీర్ : ఇదిగో ఈ బాబాయే నా గురువు. ఈయనే నాకు ఈ ఆలయంలో పూజలు ఎలా చేయాలో నేర్పారు.
నేను : కుండలినీ యోగం చాలా మంచి మార్గం కదా మరి మళ్ళీ నువ్వు ఎందుకు ఈ మార్గం ఎంచుకున్నావు?
సమీర్ : నేను ఇంట్లో ఆ మార్గంలోనే ధ్యానం చేస్తాను. కాని ఇక్కడ కూర్చొని ఈ మార్గంలో ధ్యానం చేస్తే ఇంకా గొప్ప అనుభవాలు కలుగుతున్నాయి. నేను ఎన్నోసార్లు ధ్యానంలో ఇక్కడ శంకరభగవానుని చూశాను. నాకు ఇంకా బాగా సాధన చేయాలని వుంది. కాని బాధ్యతల వల్ల కుదరడంలేదు.

సమీర్ మాటల ద్వారా అర్ధమైన విషయం, సమీర్ మంచి ఆధ్యాత్మిక కుటుంబ నేపధ్యం ఉన్నవాడు. అతనికి కుండలిని జాగృతి కూడా వుంది. అతని ఆ సాధన ఫలితమే ఈ అనుభవాలు అనిపించింది. మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. మొదటి చక్రం గుదభాగంలో ఉంటుంది. దీన్ని మూలాధార చక్రం అంటారు. ఇక్కడ కుండలినీ శక్తి నిక్షిప్తమై వుంటుంది. 

ఈ చక్రానికి కాస్త పైన స్వాధిష్టాన చక్రం వుంటుంది. పొట్ట వద్ద మణిపూరక చక్రం, హృదయ స్థానం వద్ద అనాహత చక్రం, దాని పైన విశుద్ధ చక్రం, రెండు కనుబొమ్మల బిందు స్థానంలో ఆజ్ఞా చక్రం, తల పై భాగంలో సహస్రార చక్రం వుంటాయి.ధ్యాన తీవ్రత ఎక్కువైనప్పుడు మూలాధారంలోని కుండలినీ శక్తి జాగృతమై పై అన్ని చక్రాల గుండా ప్రయాణించి సహస్రారాన్ని చేరుతుంది. 

దీన్నే ఆత్మదర్శనం లేదా నిర్వికల్ప సమాధి అంటారు. ఈ సమాధిలో మనిషి నువ్వు నేను అనే భావాలను కోల్పోతాడు. అంతటిలో తానే వుంటాడు. తనలోనే అంతా ఉంటుంది. దీన్నే తనలోని భగవంతుడిని చూడటం అంటారు. దీని కోసమే సాధకులు సర్వాన్ని వదులుకొని సాధనలు చేస్తారు.

ఇలాంటి మంచి సాధన మార్గంలో ఉన్నాడు సమీర్ అతని తండ్రిగారి మార్గదర్శకత్వం వలన. కాని దాని విలువ తెలియని సమీర్ కేవలం అనుభవాల వెంట పడుతున్నాడనిపించింది. 

ఇక నా దృష్టి సమీర్ నుండి ఆ అఘోరబాబా వైపు మళ్ళింది.


Episode: 25:-

నేను ఆయనతో, మీతో కొంత మాట్లాడాలనుకుంటున్నాను అని అడిగాను. ఆయన సరే అని వచ్చి నాకు కొంచెం దూరంలో కూర్చున్నాడు.
నేను: మీపేరు?
బాబా: కృష్ణానంద్‌జీ.
నేను: ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఉంటున్నారు? మీ వివరాలు ఏమిటి?
బాబా: 10 నెలల నుండి ఇక్కడ ఉంటున్నాను. నా పుట్టుక వివరాలు తెలియవు. అడవుల్లో తిరుగుతూ వుండేవాడిని. అలా ఈ మార్గంలోకి వచ్చాను.
నేను: మీ గురువు ఎవరు?
బాబా: ఈ శంకరుడే.
నేను: అఘోర దీక్ష ఎవరు ఇచ్చారు?
బాబా: శంకరుడే చెప్పాడు?
నేను: అలా ఎలా కుదురుతుంది?
బాబా: అవును నాకు శంకరుడే చెప్పాడు. మీరు ఆయనే గురువు అనుకుంటే అన్నీ ఆయనే ఇస్తాడు.
నేను: అఘోర దీక్ష సమయంలో నరమాంసం తింటారనీ, తంత్రపూజలు చేస్తారని విన్నాను అది నిజమేనా?
బాబా : అలా ఏమీ చేయరు? అలాంటి వారు 50 సం,,ల క్రితం ఉండేవారు. ఇప్పుడు అవన్నీ కుదరవు. ఇప్పుడు అవి చేయాలంటే కష్టం. కొందరు వీడియో చిత్రీకరణ కోసమే అలాంటి పనులు చేస్తారు కాని నిజంగా ఎవరూ అలా చేయరు.
నేను : బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి?
బాబా: బ్రహ్మజ్ఞానం అంటే మీరాబాయి చూసినట్టు భగవంతుడిని, ప్రపంచాన్ని చూడాలి.
నేను: అంటే ఎలా?
బాబా: మీరా ఎన్నో సం,,లు కృష్ణుడిని ధ్యానించింది. కాని ఆమె జ్ఞానం పొందలేకపోయింది. అపుడు కృష్ణుడు కనిపించి గురువును పట్టుకోమని, ఆయనే మోక్ష మార్గం చూపుతాడని చెప్పాడు. అలా ఆమె రైదాస్ శిష్యురాలయింది. ఆయన ద్వారా ఆమె జ్ఞానం పొందింది.
నేను : మీకు శిష్యులు ఉన్నారా?
బాబా: ఉన్నారు కాని ఇక్కడ లేరు. దూరంగా ఉన్నారు. వారిని నేను ఇక్కడికి పిలవాలనుకోవడం లేదు. ఇక్కడ ఎవరినైనా తయారు చేయాలనుకుంటున్నాను.
20 సం,,ల కన్న చిన్నవారినే మొదట శిష్యులుగా చేసుకుంటాను.
నేను : కుండలినీ మార్గానికి, ఈ మార్గానికి తేడా ఏమిటి ?
బాబా: ఇక్కడ వ్యక్తి ఏం ఆలోచించడు. కాని కుండలినీలో మనసు పని చేస్తుంది. ఇందులో జపం చేయడం ఉండదు. మనసు పరుగెత్తకుండా పట్టుకోవాలి. ఈ ధ్యానంలో ఒక గంట పదిహేను నిమిషాల తరువాత మనసు లగ్నం అవతుంది. కాని ప్రజలు ఇవేవీ నమ్మరు. వాళ్ళు మహామాయ వెంట పడ్డారు. వాళ్ళు ఏదైనా పొందాలంటే మహామాయ నుండి దూరం కావాలి శివ నిజతత్వం తెలుసుకోవాలి. 

ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు తమ వాటిని వదిలి వేయాల్సిందే. బయట ఉన్న వాటిని వదిలివేసి లోపల ఉన్న వాటిని పట్టుకుంటే భగవంతుడు తెలుస్తాడు. ఇది చదివి ఎవరైనా నాదగ్గరికి వస్తే వారికి నా శక్తులు ఇస్తాను.
(శక్తులు ఇస్తాను అన్నమాట విని నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే నాకు అర్ధం అయింది. అతనికి ఎలాంటి శక్తులు లేవు, ఎలాంటి జ్ఞానమూ లేదు. నిజానికి అతను సంప్రదాయ అఘోరా కూడా కాదు. నేను ఆలయంలోకి రాక ముందే బయట వున్న వారి దగ్గర తెలుసుకున్న విషయం ఏమిటంటే సంవత్సరం ముందు వరకు ఇక్కడ ఒక అఘోర బాబా ఉండేవారు. ఆయన మహాత్ముడని వీరి నమ్మకం. ఆయన గంగానది శుద్ధికోసం నిరాహార దీక్ష చేశారు. కాని ఎవరూ పట్టించుకోలేదు. అలా ఆయన చనిపోయారు.

అప్పటి నుండి ఈ ఆలయంలో పూజారి లేరు. ఎక్కడి నుండి వచ్చారో ఈయన వచ్చి ఈ ఆలయంలో ఉండటం మొదలు పెట్టారు.)
అసలు ఆయన బాబాయే కాదు అని ఆయన మాటల ద్వారా నాకు అర్ధం అయింది. అయినా ఆయన శక్తులు వున్నాయి అన్నాడు కదా ఏమి చేస్తాడో చూద్దాం అని ఏమైనా మహిమలు చూపించమని అడిగాను. నీ చేతిలో ఉన్న కలము, పుస్తకం, సెల్ నీ సంచిలో పెట్టు. ఆ సంచిని ప్రక్కన పెట్టు అన్నారు బాబా. ఆయన చెప్పినట్టు చేశాను. కాస్త దూరంలో శివుడికి ఎదురుగా కూర్చుని కళ్ళు తెరచి ధ్యానం చేయమన్నారు. 

నా ధ్యాస అంతా శివుడి మీద పెట్టమన్నారు. నేను అలాగే చేశాను. ఆయన నా వెనుక వైపు నిలబడి గబగబా అటు నుండి ఇటు, ఇటు నుండి అటూ నడవడం మొదలు పెట్టాడు. నాకు అర్ధం కాలేదు. నన్ను ధ్యానం చేయమని ఆయన అలా నాకు దగ్గరగా, వెనక శబ్దం చేస్తూ నడుస్తూ వుంటే నాకు ఏకాగ్రత ఎలా కుదురుతుంది. పైగా నిజం చెప్పాలంటే నా ఏకాగ్రత పూర్తిగా నా హ్యాండ్ బ్యాగ్ మీదే వుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే ముందే నేను డబ్బులు డ్రా చేశాను ATM నుండి. గుడిలో నేను, ఆయన తప్ప ఎవరూ లేరు. నాకేమో ఆయన మీద నమ్మకం లేదు. అందులోనూ ఆయన ప్రవర్తన మరీ విచిత్రంగా, అనుమానించేలా వుంది.
ఇక నేను ఇదంతా కుదరదని లేచి నిలబడ్డాను. 

ఆయన వెంటనే ఏమైంది అని అడిగారు. ఏమి చెప్పాలో తెలియక నేను అలా ఏకాగ్రతగా అంతసేపటి వరకు శివలింగాన్ని చూడలేకపోతున్నానని చెప్పాను. ఆయన వెంటనే చూసావా! చూసావా! ఎంతటి మహిమో అన్నారు. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. మహిమ అంటే నా వస్తువులు ఏమైనా మాయం చేయడమో, లేక ఏమైనా సృష్టించడమో చేస్తారని ఎదురు చూసిన నాకు ఆయన చెప్పిన మహిమ పెద్దగా రుచించలేదు కాని ఆయన మొహంలో మాత్రం వెలుగు వచ్చింది. నేను ఆయన అన్ని మాటలు నమ్మాను అన్న భావం ఆయన ముఖంలో కనిపిస్తుంది. 

నేను ఇక బయలుదేరుతాను బాబా అన్నాను ఆయనతో. అలాగే కాని నాకు ఒక పిల్లవాడిని తీసుకురా. నాకు ఒక మంచి శిష్యుడు కావాలి. ధనవంతుడైనా పేదవాడైనా పరవాలేదు. నేను నా సాధనలు చేసుకుంటుంటే అతను నా పనులు చేసిపెడితే చాలు అన్నారు.
ఈ విధంగా ఆయనకు

ఒక శిష్యుడిని వెతికే బాధ్యతను కూడా నాకు అప్పగించారు. ఆయనకు ఏమీ తెలియదని నేను అనుకుంటుంటే ఆయన నన్నే శిష్యుడిని వెతకమనడం.

Episode: 26

ఇంతలో నేను వచ్చినపుడు ఆలయం శుభ్రం చేస్తున్న వ్యక్తి కొన్ని కట్టెలు తెచ్చి ధునిలో వేస్తున్నాడు. నేను అతనితో ఈ కట్టెలు ఎక్కడి నుండి తెస్తున్నారు అని అడిగాను. ఈ స్మశానంలో శవాలు కాల్చగా మిగిలిన కట్టెలు తెచ్చి ధునిలో వేస్తాం అన్నాడు. అంతే ఈ మాట వినగానే నా గుండె జల్లుమన్నది. నేను వచ్చినపుడు ఈ కృష్ణానంద్ బాబాజీ నాకు ఆ విభూతి చేతిలో వేయడం, నేను దాన్ని రుద్ది రుద్ది పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది. ఒకసారి నా చేతిని చూసుకున్నాను. ఇక నేను అక్కడ నిలబడలేకపోయాను. మళ్ళీ వస్తానని బాబాజీకి చెప్పి బయటకు వచ్చేశాను. నేను వచ్చేస్తుంటే కూడా ఆయన శిష్యుడిని వెతికే బాధ్యతను గుర్తు చేశారు.
గుడి నుండి బయటకు రాగానే కాస్త ముందుకు వెళ్ళి నా హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న నీళ్ళ బాటిల్ తీసి కుడిచేతిని కడుక్కున్నాను. కాని నుదుట బొట్టుగా వున్న విభూతిని కడగలేను, ఉంచలేను. కాస్త తర్జన భర్జన పడి ఉంచేయాలని నిర్ణయించుకున్నాను. ఎంతైనా శివుడి ముందు పెట్టుకున్నాను అనే ఒక చిన్న అభిప్రాయం. నేను కడిగేస్తే ఆయనకు కోపం వస్తే? అలా అని చేయి కడిగావు కదా అని అడగకండి ఎంతైనా చేయికదా.
అప్పటికే బాగా రాత్రి అయింది. గంగాహారతి కూడా అయిపోయి చాలా సేపవుతుంది. ఘాట్లన్ని కూడా దాదాపుగా ఖాళీగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఉత్సుకతతో ఉన్నాను. రేపు ఉదయం అఘోరాని చూడబోతున్నాను. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆయన నన్ను నిరుత్సాహపడేలా ఉండకూడదని కోరుకుంటున్నా. కాని అదెలా ఉంటుందనే విషయం రేపటి రోజే చెప్పబోతుంది.
అప్పుడే తెల్లవారుతుందనగా గది నుండి బయటకు వచ్చాను. నిన్న ఆ పాశ్చాత్యుడు ఎక్కడైతే రిక్షా ఎక్కాడో అదే స్టాండ్‌కి వెళ్ళి ఒకతనిని పుష్కర్ తలాబ్‌కి వెళ్ళాలి అన్నాను. ఎక్కడికి అని అడిగిన అతనికి మౌనిబాబా ఆశ్రమం అని చెప్పాను. హరిశ్చంద్ర రోడ్ నుండి 3లేక 4 కి.మి. ల దూరంలో ఉంది పుష్కర్ తలాబ్‌కి వెళ్ళే రోడ్. రోడ్ మీదే రిక్షా దిగి ఆ తలాబ్ ఉంది అన్న వీధిలోకి నడవసాగాను.
ఆ ప్రాంతం బాగా పల్లెటూరు వాతావరణంలో ఉంది. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. మధ్యలో ఎడమవైపు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద చిన్న శివాలయం, హనుమంతుని విగ్రహం ఉన్నాయి. అవి దాటుకొని కొంచెం ముందుకు వెళితే ఎడమ ప్రక్కన పొదలు పొదలుగా చెట్లు, కుడి ప్రక్కన పెద్ద ప్రహరి గోడ. ఎందుకైనా మంచిదని రోడ్ మీద పళ్ళు తోముకుంటున్న ఇద్దరు ఆడవాళ్ళు కనబడితే వారిని అడిగాను. అఘోరాబాబా మౌనిబాబా ఆశ్రమం ఎక్కడ అని. నేను దాటి వచ్చిన చెట్టు క్రింద ఆలయం ప్రక్కనే వున్న ఒక గుడిసెను చూపించింది.

నేను మళ్ళీ వెనక్కి, ఆలయం దగ్గరికి వెళ్ళాను. ఆలయం పూజారికి మౌనిబాబా ఎవరని అడగబోతుండగా ఆ గుడిసె నల్లని పరదా తొలగించుకొని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అలా పరదా తొలగగానే గుడిసె లోపలి భాగం కనబడింది. లోపల ఒక వ్యక్తి నల్లని బట్టలతో ఉన్నాడు. మా ఇద్దరి చూపులు ఒకేసారి కలుసుకున్నాయి. ఆయన నన్ను లోపలికి రమ్మని సైగ చేశారు. గుడిసె ముందుకు వెళ్ళి నిలబడ్డాను. దయచేసి లోపలికి రండి అంటూ స్వచ్ఛమైన ఇంగ్లీష్‌లో ఆహ్వానించారు. లోపలికి వెళ్ళాను. ఆయన ఎదురుగా ధుని ఉంది. అది మండటం లేదు. దానికి ఆ వైపు వంట చేసుకునే గిన్నెలు, పొయ్యి ఉన్నాయి. ధునికి కాస్త దగ్గరగా, నిన్న నేను క్షమేశ్వర్ ఘాట్ వద్ద చూసిన ఆ పాశ్చాత్య యువకుడు కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి కాస్త పక్కకి జరిగి కూర్చోవడానికి చోటు ఇచ్చాడు.

ఆ అఘోరబాబా వయస్సు సుమారుగా 35 సం,,లు ఉండొచ్చు. నల్లని బట్టలు, రంగు రంగుల పూసల దండలు, పది వేళ్ళకు పది రాళ్ళ ఉంగరాలు, చేతిలో ఐప్యాడ్, ఒక సెల్‌ఫోన్ వున్నాయి. ఆయన నన్ను టీ త్రాగుతారా అని అడిగారు. త్రాగుతాను అన్నాను. ఆ మాటలతో బాబాజీ, ఆయన పాశ్చాత్య శిష్యుడు, మరొక శిష్యుడు ముగ్గురు ఆశ్చర్యపోయారు.

మౌనిబాబా మళ్లీ నాతో టీ కొని తీసుకురారు, వీళ్ళు ఇక్కడే పెడతారు అన్నారు. సరే అన్నాను. వాళ్ళ ముఖంలో ఆశ్చర్యం ఇంకా పెరిగింది. ఎందుకు మీరంతా అలా ఆశ్చర్యపోతున్నారని అడిగాను. ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు. కాని ఎవరూ ఇక్కడ మేము పెట్టే టీ త్రాగడానికి ఇష్టపడరు. మేము త్రాగమని అడిగితే వద్దు మేము బయట త్రాగుతాం అని నిర్మొహమాటంగా చెబుతారు. అలాంటిది మీరు ఒక స్త్రీ అయి ఉండి ఒంటరిగా రావడమే కాక, మేము పెట్టే టీ త్రాగడానికి కూడా ఒప్పుకుంటే మాకు ఆశ్చర్యం వేసింది.

ఓ అదా! నాకు ఎలాంటి భయాలు లేవు. మీరు మర్యాదపూర్వకంగా అడిగిన టీ వద్దని మిమ్మల్ని అవమానపరచలేను. కాబట్టి నాకు మీ టీ త్రాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. ఆయన నా వివరాలు అడిగారు. అందరి లాగే ఆయన, నేను ఒంటరిగా కాశీ రావడం గురించి విని ఆశ్చర్యపోయారు. ఈయన గురించి చెబుతున్నపుడు అందరూ మౌనిబాబా అన్నారు. కాని ఈయనేమో నేను ముందు చూసిన మౌనిబాబా కన్న ఎక్కువ గలగలా మాట్లాడుతున్నారు అది కూడా మంచి ఇంగ్లీష్‌లో. మౌని అంటే మౌనంగా ఉండడమో లేక కావలసిన దానికన్న ఎక్కువగా మాట్లాడడమో నాకు అర్ధం కావడం లేదు. ఒక్కరూ ఆ పేరుకు తగ్గట్టు లేరు.

Episode: 27
                                                                                                                                                                                    ఇక మౌనిబాబాతో సంభాషణ చదవండి.
నేను : మీపేరు?
బాబా : మాధవముని బాబా.
నేను : మరి అందరూ మౌనిబాబా అంటున్నారు?
బాబా : ఒకప్పుడు నేను మౌనంగానే వుండేవాడిని. అందుకే అందరూ అలా అంటారు.
నేను : ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారే. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఏం చదువుకున్నారు (ఆయన గట్టిగా నవ్వారు)?
బాబా : నేనా! నేను అసలు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు అసలు చదువుకోలేదు.
నేను : మరి ఎలా మాట్లాడుతున్నారు?
బాబా : నేను ఒకే దగ్గర ఉండను. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. నేపాల్, టిబెట్, హిమాలయాలు అలా. నాకు ఎక్కువగా పాశ్చాత్య శిష్యులే ఉన్నారు అందుకే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు.
నేను : మీ జన్మ స్థలం?
బాబా : బిశ్వాస్ పూర్. ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో వుండేది ఇపుడు చత్తీస్‌ఘడ్‌లో ఉంది.
నేను : మీరు బాబా ఎలా అయ్యారు?
బాబా : నేను ఒక రాజవంశం వారి గురు వంశంలో పుట్టాను జన్మత: బ్రాహ్మణుడిని. 7సం,,ల వయస్సులో నేను ఇంటి నుండి బయటకు వచ్చేశాను. అలా అప్పుడే ఇల్లు వదిలాను. అక్కడ ఇక్కడ తిరుగుతూ కాశీ వచ్చాను. నేను మొదటిసారి కాశీ వచ్చినపుడు ఇన్ని ఇళ్ళులు లేవు ఇంత జనమూ లేరు. ఎలా తెలిసిందో మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది నేను కాశీలో ఉన్నానని. మా అమ్మానాన్నా వచ్చారు నన్ను తమతో ఇంటికి రమ్మని అడిగారు నేను రానని చెప్పాను. ఏమనుకుందో మా అమ్మ నన్ను గంగ వద్దకు తీసుకువెళ్ళింది. ఆ మట్టి పట్టుకొని, ఇక వీడు నీ కొడుకు అంటూ నన్ను గంగకు ఇచ్చివేసింది. మా నాన్న ఆపుతున్నా ఆగలేదు. ఆ తరువాత వారు నన్ను వదిలివేసారు. అప్పటి నుండి నేను ఇలా తిరుగుతూనే ఉన్నాను.
నేను : మీ గురువు ఎవరు?
బాబా : నేను 2 మార్గాలు పాటిస్తాను.
1. ఉదాసీన్
2. అఘోర
ఉదాసీన్ అనేది ఒక పరావస్థ. అఘోర సంప్రదాయంలో భైరవుడిని పూజిస్తాం.
అలా అంటూ ఆయన అఘోరా వేషంలో ఉండి ఒంటి నిండా బూడిద రాసుకొని ఉన్న ఆయనది ఒక ఫొటో చూపించారు.
బాబా : నేను త్వరలో చనిపోతాను.
నేను : అదేమిటి?
బాబా : అవును, ఈ శరీరం వదిలి వేసి క్రొత్త శరీరంలోకి వెళతాను మళ్ళీ రాజగురువుల వంశంలోనే జన్మిస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా జ్ఞానులుగా ఉంటారు.
నేను : అఘోరాలు చనిపోయిన వాళ్ళని తింటారని విన్నాను. నిజమేనా?
బాబా : మీరు కూరగాయలు, కోడి, మేక లాంటివి ఎలా తింటారు? చంపేకదా?మరి మీరు అఘోరిలే కదా. మమ్మల్ని మాత్రమే ఎందుకు నిందిస్తారు.
నేను : మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు?
బాబా : చాలా సంవత్సరాల నుండి. ఇక్కడ నా గతజన్మలో కూడా జీవించాను.
నేను : మీరు మాంసాహారం తింటారా?
బాబా : తింటాను. మదీర కూడా అప్పుడప్పుడు తీసుకుంటాను అది కూడా ప్రసాదంగా.
ఇలా చెబుతూ కొబ్బరి చిప్పతో చేసిన ఒక గిన్నె వంటి వస్తువు మరియు నీళ్ళు పోసుకునే మరచెంబు లాంటిది చూపించారు. ఇవి 150 సం,, ల క్రితంవి. నేను వీటిల్లోనే భోజనం చేస్తాను అని చెప్పారు. నిజంగా వాటి పనితనం చాలా అందంగా ఉంది. ఆయన నన్ను యోగి అంటే ఎవరో తెలుసా అని అడిగారు. ఏమిటి అని అడిగాను.
బాబా : బ్రతకడం అనే కళ తెలిసినవాడు యోగి. వారికి దేనితో పని ఉండదు. నన్నే చూడండి నా ముందు ఎంత డబ్బు ఉన్నా అది ఎవరు పట్టుకుపోయినా నేను పట్టించుకోను.
మీరు ధ్యానం చేస్తారా?
బాబా : చేస్తాను. చేయిస్తాను. ఇదిగో ఇతను నా శిష్యుడు గోపాల్ ముని బాబా (పాశ్చాత్యయువకుడు).
నేను : ఏ ధ్యానం చేస్తారు?
బాబా : క్రియాయోగం, బ్రహ్మయోగం.
నేను : అంటే ఏమిటి?
బాబా : అవి పరబ్రహ్మంలో మనల్ని కలుపుతాయి.
నేను : ఇంకేమైనా క్రియలు చేస్తారా?
బాబా : చేస్తాను. హఠయోగం, క్రియాయోగం, బ్రహ్మయోగం.
నేను : స్మశాన పూజలు లాంటివి చేస్తారా?
బాబా : చేస్తాను. చాలామంది నా గురించి డాక్యుమెంటరి చేస్తామని వచ్చారు. కాని ప్రభుత్వం పడనివ్వలేదు.
నేను : అదేమిటి మధ్యలో ప్రభుత్వం ఎందుకు పడనివ్వలేదు?
బాబా : 4 సం,,ల క్రితం నేను ఇక్కడ గుడిసె వేస్తుంటే ఇక్కడి ప్రజలు నేను ఈ స్థలం కబ్జా చేస్తున్నానని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నా శిష్యులు మాట్లాడి సర్దుబాటు చేశారు.
నేను : ఈ పాశ్చాత్య యువకుడు ఎలా మీకు శిష్యుడయ్యాడు?
బాబా: అది అతనే చెబుతాడు.
గోపాల్ ముని : నన్ను మీరు నిన్న చూశారు కదా క్షమేశ్వర్ ఘాట్ వద్ద, అక్కడే ఒక రోజు గురూజీ మురళి వాయిస్తున్నారు. అది విని నేను చాలా మైమరచిపోయాను.
బాబా : ఈ అబ్బాయి సంవత్సరం క్రితం తన స్నేహితురాలితో కలిసి కాశీ వచ్చాడు. అప్పుడే నన్ను చూశాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది.

రెండవసారి నేను మురళి వాయించి కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఆ అమ్మాయి ఉంది. ఏమిటని అడిగా. మీరు చాలా బాగా మురళి వాయిస్తున్నారు అన్నది. ఆమె ఈ అబ్బాయితో గొడవపడి ఒకర్తే ఘాట్‌కి వచ్చిందని మాటలలో అర్ధమైంది. నేను వారిద్దరిని కలిపాను. కొన్ని రోజుల తరువాత వీళ్ళిద్దరూ మళ్ళీ నాకు హరిద్వార్‌లో కలిసారు. అప్పటి నుండి ఈ కుర్రవాడు నాతోనే ఉండిపోయాడు.

Episode: 28

మొదటి నుండి చివరి వరకు మా సంభాషణ జరుగుతున్నంత సమయం ఆ కుర్రవాడు ఈ మౌని బాబాని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆయన ప్రతి మాటని తన్మయత్వంతో వింటున్నాడు.
బాబా: ప్రతి సంవత్సరం నేను శివరాత్రికి ప్రత్యేక పూజలు చేస్తాను.
నేను : ఈ శివరాత్రికి నేను రావచ్చా అయితే?
బాబా : లేదు ఈ శివరాత్రికి నేను నేపాల్ వెళ్తున్నాను.
నేను : మళ్ళీ ఎప్పుడు వస్తారు?
బాబా : శివరాత్రి తర్వాత.
ఇంకా ఆయన గొప్పతనం చాలా చెప్పాడు. ఒకప్పుడు డబ్బు, బంగారం సృష్టించే వాడినని. ఇప్పుడు మానేసానని ఏవేవో చెప్పుకు పోతున్నాడు. పైగా నాకోసం ఒక సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. కాశీలో ఉన్న అన్ని సాధు సంఘాలకు ఆయనే నన్ను తీసుకు వెళతానని. కాకపోతే నేనా విషయాన్ని తిరస్కరించాను.
ఇప్పటి వరకు నేను ఆయనతో మాట్లాడినదాన్ని బట్టి ఆయన ఏ సంప్రదాయానికి చెందినవాడు కాదు. ఏ దీక్ష తీసుకోలేదు. వినే వాళ్ళకు తెలియకపోతే ఏమైనా చెప్పవచ్చు. అలాగే నాకు చెప్పారు. ఆత్మదర్శనం అయ్యిందా అని నేను అడిగిన ప్రశ్నకి చాలాసార్లు అయ్యిందని సమాధానం చెప్పారు. అంటే ఏమిటి అంటే మాత్రం సమాధానం లేదు.


ఆయన ఏమిటో అర్థం అయ్యాక ఇక అక్కడ కూర్చోవాలన్పించలేదు. వెళ్తాను అని లేవబోయాను, ఉండండి మళ్ళీ టీ త్రాగమని అడిగారు. వద్దన్నాను కాని ఆ పాశ్చాత్య యువకుడు తాను మసాలా టీ బాగా పెడతానని కొంచెం రుచి చూడమని అడిగాడు. సరే అని చెప్పి గుడి దగ్గరికి వచ్చాను. గుడి పూజారి పలకరించాడు. ఆయనను స్థల పురాణం చెప్పమని అడిగినపుడు ఎన్నో విషయాలు చెప్పారు.
ఈ ఆలయం ఉన్న రావి చెట్టు 800 సం,, క్రితంది. తులసీదాస్ రామచరిత మానస్ ఇక్కడే కూర్చొని రాసాడు. ఈ శివలింగం కూడా ఆయనే ప్రతిష్టించారు. ఈ శివలింగం దగ్గర కొబ్బరికాయ పెడితే తెల్లవారేసరికి అది పగిలి ఉంటుంది.


 తులసీదాస్‌కు అస్సీ నది అవతలే హనుమాన్ దర్శనం అయింది. కాస్త ప్రక్కనే బ్రహ్మ మందిరం ఉంది. బ్రహ్మకు ఆలయాలు ఉండటం చాలా అరుదు. ఈ పుష్కర్ తలాబ్ అనే కొలనులో బ్రహ్మ స్నానం చేశాడని ప్రసిద్ధి. ఇక్కడ చేసే స్నానానికి, దానానికి చాలా ఫలితం ఉంటుందని చెప్పారు.
నేను బ్రహ్మదర్శనం చేసుకున్నాను. పుష్కర్ తలాబ్‌లో మాత్రం నీరు అనే పదార్ధమే కనిపించదు. ఎందుకంటే మొత్తం చెట్లు, పొదలతో నిండి ఉంది.
ఇంతలో గోపాల్ ముని బాబా వచ్చి పిలిచాడు. తన టీ ఇచ్చాడు. మసాలా టీ అది. నిజంగా ఆ కుర్రవాడు చాలా బాగా చేశాడు. మాధవ్ ముని బాబా దగ్గర సెలవు తీసుకొని వస్తుంటే చూశాను గోపాల్ ముని చాలా తన్మయత్వంతో చూస్తున్నాడు అతను పెట్టిన టీ వాళ్ళ గురువు గారు త్రాగడం.


 నిజంగా ఆ అబ్బాయి అతనేదో నిజమైన గురువు అని నమ్మి తన సమయం వృధా చేసుకుంటున్నాడు. ఈయనేమో ఆ అబ్బాయిని చూపించి నాకు పాశ్చాత్య శిష్యులు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ పాశ్చాత్యులు పాపం ఇలాంటి వేషబాబాల వద్ద మోసపోవడం కొత్తేమీ కాదు. ఆ కుర్రవాణ్ణి చూసి జాలి వేసినా ఏమీ చేయలేను కదా. ఆ కుర్రవాణ్ణి చూస్తేనే తెలుస్తుంది వీళ్ళ మత్తు పదార్ధాలకు ఎంత అలవాటు పడ్డాడో. ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా అర్ధం కాదు. నేను వారిద్దరికి ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాను.


ఈ రోజైన ఒక నిజమైన అఘోరాని చూస్తాననుకున్న నాకు ఈ అనుభవం చాలా నిరుత్సాహపరచింది. ఎలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళంతా బాబాలుగా చెలామణి అవుతున్నారు.
ఆలయం దగ్గరలో పూజారి నా కోసం నిలబడి ఉన్నాడు. నన్ను చూస్తూనే, మేడమ్ వీలయితే మీరు ఈ కుండం గురించి, స్థలం గురించి రాయండి. ప్రభుత్వమో, భక్తులో పూనుకొని ఈ కుండంని బాగు చేస్తే చాలు అన్నాడు. అయితే ఈ కుండం గురించి ఇంకా చెప్పమని అడిగాను.
ఈ కుండం 50 అడుగుల లోతు ఉంటుంది. 


ఇందులో 5 బావులు ఉన్నాయి. కుండంలో బ్రహ్మ విగ్రహం ఉంటుంది. కుండం శుభ్రపడినప్పుడే అది కనపడుతుంది. 13 సం,,ల క్రితం నాకు గంగానదిలో స్నానం చేస్తుంటే శంఖం దొరికింది. దీని నుండి సముద్రఘోష వినపడుతుంది. మరొకసారి నదిలో ఒక చిన్న నంది విగ్రహం, ఒక డప్పు దొరికాయి. ఈ కుండంలో ఒక పెద్ద రాయి వుంది. దాని మీద సంస్కృతంలో రాసి ఉండేది. మా చిన్నతనంలో చూశాము. ఇప్పుడు ఈ చెత్త వలన కనిపించదు. ఈ కుండంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది ఎంతో మహిమాన్వితమైన స్థలం. ఇక్కడ ఏది ప్రార్ధిస్తే అది జరుగుతుంది. 


మీకు ముందే చెప్పాను కదా తులసీదాస్ ఇక్కడే కూర్చొని రామచరిత్ మానస్ రాశారు అని చెప్పాడు.
ఇదండీ ఈ స్థల విశేషం. చాలా మంది కాశీకి వెళతారు. కాని వారికి అక్కడ ఉన్న ఇలాంటి మహిమాన్విత స్థలాల గురించి తెలియక దర్శనం చేసుకోరు. దర్శించే వారు లేక ఈ స్థలాలు కూడా బోసిపోతున్నాయి. తమ ప్రాముఖ్యతని కూడా జనులు మరిచిపోయేలా మారిపోతున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే మాములుగా చూస్తే ఒక పెద్ద చెట్టు క్రింద చిన్న శివలింగం, హనుమంతుని విగ్రహం మాత్రమే కనిపిస్తాయి. బ్రహ్మ మందిరం లోపలికి ఉంటుంది. దర్శించే వాళ్ళు లేక ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది.


ఇక బ్రహ్మకుండ్ అయితే అసలు అక్కడ కుండ్ ఉందనే విషయమే మనకు తెలియదు ఎవరైనా చెప్పే వరకు. అంతలా అవి తమ ప్రాముఖ్యతని పొ

గొట్టుకున్నాయి. మీకు వీలయితే ఈసారి కాశీ వెళ్ళినపుడు తప్పకుండా ఈ స్థలం దర్శించండి. ఈ స్థలం మహిమ తెలియడం వలనే తులసీదాస్ ఇక్కడ కూర్చొని రామచరితమానస్ రాసారు.


(Episode: 30)

రాణా మహల్ ఘాట్ వద్ద లఖన్ యాదవ్ అనే పడవ కుర్రవాడు పలకరించాడు. అతనితో కాసేపు శివరాత్రి విశేషాలు, బాబాల గురించి మాట్లాడి రాజుఘాట్ వైపు నడుస్తున్నాను. సాయంత్రం సమయం కావడం వలన కొంచెం రద్దీగానే ఉంది. ఇంతలో నాకు ప్రక్కగా ఒక కుర్రవాడు వచ్చాడు. 23 లేక 24 సం,,లు ఉండొచ్చు. నడుస్తున్న నాతో, స్నేహం చేస్తారా అని హిందీలో అడిగాడు. అకస్మాత్తుగా ఒక అపరిచితుడు అడిగిన ప్రశ్నకు నేను ఆశ్చర్యంతో ఎవరు నువ్వు, ఏం కావాలి అంటూ గట్టిగా ఇంగ్లీష్‌లో అడిగాను. ఆ కుర్రవాడు వెంటనే క్షమించండి అంటూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


ఘాట్‌ల మీద కొద్ది రోజుల నుండి నేను ఒంటరిగా తిరుగుతుండటం కొద్ది మందికి అలుసుగా కనిపిస్తుండవచ్చు అనిపించింది. అలా ఆలోచిస్తూ రాజూఘాట్ మెట్ల మీద కూర్చున్నాను. ఒక యువకుడు నన్ను దాటి వెళ్ళబోతూ ఆగి, ఏమిటి మేడమ్ ఒక్కరే ఇలా కూర్చున్నారు అని అడిగాడు. నేను మాట్లాడలేదు. అతను ఏమనుకున్నాడో, మనోజ్‌ని కాని గౌరవ్‌ని కాని పిలవమంటారా అని అడిగాడు. అది వినగానే నువ్వు ఎవరని అడిగాను. తన పేరు జై అని, గౌరవ్ స్నేహితుడినని చెప్పాడు. కూర్చోమన్నాను. కాసేపటికి ముందు ఆ కుర్రవాడు నాతో మాట్లాడింది జైకి చెప్పాను. జై నవ్వి అది ఇక్కడ పెద్ద విషయం కాదు మేడమ్. బెనారస్‌కి పాశ్చాత్యులు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళు వాళ్ళ స్నేహితుడు లేదా స్నేహితురాలితో వస్తారు. ఒంటరిగా వచ్చిన వాళ్ళు స్థానికులనో లేదా తమ లాగే ఒంటరిగా వచ్చిన వారితోనో కొద్ది రోజులు స్నేహం చేస్తారు. తరువాత ఎవరి దారి వాళ్ళదే. మీరు ఒంటరిగా వుండటం చూసి అలా అన్నాడు.
ఈ పాశ్చాత్యుల సంస్కృతేమో కాని దాని వల్ల నాకు ఈ సమస్య ఎదురయ్యిందని అర్ధమైంది. మీరు వచ్చిన పని ఎలా జరుగుతుందని అడిగాడు జై. పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదని ఇప్పటి వరకు కలసిన వారిలో ఎలాంటి గొప్పదనం లేదని చెప్పాను. నీకెవరైనా బాబాలు తెలుసా అని అడిగాను. ప్రాచీన అఖాడా, దత్తాత్రేయ మఠం వెళ్ళారా అని అడిగాడు. లేదని చెప్పాను. ఒక్కసారి ఆ రెండు చోట్లకి వెళ్ళమన్నాడు.


అఘోరా బాబాలు తెలుసా అని అడిగాను. అమర్ బాబా (అనివార్య కారణాల వల్ల పేరు మార్చడం జరిగింది) అని ఒక బాబా కొన్ని సం ,, ల ముందు వరకు హరిశ్చంద్రఘాట్ వద్ద వుండేవారు. తరువాత ఆశ్రమం ఏర్పరుచుకొని వేరేచోట వుంటున్నారు. ఆయన గురించి తెలియాలంటే ఆయన శిష్యుడిని అడగాలి. ఆయన పేరు గణేష్ బాబా. తమిళనాడుకి చెందినవాడు అని చెప్పాడు. మరి అఘోరిబాబా శిష్యుడు ఎలా అయ్యాడు అని అడిగాను. ఏం చెబుతాం మేడమ్ 4 సం,,ల ముందు అతను అందరిలాగే కాశీ విశ్వనాధ దర్శనానికి వచ్చాడు. కొన్ని రోజులు వుండి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు.
కొద్ది రోజులకు మళ్ళీ వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఎలా కలిసాడో తెలియదు. అమర్ బాబా శిష్యుడయ్యాడు. వేషం మారిపోయింది. ఈ ఘాట్ వద్దే కూర్చొని వున్న నా వద్దకు వచ్చి అద్దెకు గది ఇప్పించమని అడిగాడు. అపుడు నేనే గది ఇప్పించాను. ఇపుడు వేరే చోట వుంటున్నాడు. అది నాకు తెలియదు.
ఇతని గురువు అమర్ బాబాకి చాలా శక్తులు వుంటాయని అందరూ అనుకుంటు వుంటారు. అతను ఎప్పుడూ మద్యం మత్తులో వుంటాడట. అతనికి పాశ్చాత్య శిష్యులే ఎక్కువ. ఒక పాశ్చాత్యురాలిని వివాహం చేసుకున్నాడని అంటారు. నేను ఆశ్చర్యంగా వాళ్ళు ఇలాంటి అఘోరాలని పెళ్ళి చేసుకుంటారా అని అడిగాను. కాశీలో మీకు అలా ఎంతో మంది కనిపిస్తారు. ఎంతోమంది పాశ్చాత్యులు పడవల వాళ్ళని, గైడ్‌లని కూడా పెళ్ళిచేసుకున్నారు.
నేను : పడవల వారినా అదెలా?
జై : పాశ్చాత్యులు వున్న కొద్ది కాలంలో స్తానికులతో చాలా స్నేహంగా వుంటారు. ఒక వేళ వాళ్ళు వీళ్ళు ఇష్టపడితే పెళ్ళి చేసుకుంటారు. కొందరు తమతో తమ దేశం తీసుకువెళితే, మరికొందరు ఇక్కడే స్థిరపడిపోతారు. ఇప్పటి వరకు ఇలా 400 పైగా వివాహాలు జరిగాయి. అందులో కొందరు ఎక్కువ కాలం కలిసి వుండరు. చాలా మంది ఇక్కడి బాబాలను పెళ్ళిచేసుకోవడం, వారికి ఇళ్ళో, ఆశ్రమమో కట్టించి వాళ్లతో ఇక్కడే వుండిపోవడం జరుగుతుంటుంది.
నేను : అసలు ఇక్కడ ఇంత మంది పాశ్చాత్యులు వున్నారేంటి?
జై : చలికాలం మొత్తం ఇక్కడ పాశ్చాత్యులే వుంటారు మిగిలిన సమయాల్లో మన దేశస్థులు వుంటారు.
నేను : ఎందుకు?
జై : మేడమ్ మీరు ఇప్పటి వరకు గమనించారో లేదో. ఇక్కడ మత్తుపదార్ధాలు అమ్మకం ఎక్కువ. భంగుకయితే అమ్మకానికి, కొనుగోలుకి అనుమతి కూడా వుంది.


నేను : అవును నేను విన్నాను కాశీ విశ్వనాధునికి నైవేద్యంగా భంగుని సమర్పిస్తారని కాశీలో ప్రజలు భంగుని ప్రసాదంగా తీసుకుంటారని. అందుకే ప్రభుత్వ అనుమతి కూడా వుంది. మరి మిగిలిన మత్తు పదార్థాలు? (భంగు అనేది ఒక రకం ఆకు పసరు. మజ్జిగలో గాని మీగడలో గాని కలిపి సేవిస్తారు. అది చాలా మత్తునిస్తుంది.)
జై : వాటికి అనుమతి లేదు. కాని అన్ని రకాల పదార్థాలు ఇక్కడ అమ్ముతారు.
నేను : ఎందుకని?
జై : మత్తు పదార్ధల చెట్లు శీతల ప్రదేశాల్లో ఎక్కువగా వుంటాయి. అక్కడి నుండి ఇవి వస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రం కావడం వలన ఆ పేరుతో పాశ్చాత్యులు ఇక్కడికి వస్తారు . వారికి కావలసిన అన్ని మత్తు

పదార్ధాలు ఇక్కడ దొరుకుతాయి. మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా?

(Episode: 31)

జై : చాలా మంది బాబాలు, సాధువులు వాళ్ళు హిమాలయాలకు లేదా శీతల ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడి నుండి మంచి రకం మత్తు పదార్ధాలు తెస్తుంటారు. కొంత మంది బాబాలకు పాశ్చాత్య శిష్యులు ఈ మత్తు పదార్ధల కోసమే ఏర్పడుతారు. బాబాలు కూడా వాళ్ళని మత్తు పదార్ధలతో మచ్చిక చేసుకుంటారు. ఎక్కడో కొంత మంది పాశ్చాత్యులు మాత్రం నిజంగా ఆధ్యాత్మికత కోసం వస్తారు. ఎవరో ఒక గురువుని పట్టుకొని వారు చెప్పిన పద్ధతిలో ప్రశాంతంగా వారి సాధన వారు చేసుకుంటారు.

నేను : సరే నాకు ఇంకా నీకు తెలిసిన బాబాలు ఎవరైనా వుంటే చెప్పు.

జై : 3 సం,,ల క్రితం ఒక పంజాబి యువకుడు కాశీ వచ్చాడు మేడమ్. చాలా అందగాడు. ఒడ్డు పొడుగు బాగుండేవాడు. అతను కాశీ వచ్చిన రెండు రోజులకు నాకూ, అతనికి పరిచయం అయింది. చాలా డబ్బుగలవాడు. అందరికి బాగా డబ్బు ఇస్తుండేవాడు. కొద్ది రోజులు వుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి వచ్చాడు. అప్పుడు కూడా చాలా డబ్బు తెచ్చాడు. విపరీతంగా మత్తుపదార్ధాలు వాడేవాడు. డబ్బు అయిపోగానే వెళ్ళిపోయేవాడు.

ఒక సంవత్సరం క్రితం నేను తనని చివరిసారిగా చూశాను. ఎప్పటిలాగే చాలా డబ్బుతో వచ్చాడు. అపుడు చాలా రోజులు వున్నాడు కాశీలో. ఒక రాత్రి సమయం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను పడవ నడిపేవాణ్ణి కాదు. మాది పాల వ్యాపారం. కాని నాకు పడవ నడపడం వచ్చు. అతను నన్ను ఒక పడవ తీయమన్నాడు. ఇద్దరం గంగాజీ అవతల గట్టుకి వెళ్ళాం. చీకటిలో అటు వెళ్ళి కొంతసేపు వుండి రావడం చాలా మంది ఇష్టపడు తుంటారు.అలాగే వెళ్తున్నామనుకున్నాను. కాని నా ఊహ తప్పని తరువాత తెలిసింది.

నేను : ఏం జరిగింది?

జై : అటు వెళ్ళగానే అతను తన బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తయారయ్యాడు. గంగలో స్నానం చేసి వచ్చాడు. ఇసుక మీద కూర్చుని, తన ఎదురుగా ఒక గిన్నె పెట్టుకున్నాడు. అతని ఎడమ చేతి మణికట్టుని ఒక చిన్న కత్తిలాంటి దానితో కోసి రక్తం గిన్నెలో పడేలా పెట్టి ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చునే ముందు ఇదంతా ఏమి అర్ధం కాక ఆశ్చర్యంగా, భయంగా చూస్తున్న నాతో, కుక్కలు కాని మనుషులు కాని వచ్చి ఇబ్బంది కలిగించకుండా చూడమని చెప్పాడు. అలా 3 లేక 4 గం,,లు కూర్చున్నాడు.

లేచాక నన్ను దగ్గరికి పిలిచి ప్రసాదం కావాలా అని అడిగాడు. అక్కడ ఏమి లేదు ఏమిస్తాడో అర్థంగాక కావాలి అన్నాను. ఆ రక్తం వున్న గిన్నెను ఇచ్చి త్రాగమన్నాడు. అంతే నా ఒళ్ళు భయంతో కంపించిపోయింది. నేను త్రాగనన్నాను. తన వేలితో కొంత రక్తం తీసి బొట్టు పెట్టాడు నాకు. మిగిలిందంతా త్రాగేసాడు. తెల్లవారుతుండగా ఇటు వచ్చాము. నాకు చాలా భయం వేసింది. అప్పుడప్పుడు కాశీ వచ్చి రోజుల తరబడి వుంటుంటే మత్తుపదార్ధల కోసం అనుకున్నాను. కాని అతను ఎవరి దగ్గరో ఇలాంటివి నేర్చుకుంటాడని అనుకోలేదు.

మొదటిసారి అతడిని చూసినప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా వుంది. మనిషి చిక్కిపోయి, గడ్డంతో వున్నాడు. గట్టుకి వచ్చాక నేను అతనిని ఏమి పలకరించలేదు. అతను నాతో ఏం మాట్లడలేదు. మనిషి గంభీరంగా వున్నాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. నేను నిద్రలేవక ముందే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. పద వెళ్దాం అన్నాడు. అతనితో వెళ్ళాలనిపించలేదు. కాని ముందు రోజు చూసింది గుర్తు వచ్చి మాట్లాడలేకపోయాను. మనిషి బాగా చిక్కిపోయి, గడ్డంతో ఉన్నాడు. ఇవతలి గట్టుకి వచ్చాక నేను అతనిని పలకరించలేదు. అతను నాతో ఏమీ మాట్లాడలేదు. మనిషి గంభీరంగా ఉన్నాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. 

నేను నిద్రలేవక ముందే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు . పద వెళ్దాం అన్నాడు. అతనితో వెళ్ళాలనిపించలేదు కానీ ముందురోజు చూసింది గుర్తు వచ్చి మాట్లాడలేకపోయాను. నేరుగా ప్రయాగ తీసుకువెళ్ళాడు. అక్కడ ఏదో ప్రదేశం కొంచెం లోపలికి ఉంది. అక్కడ చాలా మంది ఉన్నారు .వాళ్ళంతా అఘోరాలని వారి వేషమే చెబుతుంది. మేము వెళ్ళగానే ఆ పంజాబీ యువకుడిని చూసి వారంతా దగ్గరికి వచ్చి అతని పాదాలకు నమస్కారం పెడుతున్నారు. ఇది చూసి నేను మరింత ఆశ్చర్యపోయాను. ఇప్పటి వరకు నేను అతను ఎవరి దగ్గరో కొన్ని పూజలు నేర్చుకొని చేస్తున్నాడనుకున్నాను. కానీ అతనే ఒక పెద్ద అఘోరా గురువు అనుకోలేదు. పట్టుమని 26 సం..లు ఉంటాయేమో కాని అతనికి నమస్కారాలు పెడుతున్న వాళ్ళంతా వయస్సులో అతనికన్నా చాలా పెద్దవారు. ప్రయాగ నుండి వచ్చిన కొన్ని రోజులకు అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పటి వరకు నేను అతన్ని చూడలేదు. ఇంటికి వెళ్ళాడో, మరెక్కడికైనా వెళ్ళాడో తెలియదు. కానీ చాలా మంచివాడు అలా అవ్వడమే బాధగా అనిపించింది.

నేను : అంతలా ఆకర్షింపబడతారా ఆ బాబాలకి?

జై : అదే తెలీదు మేడమ్. మాములుగా కాశీ చూడడానికి వచ్చిన వారికి ఎవరో కలవడం, వాళ్లకి వీళ్ళు ఆకర్షితులవ్వడం, వాళ్ళ శిష్యులవ్వడం జరుగుతూ ఉంటుంది.

నేను : సరే నువ్వు చెప్పిన అమర్ బాబా వివరాలు ఇంకా ఎవరిని అడిగితే తెలుస్తాయి?

జై : మీ స్నేహితుడు మనోజ్ కి కూడా తెలుసు అతనిని అడగండి.

అలాగే కానీ గణేష్ బాబా వివరాలు సేకరించమని చెప్పి గదికి వచ్చాను. నిజంగా పంజాబీ యువకుని కథ అబ్బుర పరిచేలా ఉంది. అఘోరాలలో అంతటి ఆకర్షణ శక్తి ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతా అమర్ బాబా పైనే ఉంది. రేపు ఉదయం వెళ్ళగానే మనోజ్ ని అడగాలనుకున్నాను.

గోలాపురి : శరీరం లేని ఆత్మ ఏ పరమాత్మ నుండి వచ్చిందో అందులోనే లీనమవుతుంది.

నేను : మీ వయస్సు ఎంత?

గోలాపురి :60 సం.ల పైనే.

ఈ చివరి మాటకి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 50 సం ,,ల వయస్సులా ఉన్నారు ఆయన. ఎందుకో ఆయన వయస్సు ఆయనకు తెలియదేమో అనిపించింది. రెండవ వ్యక్తితో సంభాషణ...
...

(Episode: 32)

రోజు ఎప్పుడు నేను వెళ్ళే సమయం కన్నా కాస్తముందే ఘాట్ ల మీదకి వచ్చాను. మనోజ్, గౌరవ్ అక్కడే ఉన్నారు. వెళ్లి మనోజ్ అనిల్ బాబా గురించి అడిగాను. అమర్ బాబా ఎవరిని ఎక్కువగా కలవరని అందుకే ఇప్పటివరకు నాకు ఆయన గురించి చెప్పలేదన్నాడు. కాని నేను ఆయనను కలవాలనుకుంటున్నానని చెప్పాను. సరే మేడమ్ అయితే ఆయన శిష్యుడు గణేష్ బాబాని కనుక్కుంటాను అన్నాడు. వీలయితే నాకు గణేష్ బాబాని కలిపించమని చెప్పాను.


 కాసేపటికి మాటలలో మనోజ్, మేడమ్ ఇంకొక 6 సం..లకి నేను కూడా అఘోరా అవుతాను అన్నాడు. ఊహించని ఈ మాటకి నేను ఆశ్చర్యపోయాను. సరదాగా అంటున్నాడనుకున్నాను కానీ తను ఏం చెప్పాడో తెలుసా?

మనోజ్ : మేడమ్ నా తోబుట్టువులందరిలో నేనే చిన్నవాడిని. నా చిన్నతనంలోనే అమ్మ, నాన్న చనిపోయారు. అక్కడ ఇక్కడ పెరిగాను. నేను ఏం చదువుకోలేదు, చిల్లరపనులు చేస్తుండేవాడిని. 5సం.ల క్రితం ఒక అఘోరా బాబా కాశీ వచ్చారు. ఎందుకో నాకు ఆయన బాగా నచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఆయనతోనే ఉండి, ఆయనకు సేవలు చేశాను. వెళ్ళిపోయేటప్పుడు ఆయన నాతో నేను 11సం.ల తర్వాత అఘోరా అవుతానని చెప్పారు, ఇప్పటికి 5 సం.లు అయ్యాయి.
(కాస్త నిర్ఘాంతపోయిన నేను తొందరగానే తేరుకున్నాను.)


నేను : ఆయన మాటలు నిజం అవుతాయని నమ్మకం ఏమిటి?
మనోజ్ : లేదు మేడమ్ ఆయన చాలా శక్తివంతుడు, నేను నా కళ్ళతో చూశాను. ఆయన చెప్పినట్టు నేను త్వరలోనే అఘోరా అవుతాను.


నేను : నీకు పెళ్లి అయ్యిందా?
మనోజ్ : అయ్యింది మేడమ్, బాబు పుట్టి 2 నెలలు అవుతుంది.


నేను : మరి వాళ్ళను ఏం చేస్తావు?
మనోజ్ : బోలేబాబా (శంకర భగవానుడు ) చూసుకుంటాడు.
ఇక తనతో వాదన అనవసరమనిపించింది. ౩౦ సం.ల యువకుడు మనోజ్. మానసికంగా, శారీరకంగా దృడమైనవాడు.


 మంచి కుటుంబం ఉంది. ఘాట్ల మీద మంచి పేరు ఉంది. అయినా తనకు వాటితో సంతృప్తి లేదు. ఎప్పుడు అఘోరా అవుతానా అని ఎదురుచూస్తున్నాడు. మనోజ్ కి, గౌరవ్ కి మళ్ళీ వస్తానని చెప్పి దత్తాత్రేయ మఠ్ కి బయలుదేరాను.
రాజా ఘాట్ పైనే ఉంది దత్తాత్రేయ మఠ్. 


లేత గులాబీ రంగులో ఉన్న రెండంతస్తుల బంగ్లా అది. ద్వారం వద్ద రెండు పావుకోళ్లు ఉన్నాయి. మనుష్యుల అలికిడి లేదు. నాకు ఎదురుగా ఏదో చిన్న గుడి ఉంది. అది మూసి ఉంది. చుట్టూ వసారా ఉండి, లోపలికి గదులు ఉన్నాయి. ఎవరూ లేకపోవడంతో కొంచెం లోపలికి వెళ్ళాను. ఎడమ ప్రక్కన వంటగది, వంట చేస్తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులూ ఉన్నారు.


 కుడి ప్రక్కన 80సం,,ల పైన వయస్సు ఉన్న వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. కాషాయం ధరించి ఉన్నాడు, ఆయన చేతిలో దండి సన్యాసుల వద్ద ఉండే దండం ఉంది. మరొక కుర్చీలో ఒక నడి వయస్సు వ్యక్తి, క్రింద ముగ్గురు 12 నుండి 15 సం.ల వయస్సు గల బాలురు ఉన్నారు. ఆ నడి వయస్సు వ్యక్తి ఏదో పుస్తకం చదివి వినిపిస్తుంటే వాళ్ళంతా వింటున్నారు.
నేను ఇంకొంచెం ముందుకు వెళ్లి నిలబడ్డాను. వంటగదిలో నుండి ఒక వ్యక్తి వచ్చి ఎవరు కావాలి అని అడిగాడు. 


మఠం గురువుగారిని కలవాలని చెప్పాను. వసారాని ఆనుకొని గుడికి కాస్త ప్రక్కగా ఉన్న ఒక గది దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు. ఆ గదిలో 60 సం.ల ఒక వ్యక్తి ఏదో పుస్తకం చదువు కుంటున్నారు. ఆయనకు నన్ను చూపించి, మిమ్మల్ని కలవాలన్నారు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరని అడిగారు ఆ గురువుగారు. 


నా పేరు, వివరాలు చెప్పాను. ఇది అందరూ సాధన చేసుకునే సమయం కాబట్టి మధ్యాహ్నం 2గం.ల సమయంలో రమ్మన్నారు. అలాగే అని చెప్పి మళ్ళీ ఘాట్ కి వచ్చేశాను.
అక్కడి నుండి నేరుగా ప్రాచీన అఖాడాకి వెళ్ళాను. ఇది సాధువుల సంఘం. ఇక్కడే సాధువులకు ఐ.డి .కార్డ్స్ ఇస్తారు.


 నేను మొదటిరోజు కలిసిన మనోహరగిరి బాబా, పద్మగిరి బాబా, మౌని బాబా అందరూ ఈ సంఘంలో ఐ.డి.కార్డ్స్ పొందినవారే. నేను అక్కడికి వెళ్ళేసరికి ఉదయం 9.30 అవుతుoది. ఆ బంగ్లా మూడు అంతస్తులలో విస్తరించి ఉంది. చాలా సం..ల క్రితం కట్టినట్టు దాన్ని చూస్తేనే తెలుస్తుంది.


 పెద్ద పెద్ద ద్వారాలు, చొచ్చుకొని ఉన్న గదులు. లోపలికి వెళ్ళగానే ఎదురుగా హనుమంతుని గుడి, చుట్టూ వసారా, దాన్ని ఆనుకొని ఉన్న
గదులు.
బయట ఎవరూ లేకపోవడంతో కొంచెం లోపలికి వెళ్ళాను. చిన్నశివాలయం, అమ్మవారి విగ్రహం, ఇంకా దేవీదేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇంతలో ఒక సాధువు వచ్చి నన్ను పలకరించాడు. 


నేను పరిచయం చేసుకొని, సాధువులను కలవాలనుకుంటున్నానని చెప్పాను. పుస్తకం ఏమైనా రాస్తున్నావా అని అడిగారు. అవును అని చెప్పాను. హనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్న ధుని వద్ద కూర్చున్నాం. ఇంతలో మరో వ్యక్తి కూడా వచ్చి మాతో చేరాడు.

(Episode: 33)

మొదటి వ్యక్తితో నా సంభాషణ
నేను : మీ పేరు?
వ్యక్తి : మహంత్ గోలాపురి.


నేను : ఏం చేస్తుంటారు?
గోలాపురి : హనుమాన్ పూజారి.


నేను : ఎక్కడి నుండి వచ్చారు?
గోలాపురి : హరిద్వార్ లో ఉంటాను, భరతమాత గుడిలో పూజారిని. కొన్ని నెలలు ఇక్కడ ఉండటానికి వచ్చాను.


నేను : మీ జన్మస్థలం ఏది? సాధువు ఎప్పుడు అయ్యారు?
గోలాపురి : నాది ఉత్తర ప్రదేశ్. 2000 సం.లో సాధువుగా మారాను.


నేను : మీకు పెళ్లి అయ్యిందా ?
గోలాపురి : లేదు, చేసుకోలేదు.


నేను : సాధువు ఎందుకు అయ్యారు?
గోలాపురి : అన్ని క్షేత్రాలు చూడాలనుకున్నాను అందుకే బాబా అయ్యాను.


నేను : అదేమిటి క్షేత్రాలు చూడడం కోసం బాబా అయ్యారా?
గోలాపురి : లేదు సాధన కూడా చేయాలనుకున్నాను.


నేను : మీ సాధన ఏమిటి?
గోలాపురి : ఎన్నో రకాల సాధనలు ఉంటాయి. నేను యోగా చేస్తాను. 
ఇంకా భంరేశ్వరి ప్రార్ధనచేస్తాను.


నేను : భంరేశ్వరి అంటే?
గోలాపురి : భరతమాత.


నేను : ఈ సాధనలు చేస్తే చాలా?
గోలాపురి : అవును.


నేను :ఈ సాధనలు చేస్తే ఏం లభిస్తుంది?
గోలాపురి : ముక్తి లభిస్తుంది.


నేను : ముక్తి అంటే ఏమిటి?
గోలాపురి : జన్మ లేకపోవడం.


నేను : అంటే స్వర్గంలోకి వెళతామా?
గోలాపురి : శరీరం లేని ఆత్మ ఏ పరమాత్మ నుండి వచ్చిందో అందులోనే లీనమవుతుంది.


నేను : మీ వయస్సు ఎంత?
గోలాపురి :60 సం.ల పైనే.


ఈ చివరి మాటకి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 50 సం ,,ల వయస్సులా ఉన్నారు ఆయన. ఎందుకో ఆయన వయస్సు ఆయనకు తెలియదేమో అనిపించింది. రెండవ వ్యక్తితో సంభాషణ...


నేను : మీ పేరు?
పూజారి : మహంత్ విష్ణుగిరి.


నేను : మీరు ఎక్కడి నుండి వచ్చారు?
విష్ణుగిరి : ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలో ఖాన్ పూర్ గ్రామంలో మా గురువు గారి సమాధి ఉంది. ముందు అక్కడ ఉంటుండేవాడిని. తర్వాత హనుమాన్ పూజారిగా ఇక్కడికి వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను.


నేను : మీరు సాధువు ఎప్పుడు అయ్యారు?
విష్ణుగిరి : చిన్నప్పుడే అయ్యాను.


నేను : ఎందుకని చిన్నప్పుడే సాధువు అయ్యారు?
విష్ణుగిరి : ప్రారబ్ధం. నేను బ్రాహ్మణుడిని. అందరికీ ఏదో ఒకటి కావాలని ఎలా కోరిక ఉంటుందో అలాగే నాకు సాధువు కావాలని, భగవంతుని సన్నిధి పొందాలని కోరిక.


నేను : మీ గురువు గారి పేరు?
విష్ణుగిరి : బ్రహ్మలీన్ దామోదార్ గిరి. ఆయన సమాధి, ఖాన్ పూర్ లో ఉంది.


నేను : మీరు ఎలాంటి సాధనలు చేస్తారు?
విష్ణుగిరి : చాలా సాధనలు చేస్తాను. (సరైన సమాధానం ఇవ్వలేదు).


నేను : అఖాడా అంటే ఏమిటి?
విష్ణుగిరి : సంస్థ అని అర్ధం.ఇలాంటివి 7 సంస్థలు ఉంటాయి.


నేను : ఇవి ఏం చేస్తాయి?
విష్ణుగిరి : మేము ఈ సంస్థ ద్వారా ఎన్నో సమాజ సేవలు చేస్తుంటాం. ఎక్కడైనా ప్రకృతి వైపరిత్యాల లాంటివి వస్తే మా ట్రస్ట్ 4% విరాళంగా ఇస్తుంది.


ఇలా మా సంభాషణ సాగుతుండగా ఒక 80 ఏళ్ల వృద్ధ సాధువు వచ్చారు.

(Episode: 34)

నా చేతిలో పుస్తకం, పెన్ను చూసి నువ్వు విలేఖరివా? కొన్ని సమస్యలు ఉన్నాయి చెబుతాను తీరుస్తావా అని అడిగారు. నేను నవ్వుతూ కాదు అన్నాను. ఓ అయితే డాక్టర్వా? నా మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. బాగా అలసట కూడా ఉంది ఏదైనా మందిస్తావా అని అడిగారు. ఆయన వేగం చూస్తే నాకు నవ్వు వస్తుంది.


 అంతలో గోలాపురి బాబా కలగచేసుకొని ఆమె ఒక రచయిత్రి అని చెప్పాడు. అలాగా అయితే నీ పుస్తకంలో వ్రాయి నాకు ఒక మంచి శిష్యుడు కావాలి.


గోలాపురి బాబా కలుగజేసుకొని శిష్యుడు అంత అవసరమా? ఇప్పుడే కావాలా? అని అడిగారు. అవును నాకు వెంటనే కావాలి, నా పనులు చేయడానికి కావాలి అన్నారు.


గోలాపురి బాబా: పాశ్చాత్యుడు కావాలా? భారతీయుడు కావాలా?
వృద్ధుడు : పాశ్చాత్యుడు నాకు ఎందుకు? పాశ్చాత్యుడు అయితే నాకు సేవ చేయడు. నేను అతనికి సేవ చేయాల్సి వస్తుంది. అలా అని స్థానికుడు వద్దు. వాళ్లకి పొగరు ఉంటుంది. సేవ చేయరు.
మీ ప్రాంతం నుండి మంచి శిష్యుడు ఉంటే తీసుకురా అన్నారు నాతో. నేను నవ్వుతూ వారి సంభాషణ వింటున్నాను. గోలాపురి బాబా ఆయనతో మేడమకి నీ కొన్ని వివరాలు కావాలంట. నేను అడుగుతాను చెప్పు అంటూ అడగడం మొదలుపెట్టారు.


గోలాపురి : ఎక్కడినుండి వచ్చావు?
వృద్ధుడు : బీహార్.


గోలాపురి : వయస్సు ఎంత?
వృద్ధుడు :70 సం.లు, 60 అని రాసుకోమను.


గోలాపురి : ఎప్పటినుండి సాధువు అయ్యావు?
వృద్ధుడు : 35సం.ల వయస్సులో.


గోలాపురి : మీకు పెళ్లి అయిందా?
వృద్ధుడు : అయింది. భార్య చనిపోయింది.


గోలాపురి : పిల్లలు ఉన్నారా?
వృద్ధుడు : ఉన్నారు.


గోలాపురి : ఎంతమంది?
వృద్ధుడు : ఎందుకు ఇప్పుడు?
నా సమయాన్ని వృధా చేస్తున్నారు అని లేచారు. మళ్ళీ ఏం గుర్తు వచ్చిందో ఆగిపోయి నన్ను చూస్తూ, ఈ పని చేస్తే నీకు ఎంత డబ్బు వస్తుంది అని అడిగారు. నేను ఇప్పుడే చేస్తున్నాను అని చెప్పాను. అవునా సరే అయితే అంటూ అక్క్కడి నుండి వెళ్ళి పోయారు.


ఈ అఖాడాలో ఇంకొంత మందితో నేను మాట్లాడవచ్చా అని అడిగాను. మాట్లాడవచ్చు లోపలికి వెళ్ళమన్నారు. లోపలి గదుల్లోకి వెళ్తుంటే విష్ణు మరియు దత్తాత్రేయు ల మందిరం వచ్చింది. వారికి నమస్కరించుకొని కాస్త ముందుకు వెళితే పెద్దగా విశాలంగా ఉన్న ఒక గది వచ్చింది.


 అందులో వరుసగా పడుకునే బల్లలు, పరుపులు వేసి ఉన్నాయి.
ఒక యువకుడైన సాధువు ఒక బల్లమీద కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి దగ్గరకు రమ్మన్నాడు. ఏం కావాలి? ఎందుకు వచ్చావు? అని అడిగాడు. నా పరిచయం చేసుకొని కొంతమంది సాధువులతో మాట్లాడి, వారి జీవన విధానం తెలుసుకుందామని వచ్చానని చెప్పాను.


 సరే కూర్చోమంటూ, ఆమెకు కూర్చోవడానికి క్రింద చాప వేయమని అతని ప్రక్కనే ఉన్న ఒక 50 సం.ల వయస్సు ఉన్న వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి నాకు చాప వేసి, ఆ యువకుడి ప్రక్కన క్రింద కూర్చున్నాడు. ఆ పెద్ద గదిని ఆనుకొని వంట గది ఉంది. అక్కడ వంట జరుగుతున్నట్టుంది. ఆ హడావిడి వినిపిస్తుంది.


 ఆ సాధువుతో నా సంభాషణ:-

నేను : మీ పేరు?
సాధువు : మేఘానంద్ సరస్వతి.

నేను : ఎక్కడినుండి వచ్చారు?
మేఘానంద్ : ఆగ్ర మండల్, ఉత్తరప్రదేశ్.

నేను : మీ వయస్సు?
మేఘానంద్ : 23 సం.లు.

నేను : సాధువుగా ఎప్పుడు మారారు?
మేఘానంద్ : 6 సం. ల క్రితం.

నేను : ఎందుకు సాధువు అయ్యారు?
మేఘానంద్ : తెలియదు ప్రారబ్ధం.

నేను : గురువు ఎవరు?
మేఘానంద్ : ఈ అఖాడ మహరాజ్ , శ్రీ మహంత్ విద్యా నంద సరస్వతి మహారాజ్.

నేను : ఇప్పుడు ఇక్కడే ఉన్నారా?
మేఘానంద్ : లేదు తిరుగుతూ ఉంటారు.

నేను : మీరు ఎలాంటి సాధన చేస్తారు?
మేఘానంద్ : నేను ఈ అఖాడా కార్యనిర్వాహణ
(మేనేజ్ మెంట్) చూసుకుంటాను.

నేను : ఇందులో ఎంతమంది సాధువులు ఉన్నారు?
మేఘానంద్ : ఈ అఖాడా కు సంబంధించి వందల్లో సాధువులు ఉన్నారు కాని ఎప్పుడూ అందరూ ఇక్కడే ఉండరు. తిరుగుతూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ 20మంది సాధువులు ఉన్నారు.
(మేఘానంద్ సరస్వతి పడకకి కాస్త దూరంలో పెద్ద ప్లాస్మా టి.వి., డివిడి ప్లేయర్ ఉన్నాయి.)

మేఘానంద్ : కుంభమేళ లాంటి సమయాల్లో హిమాలయాల నుండి వచ్చిన పెద్ద పెద్ద బాబాలకి, సాధువులకి వసతి ఈ అఖడాలోనే ఉంటుంది.


ఇంతలో విష్ణు మందిరం పూజారి 
ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే మేఘానంద్ సరస్వతి రెండురోజుల నుండి కేబుల్ రావడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆ కేబుల్ అతను ఏదో సంజాయిషీ చెప్పుకున్నాడు. అతను వెళ్ళిపోయాక –

(Episode: 36)

నన్ను చూస్తూ భారత్ సాధువుల గ్రామం. ఈ సాధువులు ధర్మంకోసం జీవిస్తారు. సనాతన ధర్మాన్ని పాటిస్తారు అన్నారు. ఆయన పేరు మహంత్ త్రివేణి గిరి. వయస్సు 60 సం.లు. సాధువుగా ఎప్పుడు మారారు అన్న నా ప్రశ్నకు ఆయన గట్టి సమాధానమే చెప్పారు.


నేను ఎప్పుడు ఎలా సాధువుగా మారాను అనేది నీకు అనవసరం. నువ్వు ఎవరు అడగడానికి నీకు సంబంధించినవి మాత్రమే అడుగు అన్నారు.
నేను : అయితే సాధన గురించి చెప్పండి.
త్రివేణి గిరి : భగవంతుని నామస్మరణే సాధన. 4 వేదాలు, 18 పురాణాలు చదివిన వారైనా నామస్మరణ చేయవలసిందే. అప్పుడే వారు ఏదైనా ప్రాప్తించుకోగలరు. నామస్మరణ చేస్తేనే భక్తి పరిపూర్ణం అవుతుంది. రామనామమే సాధన. శివనామమే సాధన. అమ్మ నామమే సాధన.
నేను : ఆత్మదర్శనం అంటే ఏమిటి?
త్రివేణిగిరి: పరమాత్మలో కలిసిపోవడం. హృదయంలో భగవంతుని ప్రతిష్టించుకోవడం.


నేను : నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి?
త్రివేణి గిరి : ఎన్నో రకాల సమాధులు ఉంటాయి అందులో ఇది ఒకటి.
ఇంతలో గోలాపురి, విష్ణుగిరి మరికొందరు ఆ గదిలోకి వచ్చారు. వారి భోజనానికి వేళ అయ్యిందని, మేము భోజనానికి వెళుతున్నామని నన్ను వారితో భోజనం చేయమని ఆహ్వానించారు. అప్పుడు సమయం ఉదయం 11 గం.లే అవుతుంది. ఆకలి లేదు కాని వారి భోజనం ఎలా ఉంటుందో చూడాలి అనే నా ఉత్సాహం నన్ను వారితో భోజనానికి వెళ్ళేలా చేసింది.


దాదాపుగా 10 మంది సాధువులు భోజనానికి వరుసగా కూర్చున్నారు. నేను ఒక ప్రక్కన కూర్చున్నాను. ఇద్దరు మగ పిల్లలు వడ్డించడం మొదలుపెట్టారు. యువ సాధువు, ఆయన వినయ శిష్యుడు వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు. ముందుగా అందరికీ రెండు చపాతీలు, పప్పు, సొరకాయ కూర వడ్డించారు.


 తరువాత అన్నం, మళ్ళీ అడిగిన వారికి చపాతీలు వడ్డిస్తూనే ఉన్నారు. వారి వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఉప్పు, కారం, మసాలాలు అన్ని తగు విధంగా ఉన్నాయి. నేను ఇంకా సాధువుల భోజనం అంటే చప్పగా, అంతగా రుచి లేకుండా ఊహించడం వలన ఆ భోజనం నన్ను ఆశ్చర్యపరిచింది. తినడం అయిపోగానే సాధువులందరూ ఎవరి కంచాలు వాళ్ళు కడిగే దగ్గర పెడుతున్నారు. నా ప్రక్కన కూర్చున్న మన యువ సాధువు కూడా భోజనం అయిపోగానే కంచం తీయబోయాడు. అంతే ఏదో ఘోర అపరాధం జరిగినట్టు ఆయన వృద్ధశిష్యుడు వణికిపోయాడు.


 గురూజీ! మీరు కంచం తీస్తారా?వద్దు వద్దు అంటూ చేయి పట్టుకున్నాడు.
యువసాధువు ఒకసారి నా వైపు చూశాడు. నేను వాళ్ళనే చూస్తున్నాను. వద్దు వద్దు నా కంచం నేనే తీసుకుంటాను అంటూ బలవంతంగా అతనే తీసుకువెళ్ళాడు. పాపం గురువుగారి ఆ చర్యకు చాలా బాధపడ్డాడు శిష్యుడు. మొత్తానికి ఆ యువసాధువు తన పదవిని అన్ని విధాలుగా బాగానే ఉపయోగించుకుంటున్నాడని అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.


 అసలు ఆ యువకుడికి ఏ మాత్రము ఆధ్యాత్మిక జ్ఞానం లేదు సరి కదా వయస్సులో తనకంటే పెద్దవారైన సాధువులను ఎలా గౌరవించాలో కూడా తెలియదు.అతనే కాదు ఆ అఖాడాలో నేను చూసిన వారందరూ అలాగే ఉన్నారు. ఆధ్యాత్మికంగా వారి జ్ఞానం శూన్యం. క్షేత్రాలు చూడడానికి వచ్చి సాధువుగా మారినవారు ఒకరు, ఎందుకు సాధువు అయ్యారో తెలియని వారు ఒకరు, అది నా కర్మ అనేవారు మరొకరు. అందరూ అలాగే ఉన్నారు.


 వారితో మాట్లాడిన ఆ సమయంలో నాకు ఒకటి బాగా అర్ధం అయ్యింది. వారిలో చాలామందికి సంసార జీవితం పట్ల కోరిక ఉంది. జీవితంలో తాము ఏదో కోల్పోయామనే నిరుత్సాహం ఉంది. మాట్లాడినంతలోవారు నన్నునా గురించి చాలా ప్రశ్నలు వేశారు. నా భర్త గురించి, ఇంకా నేను సంతానవతిని కాకపోవడం గురించి. వారికి నేను పిచ్చిదానిలా కనిపించాను. సంసారం వదిలివేసి భగవంతుడని తిరగడం. ఈ విషయంలో వృద్ధ సన్యాసి మహంత్ త్రివేణి గిరి మాత్రమే వేరుగా స్పందించారు.


 భగవంతుని సేవ అన్నిటికన్నా గొప్పదని అన్నారు. మిగిలిన వారి నుండి ఆయన వేరుగా ఉన్నారనేది వాస్తవం. ఆయన తేజస్సే చెబుతుంది ఆయన సాధనలు ఏ స్థాయిలో ఉన్నాయో. కాని నిజానికి ఆయన కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు. కాకపొతే ఆయన సాధన ఆయన బాగా చేసుకుంటున్నారు. మంచి దశలో కూడా ఉన్నారు. మిగిలిన వారు మాత్రం బ్రతకలేక సాధువులయ్యారు అనిపించింది. ఆ యువ సాధువుని, అతని అతిశయాన్ని చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాకమానదు.


చెప్పడం మరిచాను నేను అక్కడినుండి వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు సాధువులు నాకు వారి విజిటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఐ.డి.కార్డ్స్ కే ఆశ్చర్యపోతున్ననేను విజిటింగ్ కార్డ్స్ చూసి నిర్ఘాంతపోయాననే చెప్పాలి. సాధువుల జీవితం ఇంత విలాసవంతంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అలా ప్రాచీన అఖాడా దర్శన కార్యక్రమం ముగిసింది.

(Episode: 37)

మధ్యాహ్నం నేను దత్తాత్రేయ మఠ్ వెళ్ళాలి. అటుగా నడవడం మొదలుపెట్టాను. క్షమేశ్వర్ ఘాట్ టీ దుకాణం దగ్గర మనోహరగిరి బాబా, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇంకొక అతను బాబానో, కాదో నాకు అర్ధం కాలేదు. సుమారు 40సం.ల వయస్సు కల్గి, కాషాయం ధరించి ఉన్నాడు. మెడలో రంగురంగుల పూసల దండలు, పెద్ద గింగిరుల జుట్టు, కళ్ళకి నల్ల అద్దాల కళ్ళజోడు విచిత్రంగా ఉన్నాడు. నన్ను చూడగానే మనోహరగిరి బాబా రమ్మని పిలిచారు. వెళ్లి మెట్లమీద కూర్చున్నాను.


వాళ్ళంతా పూసల దండలు అమ్ముతున్న ఒక స్త్రీ వద్ద స్పటికమాలలు బేరం చేస్తున్నారు. ఆ స్త్రీ గురించి చెబుతూ మనోహరగిరి బాబా ఈమెని నేను హరిద్వార్ లోనూ, గంగోత్రి లోనూ చూశాను. వీరు ఈ దండలు అమ్మడానికి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఒక విధంగా వీరిది సాధు జీవితమే అన్నారు. నేను బెనారస్ వచ్చిన పని ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో కూర్చున్నాను. నేను దత్తాత్రేయ మఠానికి వెళ్ళవలసిన సమయం కావస్తుండడంతో మనోహర్ గిరి బాబా వద్ద సెలవు తీసుకున్నాను.
మఠానికి నేను వెళ్లేసరికి మధ్యాహ్నం రమ్మని చెప్పిన వ్యక్తి వసారాలో కుర్చీలో కూర్చొని వార్తా పత్రిక చదువుతున్నారు.


 నన్ను చూడగానే మరో కుర్చీ తెప్పించారు. ఏమి వివరాలు కావాలి అని అడిగారు. మీ గురించి, మఠం గురించి చెప్పమని అడిగాను.
నా పేరు శంకరానంద సరస్వతి. వయస్సు 60 సం.లు. నేను దండి సన్యాసిని. సన్యాస సంప్రదాయాలలో ఇది చాలా విశిష్టమైనది. సన్యాసి కేవలం బ్రాహ్మణుడే కాగలడు. కాని ఈ రోజుల్లో అందరూ సన్యాసి అయిపోతున్నారు. ఇంట్లో గొడవలతో కొందరు, పని చేయడం చేతగాక కొందరు సన్యాసులవుతున్నారు.నేను : ఈ మఠం ఎప్పుడు స్థాపించారు?
శంకరానంద : ఇది 800 సం.ల పురాతనమైన దత్తాత్రేయ మఠం. దత్తాత్రేయ అవతారంగా పేర్కొనబడే నృసింహ సరస్వతి గారి మఠం ఇది. నృసింహ సరస్వతి ఇక్కడే సన్యాసం తీసుకున్నారు. ఆ తర్వాత నృసింహవాడి, కొల్హాపూర్ లలో సాధన చేశారు.


నేను : అవును నేను ఆయన గురించి గురు చరిత్ర అనే పుస్తకంలో చదివాను. మీరు ఎలాంటి సాధనలు చేస్తారు?
శంకరానంద : ప్రణవ జపం చేస్తాము, ఇంకా ఉపనిషత్ అధ్యయనం చేస్తాము.
నేను : ఇప్పుడు ఈ మఠాధిపతి ఎవరు?
శంకరానంద : పరమహంస పరివ్రాజకాచార్య మద్వానంద సరస్వతి .
నేను : ఎవరు ఆయన?
శంకరానంద : మీకు శ్రీధర స్వామీజీ తెలుసా? ఆయన జీవించి ఉన్నకాలంలో మా గురువుగారు చాలా సంవత్సరాలు ఆయన సేవ చేశారు. తరువాతి కాలంలో దండి సన్యాసిగా మారి ఈ మఠాధిపతి అయ్యారు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు.
నేను : నేను ఆయనను కలవవచ్చా?
శంకరానంద : ఆయన వయస్సు 90సం.ల పైనే. ఆయన ఆరోగ్యం కూడా అంత సహకరించడం లేదు. అందుకే ఆయన ఎవరినీ కలవడం లేదు.


నేను : దయచేసి ఒకసారి నా విన్నపం తెలియజేయండి. ఒకవేళ ఆయన తిరస్కరిస్తే నేను మళ్ళీ అడగను.
శంకరానంద : సరే ప్రయత్నిస్తాను.
ఎవరో మరొక నడివయస్సు వ్యక్తిని పిలిచి నా గురించి చెప్పారు. ఆయన పై అంతస్తుకి వెళ్ళి, 5 ని,,లలో వచ్చారు. గురువుగారు ఇంకా లేవలేదని లేచాక అడిగి చెబుతానన్నారు. అలాగే అన్నాను.
మఠం గురించి ఏమైనా చెప్పమని శంకరానంద గారిని అడిగాను.


 నాతో రండి అంటూ ఆయన మఠం మరోవైపుకి దారి తీసారు. అక్కడ ఒక గదిలా ఉంది. లోపల చాలా శివలింగాలు ఉన్నాయి. కొన్ని పెద్దగా, కొన్ని మధ్యస్తంగా, కొన్ని చిన్నగా రకరకాలుగా ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఉన్న శివలింగాన్ని చూపిస్తూ ఇది నారదుల వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు నారదుడు శంకర భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. అందుకు గుర్తుగా ఈ లింగాన్ని ప్రతిష్టించాడు.
అదిగో ఆ లింగం చూడండి అది శంకరభగవానుని ఆభరణమైన వాసుకి అనే సర్పం తన సాధనకి గుర్తుగా ప్రతిష్టించిన లింగం.


 ఇవి రెండు దత్త భగవానుని తల్లిదండ్రులు అత్రి అనసూయ లు ప్రతిష్ట చేశారు అంటూ ఆ లింగాల విశిష్టతను చెప్పారు. నారదుడు ఇక్కడ సాధన చేయడం వల్లనే ఈ ఘాట్ కి నారద ఘాట్ అనే పేరు వచ్చింది.
పేష్వాల కాలంలో ఘాట్ మీద కొంత స్థలాన్ని మఠం వాళ్ళు మరాఠా పేష్వాలకు ఇచ్చారు. వారు ఇక్కడ భవనాన్ని నిర్మించుకున్నారు. అప్పటినుండి నారదఘాట్ రెండు భాగాలుగా విడిపోయింది. 


మీరు చూస్తున్న రాజా ఘాట్ ఏర్పడింది. ఈ మఠం ఇప్పుడు చిన్నగా ఉంది. కాని ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. అందరూ కబ్జా చేయడం వలన ఇప్పుడు ఇంతే మిగిలింది అన్నారు.
ఇంతలో ఇంతకుముందు వ్యక్తి వచ్చాడు. గురువుగారు ఈమెను రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు.

(Episode: 38)

మధ్యాహ్నం నేను దత్తాత్రేయ మఠ్ వెళ్ళాలి. అటుగా నడవడం మొదలుపెట్టాను.
 క్షమేశ్వర్ ఘాట్ టీ దుకాణం దగ్గర మనోహరగిరి బాబా, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.


 ఇంకొక అతను బాబానో, కాదో నాకు అర్ధం కాలేదు. సుమారు 40సం.ల వయస్సు కల్గి, కాషాయం ధరించి ఉన్నాడు. మెడలో రంగురంగుల పూసల దండలు, పెద్ద గింగిరుల జుట్టు, కళ్ళకి నల్ల అద్దాల కళ్ళజోడు విచిత్రంగా ఉన్నాడు. నన్ను చూడగానే మనోహరగిరి బాబా రమ్మని పిలిచారు. వెళ్లి మెట్లమీద కూర్చున్నాను.
వాళ్ళంతా పూసల దండలు అమ్ముతున్న ఒక స్త్రీ వద్ద స్పటికమాలలు బేరం చేస్తున్నారు. ఆ స్త్రీ గురించి చెబుతూ మనోహరగిరి బాబా ఈమెని నేను హరిద్వార్ లోనూ, గంగోత్రి లోనూ చూశాను. వీరు ఈ దండలు అమ్మడానికి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఒక విధంగా వీరిది సాధు జీవితమే అన్నారు. నేను బెనారస్ వచ్చిన పని ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు.


 కాసేపు వారితో కూర్చున్నాను. నేను దత్తాత్రేయ మఠానికి వెళ్ళవలసిన సమయం కావస్తుండడంతో మనోహర్ గిరి బాబా వద్ద సెలవు తీసుకున్నాను.
మఠానికి నేను వెళ్లేసరికి మధ్యాహ్నం రమ్మని చెప్పిన వ్యక్తి వసారాలో కుర్చీలో కూర్చొని వార్తా పత్రిక చదువుతున్నారు. నన్ను చూడగానే మరో కుర్చీ తెప్పించారు. ఏమి వివరాలు కావాలి అని అడిగారు. మీ గురించి, మఠం గురించి చెప్పమని అడిగాను.
నా పేరు శంకరానంద సరస్వతి. వయస్సు 60 సం.లు. నేను దండి సన్యాసిని. సన్యాస సంప్రదాయాలలో ఇది చాలా విశిష్టమైనది. సన్యాసి కేవలం బ్రాహ్మణుడే కాగలడు. కాని ఈ రోజుల్లో అందరూ సన్యాసి అయిపోతున్నారు. ఇంట్లో గొడవలతో కొందరు, పని చేయడం చేతగాక కొందరు సన్యాసులవుతున్నారు.నేను : ఈ మఠం ఎప్పుడు స్థాపించారు?
శంకరానంద : ఇది 800 సం.ల పురాతనమైన దత్తాత్రేయ మఠం. దత్తాత్రేయ అవతారంగా పేర్కొనబడే నృసింహ సరస్వతి గారి మఠం ఇది. నృసింహ సరస్వతి ఇక్కడే సన్యాసం తీసుకున్నారు. ఆ తర్వాత నృసింహవాడి, కొల్హాపూర్ లలో సాధన చేశారు.


నేను : అవును నేను ఆయన గురించి గురు చరిత్ర అనే పుస్తకంలో చదివాను. మీరు ఎలాంటి సాధనలు చేస్తారు?
శంకరానంద : ప్రణవ జపం చేస్తాము, ఇంకా ఉపనిషత్ అధ్యయనం చేస్తాము.
నేను : ఇప్పుడు ఈ మఠాధిపతి ఎవరు?
శంకరానంద : పరమహంస పరివ్రాజకాచార్య మద్వానంద సరస్వతి .
నేను : ఎవరు ఆయన?
శంకరానంద : మీకు శ్రీధర స్వామీజీ తెలుసా? ఆయన జీవించి ఉన్నకాలంలో మా గురువుగారు చాలా సంవత్సరాలు ఆయన సేవ చేశారు. తరువాతి కాలంలో దండి సన్యాసిగా మారి ఈ మఠాధిపతి అయ్యారు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు.
నేను : నేను ఆయనను కలవవచ్చా?
శంకరానంద : ఆయన వయస్సు 90సం.ల పైనే. ఆయన ఆరోగ్యం కూడా అంత సహకరించడం లేదు. అందుకే ఆయన ఎవరినీ కలవడం లేదు.


నేను : దయచేసి ఒకసారి నా విన్నపం తెలియజేయండి. ఒకవేళ ఆయన తిరస్కరిస్తే నేను మళ్ళీ అడగను.
శంకరానంద : సరే ప్రయత్నిస్తాను.
ఎవరో మరొక నడివయస్సు వ్యక్తిని పిలిచి నా గురించి చెప్పారు. ఆయన పై అంతస్తుకి వెళ్ళి, 5 ని,,లలో వచ్చారు. గురువుగారు ఇంకా లేవలేదని లేచాక అడిగి చెబుతానన్నారు. అలాగే అన్నాను.
మఠం గురించి ఏమైనా చెప్పమని శంకరానంద గారిని అడిగాను.


 నాతో రండి అంటూ ఆయన మఠం మరోవైపుకి దారి తీసారు. అక్కడ ఒక గదిలా ఉంది. లోపల చాలా శివలింగాలు ఉన్నాయి. కొన్ని పెద్దగా, కొన్ని మధ్యస్తంగా, కొన్ని చిన్నగా రకరకాలుగా ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఉన్న శివలింగాన్ని చూపిస్తూ ఇది నారదుల వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు నారదుడు శంకర భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. అందుకు గుర్తుగా ఈ లింగాన్ని ప్రతిష్టించాడు.


అదిగో ఆ లింగం చూడండి అది శంకరభగవానుని ఆభరణమైన వాసుకి అనే సర్పం తన సాధనకి గుర్తుగా ప్రతిష్టించిన లింగం. ఇవి రెండు దత్త భగవానుని తల్లిదండ్రులు అత్రి అనసూయ లు ప్రతిష్ట చేశారు అంటూ ఆ లింగాల విశిష్టతను చెప్పారు. నారదుడు ఇక్కడ సాధన చేయడం వల్లనే ఈ ఘాట్ కి నారద ఘాట్ అనే పేరు వచ్చింది.
పేష్వాల కాలంలో ఘాట్ మీద కొంత స్థలాన్ని మఠం వాళ్ళు మరాఠా పేష్వాలకు ఇచ్చారు. వారు ఇక్కడ భవనాన్ని నిర్మించుకున్నారు.


 అప్పటినుండి నారదఘాట్ రెండు భాగాలుగా విడిపోయింది. మీరు చూస్తున్న రాజా ఘాట్ ఏర్పడింది. ఈ మఠం ఇప్పుడు చిన్నగా ఉంది. కాని ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. అందరూ కబ్జా చేయడం వలన ఇప్పుడు ఇంతే మిగిలింది అన్నారు.
ఇంతలో ఇంతకుముందు వ్యక్తి వచ్చాడు. గురువుగారు ఈమెను రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు.


Episode - 39 (Telugu)
   
      మరుసటి రోజు ఉదయం ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నా.


  ఈరోజు కీనారం మఠం గురువుగారి దర్శనం లభించే రోజు. ఒక బాబానో, మహాత్ముడినో చూడబోతున్నాను అనే ఉత్సాహం కన్నా ఒక అఘోరా పీఠాధిపతిని చూడబోతున్నానన్న ఉత్సాహమే ఎక్కువగా ఉంది. ఉదయం 9 గం.లకు చాలా ఉత్సాహంగా బయలుదేరాను కీనారాం మఠ్ కి.


  నేను వెళ్ళేసరికి మఠం బయటి వరకు ఆడ, మగ నిలబడి ఉన్నారు. నాకు ఏమీ అర్ధం కాలేదు. ఆ రోజు మఠాధిపతి దర్శనం అంటే ఏదో అనుకున్నాను. 


కానీ ఆయనకి ఇంతమంది భక్తులు ఉంటారని నేను ఊహించలేదు. చాలా మంది భక్తులు ఉన్నారు. మొదటిసారి నేను వెళ్ళినపుడు ఎవరూ లేక వెలవెలబోతున్న ఆశ్రమం ఈరోజు స్థలం సరిపోవడం లేదు. బయట గేట్ వద్ద ఉండి భక్తులను కంట్రోల్ చేస్తున్న ఒక వాలంటీర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. ఏం కావాలి మేడమ్ అని అడిగాడు. గురువుగారిని కలవాలి అన్నాను. ఆడవాళ్ళు నిలబడిన వరుస చూపించాడు. 


అలా కాదు ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నాను. ముందు మీరు ఈ వరుసలో వెళ్ళండి. లోపల ఉన్న వారిని అడగండి అన్నాడు. ఇక వెళ్ళి వరుసలో నిలబడ్డాను. చాలా మంది ఉన్నారు. నా ముందు ఒక నడి వయస్సు స్త్రీ ఉంది. ఆమెను చూస్తే చదువుకున్న వ్యక్తిలాగే ఉంది. నా వెనుక ఉన్న స్త్రీలు చాలా ఆధునికంగా ఉన్నారు. వాళ్ళే కాదు అక్కడ చాలా మంది మంచి స్థితి వాళ్ళని చూడగానే తెలుస్తుంది. 


ఒక అఘోరా గురువుకి ఇంతమంది నాగరిక భక్తులు ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ముందు ఉన్న స్త్రీతో మెల్లిగా మాటలు కలిపాను.ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఇంతమంది ఉన్నారేమిటి? అని అడిగాను. గురువుగారు చాలా తక్కువ సార్లు దర్శనం ఇస్తారు. కొన్నిసార్లు వారు ఆశ్రమానికి వచ్చి, వెళ్ళిన విషయం కూడా తెలియదు. కాని ఈ రోజు మఠస్థాపన దినోత్సవం. 


ప్రతి సంవత్సరం ఈ రోజు గురువుగారు గురుస్థానంలో కూర్చుని దర్శనం ఇస్తారు. ఆ దర్శనానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తారు అన్నది. ఆయన అంత మహాత్ముడా అని నేను అడిగిన ప్రశ్నకి, మారిపోయిన ఆమె ముఖ కవళికలు చూసి అనవసరంగా అడిగానేమో అనిపించింది. బాబాజీ చాలా గొప్ప సిద్ధపురుషుడని, ఆయన దర్శనం లభించడం అదృష్టం అని చెప్పింది. అయితే నేను ఆ అదృష్టానికి కాస్త దూరంలో ఉన్నాననిపించింది. ఏమైనా ఒక పూర్తి అఘోరాని చూడబోతున్నాను. నల్లని బట్టలలో ఒక గంభీరమైన ఆకారాన్ని ఊహించడం మొదలుపెట్టాను.


  నా ముందు వరుస తగ్గుతూ ఒకచోట ఆగాను. అక్కడ వసారా లాంటిది ఉంది. అక్కడ ఒక 40 సం.ల వ్యక్తి తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి చేతులు దగ్గరికి పెట్టుకొని కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆయనకి కొంచెం దూరంలో వరుసల్లో వచ్చిన భక్తులు పూలదండలు క్రింద పెట్టి అక్కడే నమస్కరిస్తున్నారు. నాకు అర్ధం కాలేదు వాళ్ళంతా ఆయనకు ఎందుకు నమస్కరిస్తున్నారో! చాలా పారవశ్యంలో ఉన్న నా ముందు స్త్రీ ని అడిగా ఆయన ఎవరు అని.


 మరొకసారి ఆమె నన్ను మింగేసేలా చూసింది. ఆయనే కీనారాం పీఠాధిపతి గౌతం బాబా అన్నది. అఘోరా అనగానే నల్ల బట్టలు, భీకరమైన రూపం ఊహించిన నేను ఆయన అలా ఉండడం జీర్ణించుకోలేకపోయాను. అంత పెద్ద అఘోరాధిపతి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయలేదనిపించింది. అందరితోపాటు నేను నమస్కరించుకున్నాను.


ఎవరినీ ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్ళకుండా సేవకులు ఉన్నారు. కాస్త బయటకు వచ్చేసరికి అక్కడ ఒక స్త్రీ పళ్ళెంలో ఏదో పెట్టుకొని అందరికీ ఇస్తుంది. నేను అక్కడికి వెళ్ళాను. ఏదో చేతిలో పెట్టింది.


 గుంపు నుండి బయటకు వచ్చి చేయి తెరచి చూశాను. కొంచెం సోంపు, లవంగాలు, యాలకులు ఉన్నాయి. ఈ మసాలా దినుసులు ఎందుకు ఇచ్చిందో అర్ధం కాలేదు. అసలు అవి లవంగాలు, యాలకులేనా అని వాటిమీద పరిశోధన మొదలు పెట్టబోయేంతలో, ఇంతకుముందు వరుసలో నా వెనుక నిలబడ్డ ఆధునిక స్త్రీ నా వద్దకు వచ్చింది. నా సమస్య అర్ధమైనట్టుంది. 


అవి ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. వాటిని తినండి అన్నది. ఒక లవంగం, ఒక యాలక్కాయనోటిలో వేసుకున్నాను. ఆమె వెంటనే కాదు కాదు మొత్తం తినండి అంది. ఒక సారి కూరలో వేసుకునేంత మసాలా ఉంది నా చేతిలో. అదంతా ఒకేసారి తినడమా? ఆమె బలవంతపెట్టేసరికి నోట్లో వేసుకున్నాను. వాళ్ళంతా ఎంతో భక్తిగా ఆ దినుసులు తింటుంటే నాకు మాత్రం నోరు మండిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళితే కేసరి ప్రసాదంగా ఇస్తున్నారు. ముందు అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. 


నా నోటి మంట కి అదే మందు అప్పుడు. ఆశ్రమ ఆవరణ అంతా కిటకిటలాడిపోతుంది. చాలా మంది దూర ప్రదేశాలనుండి వచ్చినట్టు వాళ్ళ సామాన్లు చూస్తేనే తెలుస్తుంది. కొందరు అక్కడే స్నానాలు చేస్తున్నారు. కీనారాం బాబా సమాధి దగ్గర ఉన్న ఒక సేవకుడిని అడిగాను. బాబాజీతో మాట్లాడాలంటే ఎవరిని సంప్రదించాలి అని.


Episode - 40 (Telugu)

మేము నిలబడిన చోటుకి కాస్త దూరంలో ఉన్న రెండంతస్తుల బంగళా చూపించి అక్కడ అడగమన్నాడు. అక్కడికి వెళ్లి నేను చాలా దూరం నుండి వచ్చానని, బాబా దర్శనం కావాలని అడిగాను. ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడడం కుదరదు. రేపు ఉదయం 9 గం.లకు రండి అన్నారు. అక్కడినుండి బయటకు వచ్చాను కాని ఎందుకో ఒక అఘోర గురువు అలా ఉండడం నాకు జీర్ణం కాలేదు. ఘాట్ల మీదకి వచ్చాను. మిగిలిన సమయం అంతా జైతో కాశీ గురించి, సందర్శకుల గురించి కబుర్లతోనే గడిచింది.

మరుసటిరోజు ఉదయం 9గం,,లు అవుతుండగా కీనారాం మఠ్‌కి వెళ్ళాను. చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు. వారు కూడా దూర ప్రాంతాల నుండి వచ్చినవారే. రాత్రి వాళ్ళు అక్కడే పడుకున్నట్టున్నారు.

నిన్న నేను వెళ్ళి అడిగిన బంగళా మొదటి అంతస్తుకి వెళ్ళాను. మధ్యలో వసారా ఉండి అటూ ఇటూ గదులు ఉన్నాయి. నేను వెళ్ళేసరికి ముగ్గురు వ్యక్తులు వసారాలో కూర్చొని ఉన్నారు. నన్ను రమ్మన్న వ్యక్తి నన్ను అక్కడే కూర్చోమన్నాడు. నేను కూర్చున్నదానికి ఎడమప్రక్కన రెండు గదులు ఉన్నాయి. ఒక గది గుమ్మానికి పూలమాలలు ఉన్నాయి. నేను కూర్చున్నచోటుకి కాస్త దూరంలో ఒక విశ్రాంతి కుర్చీ, క్రింద ఒక అందమైన పట్టా ఉన్నాయి. దానిమీద పాదాలు పెట్టుకోవడానికి పీఠము ఉంది. అవన్నీ పూలతో అలంకరించబడి ఉన్నాయి. కొందరు భక్తులు నిశ్శబ్ధంగా వచ్చి ఆ కుర్చీకి, గదికి నమస్కారాలు పెట్టి వెళ్ళిపోతున్నారు.

ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ వైపు గదుల నుండి ఈవైపు గదులకు తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. అరగంట తర్వాత ఒక వ్యక్తి వచ్చి గురువుగారు నిద్ర లేచారు రండి అంటూ నన్ను, ఒక యువకుడిని లోపలికి తీసుకువెళ్ళారు. 
లోపల అంతా అధునాతనంగాఉంది. మూడు భాగాలుగా విభజించబడి ఉంది. మొదటి భాగంలో నేను, నాతోపాటు లోపలికి వచ్చిన యువకుడు నిలబడి ఉన్నాం. రెండవ భాగంలో ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. మూడవ భాగం గురువుగారి పడకగది. ఆయన లేచారు కదా ఆయన శిష్యులు గది శుభ్రం చేస్తున్నారు.

నా కళ్ళు గురువుగారి కోసం వెతుకుతున్నాయి. ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ఇప్పుడే లేచారు కదా లోపల ఉన్నారేమో అనుకొని గదులు, ఫోటోలు అన్నీ గమనిస్తున్నా. అంతలో నా ప్రక్కన నిలబడ్డ యువకుడు వెళ్ళి రెండవభాగంలో నిలబడ్డ ఇద్దరు వ్యక్తులలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను పట్టించుకోలేదు. నా దృష్టి అంతా గదుల్లోని ఫోటోల మీద ఉంది.

కాసేపటికి ఆ యువకుడు బయటకు వెళుతూ నన్ను లోపలికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్ధంగాక కొంచెం ముందుకు వెళ్ళి నిలబడి చూస్తున్నాను. అక్కడ నిలబడ్డ వ్యక్తి కూడా ఏమీ మాట్లాడకుండా నన్నే చూస్తున్నాడు. అతను బ్లూ టీషర్ట్, తెల్లని పంచె ధరించి ఉన్నాడు. గుట్కా నములుతున్నాడు.

గురువుగారి దర్శనం ఎక్కడ అని ఆయనను అడగనా వద్దా అనుకుంటూ ఆయనను దాటి కొంచెం ముందుకు వెళ్ళి లోపలికి వంగి చూస్తున్నాను. అంతలో నా వెనుక నిలబడిన ఆయన, నాతో ఏం మాట్లాడాలి అని అడిగాడు. గురువుగారిని కలవాలని చెప్పబోతూ ఒక్కసారి ఆయన ముఖం పరిశీలనగా చూశాను. అంతే! నాకు ఎంత షాక్ కొట్టిందో చెప్పడం కష్టమే.
ఆయన వేషధారణ చూసి గురువుగారి గురించి అడగడానికి కూడా నేను ఇష్టపడలేదు. కాని ఆయనే ఆ గురువు. నిన్నటి రోజు కన్నా ఎక్కువగా నిరుత్సాహపడ్డాను.

కాని ఆయన పెదాల మీద అందమైన చిరునవ్వు నా అమాయకత్వానికి. నా వివరాలు అడిగారు, తడబడుతూనే చెప్పాను. నేను కాశీ వచ్చిన పని చెప్పాను. తప్పకుండా చేయి, సఫలం అవుతుంది అని ఆశీర్వదించారు. ఆ షాక్ లోనే బయటకు వచ్చాను. గౌతమ్ బాబా గురించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. 

కాని ఎవరూ సరిగా చెప్పలేకపోయారు. అయినా గాని ఆయన లీలలు, శక్తి గురించి మాత్రం ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. అంత చిన్న వయస్సు వ్యక్తి, అంత సాధారణంగా ఉన్న వ్యక్తిలో అంత శక్తి ఉందా అనిపించింది. కాని వయస్సుకి, సాధనకి సంబంధం లేదు అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి.

అక్కడి నుండి లాలి ఘాట్‌కి వచ్చాను. నేను వచ్చేసరికి మనోజ్ ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు.

ఆ వ్యక్తి నల్లబట్టలు, రింగుల జుట్టుతో ఉన్నాడు. మనోజ్ నన్ను చూడగానే, మేడమ్ ఇతనే గణేష్ రామ్, అమర్ బాబా శిష్యుడు అంటూ పరిచయం చేశాడు. నేను అమర్ బాబాని కలవాలనుకుంటున్నట్టు అతనికి చెప్పాను. అది అంత సులభం కాదు, గురువుగారు ఒప్పుకోవాలి. అంతేకాదు ఆయన ఆశ్రమంలో ఉన్నారో లేదో తెలియదు. నేను కనుక్కుంటాను అన్నాడు.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.