Who is Narada Maharshi | Facts About Narad Muni

నారదుని పూర్వజన్మ వృత్తాంతము

(శ్రీమదాంధ్ర మహాభాగవతం) *”వ్యాసా! నేను ఈవేళ ఎందుకు నారదుడుగా ఉన్నానో నీకు చెపుతాను. నా చరిత్ర వింటే నీవు తెల్లబోతావు’ అని నారదుడు తాను నారదుడెలా అయ్యాడో చెపుతాడు.”*

నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనంనుంచీ బాగా ఐశ్వర్యవంతులయ్న బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితికి పెత్తడం మొదలగు పనులు చేసేది. తల్లి ఎక్కడికి వెడితే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. వారు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చాతుర్మాస్యమునకని వచ్చారు. వస్తే అమ్మతోపాటు ఈ పిల్లవాడు కూడ అక్కడ ఉన్నాడు. రోజూ ’నీవు ఉదయముననే స్నానం చేసేసి, వాళ్ళకి పీటలు వెయ్యడం, దర్భాసనములు వెయ్యడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినది’ అని యజమాని ఈ పిల్లవానికి చెప్పాడు.

దాసీ పుత్రుడైన నారదుడు రోజూ స్నానంచేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు. వాళ్ళు సన్యాసులు. సన్యాసులు అంటే లోకం అంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. వాళ్ళు ఆ పిల్లవాని దాసీపుత్రునిగా చూడలేదు. అయిదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవచూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టమును నారదునికి ఇచ్చేవారు. వాళ్ళు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవతమ్ శేషమును తినేవాడు. ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుడిని అర్చన చేసుకోవడం, వేదవేదాంగములు చదువుకోవడం, వాటిని గూర్చి చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవాడు. ఆఖరుకి చాతుర్మాస్యమ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడయిన నారదుని పిలిచి –

అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే గొలువగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతో గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్!!

ఆ పిల్లవానికి ఏమీ తెలియకపోయినా, ఏ తాపత్రయం లేకుండా మనస్సులో వాళ్ళమీద ఉన్న అపారమయిన భక్తిచేత అతడు వారిని సేవించగా – వారందరు కూడ కారుణ్యము అని చెప్పడానికి కూడ వీలు లేదు – మిక్కిలి వాత్సల్య చిత్తముతో నారదుని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మమీద ద్వాదశాక్షరీ మహామంత్రమును ఉపదేశంచేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవానిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇంతకాలం అటువంటి వారిని సేవించి, సేవించి ఉండడంఅలన నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది.

సత్సంగత్వే నిస్స్ంగత్వం – నిస్సంగత్వే నిర్మోహత్వం!
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం – నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!!

అటువంటి సత్పురుషులతో తిరగడం వలన హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకు మనసులోకి అందేసింది. చాతుర్మాస్యం అయిపోయింది. ఆ సన్యాసులు వెళ్ళిపోయారు. తాను లోపల ఆ శ్రీమన్నారాయణుని తలుచుకొని పొంగిపోతూ రోజూ అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటిపడిపోయిన తరువాత గృహయజమానులయిన బ్రాహ్మణులు ఆమెను పిలిచి ’పెరట్లోకి వెళ్ళి ఆవులపాలు పితికి పట్టుకునిరా’ అని చెప్పారు తల్లిని. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకుంది ఆవిడ చూడకుండా పొరపాటున దానిమీద కాలువేసింది. త్రాచుపాము ఆవిడని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు పిల్లవాడు అనుకున్నాడు – ’ అమ్మయ్య, నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నది ఒకర్తి ఉండడం వలన నేను ఈ ఇంట్లో అమ్మతోపాటు తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను స్వేచ్ఛావిహారిని. అంతా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాను” అని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి చివరకు ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్దపులులు తిరిగుతున్నాయి. క్రూరసర్పములు తిరిగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు – ’నాకు ఏమిటిభయం! ఈలోకం అంతటానిండి నిబిడీకృతమయి శాసించే కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు’ అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి విపరీతమయిన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనబడింది. అక్కడ నీళ్ళు తాగి స్నానంచేసి ’ఇక్కడ నాస్వామి ఒకసారి నాకు సాకారంగా కనపడితే బాగుండును’ అని ఒక రావిచెట్టు క్రిందకూర్చుని ద్వాదశాక్షరీ మంత్రమును తదేకంగా ధ్యానం చేస్తున్నాడు.

అలా ధ్యానం చేస్తుంటే లీలామాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని దర్శనం అయిందొ. పొంగిపోయి పైనుంచి క్రిందకి మెరుపును చూసినట్లు చూశాడు. అంతే! స్వామి అంతర్ధానం అయిపోయారు. అపుడు అశరీరవాణి వినపడింది. ’ఈజన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టంచేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణంచేత, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపమును అలా బాగా చూడాలి అని కోరుకుంటూ, నువ్వు నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మాన్ని అనుసరించి ఒకరోజున ఈ శరీరమును వదిలేస్తావు. అలా అదిలేసిన తరువాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఒకనాడు నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకములయందు విహరిస్తావు. నీకీ కానుకను ఇస్తున్నాను’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.

’ఆనాడు శ్రీమన్నారాయణున్ని దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని, చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తరువాత నారాయణుని నాభికమలంలోంచి మరల చతుర్భుజ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు. మొట్టమొదట ప్రజాపతులను సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు. నాకు ’మహతి’ అను వీణను ఇచ్చారు. ఆ వీణ సర్వకాలములయందు భగవంతునికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములనంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నేను వైకుంఠమునకు వెళతాను. సత్యలోకమునకు వెళతాను. కైలాసమునకు వెళతాను. ఏ ఊరుపడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను. భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను. అదితప్ప మరొకటి నాకు రాలేదు.

వ్యాసా, నేను ఇవ్వాళ్టికి ఇంతటి వాడిని ఎందువల్ల అవగలిగాను? ఒకనాడు దాసీపుత్రుడనయిన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానము ఇవ్వాళ నన్నీస్థితికి తెచ్చింది. రెండవజన్మలో నారదుడను అయిపోయాను. నీవు భాగవతమును, భగవత్కథను చెప్పగలిగితే విన్నవాడు ఉత్తరజన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు? ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని నీవు భగవద్భక్తి గురించి చెప్పవలసింది. దుర్యోధన ధృతరాష్ట్రులగురించి ఎందుకు చెపుతావు? చెప్పకపోయినా ప్రజలకందరకు వారిని గురించి తెలుసు. అందుకని భక్తి గురించి చెప్పు. భక్తికి ఆలవాలమయిన భాగవతమును రచించు’ అన్నారు.

అనగా ఆనాడు మహానుభావుడు వ్యాసభగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయి ’నారదా ఎంతగొప్పమాట చెప్పావయ్యా!ఇప్పుడు నేను భగవంతుని గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తిగురించి, ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించిపోయినట్లు తరించిపోతారు. అటువంటి భాగవతమును రచన చేయడం ప్రారంభిస్తున్నాను’ అని ఆచమనం చేసి కూర్చుని వ్యాసభగవానుడు తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభం చేశారు.

Keywords : Who is narada, Narada Maharshi History , History of Narada Muni , Devotional doubts ,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *