Amarnath Yatra 2018 Travel Experience by Saride Nag Pithapuram

ప్రతి హింధువూ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన ఆథ్యాత్మిక యాత్ర అమరనాథ్
ప్రకృతి ఒడిలో సహజ ఇబ్బందులను తట్టుకుంటూ, ప్రకృతి అందాలకు పరవశిస్తూ.. అడుగడుగునా భంభం భోలే అని నినదిస్తూ.. ముందు సాగే సాహస యాత్రే అమరనాథ్ యాత్ర.
మేము పిఠాపురం నుంచి భయలు దేరే రోజుకు (14 07 2018) అమరనాథ్ లో వాతావరణం బాగోలేదు. తీవ్రమైన వర్షాలు. జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడే మరణించారు. ఈ వార్తలతో అసలు మేము వెళ్లగలమా లేదా అనే అనుమానం ఆదిలోనే వచ్చేసింది.
చూద్దాం.. భగవంతుని అనుమతి వుంటే వెళ్దాం. లేదంటే కాట్రా వైష్ణోదేవిని దర్శించుకుని వచ్చేద్దాం అని మొండిగా ముందుకువెళ్లాను.
ఈ యాత్రలో తొలి దేవుళ్లు గుర్రాళ్లు
48 కిలోమీటర్లు 3,888 మీటర్ల ఎత్తులోని
ప్రమాద భరితమైన దారుల్లో , మంచులో.. ఐస్ కొండల నుడుమ, నధుల మధ్య ఎక్కడ అడుగేయాలో చాలా చక్కగా ఆలోచించి, మనల్ని అత్యంత భద్రంగా శివసన్నిధికి చేర్చుతాయి అశ్వాలు
ఇక మలిదేవుళ్లు గుర్రాలతో పాటూ మన రక్షణ కోసం వచ్చే ముస్లిం యువకులు. వాళ్ళు గుర్రంతో పాటూ సుమారు 48 కిలోమీటర్లు నడకతోనే మన వెంట వస్తారు. temples guide amarnath tour pics saride nag 1
ఇక మూడో దేవుళ్ళు రహదారికి ఇరువైపులా మంచు కొండల్లో నిత్యం పహరా కాసే సైనికులు వాళ్లు మన యాత్రను చూస్తూనే వుంటారు. అవసరమైన సహాయం చేస్తుంటారు.
ఇక నాల్గో దేవుళ్లు దారిపొడవునా ఆహారం, నీరు అందించే బండారీలు. వీళ్లు అత్యంత ఖరీదైన ఆహారాన్ని సైతం భక్తులకు ఉచితంగా అందజేస్తారు. వాళ్లు అందించే ఆహారం మినహా మన దగ్గర ఎంత డబ్బు వున్నా కొనుక్కోడానికి ఒక్క హోటలూ అక్కడ వుండదు.

ఇక నా యాత్ర విషయానికి వస్తే.. జమ్ము నుంచి శ్రీనగర్ కు చేరుకోగానే అక్కడి మంచుకి విపరీతమైన జ్వరం వచ్చేసింది. నీరు పడక గొంతు నొప్పి, రొంప. మెడికల్, రిజిస్ట్రేషన్ అయ్యే సరికి మూడు రోజుల పాటు లంకణాలు చేశాను. పారాసిట్మల్ మాత్రలు మింగుతూనే వున్నా.. టాబ్లెట్లు వేసుకునేప్పుడు మాత్రమే గుక్కెడు నీళ్లు మింగడమే.. మరి మూడు రోజులు ఎలా వున్నానో అమరాధుడికే తెలియాలి. ‘
శ్రీ నగర్ లో రిజిస్ట్రేషన్ అయ్యాక, అక్కడి నుంచి పహెల్ గావ్ వెళ్లాం. అక్కడ రిసార్ట్ లో ఒక రోజు మకాం.

శివుడు అమరనాథ గుహకు పార్వతిని తీసుకు వెళ్లిన పహెల్ గావ్ మార్గంలోనే వెళ్లాలని మొదటే నిర్ణయించుకున్నా. కొంచెం కష్టమే అయినా గుర్రాన్ని నమ్ముకున్నా. అందుకే పహల్ గావ్ వెళ్లగానే అక్కడ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రికి వెళ్లి మరి కొన్ని మందులు తీసుకున్నాను. చేతి గ్లౌజులు, మంకీ క్యాప్ అక్కడే కొన్నాం. కొందరు స్వెట్టర్లు, రెయిన్ కోట్లు తీసుకున్నారు. మా బృందంలో మహిళలు కూడా వున్నారు.
12 మందితో కూడిన బృందం గుర్రాలు మాట్లాడుకుని యాత్రకు బయలు దేరాం.
చందన్ వాడి, శేషనాగ్ మీదుగా ప్రయాణం సాగింది
పహల్గాం నుండి 16 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 2,895 మీ ఎత్తున ఉన్న చందన్‌వారి నుండి అమర్‌నాథ్ యాత్ర మొదలౌతుంది. చందన్ వాడి వరకు మార్గం చదునుగ ఉంటుంది. శేషనాగ్ నుండి మార్గం ఏటవాలుగా ఉంటుంది.
పంచతరణి వరకూ గుర్రాలు వచ్చాయి. అమర్నాథ్ ఆలయం 6 కి.మీ దూరంలో ఉంది.
ఇక అక్కడ నుంచి అమరనాథ్ గుహకు మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణం. అక్కడ డోలీ ఎక్కాం.
గుహకు రెండు కిలోమీటర్ల వద్ద ఆగాం. మళ్లీ అక్కడ నుంచి డోలీ లో పవిత్ర గుహ వరకూ చేరుకున్నాం.
ఇదంతా నాలుగు రోజులు లంకణాలతోనే ప్రయాణం చేశాను. మధ్యలో పంచతరణి వద్ద ఒకసారి పచ్చని వాంతులు ఆయ్యాయి. బియాస్ నదీ జలాలతో శుబ్రం చేసుకున్నాను. 
నాతో వచ్చిన వాళ్లకు ఆందోళన నేను పూర్తిగా పైకి వస్తానో.. పైకి పోతానో అని..
మా పక్క నుంచే ఆక్సిజన్ అందని వాళ్లని కర్రలకు (పడిపోకుండా) తాళ్లతో కట్టేసి రెస్క్యూ క్యాంపులకి తీసుకు పోయేవారు. వాళ్ల చూస్తూనే భగవంతుడిని తలచుకుంటూనే ముందుకు సాగాం. దారిలో ఒకచోట చినుకులు మాత్రమే పడ్డాయి.
చిత్రం ఏమిటంటే అందరి కన్నా ముందు నా గుర్రం దారి చూపేది.
మరో విచిత్రం ఏమిటంటే గుర్రాలతో పాటూ. అనేక మంది యాత్రికులు కాలి నడకనే వస్తున్నారు. వాళ్లలో వృద్ధులు పిల్లలు కూడా వున్నారు.
అక్కడి వాతావరణానికి నాకు ఆకలి కూడా తెలిసేది కాదు.
అమరనాథుని గుహలో స్వామి అడుగు ఎత్తులో వున్నాడు (మేము చూసే సరికి) స్వామి దర్శించుకున్నాం. పక్కనే రెండు పావురాలు.. కొంచెం దూరంలో వినాయకుడు.. స్వామికి మరి కొంత దూరంలో పార్వతీ దేవి..
ఏమాత్రం తోపులాట లేదు. ఎంతసేపైనా స్వామిని దర్శించుకోవచ్చు. ఒక్క రూపాయి టిక్కెట్ లేదు. అమరనాథుడిని తనివితీరా చూడొచ్చు.
నాకైతే కళ్లంటా నీళ్లొచ్చాయి.
తిరిగి పంచతరణికి వచ్చాం. ముందే నిర్ణయించుకున్న ప్రకారం గుర్రాలని వెనక్కి పంపేశాం.
రిటర్న్ చాపర్ మీద రావాలని అనుకున్నాం. అయితే సాయంత్రం కావడంతో చాపర్లు తిరిగడం లేదు
అక్కడే అద్దెకు ఇచ్చే షెడ్డులో ఒకటి తీసుకున్నాం. దానిలో అరచేతి మందం దళసరి కంబళ్లు కూడా వున్నాయి. బాత్ రూమ్ లో నీళ్లు మాత్రం ఐస్ గడ్డళ్లా వున్నాయి. అక్కడే వేడి కోసం కొందరు భక్తులు దేవదారు కర్రలతో నెగళ్లు ఏర్పాటు చేశారు.
రాత్రి గడిచింది. అలసిపోయి వున్న మాకు ఏ భయమూ లేదు. చలీ లేదు హాయిగా నిద్రపట్టేసింది. 
ఉదయం లేచిన నాకు చిత్రంగా జ్వరం మటుమాయం అయ్యింది. నాలుగు రోజులు పాటు గుక్కెడు నీళ్లతో బతికిన నాకు విపరీతమైన ఆకలి వేసింది. ముఖాలు కడుక్కుని, అక్కడే వున్న బండారాల్లో టీలు ఆలూ పరోటాలు తినేసి టీ తాగాను. ఎక్కడా లేని శక్తి వచ్చేసింది. నాతో వచ్చిన వాళ్లు ఆశ్చర్యపోయారు.
మరోసారి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని చాపర్ (హెలీకాఫ్టర్) టిక్కెట్లు కోసం క్యూలో నిలుచున్నాం.
హెలీకాఫ్టర్ లో నుంచి హిమాలయాలు, గుర్రాలపై వచ్చే యాత్రికులను చూడాలి.. అద్భుతం అది వర్ణణాతీతం. ఆ వీడియోను మరోసారి అప్ లోడ్ చేస్తాను.
క్షేమంగా పహెల్ గావ్ చేరుకున్నాం.
— సరిదే నాగ్
ఫోటోలు : అమరనాథ్ యాత్రలో తీసినవి

Keywords : Amarnath Yatra, 2018 Amarnath Yatra information, Saride Nag ,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *