Potana Telugu Bhagavatam 7th Poem | Bhagavatam PDF Books Poems Meaning Audio Files Download

Potana Telugu Bhagavatam 7th Poem : Sri Kaivalya Padambu Cherutakunai (1-1)

ప్రతిరచనకు ఒక లక్ష్యం ఉంటుంది. కవి / రచయిత ముందుగా తాను ఎందుకు ఆ రచన చేయదలిచాడో తాను కోరుకుంటున్న ఫలితం ఏమిటో ముందు మాటగా వివరిస్తాడు. ఈ ముందు మాట లేదా తోలి  పలుకులో మనకు కవి యొక్క ఉద్దేశ్యం మనకు తెలుస్తుంది. పోతనామాత్యులు కూడా అదే రీతిలో తన లక్ష్యం ఏమిటో తాను ఎందుకు భాగవత రచన చేస్తున్నారో మనకు తోలి పద్యం లోని తెలియచేసారు. శ్రీ కైవల్య పదం చేరుటకునై అంటూ రచన యొక్క లక్ష్యాన్ని వివరించారు.

భాగవతం లో ప్రధమ స్కంధం లో మొట్ట మొదటి పద్యమే శ్రీ కైవల్యం. మనం ముందుగా ఈ పద్యమే నేర్చుకోవాలి కానీ సులువైన పద్యాలు ద్వారా మనం నెర్చుంటున్నాం కదా.. ఈ పద్యం లో “విలసద్దృగ్జాల” ఈ ఒక పదం మాత్రమే కాస్త పలకడానికి కష్టం గా ఉంటుంది. రెండు మూడు సార్లు మీరు చదివిన, విన్న మీకు వచ్చేస్తుంది.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్

ప్రతిపదార్ధం :

శ్రీ = శుభకర మైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థించెదన్; లోక = లోకా లన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్ప మున్న వాడు; కున్ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళ యందు; సంరంభ = వేగిరపాటు ఉన్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసే వాడు; కున్ = కి; కేళి = ఆట లందు; లోల = వినోదా లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; = బ్రహ్మాండముల {కంజాత భవాండకం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగిన వాడు; కున్ = కి; మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్య యొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.

భావం :

సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల… కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *